చేతిరాత.. తెలిపెను తలరాత!


Sun,January 20, 2019 03:02 AM

writing
పుస్తకం అట్టను బట్టి ఆ పుస్తకం ఎలా ఉంటుందని చెప్పగలమా?పూర్తిగా పుస్తకాన్ని చదివితే కానీ చెప్పలేం కదా! మరి చేతిరాతను చూసి వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారు.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనా వేయగలమా?దీనికి సమాధానం మాత్రం అవునంటున్నారు గ్రాఫాలజిస్ట్‌లు.. అక్షరం మెలికను బట్టి.. ఇచ్చే గ్యాప్‌ని బట్టి.. ఇలా మనుషుల పర్సనాలిటీలను చెప్పేయొచ్చట..ఈ వారంలో నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే ఉంది.. ఈ సందర్భంగా చేతిరాతను బట్టి.. ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

- సౌమ్య పలుస

దివ్య (పేరు మార్చాం) అందంగా ఉంటుంది. ఆమెలాగే ఆమె రాసే అక్షరాలు ముత్యాల్లా మెరిసిపోతాయంటారు. కాకపోతే ఎవరేమన్నా తట్టుకునేతత్వం కాదామెది. ఒకసారి వాళ్ల నాన్న బెదిరించారని ఆత్మహత్యకు ప్రయత్నించింది. చనిపోయే ముందు చావుకు కారణం రాసి పెట్టింది. కానీ ఆమె రాసింది చూసిన వాళ్లంతా అది ఆమె రాయలేదని వాదించారు. చిందరవందరగా అక్షరాలున్నాయి. గ్రాఫాలజిస్ట్‌ల దగ్గరకు ఆ కాగితం వెళ్లింది. దివ్య రాసిన పాత పేపర్లు, చనిపోయే ముందు రాసిన పేపర్‌ని క్షుణ్ణంగా పరిశీలించారు. అది దివ్య రాసిందని తేల్చారు. ఆమె మానసిక సంఘర్షణ కారణంగానే చేతిరాత అలా మారిందని చెప్పారు.

నేషనల్ పెన్ అసోసియన్ చేతిరాత మీద ఒక అధ్యయనమే చేసింది. దీని ప్రకారం.. చేతిరాతను బట్టి సుమారు 5వేల కంటే ఎక్కువ వ్యక్తిత్వ లక్షణాలను గుర్తించవచ్చునని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, కౌన్సెలర్లు, ఇంటర్వ్యూవర్లు, ఇతర మేనేజర్ స్థాయిలో ఉన్నవారు తమ టీమ్‌ని ఎంచుకునే ముందు వారి చేతిరాతను బట్టి వారు ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో చెప్పేయొచ్చు. లోపల ఏముందో ముఖ కవళికల్లో, మనం మాట్లాడేదాన్ని కొంతమేర అంచనా వేయొచ్చు. కానీ చేతిరాతను బట్టి ఆ సమయంలో వారి మానసిక పరిస్థితిని కూడా అంచనా వేయొచ్చుననేది గ్రాఫాలజిస్ట్‌ల వాదన.

సైజును బట్టి..

అక్షరాలను పెద్దగా రాస్తారా? అయితే మీ మనసు కూడా చాలా పెద్దదే. ఉదారస్వభావం కలిగిన వారయుంటారు. ఎక్కువగా రచనలు చేసేవారు ఇలా పెద్ద అక్షరాలను రాస్తారట. అందరిలోకెల్లా అత్యంత ఆకర్షణగా తాము నిలువాలి అనుకునే రకాలు. సమయం, డబ్బు, ప్రేమ అన్నీ వీరి జీవితాల్లో ముఖ్యమని భావిస్తుంటారు. చిన్నగా రాసేవాళ్లు.. కాస్త బిడియంగా ప్రవర్తిస్తుంటారు. డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటారు. మామూలు సైజుల్లో మీ అక్షరాలు ఉంటే గనుక మీకు అన్ని విషయాల్లో అడ్జెస్టింగ్ మెంటాలిటీ ఉంటుందని అర్థం.

దూరం.. దూరం..

అక్షరం.. అక్షరానికి, పద.. పదానికి మధ్య చాలామంది దూరాలను పెంచుతుంటారు. కొందరు మరీ ఇరికించేస్తుంటారు. ఒకవేళ ఆ దూరం ఎక్కువగా ఉంటే మీరు స్వతహాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇలాంటివారు గిరిగీసుకొని కూర్చుంటారే తప్ప.. నలుగురిలో కలువలేరు. తక్కువ దూరాలను ఇచ్చేవారు ఎదుటివారి పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటారు, ప్రేమను కోరుకుంటారు. సుమారు 50 మంది బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ వీరి దగ్గర ఉంటుంది. కాకపోతే వీరికి సమయపాలన, నిర్వహణ అస్సలు తెలియదు.

అదిరే స్టయిల్

కొందరు రాస్తే ముత్యాలు పరిచినట్టుగా ఉంటాయి. కొందరు రాస్తే కోడి గెలికినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లు రాసే రాత ఎవరికీ అర్థం కాదంటారే.. అలా అన్నమాట. అక్షరాలను సూటిగా రాసే మనుషులు స్మార్ట్‌గా ప్రవర్తిస్తారు. వాళ్లని వాళ్లు చెత్తగా విమర్శించుకోవడంలో ముందుంటారు. వీరికి సహనం కాస్త తక్కువే. గుండ్రటి అక్షరాలు రాసే వాళ్లు కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటారు. తమ చుట్టూ ఉండే వాతావరణం సంతోషంగా ఉండాలనుకుంటారు. గొడవలను అస్సలు ఇష్టపడరు. అన్ని క్యాపిటల్ లెటర్స్ రాసేవారు తమ విషయాలేవీ బయట వాళ్లకు తెలియకూడదనుకుంటారు. తమని గురించి తాము తక్కువగా చెప్పుకొంటారు. పైకి, కిందకి సాగదీసినట్టు రాస్తుంటారు కొంతమంది. వారిపైన ఇతరుల శ్రద్ధ ఉండాలనుకుంటారు.
writing1

చుక్కలో ఏముంది?

ఇంగ్లిష్‌లో స్మాల్ లెటర్స్ రాస్తున్నప్పుడు ఐ, జె లకు చుక్కలను పెడుతాం. అయితే ఈ చుక్కను బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చునట. ఈ చుక్క పెద్దగా, కింద గీతకి దూరంగా పెడితే వారి ఊహల్లో బతుకుతారని అర్థం. ఈ చుక్కను కాస్త ఎడమ వైపు జరిపి పెడితే మీరు బద్దకస్తులు. అదే చుక్క కుడివైపు మొగ్గు చూపితే కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ ఆలోచన ఉన్న మనిషిగా పరిగణించొచ్చు. ఈ చుక్కను కొంతమంది అందంగా పెడుతుంటారు. నక్షత్రంలా, గుండె మాదిరి.. అలాంటి వారు జీవితాన్ని చాలా ఆస్వాదిస్తుంటారు.

టీతో గుట్టురట్టు

మనం రాసే ప్రతీ అక్షరం వంపులో మన జాతకం ఉంటుందని అంటున్నారు గ్రాఫాలజిస్ట్‌లు. అందులో ముఖ్యంగా టీ అనే అక్షరాన్ని బట్టి మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చునట. పెద్ద లేదా చిన్నగా అయిన టీ అనే అక్షరాన్ని వంకరగా రాస్తే.. మిమ్మల్ని మీరు పట్టించుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాళ్లుగా లెక్కగట్టొచ్చు. పైకి లాగి మరీ వంకరగా రాస్తే.. పని విషయంలో నిబద్ధతగా ఉంటారని అర్థం. పైన గీత లేదా చిన్న అక్షరంలోని మధ్య గీత కాస్త పెద్దగా ఉంటే.. ప్రతీ విషయంలోనూ ఫోకస్డ్‌గా ఉంటారు. ఏ విషయాన్ని అయినా పక్కాగా ప్లానింగ్ చేస్తారు. తక్కువ క్రాస్, చిన్న లైన్స్ పెట్టేవాళ్లు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ అవి చేరుకునే వరకు ఓపిక ఉండదు. మధ్యలోనే వదిలేసే రకాలన్నమాట. చిన్న అక్షరంలోని మధ్య గీత సరిగ్గా పెట్టారంటే.. జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తారని అంచనా వేసుకోవచ్చు.

సంతకం.. సంకేతం..

కొందరు సంతకాన్ని తెలుగులో పెడుతుంటారు, మరికొందరు ఇంగ్లిష్‌లో చేస్తారు. ఏది ఎలా చేసినా మన వ్యక్తిత్వం ఇక్కడే బట్టబయలవుతుందని గమనించుకోండి. గజిబిజి సంతకం చేస్తుంటే.. మీరు ప్రైవేట్ లైఫ్‌ని ఇష్టపడుతారు. మిమ్మల్ని గురించి బయటకు చెప్పుకోవడం కూడా పెద్దగా ఇష్టముండదు. పేరునే సంతకంగా పెడుతున్నారా? అయితే.. మీ గురించి మీ అంచనాలన్ని కరెక్టే. ఇతరులకు మీరు చెప్పాల్సింది, దాచేది ఏముండదని అర్థం. కొందరు కొన్ని అక్షరాలను వదిలి వేసి మరీ సంతకం చేస్తుంటారు. అలాంటప్పుడు వారు వారి జీవితంలో ఎక్కువ మార్పులను కోరుకుంటున్నట్టు లెక్క. ఇవన్నీ గమనించుకున్నారు కదా.. ఇప్పుడు ఒక పేపర్, పెన్ తీసుకోండి. ఏదో ఒక వాక్యాన్ని రాసుకోండి. ఇతరులతో రాయించండి. మీరు ప్రేమించిన వాళ్లే కావొచ్చు.. మీ టీమ్, ఫ్రెండ్ ఎవరితోనైనా రాయించి వారి వ్యక్తిత్వాన్ని, మీ వ్యక్తిత్వాన్ని గమనించుకోవచ్చు.

నిజమా.. అబద్ధమా?

మీరు రాసే విధానాన్ని బట్టి మీరు చెప్పేది నిజమో.. అబద్ధమో కూడా చెప్పేయొచ్చు. ఈ మాటలంటున్నది గ్రాఫాలజిస్టులు. మామూలుగా రాసినప్పుడు ఒకలా, కంగారుగా ఉన్నప్పుడు మరోలా చాలామంది చేతిరాత మారుతుందట. ఒకవేళ పెన్ లేదా పెన్సిల్‌ని గట్టిగా, ఒత్తి పట్టుకొని రాస్తున్నారంటే వాళ్లు కచ్చితంగా అబద్ధం చెబుతున్నట్లే లెక్క. కర్సివ్ రైటింగ్ అని ఇంగ్లిష్‌లో ఉంటుంది. అందులో ఓ అనే అక్షరాన్ని రాస్తున్నప్పుడు లోపల మరో గుండ్రాన్ని గీస్తారు. అలాంటి వారికి అబద్ధాలు చెప్పడమే లక్షణంగా ఉంటుందట. కొన్ని అక్షరాలకు మాత్రమే అలా రెండు గీతలు, చిక్కులు పడిన రాతలు రాసే వాళ్లు పూర్తి నిజాలను చెప్పేందుకు ఇష్టపడరు. అంటే.. హింట్ ఇచ్చి కూర్చుంటారన్నమాట.

1392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles