పారిపోయిన ఖైదీలు


Sun,January 20, 2019 02:32 AM

Paripoaina-Kaidilu
ఎనిమిదిన్నరకి ఆస్కార్ భోజనానికి వచ్చాడు. ఐదేళ్ళ క్రితం జరిగిన అలాంటి సంఘటన గుర్తుకు వచ్చింది. తన భర్త అక్కడ లేనట్లుగానే ప్రవర్తిస్తూ కోరా అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది. ఆస్కార్ వచ్చాక మళ్ళీ అదే పునరావృతం అయింది. కోరా తనని వదిలించుకోవడానికి నిర్ణయించుకుందని జాన్‌కి పూర్తిగా అర్థమైంది. అతను వెళ్ళాక చెప్పింది.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

జాన్, కోరా భార్యాభర్తలు. బ్రహ్మచారిగా జాన్‌కి లేని ఎన్నో సౌకర్యాలు పెళ్ళయ్యాక అమరాయి. కోరా తన భార్య అవడం వల్ల అవి అతనికి అందుబాటులోకి వచ్చాయి. ఓక్, పామ్ చెట్ల మధ్య అందమైన పెద్ద ఇల్లు, యాభై గజాల దూరంలోని ఇంట్రాకోస్టల్ హై వే వాటర్ వేలో తెల్లటి మర పడవ, గేరేజ్ నిండా కార్లు, సేవకులు, ఇంటి చుట్టూ అందమైన తోట, తోటమాలులు. సగటు మగాడు కోరుకునేవన్నీ అతనికి అందుబాటులో ఉన్నాయి. కాని...
జాన్ భార్య కంఠం వినగానే అతనిలో ఎప్పటిలా వణుకు పుట్టింది.

ఎస్ కోరా డియర్. ఇక్కడే ఉన్నాను. ఏం కావాలి? అరిచాడు.
జాన్. ఓ కప్పు టీ చేసి తెస్తావా?
కోరా. ఇప్పుడు ఇంట్లో సరిగ్గా పదకొండు మంది పనివాళ్ళు ఉన్నారు. వారిలో ఎవరినైనా టీ తెమ్మని అడగొచ్చుగా?
అలాంటి కంఠంతో ఇంకెప్పుడూ నాకు బదులు చెప్పకు జాన్. నువ్వు తెస్తే నాకు చాలా బావుంటుంది.
గతంలో ఆమె టీ అడిగితే ఇవ్వనందుకు జాన్ కొత్త ఫెరారీ కారుని అమ్మేసి డ్రైవర్ని తీసేసింది. కోరా తనని బానిసని చేసింది అని పెళ్ళయ్యాక త్వరలోనే జాన్ గ్రహించాడు. వారానికి వంద డాలర్లు మించి ఖర్చులకి ఇవ్వదు. పెళ్ళయిన గత ఐదేళ్ళుగా ఏ అవసరం ఉన్నా తనే కొనిస్తుంది తప్ప డబ్బు మాత్రం ఇవ్వదు.
కోరా వయసు నలభై రెండు. ఆమె కన్నా జాన్ పదేళ్ళు చిన్నవాడు. ఏదో ఓ రోజు ఆమె ఆస్తికి తనే వారసుడు అవుతాడనే ఒక్క ఆశతో ఆ బానిసత్వాన్ని భరిస్తున్నాడు.
రుచిగా కలిపావు. థాంక్ యు టీ తాగి చెప్పింది.

నేను వెళ్ళొచ్చా? కోపాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు.
జాన్ ఆ దృక్పథం మానమన్నానా? నువ్వు నా మొదటి భర్తవి కాదని నీకు తెలుసు. మానకపోతే నువ్వు నా ఆఖరి భర్తవి కూడా కాకపోవచ్చు నవ్వుతూ చెప్పింది.
ఆమె అనేకసార్లు అతనికి విడాకులు ఇస్తానని బెదిరించింది. తన కార్లు, ఇల్లు, పని వాళ్ళల్లా తనకి కూడా ఆమె యజమానురాలు అనుకుంటుంది అని జాన్‌కి తెలుసు. ఏదో రోజు తను కోట్ల ఆస్థికి వారసుడు అవుతాడు అనే చిరు ఆశ అతన్ని బంధిస్తున్నది.
* * *

ఆ ఆదివారం బఫే లంచ్‌కి కోరా ఆహ్వానించిన ఆస్కార్ వచ్చాడు. కోరా అతనితో టీనేజ్ అమ్మాయి డేటింగ్‌లో ప్రవర్తించినట్లు ప్రవర్తించడం జాన్ గుర్తించాడు. ఆమె ఆస్తికి అతను వారసుడు కాబోతున్నాడని చూచాయగా జాన్‌కి అనిపించింది. ఆమె ఏ భర్తకీ పెద్దగా భరణం ఇవ్వలేదు. ఆమె రెండో భర్త తన ప్రియురాలికి రాసిన ఉత్తరాలు, ఫొటోలు జడ్జి చూసాక అతను కోరిన భరణాన్ని రద్దు చేసాడు.
ఆమె ఆఖరి భర్తనుంచి ఇంకా విడాకులు తీసుకోక మునుపు తను బఫే లంచ్‌కి వచ్చినప్పుడు కోరా ఎలా ప్రవర్తించిందో ఆమె ప్రవర్తనని బట్టి జాన్‌కి గుర్తొచ్చింది. ఇంకో రెండు వారాల్లో బహుశ తను ఆవిడ జీవితం లోంచి, వారసత్వం లోంచి పూర్తిగా నిష్ర్కమించ బోతున్నాడని జాన్‌కి అర్థమైంది.
* * *

సోమవారం ఉదయం జాన్ దినపత్రిక తిరగేస్తుంటే, మొదటి పేజీలో ఎనిమిది మంది ఖైదీలు తప్పించుకున్న వార్త కనిపించింది. వారిలోని ఆరుగురు ప్రమాదకరమైన హంతకులు.
మైల్స్. ఈ వార్త గురించి నువ్వు రేడియోలో ఏమైనా విన్నావా? బట్లర్‌కి ఆ వార్తని చూపించి అడిగాడు.
ఎస్ సర్. ఈ ఎనిమిది మంది వాటర్‌లే ప్రాంతంలో ఉన్నారని, వారి దగ్గర ఆహారం కాని, డబ్బు కాని లేవని, ఆచూకీ తెలిస్తే పోలీసులకి చెప్పమని గంట క్రితం వార్తల్లో చెప్పారు.
అంటే మనింటి చుట్టు పక్కలే ఉన్నారన్నమాట.
అవును సర్.
థాంక్ యు మైల్స్.
పారిపోయిన నిస్సహాయ ఖైదీలు దేనికైనా తెగిస్తారు. వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారు! అతను చిన్నగా నవ్వాడు.
సాయంత్రం మైల్స్ జాన్‌తో చెప్పాడు.

మిస్టర్ జాన్ సర్. గిన్స్ జంక్షన్‌లో ఒకడు ఓ ఇంట్లోంచి ఆహారం, బట్టలు దొంగిలిస్తూంటే ఆ ఇంటి యజమాని ఆ ఖైదీని కాల్చి చంపారని, మిగిలిన ఏడుగురి ఆచూకి తెలీలేదని రేడియోలో ఇందాకే చెప్పారు.
గిన్స్ జంక్షన్. వాళ్ళు మనింటికి ఇంకాస్త దగ్గరగా వచ్చారు. వాళ్ళు మనింటి వెనకే దాక్కున్నా ఆశ్చర్యం లేదు.
ఎస్ మిస్టర్ జాన్ సర్.
వాళ్ళు మనింట్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకో మైల్స్.
ఎస్ మిస్టర్ జాన్ సర్.
అక్కడి నించి గిన్స్ జంక్షన్ ఏడు మైళ్ళ దూరం. రోడ్ మీద కాక చెట్లు, పొలాల వెంట పడి వస్తే నాలుగు మైళ్ళే. అర్ధరాత్రి తనింటి ప్రాంతానికి వారు రావచ్చు. ఆ సమయానికి పని వాళ్ళంతా గాఢనిద్రలో ఉంటారు.

ఎనిమిదిన్నరకి ఆస్కార్ భోజనానికి వచ్చాడు. ఐదేళ్ళ క్రితం జరిగిన అలాంటి సంఘటన గుర్తుకు వచ్చింది. తన భర్త అక్కడ లేనట్లుగానే ప్రవర్తిస్తూ కోరా అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది. ఆస్కార్ వచ్చాక మళ్ళీ అదే పునరావృతం అయింది. కోరా తనని వదిలించుకోవడానికి నిర్ణయించుకుందని జాన్‌కి పూర్తిగా అర్థమైంది. అతను వెళ్ళాక చెప్పింది.
నీ పద్ధతి నాకు నచ్చలేదు జాన్. నువ్వు అతని జోక్స్‌కి నవ్వవే? అతను మన అతిథి అని మరిచావా? ఈ రాత్రి బయట సోఫాలో పడుకో.
బయట పడుకోవడం దేనికి?
అర్థం కానట్లుగా నటించకు?
నన్ను వదిలించుకుంటున్నావా?
అవును. రేపు ఉదయం ఈ విషయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్.
జాన్ రాత్రి పదకొండు ముప్పావుకి బేస్‌మెంట్‌లోకి వెళ్ళి వేట రైఫిల్‌ని తీసుకొని గోడకి వేలాడే బుల్లెట్ క్లిప్‌ని అందులో తొడిగాడు. గన్ కేబినెట్‌లోంచి శుభ్రమైన ఓ బట్టని, టూల్ బాక్స్‌లోంచి హాక్‌సా బ్లేడ్‌ని తీసుకొని జేబులో ఉంచుకున్నాడు. పైకి వచ్చి ఫ్రెంచ్ విండో తెరిచాడు. బయట చీకట్లో చెట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇనుప ఫెన్స్ దగ్గరికి నడిచి ఓ చోట మనిషి దూరేంత కోసేసాడు. తర్వాత కిటికీ లోంచి నెమ్మదిగా పిలిచాడు.
కోరా! కోరా! త్వరగా రా.

ఎక్కడికి జాన్? అతని కంఠంలోని ఆదుర్దాని గమనించి ఆమె అడిగింది.
బయటకి. ఆస్కార్... రా చెప్తా
ఆమె ఆస్కార్ పేరు వినగానే చెప్పులు తొడుక్కుని తక్షణం బయటకి వచ్చి అడిగింది.
నువ్వెక్కడ జాన్? ఏమిటి సమస్య?
నువ్వే.

జాన్ వెనుక నుంచి ఆమె మెడ చుట్టూ ఇనుప బార్బ్‌డ్ వైర్‌ని బలంగా మెలి వేసాడు. అతని చేతులకి గాయాలు అవకుండా తనతో తెచ్చిన బట్టతో దాన్ని పట్టుకున్నాడు. ఆమె చేతులు పైకి లేచాయి. ఆమె మెళ్ళో ముళ్ళు దిగాయి. అతను ఎదురు చూడనంత వేగంగా ఆమె వెనక్కి కదిలింది. కోరా కళ్ళల్లో భయం, ఆశ్చర్యం కనిపించాయి. ఆమె గొంతులోంచి గరగర శబ్దం మృదువుగా వినిపించింది. ఆమె చేతులు కొట్టుకోవడం ఆగే దాకా జాన్ వైర్‌ని వదల్లేదు.
ఆమె మరణించిందని నిశ్చయించుకున్నాక ఇంటి కిటికీల వైపు చూసాడు. అన్ని తెరలూ మూసే ఉన్నాయి. వెంటనే చీకట్లో చెట్ల వైపు రైఫిల్‌లోని గుళ్ళన్నీ ఖాళీ అయ్యే దాకా కాల్చాడు. తర్వాత ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి, రిసీవర్ ఎత్తి పోలీసులకి డయల్ చేసాడు.
హలో. షెరీఫ్ ఆఫీసా? నా పేరు జాన్... అవును. కోరా భర్తని. ఇక్కడో ఘోరం జరిగింది. నా భార్యని ఎవరో చంపేసారు. మీరు వెంటనే రావాలి. ఆ పారిపోయిన ఖైదీలై ఉంటారు. నేను వాళ్ళ వైపు రైఫిల్‌ని కాల్చాను. అంతా చీకటి కాబట్టి వాళ్ళకి గుళ్ళు తాకాయో, లేదో తెలీదు.
వాళ్ళు పారిపోయిన ఖైదీలే అని ఎలా చెప్పగలరు? షెరీఫ్ ప్రశ్నించాడు.
ఇద్దరి వంటి మీద జైలు దుస్తులు ఉన్నాయి. వెంటనే రండి.

జాన్ రిీవర్ పెట్టేసాడు. తను కోరా ఆస్తికి వారసుడు అవబోతున్నందుకు అతనికి ఆనందం కలిగింది. మైల్స్ వచ్చి చెప్పాడు.
షెరీఫ్ వచ్చారు.
అతన్ని కోరా శవం దగ్గరకి తీసుకురా.
ఎస్ సార్. ఇంక మనకి ఆ పారిపోయిన ఖైదీల భయం లేదు సర్. ఇప్పుడే రేడియోలో చెప్పారు. గంటన్నర క్రితం పోలీసులు వాళ్ళందర్నీ పట్టుకున్నారట.
జాన్ యాంత్రికంగా సరే అన్నట్లుగా తల ఊపాడు. తర్వాత తల తిప్పి చూసాడు. నేల మీద వెల్లకిలా పడి ఉన్న తెరిచిన కోరా కళ్ళు అతని వంకే చూస్తున్నాయి. ఆమె నవ్వుతున్న భావన అతనికి కలిగింది.
(రిచర్డ్ హెచ్ హార్డ్‌విక్ కథకి స్వేచ్ఛానువాదం)

864
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles