చూసేది చెప్పదు.. చెప్పేది చూడదు!


Sun,January 20, 2019 02:29 AM

Devadatta
మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. అది మనిషి వ్యక్తిత్వాన్నే బలహీనపరుస్తుంది. తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదించాలనే ధోరణిని అలవరుస్తుంది. అది మనిషి దౌష్ట్యానికి ఆనవాలుగా మారి ఆరంభమై, పెరిగి పెద్దదై ప్రబలిపోతుంది. స్వశరీర రక్షణకోసం, పోషణ కోసం, అధికారం కోసం, సంపాదన కోసం, ఆనందం కోసం, అనుభూతి కోసం కూడా అబద్ధపు బతుకు బతికేవాళ్ళున్నారు లోకంలో. నిజాయితీ అన్న మాటే బతుకులో లేకుండా బతికేవాళ్ళున్నారు లోకంలో. మనిషి సమర్థతను పరిపూర్ణంగా ప్రతిఫలింపజేసేది నిజాయితీ అయితే, అతని అబద్ధపు ప్రవర్తన అతని సామర్థ్యాన్ని తాత్కాలికంగా వెలిగిపోయేలా చేసినా చివరకు పశ్చాత్తాపపడక తప్పదు. మనస్తత్వం కారణంగా చూస్తూనే చూడవలసిన విధంగా చూడలేని మనుషుల గురించి చెబుతుందీ కథ.

- ఇట్టేడు అర్కనందనా దేవి

పోషణ అంటే కడుపు నింపుకోవడం, బతకడమంటే వ్యక్తిత్వంతో జీవించడం. వీటిని కాదని ప్రపంచాన్ని మోసం చేసేవారు తమకు తామే న్యాయం చేసుకోలేరనీ, మనస్తత్వం మంచిదైతే సంకల్పమై అద్భుతాలకు తావిస్తుందనీ నిరూపించిన ఉతథ్యుడు మూర్ఖుడు కాదేమో!

పూర్వం కోసలదేశంలో దేవదత్తుడనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నా సంతానం లేదు. అందుకని గొప్ప ఋషులను పిలిపించి పుత్ర కామేష్టి చేయిస్తున్నాడు. వేదమంత్రాల ఘోషతో యాగం కొనసాగుతున్నది. అంతలో వేదమంత్రాల పఠనంలో ఒకచోట స్వరదోషం వినిపించడంతో యజమాని అయిన దేవదత్తుడు మూర్ఖుడిలా విఘ్నం కలిగించావంటూ మండిపడితే ఒక ఋషి ఊపిరి పీల్చి వదిలే క్రమంలో జరిగే ప్రక్రియను కూడా దోషంలా భావించే నీవు నన్ను మూర్ఖుడివని అంటావా! కనీసం అక్షరాలు కూడా పలుకలేని పుత్రుడే నీకు జన్మిస్తాడని శపిస్తాడు. దేవదత్తుడు క్షమించమని అడిగితే ఆ ఋషి మొదట మూర్ఖుడిలా అందరికీ కనిపించే నీ కొడుకు తర్వాత్తర్వాత గొప్ప విలువలున్న వ్యక్తిగా సమాజంలో పేరు తెచ్చుకుంటాడని అంటాడు.

పుత్రకామేష్టి యాగం ఫలితంగా దేవదత్త రోహిణులకు ఉతథ్యుడనే కొడుకు పుట్టాడు. ఉలుకూపలుకూ లేకుండా స్తబ్దంగానే పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసుకు వచ్చాక తల్లిదండ్రులే అతణ్ని ఈసడించుకోవడంతో మనసు గాయపడి, నిరాశ అలుముకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కాళ్ళు అరిగిపోయేలా, లోపలి బాధంతా పోయేలా అడవుల్లో తిరిగాడు. చివరికి అలసిపోయి గంగాతీరంలో చిన్న కుటీరం నిర్మించుకొని, దొరికినవి తింటూ బతుకు కొనసాగిస్తున్నాడు. ఉతథ్యుడు ఎవరినీ ఏమీ అనడు. ఎవరితోనూ ఉలకడూ, పలకడు. కొంతసేపు తన స్థితికి తానే మదనపడతాడు. మరికొంతసేపు జీవితమంటేనే ఇంతని సర్దిచెప్పుకుంటాడు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయించుకున్నాడు. బతుకుకోసం అబద్ధాలు చెప్పననీ, మోసాలు చేయననీ తననుకున్న నియమాన్ని తప్పకుండా పాటించి తీరుతానని తీర్మానించుకున్నాడు.
ఒకరోజు ఉతథ్యుడు ఉంటున్న కుటీర ప్రాంతానికి వేటగాడు ఒకడు వచ్చాడు. ఉతథ్యుడు చూస్తుండగానే జంతువులను క్రూరంగా చంపుతున్నాడు.

ఒక పందిని బాణంతో కొట్టగా, అది గాయంతో మూలుగుతూ ఉతథ్యుని ముందుకు వచ్చి దీనంగా అరిచి పక్కనే ఉన్న పొదలోకి వెళ్ళిపోయింది. ఉతథ్యునికి జాలి కలిగింది. అతనిలో ఏదో కలవరం మొదలైంది. దానిని ఎలాగైనా రక్షించాలని అనుకున్నాడు. పందిని వెదుక్కుంటూ కిరాతుడు ఉతథ్యుని దగ్గరకు వస్తాడు. అయ్యా! నేను తిండికోసమని పందిని వేటాడుతుంటే అది ఇటుగా పారిపోయి వచ్చింది. అది ఎటువైపు వెళ్ళిందో దయచేసి చెప్పండని అడుగుతాడు వేటగాడు. పైగా వేటాడటం నా వృత్తిధర్మం, నా కుటుంబ పోషణకోసం అది చాలా అవసరమని అంటాడు. ఉతథ్యుడు సందిగ్థంలో పడ్డాడు. మాట మాట్లాడలేని తాను ఎలా పందిని రక్షించేది, ఎలా వేటగానికి న్యాయం చేసేదని చింతించాడు.

వేటగాడి వలలో అప్పటికి చాలా జంతువులు ఉన్నాయి. పోషణ కోసం అని చెప్పి అత్యాశను ప్రదర్శిస్తున్న వేటగాడికి అబద్ధం చెప్పి దోషం మూటగట్టుకున్నా ఫర్వాలేదని, ఒక ప్రాణిని కాపాడే అవకాశం వచ్చిందని సంకల్పించుకొని అప్రయత్నంగానే అతను మొదటిసారి మాట్లాడాడు. చాలా తెలివిగా వేటగాడికి సమాధానం చెబుతాడు. చూసేది (కన్ను) చెప్పదు, చెప్పేది (నాలుక) చూడదు. నీ స్వార్థం కోసం ఎందుకు నన్ను మాటిమాటికి అడుగుతావు. వేటగాడికి అర్థం కాలేదు. కానీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోయాడు. పందిని పొదల్లోంచి బయటకు తీసి దాని గాయానికి మందురాసి దాని ప్రాణం కాపాడాడు ఉతథ్యుడు.

పోషణ అంటే కడుపు నింపుకోవడం, బతకడమంటే వ్యక్తిత్వంతో జీవించడం. వీటిని కాదని ప్రపంచాన్ని మోసం చేసేవారు తమకు తామే న్యాయం చేసుకోలేరనీ, మనస్తత్వం మంచిదైతే సంకల్పమై అద్భుతాలకు తావిస్తుందనీ నిరూపించిన ఉతథ్యుడు మూర్ఖుడు కాదేమో!

925
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles