మరణశయ్యపై 30 రోజులు అక్కడేం జరిగింది?


Sun,January 13, 2019 01:25 AM

Sathya-Sai-Baba
మధుకర్ వైద్యుల
సెల్ : 80966 77409

2011 మార్చి 24 గురువారం
ఉదయం 7 గం.40 నిమిషాలు...
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం

అప్పటికి నడిచే దైవంగా దేశవిదేశీ భక్తులతో పూజలందుకుంటున్న పుట్టపర్తి సత్యసాయిబాబా అనారోగ్యానికి గురయ్యారు. బాబా స్లోయింగ్ ఆఫ్ ది హార్ట్ బీట్ (హృదయ స్పందన నెమ్మదించడం) సమస్యతో బాధపడుతుండడాన్ని డాక్టర్లు గుర్తించారు. నిజానికి బెంగళూరు వైట్‌ఫీల్డ్ ఆశ్రమంలో 2003లో జారిపడి కాలు విరగడంతో అప్పటి నుంచి సత్యసాయి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. నాలుగు రోజుల పాటు ఆయన నివాస మందిరమైన యజుర్వేద మందిరంలోనే చికిత్స జరిపారు. అయినా బాబా ఆరోగ్య పరిస్థితిలో మార్పులేకపోవడంతో మార్చి 28 నాటి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్) డెరైక్టర్ సఫాయా ఆధ్వర్యంలో వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది. గుండె సాధారణం కంటే అతి తక్కువ స్థాయిలో కొట్టుకుంటున్నదని వైద్యులు నిర్ధారించి ఆ దిశగా చికిత్స అందజేశారు. పేస్‌మేకర్ అమర్చి గుండె కొట్టుకోవటాన్ని సాధారణ స్థితికి తెచ్చారు. మరోవైపు ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటిలేటర్ అమర్చారు.

సత్యసాయి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయినట్లు తెలియగానే భక్తుల్లో ఆందోళన మొదలైంది. బాబా త్వరగా కోలుకోవాలని దేశ విదేశాల్లో ఉన్న ఆయన భక్తులు ప్రార్థించడం మొదలు పెట్టారు.

బాబాకు 29వ తేదీన పేస్‌మేకర్‌ను అలానే ఉంచి వైద్యం అందించారు. తిరిగి రక్తపోటు (బీపీ) సమస్య ఉత్పన్నమైంది. ఐఏబీపీ (ఆర్టీరియల్ ఇంటర్వెన్షన్ బ్లడ్ ప్రెషర్) అమర్చి రక్తపోటును నియంత్రించారు. 30వ తేదీన యూరిన్ సమస్య ఉత్పన్నమై బాబా శరీరంలోకి నీరు చేరింది. కిడ్నీ సమస్య తలెత్తినట్లు వైద్యులు గమనించారు. న్యుమోనియా వ్యాధి సోకి ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించారు. చికిత్స చేసి ఆ నీరును తొలగించారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ చికిత్సను మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగించారు.

ఏప్రిల్ 1వ తేదీన సత్యసాయి శ్వాస ప్రక్రియ సరిగా లేక అవస్థ పడుతున్న విషయాన్ని గమనించి వెంటిలేటర్ అమర్చారు. ఈ ప్రక్రియ 1, 2 తేదీల్లో కూడా కొనసాగింది. 2వ తేదీ రాత్రి బాబాకు చికిత్స కోసం అమర్చిన వైద్య పరికరాలను క్రమంగా తొలగించి సహజంగా శ్వాస తీసుకునే వీలును కల్పించే ప్రయత్నం చేశారు. అయితే బాబా శ్వాస పీల్చుకోవటానికి పడిన ఇబ్బందిని గమనించిన వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే యథావిథిగా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందజేశారు.

బాబా శ్వాస కూడా పీల్చుకోవడం లేదని, వైద్యానికి ఆయన శరీరం సహకరించడం లేదని మీడియాలో కథనాలు మొదలయ్యాయి. దీంతో ఆయన భకుల్లో కలకలం రేగింది. వేలాదిగా భక్తులు పుట్టపర్తికి చేరుకుంటుండడంతో ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పరిస్థితి చేయిదాటకముందే స్పందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంత్రుల బృందాన్ని పుట్టపర్తికి పంపించింది. ఈ బృందంలో నాటి మం త్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డిలు ఉన్నారు. వారు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య బృందం, ట్రస్టు వర్గాలతో బాబా ఆరోగ్యంపై చర్చించారు. అక్కడి పరిస్థితిని సీఎం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 3వ తేదీన (ఆదివారం) రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్ల బృందం పుట్టపర్తికి చేరుకుంది. సిమ్స్ డెరైక్టర్ సఫాయా, డాక్టర్ల బృందంతో వారు బాబాకు అందించిన చికిత్సలు, తాజా పరిస్థితుల గురించి చర్చించారు. ప్రభుత్వం తరఫున బాబాకు సంబంధించిన చికిత్సలు ఇతరత్రా అవసరాల విషయంలో తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సిమ్స్ డాక్టర్లకు తెలిపారు. ఐఏబీపీ ద్వారా అందించిన చికిత్సలకు ప్రత్యామ్నాయంగా సీఆర్‌ఆర్టీ చికిత్సను అందజేస్తే మంచిదని సూచించినట్లు తెలిపారు.

ఇదే రోజు సీఆర్‌ఆర్టీ చికిత్సలు అందజేస్తూ డయాలసిస్ నిర్వహించారు. 4వ తేది సోమవారం ఉద యం సిమ్స్ డైరెక్టర్ సఫాయా విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో సత్యసాయి బాబా అన్ని అవయవాల పనితీరు సాధారణంగా, సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. బాబా ఆరోగ్య పరిస్థితులపై మంత్రుల బృందం మళ్లీ సమీక్షించి డాక్టర్లు తెలిపిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అయితే ఆరోజు సాయంత్రానికే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోమవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. మూత్రపిండం పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. రక్తపోటు కూడా సక్రమంగా లేదని గుర్తించారు. దాంతో బాబా ఆరోగ్యం విషమించిందని సిమ్స్ డెరైక్టర్ ఏఎన్ సఫాయా ప్రకటించారు. భక్తుల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. సామాన్య భక్తులు పెద్దసంఖ్యలో పుట్టపర్తికి చేరుకోసాగారు. అంతేకాదు.. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు పుట్టపర్తికి బయలుదేరారు.

Sathya-Sai-Baba1
ప్రతి ఏటా తన జన్మదినం సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చి, సందేశమిచ్చే బాబా 2010 నవంబర్ 23న దర్శ నం మాత్రమే ఇచ్చారు. ప్రసంగించలేకపోయారు. అంతకుముందు రెండు మూడు రోజులకొకసారైనా భక్తుల ముందుకు వచ్చేవారు. ప్రశాంతి నిలయంలో కలియ తిరుగుతూ అందర్నీ పలకరించేవారు.

సత్యసాయి ఆసుపత్రిలో చేరడానికి ముందునుండే ట్రస్ట్‌లో బాబాకు తెలియకుండానే అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాక ఆయన బంధువులను ఎవరినీ కూడా ప్రశాంతి నిలయంలోకి అనుమతించకపోవడంతో బంధువుల్లో ఆందోళన మొదలైంది. సత్యసాయిని ట్రస్టు సభ్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని బంధువులే ఆరోపించడం కలకలం సృష్టించింది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంతులేని గోప్యత పాటిస్తుండటంతో ఒక దశలో భక్తులు ఆగ్రహావేశాలతో ఆందోళనకు దిగారు. మా బాబాను మాకు చూపండి. వాస్తవ పరిస్థితిని వివరించండి అని డిమాండ్ చేశారు.

కానీ, అక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.బాబా ఆరోగ్య పరిస్థితిని వివరించడానికి ట్రస్ట్ కేవలం ఆస్పత్రి డైరెక్టర్ సఫాయాకు మాత్రమే అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన ఇచ్చే సమాచారమే బయటికి వస్తున్నది. చివరికి.. ట్రస్టు సభ్యుల్లో ఒకరైన బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌ను సైతం ఆస్పత్రి లోపలికి అనుమతించడం లేదని ఆరోపణలు మిన్నంటాయి. గడచిన ఆరునెలలుగా బాబా ఆరోగ్యం దెబ్బతిందని ఆయినా ఎవరూ పట్టించుకోలేదన్న విమర్శలూ వచ్చాయి.

ప్రతి ఏటా తన జన్మదినం సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చి, సందేశమిచ్చే బాబా 2010 నవంబర్ 23న దర్శ నం మాత్రమే ఇచ్చారు. ప్రసంగించలేకపోయారు. అంతకుముందు రెండు మూడు రోజులకొకసారైనా భక్తుల ముందుకు వచ్చేవారు. ప్రశాంతి నిలయంలో కలియ తిరుగుతూ అందర్నీ పలకరించేవారు. కానీ, గత నవంబర్ 23 తర్వాత ఒక్కసారి కూడా దర్శనమివ్వలేదు. అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో బాబా తిరిగి కోలుకోవాలని, ఆయన దివ్యదర్శనం తమకు లభించాలని అశేష భక్తజనం ప్రార్థిస్తునే ఉన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన మంత్రు లు కూడా భక్తులను శాంతపరిచే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సత్యసాయిబాబా ఆరోగ్యంపై ఎలాం టి గోప్యత లేదని, ఆయన ఆరోగ్యంపై రోజుకు రెండు మెడికల్ బులిటెన్లను వైద్యులు విడుదల చేస్తున్నారని నాటి మంత్రి రఘువీరా స్పష్టం చేశారు. తెలిపారు. బాబా ఆరోగ్యం నిన్నటికన్నా ఇవాళ కాస్త మెరుగ్తా ఉందని, కిడ్నీలు తప్ప మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయని మరో మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఆడియో సంగీతం, ప్రార్థనలకు బాబా స్పందిస్తున్నారని, హారతి ఇవ్వండని సైగలు కూడా చేస్తున్నారని మంత్రి వివరించారు. బాబా ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతున్నదని గీతారెడ్డి వెల్లడించారు.

అయినా ఎన్నో అనుమానాలు. అసలు బాబా బతికే ఉన్నాడా? అని సందేహాలు. అప్పటికే రెండు రోజులుగా బాబా మరణించారన్న వార్తలు గుప్పుమనడం, మరోవైపు పుట్టపర్తికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుంటుండడంతో అసలు పుట్టపర్తిలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. బాబా ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే శవపేటిక తయారీకి అర్డరు ఇచ్చారని కన్నడ టీవీ చానళ్ళు చేసిన ప్రసారాలు కొత్త వివాదానికి తెర తీశాయి. అంటే ఆయన ఆసుపత్రిలో చేరిన రోజే మరణించారా లేక ఇక ఒకటి రెండు రోజుల్లో మరణిస్తారన్న ఉద్దేశంతో ఫ్రీజర్ తయారీకి ఆర్డర్ ఇచ్చారా అన్న సందేహాలు టీవీల్లో చక్కర్లు కొట్టాయి. బాబా భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజరును తయారు చేసిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలను కన్నడ టీవీ చానళ్ళు ఉదయ, సమయ ప్రసారం చేసిన అంశాలు ఈ వివాదానికి కారణమయ్యాయి.

మార్చి ముప్పయ్యో తేదీన కర్నాటకలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే శవ పేటికల తయారీ సంస్థకు కర్నాటకలోని రాజేంద్రనాథ్ అనే సాయిసేవా సమితి ప్రతినిధి శవపేటికకు ఆర్డర్ ఇచ్చి యాభై వేల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఏప్రిల్ నాలుగో తేదీన సాయి ట్రస్టు ప్రతినిధులు మళ్ళీ ఆ సంస్థకు ఫోన్ చేసి తమకు ఏడో తేదీ కల్లా శవపేటిక కావాలని వత్తిడి తెచ్చారు. శవపేటికను తయారు చేసేందుకు తమకు కనీసం నెల రోజుల సమయమైనా కావాలని, శవపేటికలో ఉంచే భౌతిక కాయం చెడిపోకుండా ప్రత్యేక రసాయనాలను వాడాల్సి ఉంటుందని ఆ సంస్థకు చెందిన కుమార్ అనే వ్యక్తి ట్రస్టు సభ్యులకు తెలియజేశారు. మొత్తం మీద శవపేటికను ఏప్రిల్ ఐదో తేదీనే పుట్టపర్తికి పంపించారు. శవపేటిక తయారీకి సాయి ట్రస్టు ఇచ్చిన ఆర్డరు రశీదులను కూడా ఆ చానళ్ళు చూపించాయి. దీంతో భక్తుల్లో ఉత్కంఠ మొదలైంది.
మిగతా వచ్చేవారం

1266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles