నెట్టిల్లు


Sun,January 20, 2019 02:06 AM

కథలెప్పుడూ ఎక్కడో పుట్టవు. మనిషి జీవితమే ఓ కథ. ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనల కలయికే కథ. సినిమా తీయాలంటే ఒక కథ ఉంటే సరిపోతుంది. కానీ.. జీవితాన్ని అధ్యయనం చేస్తే ఎన్నో కథలు దొరుకుతాయి. ఎన్నో సినిమాలకు కావాల్సిన కథా వస్తువు జీవితమే. అలాంటి కథలతో ఈ వారం వచ్చిన కొన్ని షార్ట్‌ఫిలింస్ నెట్టిల్లులో...

తెలుగు మీడియం

Total views 169,242+ (జనవరి 12 నాటికి)
Posted On : 05 Jan 2019
దర్శకత్వం: రవితేజ మహాదాస్యం, గోపినాథ్
నటీనటులు : గోపినాథ్, రేష్మా ఎస్ పిైళ్లె, భార్గవ్ రెడ్డి, సుమన్ సింగసాని, అశోక్ దేవ
తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలోకి మారిన వారి కష్టాలెలా ఉంటాయో ఈ షార్ట్‌ఫిలింలో చూడొచ్చు. గోపి హైస్కూల్ వరకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకుంటాడు. ఇంటర్‌లో వాళ్ల నాన్న గోపిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువాల్సి వస్తుంది. అందరి ముందు తెలుగు మాట్లాడలేక, ఇంగ్లీష్‌లో చదువడం రాక, మాట్లాడడం రాక గోపి పడే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. ఆఖరికి చెల్లి పెండ్లి కోసం ప్రిన్సిపల్‌కి రాసిన లీవ్ లెటర్‌లో అక్షరానికో తప్పు దొర్లుతుంది. ఆ తర్వాత ఓ సెమినార్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అక్కడ అందరి ముందు నవ్వుల పాలవుతాడు. బాధపడుతూ బయటికొచ్చేస్తాడు. తన ఫ్రెండ్స్ తనని చూసి నవ్వుతుంటే ఓ భారీ తెలుగు సినిమా డైలాగ్ ఫుల్ ఎమోషన్‌లో చెప్తాడు. ఆ దెబ్బకి తన క్లాస్‌మేట్ ఒకమ్మాయి గోపికి పడిపోయి ఇంగ్లీష్‌లో ప్రపోజ్ చేస్తుంది. ఆ తరువాత ఏమయింది? ఆ అమ్మాయి ఇంగ్లీష్‌లో చెప్పిన ప్రపోజల్ గోపికి అర్థమైందా? ఈ షార్ట్‌ఫిలిం చూస్తే తెలుస్తుంది.


కళ

Total views 26,974+ (జనవరి 12 నాటికి)
Posted On : 11 Jan 2019
దర్శకత్వం: మహీ కోమటిరెడ్డి
నటీనటులు: మహేశ్ పవన్ యెడ్లపల్లి, సంజన, యేయిష, శ్రీనివాస్ భోగిరెడ్డి, శ్రీనివాస్ చౌహన్, మహేశ్, ప్రణయ్
శ్రీమాన్‌కి చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. పేపర్ల మీద, ఇంట్లో నిత్యం బొమ్మలేస్తుంటే శ్రీమాన్ వాళ్ల అమ్మానాన్నలు ఆ బొమ్మలు చూసి తిట్టేవారు. నేను బొమ్మలు వేసి డబ్బులు సంపాదిస్తా అని ఇంట్లోంచి వచ్చేస్తాడు. రోడ్డు మీద బొమ్మలు వేస్తుంటే ఓ పెద్ద మనిషి చూసి శ్రీమాన్‌ని ఎంకరేజ్ చేస్తాడు. ఆ ప్రోత్సాహంతో శ్రీమాన్ పట్టుదలగా శ్రమించి మంచి ఆర్టిస్టు అవుతాడు. పెద్దయిన తర్వాత తను వేసిన ఆర్ట్‌ని ఆ పెద్దమనిషికి తీసుకెళ్లి ఇస్తాడు. ఆ పెద్దమనిషి శ్రీమాన్‌ని గుర్తుపట్టడు. పైగా తిట్టి పంపిస్తాడు. శ్రీమాన్ వేసిన బొమ్మను విసిరేస్తాడు. అప్పటి నుంచి శ్రీమాన్ మరిన్ని బొమ్మలు వేస్తాడు. ఈ క్రమంలో శ్రీమాన్‌కు చిత్ర పరిచయమవుతుంది. ఆమె సహాయంతో ఓ ఎగ్జిబిషన్ పెడతాడు. ఆ ప్రదర్శనలో శ్రీమాన్‌ని అవమానించిన పెద్దమనిషి శ్రీమాన్ వేసిన బొమ్మను లక్ష రూపాయలకు కొంటాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు శ్రీమాన్‌ని చిత్ర ఇష్టపడడం మొదలుపెడుతుంది. ఈ సమయంలోనే శ్రీమాన్ ప్రేమించే అమ్మాయి కథలోకి ఎంటరవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగిలిన కథ.

తను నేను

Total views 16,513+ (జనవరి 12 నాటికి)
Posted On : 05 Jan 2019
దర్శకత్వం: నాని కాసరగడ్డ
నటినటులు : శ్రీ చక్రి, జాను నారాయణ, హేమంత్
ఓ అమ్మాయి.. పేరు జాను. ఓ అబ్బాయి.. పేరు చక్రి. జాను ప్రతిరోజూ ఉదయం రెడీ అయి బ్యాగేసుకొని బస్టాప్‌కి మాత్రం తప్పకుండా వస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో చక్రి కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరూ రావడం, బస్టాప్‌లో ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు కూర్చొని ఒకరినొకరు చూసుకోవడం రోజూ జరిగే తంతే. ఒకరోజు వీరి కంటే ముందే ఓ ఉద్యోగి సరిగ్గా బస్టాప్ మధ్యలో కూర్చొని కునుకు తీస్తుంటాడు. ఇద్దరూ ఆలోచించి ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకుంటారు. పక్కపక్కనే కూర్చొని చాటింగ్ చేస్తుంటారు. గడికోసారి వచ్చే మెసేజ్‌ల సౌండ్‌కి బస్టాప్‌లో కూర్చున్న వ్యక్తికి నిద్ర కాస్త చెడిపోతుంది. గొణుక్కుంటూ వెళ్లిపోతాడు. ఇద్దరూ కొద్దిసేపు చాటింగ్ చేసుకుంటారు. మాటలో మాటగా ఎంతసేపు చాటింగేనా? మాట్లాడవా? అంటాడు చక్రి. ఆమె నేను మాట్లాడలేను అని చెప్తుంది. నువ్వు మాట్లాడినా నేను వినలేను అని చెప్తాడు చక్రి. ఆ తర్వాత ఏం జరిగింది? కథ చివర్లో ట్విస్ట్ భలే ఉంది. కావాలంటే యూట్యూబ్‌లో చూడండి.

సంక్రాంతి అల్లుళ్లు

Total views 8,054+ (జనవరి 12 నాటికి)
Posted On : 11 Jan 2019
దర్శకత్వం: నాగేంద్ర
నటీనటులు : రామ్ పటాస్, హర శ్రీనివాస్, మహేశ్ విట్ట, అల్మట్టి నాని, రాజ్‌కమల్, జి.రాజకుమార్ వైఎన్
సంక్రాంతి పండుగకు అత్తింటికి వచ్చి అల్లుళ్లు పెట్టే తిప్పలే ఈ షార్ట్‌ఫిలిం. పండుగ దగ్గరికి వచ్చినా ఇంకా అల్లుళ్లు, కూతుళ్లు రాలేదేంటా అని ఎదురుచూస్తుంటాడు పాపారాయుడు. చీటికి మాటికి ఇంట్లోకెళ్లి, మళ్లీ బయటకొచ్చి రోడ్డు వైపు చూస్తుంటాడు. ఇంతలోనే పెద్దకూతురు, ఆమె భర్త ఇద్దరూ వస్తారు. ఊర్లోకి వచ్చీ రాగానే మందేసి చిందేస్తూ ఎంటరిస్తాడు పెద్దల్లుడు. మరికొద్దిసేపటికి రెండో కూతురు, అల్లుడు వస్తారు. వచ్చీ రాగానే రెండో అల్లుడు మామను పొగడడం మొదలుపెడుతాడు. ఆ తర్వాత మామతో అడిగి మరీ పొగిడించుకుంటాడు. మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం కావస్తున్నా చిన్న కూతురు రాకపోవడంతో చిన్నకూతురు, అల్లుడు కోసం పడిగాపులు కాస్తుంటాడు పాపారాయుడు. రాత్రి తొమ్మిది గంటల వరకు చూసీ, చూసీ ఇంట్లోకి వెళ్లే ముందు తలుపు పక్కన గోడ మీద చిన్న కూతురు, అల్లుడు కూర్చుని ఉంటారు. వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్తాడు. పండుగకు వచ్చిన అల్లుళ్లు మామను ఎలా ఇబ్బంది పెట్టారు? ఆయన వారికి ఎలా బుద్ధి చెప్పాడో ఈ షార్ట్‌ఫిలింలో చూడండి.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి

938
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles