సత్యసాయి నిర్యాణం


Sun,January 20, 2019 03:25 AM

మధుకర్ వైద్యుల
సెల్ : 9182777 409

గతవారం తరువాయి
Sathya-Sai-Baba
మరునాడు పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఉదయం నుంచి నిలకడగా ఉన్న ఆరోగ్య పరిస్థితి మధ్యాహ్నం నుంచి గంటగంటకూ మారింది. ఒకానొక దశలో వైద్యులు సైతం ఆయన ఆరోగ్య విషయంపై హామీ ఇవ్వలేమని చేతులెత్తేసినట్టు ఆందోళనకరమైన వార్తలొచ్చాయి. బాబా శరీరంలోని అనేక కీలక అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని కూడా తెలిసింది. సాయంత్రానికల్లా బాబా ఆరో గ్యం ఆందోళనకరంగా ఉందని, పరిస్థితి విషమించిందని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా ప్రత్యేక మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. బాబా మూత్రపిండాలు సరిగా పనిచేయక పోవడంవల్ల డయాలసిస్ చేశామని దానివల్ల కూడా ఫలితం లేకపోవడంతో సీఆర్‌ఆర్టీ అనే అత్యాధునిక పరికరం అమర్చి వైద్యం అందిస్తున్నామని డాక్టర్ సఫాయా వెల్లడించారు.

ఆసుపత్రి ఆశ్రమం వద్ద భారీ సంఖ్యలో భక్తులు గుమికూడారు. బాబా క్షేమంగా ఉండాలంటూ వారు పెద్ద పెట్టున విలపించారు. బాబాను తమకు చూపాలని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పుట్టపర్తిలో 144వ సెక్షన్‌ను విధించారు. అప్పటి డీఐజీ చారుసిన్హా అక్కడే మకాం చేశారు. పేస్‌మేకర్, వెంటిలేటర్‌ల ద్వారా చికిత్సను అందిస్తూనే కిడ్నీలకు సీఆర్‌ఆర్టీ ద్వారా డయాలసిస్ ప్రక్రియను ప్రారంభించారు. బాబాకి కామెర్లు ముదిరినట్లు గుర్తించారు. అంతేకాక, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ప్రక టించారు. బాబాకు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్లు గుర్తించారు.
Sathya-Sai-Baba1
ఇదిలా ఉండగా.. బాబా ఆరోగ్యం పట్ల ట్రస్టు నిర్లక్ష్యం చేస్తోందంటూ భక్తులు మండిపడ్డారు. తక్షణమే తమకు బాబాను చూపించాలని డిమాండ్ చేశారు. బాబాకు చికిత్స అందిస్తున్న సిమ్స్ ఎదుట వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో చేరి ధర్నాకు దిగారు. సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయటానికి వచ్చిన జిల్లా కలెక్టర్ బి.జనార్దనరెడ్డి వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన వాహనం అద్దాలు పగిలిపోయాయి. బాబా ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం తెలుసుకున్న వేలాది మంది భక్తులు ఆస్పత్రి వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఆస్పత్రి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకుని.. ఆందోళన చేస్తున్న భక్తులను చెదరగొట్టాయి. బాబా ఆరోగ్యం మెరుగుపడింది. ప్రశాంతంగా ఉండండి. బాబా ఆరోగ్యం మరింత మెరుగుపడాలని పూజలు చేయండి అని భక్తులను పోలీసులు సముదాయించారు. బాబా ఆరోగ్యంగా ఉన్నారు. సత్యసాయి మనవడు శ్రావణ్‌కుమార్ బాబా కాళ్లపై పడితే ఆయన కాళ్లు కదిలించారు.. సాయిరాం అన్నప్పుడు బాబా కళ్లు తెరిచి చూశారు. ఆందోళన చెందకండి. బాబా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు చేయండి అంటూ పుట్టపర్తి డీఎస్పీ సర్దిచెప్పారు. దీంతో భక్తులు కొంత మేరకు శాంతించారు.

మరోవైపు ప్రజలు బాబా ఆరోగ్యం క్షీణించడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. పుట్టపర్తి గ్రామ దేవత అయిన సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసి, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే ప్రస్తుతం సత్యసాయి అరోగ్యం ఆందోళనకరంగా మారడానికి కారణమంటూ కొందరూ గ్రామస్తులు మరో అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని.. విగ్రహాన్ని వెతికి తీసే పనిలో పడ్డారు. పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ విగ్రహం దెబ్బతిందంటూ దాని స్థానంలో నూతన విగ్రహాన్ని సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ప్రతిష్ఠ చేయించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి సత్యసాయి కుటుంబంలో అరిష్టం చోటు చేసుకుందన్న ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో భక్తులు బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని సత్తెమ్మ విగ్రహన్ని తీసి ఊరేగింపుతో ఊళ్లోకి తీసుకువచ్చి విగ్రహానికి అభిషేకం చేసి పునఃప్రతిష్ట చేశారు.

ఏప్రిల్ 7న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం బాగుపడిందని డాక్టర్ల బృందం తెలిపింది. రక్త పరీక్ష నిర్వహించి నిర్ధారణ చేసుకున్న తర్వాత సాయికి డయాలసిస్ నిలిపి వేయాలని నిర్ణయించుకున్నారు. కిడ్నీ డయాలసిస్‌తో పాటు సిఆర్‌ఆర్ థెరఫీకి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. సత్యసాయి రక్తపోటు, షుగర్ సాధారణంగానే ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకున్నారు. సాయి మధ్యాహ్నం వరకు మరింత స్పృహలోకి వచ్చినట్లు చెప్పారు. కాగా మరోవైపు బాబా ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని సిమ్స్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సఫయా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని బులెటిన్లో చెప్పారు. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ బయో కెమిస్ట్రీ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బాబాకు వెంటిలెటర్‌తోనే కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని చెప్పారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తున్నదని చెప్పారు.

Sathya-Sai-Baba2
బాబా ఆరోగ్యం పట్ల ట్రస్టు నిర్లక్ష్యం చేస్తున్నదంటూ భక్తులు మండిపడ్డారు. తక్షణమే తమకు బాబాను చూపించాలని డిమాండ్ చేశారు. బాబాకు చికిత్స అందిస్తున్న సిమ్స్ ఎదుట వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో చేస్తున్న ధర్నాకు దిగారు. సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయటానికి వచ్చిన జిల్లా కలెక్టర్ బి.జనార్దనరెడ్డి వాహనంపై దాడి చేశారు.

ఏప్రిల్ 15వరకు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని బులెటిన్ విడుదల చేశారు. అయితే బాబాకు కామెర్లు వ్యాధి సోకినట్లు చెప్పారు. దానివల్ల లివర్ కొంచెం దెబ్బ తిన్నదని చెప్పారు. అందుకు తగిన చికిత్స ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం సత్యసాయి బాబా కళ్లు తెరిచి చూస్తున్నారు. ఇన్ఫెక్షన్ తగ్గింది. బాబా కాలేయం దెబ్బతింది. రక్తపోటు సాధారణ పరిస్థితులలోనే ఉంది. రక్తపోటు మందుల మోతాదు తగ్గించారు. డయాలసిస్ కొనసాగుతున్నది. బాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకటించారు.

అయితే మరో 24 గంటలు గడిచాయో లేవో వైద్యబృందం మరో ప్రకటన విడుదల చేసింది. ఎంత చికిత్స చేసినా కామెర్లు, జ్వరం తగ్గలేదు. దీనికి తోడు బాబాకు కొత్తగా లోబీపీ ఉన్నట్లు వెల్లడైంది. అదే రోజున చికిత్సకు అవయవాలు సహకరించడం లేదని గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన రెండు వారాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నిస్సహాయ స్థితిలో ఉన్న సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఆయన తుదిశ్వాస వరకు ఒక బ్రహ్మరహస్యంగానే మిగిలిపోయింది. అదీగాక, డాక్టర్లు ఆ రోజు విడుదల జేసిన బులెటిన్ ప్రకారం బాబా బీ.పి., గుండె కొట్టుకోవడం బాగా తగ్గిపోయాయి. అయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. పైగా అయన కాలేయం(లివర్)లోని ఇన్‌ఫెక్షను ఎక్కువయి ప్రమాద స్థాయికి చేరుకొంది. అయన ఇంకా వెంటిలేటరు సహాయంతోనే ఉన్నారు.

ఆసుపత్రిలో జరుగుతున్న విషయాలన్నీ గోప్యంగా ఉంచడంపై ఆందోళనలు మొదలయ్యాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యంపై నిజాలు వెల్లడించాలంటూ ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు దళిత జనసభ బాబా విషయంలో మానవ హక్కుల సంఘాన్ని (హెచ్‌ఆర్సీ) ఆశ్రయించింది. సత్యసాయి పరిస్థితిపై నిజాలు వెల్లడించాలని, ట్రస్టు బోర్డు, ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలు ఉన్నాయని, బాబాను ఒక్కసారి భక్తులకు చూపించాలని దళిత జనసభ సంఘం కోరింది.

20వ తేదీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పుటపర్తికి అదనపు పోలీసు బలగాలను హుటాహుటిన రప్పించడంతో, అయన పరిస్థితి చేయి దాటి పోయుండవచ్చని స్థానిక ప్రజలు, బాబా భక్తులు గట్టిగా నమ్మారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడు వారాలుగా చికిత్స పొందుతున్న సత్యసాయి పరిస్థితిపై వైద్యులే చేతులెత్తేశారు. అమెరికా నుంచి వచ్చిన కొందరు వైద్యనిపుణులు కూడా నిర్వేదంతో వెనుదిరిగారు. ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందిస్తున్నా, అత్యంత నిపుణులైన వైద్యులే అక్కడున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అనంతపురం జిల్లా యంత్రాంగం మొత్తం పుట్టపర్తిలోనే మకాం వేయడం, జాతీయ స్థాయి మీడియా సైతం తరలి రావడంతో.. పుట్టపర్తిలో గంభీరమైన వాతావరణ నెలకొన్నది. పుట్టపర్తిలో ఒక విధమైన విషాదఛాయలు అలుముకున్నాయి. వీధుల్లో జన సంచారం తగ్గింది. పోలీసుల హడావుడి పెరిగింది. వీటన్నింటి నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు అధికార వర్గాలే చెప్పాయి. ఏప్రిల్ 21న మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్‌తో బాధపడుతున్న బాబా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని సఫయా ప్రకటించారు.

మరునాడు స్వామి ఆరోగ్యం పూర్తిగా ఆందోళనకరంగా మారిందని, భగవత్ స్వరూపుడైన బాబా ఆరోగ్యాన్ని ఆయనే రక్షించుకోవాలని, తాము చేసేది మానవ ప్రయత్నం మాత్రమేనని సఫాయా పేర్కొన్నారు. మరునాటి నుండి బాబా శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేస్తున్నాయి. కిడ్నీలు, తర్వాత లివర్, ఆ తర్వాత గుండె చికిత్సకు స్పందించడం లేదని ప్రకటించారు. మెదడు పనిచేసే స్థితిలో ఉన్నంత కాలం అది ఇచ్చే ఆదేశాలకు కళ్లలో కదలిక కనిపిస్తున్నది. కానీ, తర్వాత బాబా కళ్లలో కదలిక ఆగిపోయింది. దీన్ని క్లినికల్లీ డెడ్‌గా పరిగణిస్తామని, ఆయన కోలుకోవడం అసాధ్యమని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. నిర్యాణాన్ని ఎప్పుడు ప్రకటించాలన్నదే ఇక మిగిలి ఉందని ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి. వెంటనే పుట్టపర్తికి రావాల్సిందిగా ట్రస్టు సభ్యులందరికీ పిలుపు అందింది. పుట్టపర్తి చుట్టూ 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ 24 ఉదయం, ఆసుపత్రి ఆవరణ
పొద్దున్నే ఆసుపత్రి ఆవరణలో ఒక విధమైన టెన్సన్ వాతావరణం నెలకొంది. ఆసుపత్రి ప్రాంగణంతో పాటు పుట్టపర్తి మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది. దీంతో ఏదో జరిగిందనే వార్త దావానంలా వ్యాపించింది. అంతకుముందు రాత్రి నుంచే డయాలసిస్ నిలిపివేసినట్లు కొంతమంది వైద్యులు ధృవీకరించారు. ఉదయం 6.24 గం.లకు బాబా గుండె స్పందించడం ఆగిపోయిందని నిర్ధారించారు. మరో కొన్ని గంటల్లోనే గుండె, శ్వాస వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 7.40 గంటలకు బాబా తుదిశ్వాస విడిచారని ఉదయం 10.15 గంటలకు సఫయా అధికారికంగా ప్రకటించారు. పుట్టపర్తి కన్నీటి సంద్రమైంది. వేలాది మంది ఆయన భక్తులు చివరిచూపు కోసం పుట్టపర్తి బాట పట్టారు.

ఏప్రిల్ 25, 26 తేదీల్లో ప్రజలు, భక్తుల సందర్శనార్థం బాబా భౌతికకాయాన్ని ప్రశాంతి నిలయంలో ఉంచారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు అయన భౌతికకాయాన్ని సందర్శించుకున్నారు. 27 బుధవారం ఉదయం 10 - 11.30గంటల మధ్య దశాబ్దాలుగా లక్షలాది మంది భక్తులకు బాబా దర్శనం ఇచ్చిన సాయి కుల్వంత్ హాలులోనే ఆయన్ను సమాధి చేశారు.

948
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles