యాగం లోక కల్యాణ యోగం


Sun,January 13, 2019 01:45 AM

KCR
యజ్ఞం లేదా యాగానికి హిందూ సంప్రదాయంలో విశిష్టస్థానముంది. విశ్వకల్యాణం, ప్రజాశ్రేయస్సు కోరుతూ ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు యాగాలు చేశారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా గల మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కూడా యజ్ఞయాగాదుల పట్ల చాలా విశ్వాసం ఉంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన వివిధ సందర్భాల్లో యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆయన శతచండీయాగం నిర్వహించారు. మరుసటి ఏడాది తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నవ చండీయాగం, ఆయుత శతచండీయాగం నిర్వహించారు. ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన ఆయన లోకకల్యాణం, రాష్ట్ర అభివృద్ధి కోసం మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగంను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగాల గురించి ముఖచిత్ర కథనం..
- మధుకర్ వైద్యుల,సెల్: 9182777409

KCR1

KCR2
KCR3

మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం

ముఖ్యమంత్రి కేసిఆర్ లోకకల్యాణం, రాష్ట్ర అభివృద్ధి కోసం మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం చేయనున్నారు. ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్‌లో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు యాగాన్ని నిర్వహిస్తారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో, శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. చతుర్వేద పండితుడు, జ్యోతిరాప్తోర్యామ యాజి మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో జరిగే ఈ మహా క్రతువులో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీ యాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు.

అన్నీ కలిపితే వెయ్యి పారాయణలవుతాయి. ఐదో రోజు 11 యజ్ఞ కుండాల వద్ద.. ఒక్కో యజ్ఞ కుండం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్త మవుతుంది. మహారుద్ర యాగంలో భాగంగా నాలుగు రోజులూ కలిపి వెయ్యి పైచిలుకు రుద్రపారాయణాలు, చివరిరోజున రుద్ర హవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రంపూట తత్సంబంధిత జపాలు, భాగవత, రామాయణ పారాయణ చేస్తారు. ఈ యాగానికి వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలను, పీఠాధిపతులను, ధర్మాచార్యులను, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలను, వేదపండితులను, ప్రముఖులను కేసీఆర్‌ఆహ్వానించనున్నారు.

సనాతన ధర్మంలో యజ్ఞాలు లేదా యాగాలు అనేది చాలా విశేషమైనవి. యజ్ఞం, అను శబ్దం యజ దేవ పూజయాం అనే ధాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. యజయే ఇతి యజ్ఞ: యజ: ఎన్నో యజ్ఞ యాగ దులచేత యోగ దాయకుడైన పరమేశ్వరుని యోగీశ్యరత్వా నికి య కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వల్ల స్వార్థం నశిస్తుందని గాఢ విశ్వాసం ఉంది. యజ అంటే ఆరాధించు, గౌరవించు, కర్మ త్యాగంగా చెప్పవచ్చు. ముఖ్యంగా యజ్ఞాలు అనేవి మనిషి అంతరం నుంచి విశ్వాంతరాల వరకు చేసే పనులు.

దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం ముఖ్య లక్ష్యం. అగ్ని హోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞం లోని అగ్నిలో వేసినవన్నీ అన్ని దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కు వ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి వాటిని వేస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాల వరకూ జరుగవచ్చు. యజ్ఞాలలో రకాలు
యజ్ఞాలలో మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు.
పాక యజ్ఞాలు : ఇవి మళ్ళీ ఏడు విధాలు. ఔపాసన, స్థాలీపాకము, వైశ్వదేవము, అష్టకము, మాస శ్రాద్ధము, సర్పబలి, ఈశాన బలి
హవిర్యాగాలు : వీటిలో కూడా ఏడు రకాలున్నాయి. అగ్ని హోత్రాలు, దర్శపూర్ణిమాసలు, అగ్రయణం, చాతు ర్మాస్యాలు, పిండ, పితృయజ్ఞాలు, నిరూఢ పశుబంధము, సౌత్రామణి.
సోమ సంస్థలు : వీటిలో ఏడు రకాలు. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థము, అతిరాత్రము, ఆప్తోర్యామం, వాజపేయం, పౌండరీకం.

400 పైగా..

వీటిలో రుద్రయాగాలు, చండీయాగాలు, సోమయాగాలు అని పలు రకాలు కనిపిస్తాయి. వ్యక్తులు లేదా సమూహాలు చేసేవాటిని కామ్యార్థ యాగాలని, రాజ్యం, దేశం, రాష్ట్ర శ్రేయస్సుకోసం చేసే యాగాలను లోకకళ్యాణ యాగాలని అంటారు. రుద్రయాగాల్లో ఏక, ఏకదశ, అతి, మహారుద్ర, అతిరుద్ర, ప్రయత ఇలా ఉంటే చండీయాగాల్లో నవచండీ, ద్వాదశ చండీ, శతచండీ, సహస్ర, శత సహస్ర, సోమ యాగాల్లో సుదర్శనయాగం, గీతాయజ్ఞం ఇలా చెప్పు కుంటూ పోతే 400లకు పైగా యాగాలు ఉన్నాయి.

ప్రధాన యాగాలు :

ప్రధానంగా ఎక్కువగా నిర్వహించే యాగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అశ్వమేధ యాగం, సర్ప యాగం, రాజసూయ యాగం, పుత్రకామేష్టి యాగం, విశ్వజిత్ యాగం, వరుణయాగం, సుదర్శన యాగం, చండీ యాగం, నక్షత్ర మండల యాగం, రాజసూయం, వాజ పేయం ఇలా ఎన్నెన్నో..

అశ్వమేధ యాగం :

అశ్వమేధ యాగం వేద కాలం నుంచి వస్తున్న రాజ సాంప్రదాయాలలో అతి ముఖ్యమైంది. ఈ యాగం గురిం చి వివరంగా యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదంలో గుర్రపు బలి గురించి, శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నా, యజుర్వేదంలో చెప్పినంత వివరంగా చెప్పలేదు. గాయత్రీ పరివార్ 1991 నాటి నుంచి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్ధేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై ఆధిపత్యాన్ని తెలుపడం తమ రాజ్యం గొప్పతనాన్ని చాటుకోవడం. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందుల నుంచి కాపాడడానికి తోడుగా రాజకుమారులు కాని సేనాధిపతులుగాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.

సర్పయాగం :

మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాము లను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ఆరంభంలో ఆదిపర్వంలోనే సర్ప యాగం ఉదంతం వస్తుంది. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రాంభమవుతుంది.

రాజాసూయయాగం :

ద్వాపర యుగంలో ధర్మారాజు రాజాసూయయాగాన్ని జరిపిస్తాడు. అతనికి సహాయంగా వెళ్లిన కృష్ణుడు భీమునితో తన శత్రువు జరాసందుని చంపిస్తాడు. దాంతో ధర్మరాజు ద్విగిజయంగా యాగాన్ని జరిపిస్తాడు. ఖాండవ ప్రస్థాన్ని యముడు అతిలోక సౌందర్యంతో తీర్చిదిద్దాక, రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతూండగా, యుధిష్టురుడు రాజసూయయాగం చేస్తాడు.

విశ్వజిత్ యాగం :

ఒక్క రోజులో పూర్తి కావలిసిన యాగం. ఇందులో యజ మాని తన మొత్తం ఆస్తిని దానం చేయవలసి ఉంటుంది. ప్రహ్లాదుని మనవడు వరోచనుడు. అ వరోచనుని కుమా రుడు బలి. గురువైన శంకరాచార్యుల వారి బలితో విశ్వ జిత్ అనే యాగం చేయించాడు. ఈ విశ్వజిత్ యాగాన్ని సాధారణంగా చాలా తక్కువగా నిర్వహిస్తుంటారు.

వరుణయాగం :

సాధారణంగా వర్షాలు పడనప్పుడు ఇలాంటి యాగాలు చేస్తుంటారు. చేసిన తరువాత వర్షాలు వస్తాయనేది ఒక నమ్మకం. పూర్వకాలంలో ఋషులతో రాజులు ఎక్కువగా చేయిస్తుండేవారు. వర్షాలు రానప్పుడు జపాలు చేయడం అనేది అనవాయితీగా మారింది. చాలాసార్లు ఇలా చేసి నప్పుడు వర్షం రావడంతో వరుణ దేవుడు యాగంతో కరుణించి వర్షాన్ని కురిపించాడు అనేది నమ్మకం.

పుత్రకామేష్టి యాగం

పూర్వకాలంలో రాజ్యం చేయడానికి వారసులు కావాలన్న ఉద్దేశంతో పిల్లలులేని రాజులు పిల్లలకోసం పుత్రకామేష్టీ యాగం చేసేవారు. అయోధ్య రాజు దశరథుడు తనకు పిల్లలు లేరని పుత్రకామేష్టీయాగం చేయగా ఆయనకున్న ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు జన్మించారు.

రాజశ్యామల యాగం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ రాష్ట అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 నవంబర్‌లో సిద్దిపేట జిల్లా లోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని అగ్రహాలకు హోమాలు, చండీ యాగం నిర్వహించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూ పానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు.
KCR8

పుష్పయాగం

ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారు. 15వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్స వాల్లో ధ్వజా రోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతున్నది. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబరు 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది. శ్రీవారికి యేటా కార్తీక మాసము శ్రవణ నక్షత్రం ఉన్న రోజున జరిగే పుష్ప యాగంలో ఉపయోగించే పుష్పాల బరువు 2000కిలోలు. మొత్తం తెలుగు, తమిళ, కర్ణాటక రాష్ర్టాల నుండి 27 రకాల పుష్పాలు ఉపయోగిస్తారు. చంపకం, మల్లికా, తులసి, కుముదము, కర వీర, నంద్యవర్తం, పలాశ కర్ణికా, మందార, అతసి, కేతకీ, వకులార్జున, పున్నాగ, మాధవి, పిండితకి, ద్వికర్ణికా, బహుకర్ణికా, కురువ, నాగ వృక్ష, కనకము, కర్ణికారం, బంధుకం, కృష్ణతులసి, సూర్య నందా, కకుభోదుంబరం, అగ్రకర్ణికా, కాలనందా అనేవి మొత్తం ఇరవై ఏడు రకాలు.

అతిరాత్రం

సప్త సోమయాగాలలో అతి పవిత్రమైంది అతిరాత్రం (అతిశయితా రాతిః ఇతి అతిరాత్రః) అని విజ్ఞులు చెబు తున్నారు. మనిషిజీవనానికి 48 సంస్కారాలను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. వీటిలో 39 వ సంస్కారమే అతిరాత్రం. అతిరాత్రం ఉత్కృష్ట సోమయాగం కేరళలో ప్రసిద్ధమైంది. ఈ యాగాన్ని దశరథ మహా రాజు నిర్వహించినట్టు రామాయణం బాలకాండలోని 14వ సర్గ 39వ శ్లోకం రెండో పాదం, 40వ శ్లోకం మొదటిపాదంలో పేర్కొన్నారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగంతో పాటు అతిరాత్రం కూడా నిర్వహించినట్టు దీనివల్ల స్పష్టమవుతున్నది. గుప్త రాజులు, చోళరాజులు తదితర రాజులు కూడా అతిరాత్రం యాగాన్ని నిర్వహించినట్టు దాఖలాలు ఉన్నాయి. కేరళలోని నంబూద్రి కుటుంబీకులు ఈ యాగాన్ని అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. 1901, 1918, 1956, 1975, 2011 సంవత్సరాల్లో నంబూద్రి కుటుంబీకులు అతిరాత్రం నిర్వహించారు. 2011 ఏప్రిల్ 4 నుండి 15 వరకు కేరళలోని త్రిశూర్ జిల్లా పంజాల్ గ్రామంలో అతిరాత్రం నిర్వహించారు. 2012లో ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు భద్రాచలానికి దగ్గర ఎటపాకలో జరిగింది. కేరళ నంబూద్రిలే ఈ యాగాన్ని నిర్వహించారు. 2013లో ఏప్రిల్ నెలలో కీసరగుట్ట గ్రామంలో జరిగింది.
KCR7

ఆయుత చండీయాగం

అయుత చండీ హోమం అత్యంత మహిమాన్విత హోమం.. ఇందులో పదివేల సార్లు చండీ సప్తశతి పారా యణం చేస్తారు. అందులో దశాంశం హోమాలు నిర్వ హిస్తారు. అంటే ప్రతి పదిసార్లు చండీ సప్తశతి పారా యణం చేస్తే, ఒకసారి దానికి హోమం నిర్వహిస్తారు. ఇలా వంద యజ్ఞకుండాలలో ఒకేసారి హోమం నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల శత కుండాల నుంచి వెలుగులు చిమ్ముతూ, యజ్ఞ పురుషుడు మానవుని దేహంతో పాటు, ఈ దేశంలో పేరుకుపోయిన మాలిన్యాలను తొలగిస్తాడు. ప్రకృతి శక్తులకు పునరుజ్జీవమిచ్చి.. ప్రజ్వలింప చేస్తాడు. తత్ఫలితంగా రాజ్యంలో వర్షాలు బాగా పడతాయి. కరువు కాట కాలు, గ్రహపీడలు తొలగిపోతాయి. రాజ్యానికి మహర్దశ పడుతుందన్నది పండితుల నమ్మకం. ఈ అయుత చండీ యాగాన్ని వేదప్రామాణికంగా, సనాతన ధర్మ సంప్రదాయ బద్ధంగా, అత్యంత నియమ నిష్ఠలతో నిర్వహించాలి.

నియమనిష్ఠలు

నవార్ణ మంత్ర ఉపదేశం తీసుకున్న పరమ నిష్టాగరిష్ఠులైన 200 మంది రుత్విక్కులు అయుత చండీయాగంలో పాల్గొంటారు. ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. యాగ శాలలో పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. బ్రహ్మచర్యం పాటిస్తారు. రెండు పూటలా స్నానం చేస్తారు. ఇక యాగ ప్రాంతానికి చేరుకున్న ప్రతి ఒక్కరూ యాగ పవిత్రతను కాపాడాలి. అయితే, రజస్వల, బహిష్టు అయినవాళ్లు, జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవాళ్లు, ఈ నియమాలను పాటించని ఇతర బంధుగణం యాగస్థలికి రాకూడదు. యాగ ప్రదేశానికి మద్యం, మాంసం సేవించి రాకూడదు. యాగ పరిసరాల్లో ధూమపానం నిషేధం.

యాగాలు, ఉపయోగాలు

యజ్ఞం, యాగం అన్నది ఒక వ్యక్తి నిర్వహిం చినా యజ్ఞఫలం లోక కల్యాణం కోసం ఉద్దేశించిందే. యాగం నిర్వహించేటప్పుడు.. హోమం కాల్చడం తప్పనిసరి. హోమాగ్ని జనించి మానవ జీవితానికి పారమార్థిక చింతనను కలిగిస్తుంది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ యజ్ఞ ప్రాంగణంలో కొత్త శక్తిని సంత రించుకుంటాయి. అయుత చండీ యాగంలో.. ప్రకృతికి అనంత శక్తి అందిస్తున్న సూర్యమండలంలో పోగుపడ్డ మలినాలు తొలగిపోతాయి. తద్వారా ప్రకృతి శక్తులన్నీ కొత్త ఉత్తేజంతో యజ్ఞం చేసిన ప్రాంతాల్ని కరుణిస్తాయి. సహజంగా యాగాలు నిర్వహించినపుడు హోమగుండం నుంచి వెలువడే పొగకు ఎంతో విశిష్టత ఉంటుందని రుత్వికులు చెబుతారు. ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ శత చండీ యాగంలో పూర్తిగా ఆవు నెయ్యి, ఆవు పేడతో తయారు చేసిన పిడకలను వినియోగించనున్నారు. పది గ్రాముల నెయ్యితో పిడకలను మండిస్తే టన్ను ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది. 5రోజుల పాటు నిర్వహించే హోమాల ద్వారా కొన్ని వందల టన్నుల ఆక్సిజన్ గాలిలో కలవనుంది.

మానవ తప్పిదాలతో కలుషితమైన ప్రకృతి హోమం నుంచి ఉత్పన్నమయ్యే ఆక్సిజన్ ద్వారా శుద్ధి అవుతుందని వేద పండితులు తెలిపారు. హోమ కార్యక్రమాల్లో భాగంగా రోజూ పండితులు గో విశిష్టతపై ప్రవచనాలు చెబుతారు. హోమం అనేది ఒక త్యాగం. ఇది ఒక అగ్ని ప్రక్రియ. ఈ హోమం ద్వారా ఇచ్ఛ లేదా కోరికను జయింపజేయవచ్చు. హోమాన్ని మనఃసంకల్పిత యజ్ఞం అని కూడా అంటారు. హోమంలో, ఇచ్ఛాపూర్వక దైవాన్ని నిర్దిష్టమైన రీతిలో తగిన విధానాలను ఉపయోగించి అగ్ని హోత్రంలో మంత్ర పూర్వకంగా ప్రార్థిస్తారు. అగ్నిహోత్ర పదార్థాల పవిత్రతతో వేదమంత్ర, శ్లోకాలతో పాటు ఆజ్యం, ద్రవ్యం మంటల్లో ఆహుతి అవుతాయి. ఫలితంగా సర్వమతాలు బోధించే ఈ హోమ విధానాన్ని దేవతలు స్వీకరిస్తారు. ఈ సర్వ మానవాళి అగ్నిహోత్ర మంత్ర పూర్వకంగా ప్రార్థన ఫలితంగా దేవతామూర్తుల పూజా ఫలాలు త్వరగా పొందగలుగుతాం!

ఆధ్యాత్మిక పురోగతి కోసం హోమాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. హోమానికి ప్రధాన వస్తువు అగ్ని. మంత్రోచ్ఛరణ అగ్నిలో దేవతా ద్రవ్య పదార్థాలు అందించడం ద్వారా గొప్ప ప్రక్షాళన కలిగి మనసుపై, మనిషిపై భవిష్యత్ కార్యాచరణపై మంచి ప్రభావం కనబరుస్తుంది. హోమ ఆచరణ ద్వారా గొప్ప స్థాయికి ఎదగడం.. మనసు ప్రశాంతత పొందడం సాధ్య పడుతుంది. హోమం ద్వారా సకల ప్రయోజనాలు పొంద వచ్చు. భగవద్గీత, యజుర్వేదంలో హోమ ఘట్టాల ఫలితా లెన్నో ఉన్నాయి.

KCR4

యాగాల వల్ల సత్ఫాలితాలుంటాయి

అతివృష్టి, అనావృష్టి తొలగిపోవుటకు పూర్వం దేవీ ఉపాసకులు సిద్ధ సంకల్పంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శతచండీ, సహస్ర చండీయాగాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి చేసే ప్రతి యాగం కూడా లోక కళ్యాణం కోసమే. ఆయనకు యాగాలు, యజ్ఙాల మీదా విశ్వాసం ఉంది. ఆయన చేసే యా గాలు పది మందికి ఉపయోగపడాలని, ముఖ్యంగా తెలంగాణకు మేలు జరగాలన్నదే ఆయన సంకల్పం. తెలంగాణలో వర్షాలు భాగా కురవాలనీ, తద్వారా రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నది ఆయన ఉద్దేశం. మనమందరం కలలు కంటు న్న బంగారు తెలంగాణ సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవశక్తి తోడు కావాలన్నదే ఆయన అభిలాష.
-బ్రహ్మశ్రీ వేదమూర్తులు పురాణం మహేశ్వరశర్మ

KCR5

చండీయాగం

చండీయాగంలో నవ చండీయాగం, శత చండీయాగం, సహస్ర చండీయాగం, అయుత (పది వేలు) చండీయాగం, లక్ష చండీయాగం చేస్తారు.అయుత చండీయాగం అంటే పదివేలు. పదివేల సంఖ్యను పూరిస్తూ చండీ (దుర్గ) సప్తశతీ పారాయణాలను పూర్తి చేసి, ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే వేయి సార్లు నామాలతో హోమం చేసి, పూర్ణాహుతులను సమర్పించడ మే అయుత చండీయాగం. 106 హోమగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను చేస్తారు. ఒక్కో రుత్విక్కుడు తొలిరోజు ఒక సప్తశతి పారాయణం, నాలుగు వేల చండీ నవాక్షరీ జపం చేస్తారు. రెండోరోజు 2వేల పారాయణాలు, 3వేల జపాలు. మూడోరోజు 3వేల పారాయణాలు, 2వేల జపాలు. నాలుగోరోజు 4సప్తశతి పారాయణాలు, వేయి చండీ నవాక్షరీ జపం. చివరిరోజున ఒక్కో హోమగుండం వద్ద 11 మంది రుత్విక్కులు పాయసంతో హోమం చేస్తారు. 100 మంది పాలతో 10 వేల పారాయణాలకు దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి అయుత చండీయాగం సంపూర్ణమవుతుంది. వీటితోపాటు రోజూ నవదుర్గలకు నవావరణ పూజ, బలిప్రదానం, సువాసినీ పూజలు, కన్యకాపూజలు, మహిళలతో కుంకుమార్చనలు, సాయంకాలం ప్రదోష కాలంలో అవధారయలు, రాజోపచారాలు, శాస్ర్తాలు, ప్రవచనాలు, మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఉంటాయి.

KCR6

శాస్త్రీయ కారణాలు

యజ్ఞాలు చెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. యజ్ఞం చేసేపుడు అగ్ని హోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక వృక్షాల కట్టెలు వంటి వాటిని వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వెయ్యడంతో వచ్చే ధూమంవల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించ బడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి కూడా. స్వచ్చమైన గాలి అందుతుంది. మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదు ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయవచ్చు.

వేద ప్రక్రియను రక్షించుకోవాలి!

దేశంలో కూడా పలు సందర్భాలలో వర్షాల కోసం, ప్రకృతి బీభత్సాల నుంచి రక్షణ కోసం చేసిన యజ్ఞాలు వాటి ఫలితాల గురించి చాలామంది ప్రత్యక్షంగా చూశారు. యాగాలలో వాడే ద్రవ్యపదార్థాల వల్ల ప్రకృతిలో పలు మార్పులు జరుగుతాయి. ఆతిరాత్రంలో మేకపాలు, నెయ్యితో సుమారు 3000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన అగ్నిగోళాన్ని సృష్టిస్తారు. అదే ఆధునిక సాంకేతికతలో దీనికి చాలా వ్యయప్రయాసలు పడాలి. సూక్ష్మంలో మోక్షం అనే విధంగా మన చుట్టు ఉండే ప్రకృతిలోని పదార్థాలను ఉపయోగించి ఆయా దేవతలకు హవిస్సు ఇస్తారు. కలియుగ నియమం ప్రకారం దేవతలు నేరుగా హవిస్సు తీసుకోరు. అగ్నిదేవుడు మనం యజ్ఞాల ద్వారా ఇచ్చే హవిస్సును ఆయా దేవతలకు అందిస్తారు. దానితో వారు సంతోషించి మనం చేసిన యజ్ఞ ఫలితాన్ని మనకు అందిస్తారు. అద్భుతమైన ఈ వేదప్రక్రియను రక్షించుకోవల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉంది.
- శిరీష్ ఘనాపాఠి, చెన్నై

KCR10

సీఎం కేసీఆర్ నిర్వహిచిన యాగాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గడచిన 20 ఏళ్లుగా యాగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన అనేక యాగాలు చేశారు. వాటిలో 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు. సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకం.
- 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహననం.
- 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం.
- 2006లో సహస్ర చండీయాగం.
- 2007లో పాలకుర్తి నరసింహ రామశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శన యాగం.
- 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రీ యాగం.
- 2009లో తెలంగాణ భవన్‌లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం.
- 2010లో తెలంగాణ భవన్‌లో చండీయాగం.
- 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగం.
- 2015 నవంబర్ 27న నవ చండీయాగం.
- 2015 డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శతచండీయాగం.
- 2018 రాజశ్యామల యాగం.

KCR9

చండీ యాగ విశేషాలు

కలియుగంలో చండీయాగానికి మించిన యాగం మరొకటి లేదని చెబుతారు. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమమని అంటారు. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయనుకుంటారు కానీ ఇందు లో ఉండేవి 578 మాత్రమే. అయితే ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలుగా పిలుస్తారు. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకం బరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప ్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. కలియుగంలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర, అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. గత 200 ఏళ్ల లో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే.. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు.

2188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles