మాల్యవంతుడు


Sun,January 20, 2019 02:27 AM

Mulyavanthudu
ప్రతీ విషయంలోనూ తగిన సూచనలిచ్చి రావణునికి ప్రోత్సాహాన్ని అందించేవాడు మాల్యవంతుడు. రావణుడూ మాల్యవంతుని చాలా గౌరవించేవాడు. అనుభవజ్ఞుడిగా, రాజనీతి కోవిదునిగా, నిశ్చల స్వభావిగా మాల్యవంతుడు లంకలో ఉన్నత గౌరవాన్ని పొందేవాడు. కానీ సీతాపహరణం, తర్వాత జరిగిన పరిణామాలూ, రామునితో సంధికి రావణుని విముఖత పట్ల మాల్యవంతుని అసమ్మతి స్వరం రావణ సభలో ధ్వనించింది.

- ప్రమద్వర

మనిషిలో ఎన్నో కోణాలు. కానీ ఎక్కువగా ప్రపంచంపై విరుచుకుపడేవి ఆవేశం, కోపం, పగ, ప్రతీకారం వగైరా.. వగైరా.. పుట్టినప్పటి నుంచీ పోయేదాకా బతుకాలంటే కొన్ని పద్ధతులుంటాయి,

ధర్మాలుంటాయి, అవసరాలుంటాయి. అర్థం చేసుకుంటే ప్రపంచానికేసి మన దృష్టి నిర్మల తరంగమై వెల్లువెత్తుతుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోతే మనలోని కాఠిన్యమే మనల్ని నిండా ముంచేస్తుంది. యుగాలు మారినా, తరాలు తరలినా అధర్మాన్ని ఎప్పుడూ ధర్మం ఆక్రమిస్తుంది. ధర్మం తప్పక నడుచుకునే వారికే బతుకుంటుంది. ధర్మమే బతుకునిస్తుంది, బతుకు నేర్పుతుంది. ఈ ధర్మ వివేచన రాక్షసుల్లో ఉత్తముడూ, రాజనీతిజ్ఞుడూ, అత్యున్నత విలువలున్న మంత్రి శ్రేష్ఠుడూ అయిన మాల్యవంతుడిది. రావణుని అధర్మపు చర్యలపై అసమ్మతి స్వరం వినిపించిన గొప్పమంత్రిగా లంకలో ప్రతిష్ఠ సాధించాడు మాల్యవంతుడు. ధర్మాన్ని దేవతలు పంచుకోగా అధర్మాన్ని దానవులు పంచుకున్నారని రావణుని ఉద్దేశించి నిష్ఠూరాలు పలికిన మాల్యవంతుడు దానవుడైనా ధర్మంగానే బతికాడు.

దేవవతి, సుకేశుల పుత్రుడు మాల్యవంతుడు. సుమాలి, మాలి ఇతని సోదరులు. గంధర్వకన్య సుందరి ఈతని భార్య, వజ్రముస్టి, విరూపాక్ష, దుర్ముఖి, సుప్తఘ్న, యజ్ఞకోప, మత్త, ఉన్మత్తులనే ఏడుగురు కొడుకులూ, అనల అనే కూతురు మాల్యవంతుని సంతానం. రావణునితో తాతగా, పినతండ్రిగా బంధుత్వం ఉన్న మాల్యవంతుడు రావణుని మంత్రివర్గంలో శ్రేష్ఠునిగానే చెప్పుకునేందుకు మొగ్గు చూపాడు. మాల్యవంతుడు తన సోదరులతో కలిసి వైభవాన్నీ, సంపదలనూ కావాలనుకొని బ్రహ్మకై తపస్సు చేశాడు. తపస్సు ఫలితంగా కోరిన వరాలను పొందినవాడుగా, సంపన్నునిగా కాక తన వివేకంతో బతికాడు మాల్యవంతుడు. మాల్యవంతుడు తన సోదరులతో కలిసి అద్భుత నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వకర్మను పిలిచి నగర నిర్మాణం చేయమని ఆదేశిస్తే, రాక్షసుల రారాజులైన మీ పూర్వీకులు ఆనతిస్తే లంకాపట్టణం ఒకటి నిర్మించాను. అది మీదే. మీరు అందులోనే ఉండొచ్చు. అది చాలా ప్రత్యేకమైంది. బంగారుమయమై మీ ప్రతిష్ఠకు తగినదని చెబితే మాల్యవంతుడు కుటుంబ సమేతంగా అక్కడే ఉండసాగాడు. కానీ ఒకసారి మాల్యవంత సోదరులు ముగ్గురూ రాక్షసగర్వంతో స్వర్గంపైకి యుద్ధానికి వెళతారు. గరుత్మంతుని చేతిలో మాలి చనిపోతే మాల్యవంతుడు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు.

మాల్యవంతుడు జీవితం పట్ల అవగాహన ఉన్నవాడు. జీవితం విసిరే సవాళ్ళను స్వీకరించాలేగాని జీవితమే సవాలుగా మలుచుకోరాదని గట్టిగా నమ్మినవాడు. అందుకనే ఏ పరిస్థితుల్లోనూ వివేచన కోల్పోయి దుడుకుతనం చూపించేవాడు కాదు. విశ్వకర్మ తన కుటుంబానికి ఇచ్చిన బంగారు లంకకు రావణుడు రాజైన తర్వాత తాత, పినతండ్రి అయిన మాల్యవంతుడు రావణుని రాజ్యానికి మంత్రిగా వెళతాడు. రాక్షస కుటుంబమే అయినా రావణునిలోని తెలివితేటలు, శక్తియుక్తులు, ఆలోచనలు మాల్యవంతునికి ఎంతో నచ్చేవి. ప్రతీ విషయంలోనూ తగిన సూచనలిచ్చి రావణునికి ప్రోత్సాహాన్ని అందించేవాడు మాల్యవంతుడు. రావణుడూ మాల్యవంతుని చాలా గౌరవించేవాడు. అనుభవజ్ఞుడిగా, రాజనీతి కోవిదునిగా, నిశ్చల స్వభావిగా మాల్యవంతుడు లంకలో ఉన్నత గౌరవాన్ని పొందేవాడు. కానీ సీతాపహరణం, తర్వాత జరిగిన పరిణామాలూ, రామునితో సంధికి రావణుని విముఖత పట్ల మాల్యవంతుని అసమ్మతి స్వరం రావణ సభలో ధ్వనించింది.

మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రావణుడు వారితో రాముడు యుద్ధరంగంలో చెలరేగిపోతుంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? ఏదైనా సలహాఇవ్వండని అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉంటే, మాల్యవంతుడు రావణునితో అన్న మాటలు చాలా గొప్పవి. ఆత్మ విమర్శ, రాజనీతి, ప్రయోజనం యుద్ధ సమయంలో రాజు పాటించాల్సిన ధర్మాలు. అలాగే విద్య వల్ల వచ్చిన వినయం, సంస్కారం దేశకాలాల పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే శక్తినిస్తాయి. ఆ శక్తిని అందిపుచ్చుకున్నవాడే వివేకి. నీ మనసు చెదిరింది. అందుకనే నీ ధైర్యం లోపించింది. రాముని పక్షాన ధర్మం ఉంది. ఎందరినో హింసించిన నీ కాఠిన్యమే అధర్మమై నిన్ను నాశనం చేయబోతున్నది. నీ అహంకారంతో మనుషులు, వానరులు, ఎలుగుబంట్ల వల్ల మరణం రాకూడదనే విషయం మరచి వరం కోరుకొని ప్రమాదం కొని తెచ్చుకున్నావు. సీతను నువు అపహరించడం అధర్మం. ధర్మం ఎప్పటికైనా అధర్మాన్ని ఆక్రమిస్తుంది. అణచివేస్తుంది. ఇప్పటికైనా మించిపోలేదని మాల్యవంతుడు రావణునికి ఎన్నో విధాల చెప్పిచూస్తాడు.

కానీ రావణుడు వినిపించుకోలేదు. జరగాల్సింది జరిగిపోయింది. ధర్మం గెలిచింది. మాల్యవంతుడు అధర్మాన్ని ఎప్పుడూ నిరసించాడు. ధర్మం పక్షాన ప్రత్యక్షంగా నిలబడలేకపోయినా, తన వృత్తిధర్మం నిర్వర్తిస్తూనే ధర్మం గెలవాలనీ, గెలుస్తుందనీ నమ్మాడు. విభీషణుని రాజ్యపాలనలో మంత్రిగా కొనసాగాడు. జీవిత ధర్మం ప్రకారం చివరిదాకా నిశ్చయుడై బతికిన మాల్యవంతుడు ధర్మానికి అనుంగుడూ పాత్రుడు కూడా.

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles