వాస్తు


Sun,January 20, 2019 01:38 AM

house

ఈశాన్యం పెరిగితే ఆగ్నేయం తగ్గుతుంది కదా. అది దోషం కాదా?

డి.వి.రామకృష్ణ, తిలక్‌నగర్, హైదరాబాద్
ప్రతి ఇంటికీ ఈశాన్యం పెంచి కట్టాలి అనే నియమం లేదు. పెరిగివున్న దిశలలో ఈశాన్యానికి అవకాశం ఇచ్చారు అంతే. పెరిగితేనే గొప్పది పెరగని ఇల్లు తక్కువది అనేది లేదు. ఈశాన్యం కోణంగా పెరగడం వల్ల సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడతాయి. ప్రహరీకి, ఇంటి ద్వారానికి దూరం పెరగడం వల్ల ఈశాన్యం స్థలం ఓపెన్ పెరిగి మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఇంటి లోపల ఉండదు. అధిక భాగం ఆ స్థలమే ఆక్రమిస్తుంది. ఆగ్నేయం తగ్గడం అన్నది స్థలానికి దోషం కలిగించదు. స్థలం త్రెంపుకోవాల్సి వచ్చినప్పుడు ఆగ్నేయం లేదా వాయవ్యం ఏదో ఒకటి త్రెంపు చేసుకోవడం శాస్త్రంలో చూపిన ప్రత్నామ్నాయమే.

దక్షిణం పూర్తిగా మూసి కట్టాలని చెప్పారు. అలా చేసినప్పటి నుంచి మాకేం బాగాలేదు. ఇప్పుడేం చేయమంటారు?

వనం లక్ష్మీనారాయణ, ఉప్పల్
మన శాస్ర్తాలన్నీ స్థలం వైశాల్యంలో చుట్టూ ఖాళీ వదిలి గృహం నిర్మించుకోవాలనే సూచిస్తున్నాయి. స్థలాన్ని తొమ్మిది భాగాలు చేసి చుట్టూ నాలుగువైపుల చివరలో ఒక భాగాన్ని వదలాలి అది పిశాచ స్థానం. అందులో గృహ నిర్మాణం రాకూడదు అని చెప్పారు. అంటే ఆ ప్లేస్ పిశాచాలు నివసిస్తాయి అని కాదు. ఇంటికి నలువైపులా ఓపెన్ లేకపోతే ఆరోగ్యాలు క్షీణించి అతలాకుతలం అవుతామని. మీరు వెంటనే దక్షిణం ఓపెన్ చేయండి. ఇంటి చుట్టూ ప్రదక్షిణం ఏర్పరుచుకోండి. అందుకు అనుగుణంగా ఇంట్లో లోపల కూడా మార్పులు చేర్పులు అడిగి చేసుకోండి. ఆరోగ్యధామంగా ఇల్లు ఉంటేనే అది ఆనంద నిలయం అవుతుంది.

మా ఇంటి మీద వాయవ్యంలో పద్నాలుగు అడుగుల ఎత్తు లిఫ్టు రూమ్ వచ్చింది. నైరుతిలో ఎంత ఎత్తు పెట్టాలి?

బి.వీరన్న, పోచంపల్లి
ఇంటిపైన ఒక మూల ఎత్తు ఎక్కువగా పెరగడం అనేది కొన్నిసార్లు తప్పనిసరి అవుతుంది. మీరు పైకప్పు మీదివరకు లిఫ్టులో రావడానికి పెట్టించుకొని ఉంటారు. చుట్టూ మొత్తం ఖాళీ ఉండి ఒక మూల అది వాయవ్యం రావడం వల్ల దానిపైన గాలి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. దానిని తప్పించటానికి ఆ లిఫ్ట్ గదిని ఆనుకొని ఒక గది దక్షిణం నైరుతి వరకు పెంచండి. ఆ గదిపైన వాటర్ ట్యాంక్ పెట్టుకోండి. తద్వారా పడమర అంతా నిండి నిర్మాణ సమతుల్యత వచ్చి రక్షణ ఏర్పడుతుంది. ఏ దిశకైనా ఒకే ఎత్తుతో నిర్మాణం పొడుగ్గా చేయడం మంచిది కాదు ఇంటిపైన.

ఈశాన్యం గృహం ఒక్కటే గొప్ప ఫలితాలు ఇస్తుందా? దక్షిణ గృహం ఇవ్వదా?

వి. సునీత, కంది, సంగారెడ్డి
స్థలం గొప్పదిగా ఉండి నిర్మాణం మనసు పెట్టి కడితే (అంటే శాస్త్రీయంగా) ఏ వీధి ఇల్లు అయినా గొప్పగానే ఉంటుంది. కొన్ని ఈశాన్య గృహాలు (తూర్పు - ఉత్తరం రోడ్లున్న ఇండ్లు) ఈశాన్యం లక్షణాలు పూర్ణంగా కలిగి ఉంటాయి అని చెప్పలేము. గొప్పవారి కొడుకులు గొప్ప వాళ్లుగా ఉండాలని లేదుగా.. అలా ఎన్నో లక్షణాలతోనే అది గొప్ప ఈశాన్యం ఇల్లుగా రాణిస్తుంది. దక్షిణం గృహాన్ని ఈశాన్యం గృహంతో సమంగా నిర్మించవచ్చు. వాస్తవం ఏమిటంటే భూమి మహాన్నతమైంది కావాలి. అది నిర్ధారితమైన తరువాత వీధులు ఎత్తు పల్లాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు. భూమి స్వతః సిద్ధంగా అంతటా గొప్పదిగానే ఉంటుంది అనుకోవద్దు. కాబట్టి కట్టే విధానం స్థలం నిర్ణయంతో అన్ని ఇండ్ల నుండి మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
house1

ఒకప్పుడు వాస్తును ఎవరు అంతగా పట్టించుకోలేదు కదా. ఇప్పుడే ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది?

-గౌరెల్లి రామస్వామి, రామగిరి, నల్లగొండ
మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు. కానీ తన ప్రయాణంలో ఒకరు జీవితపు ప్రాధాన్యం వైపు మరొకరు అగాధాల ఆశల వైపు ప్రయాణిస్తుంటారు. ఇద్దరూ తెలివైన వాళ్లే అయి ఉంటారు. కానీ నిర్ణయం అన్నది అక్కడ ప్రధానం. జీవితం నేర్పుతుంటే నేర్చుకోవడం గొప్పే కానీ జీవితంలో అప్పటికే ఎక్కువ కాలం ఖర్చయిపోతుంది. అలా ఉండకూడదనే మన పూర్వులు తమ జీవితాలను పణంగా పెట్టి మన జీవితాలను ఉద్ధరించాలని ఆశించి ఈ శాస్ర్తాలను అందించారు. శాస్త్రం వేలుపట్టి తండ్రిలాగ నడిపించదు. గోరుకొయ్య (నక్షత్రం) లాగా ఆకాశంలో నిలిచి ఉదయం కాలాన్ని సూచిస్తుంది. మేలుకొనే వారు మేలుకుంటారు. ఇప్పుడు, అప్పుడు శాస్త్రం ఉంది. జనంలో నేడు ఆ దృష్టి పెరిగింది. అవేర్‌నెస్ వచ్చింది. మానవ శక్తికన్నా మిన్నదైంది. జీవితాలను డ్రైవ్ చేసేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది.

sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles