ఆ నవ్వే చాలు..


Sun,January 13, 2019 01:16 AM

love
కొన్ని రోజుల తర్వాత ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్‌కాల్. లిఫ్ట్ చేశాను. అవతలి వైపు నుంచి బాగున్నవారా? అని పిలుపు. ఆ గొంతు అక్కది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తను నీతో మాట్లాడుతదటరా అన్నది. అక్క చెప్పేది నిజమా? అబద్ధమా, కలనా కొద్దిసేపు అర్థం కాలేదు.

తన నుంచి వచ్చిన తొలి, చివరి ఫోన్ కాల్ అని ఊహించలేకపోయా. తన మాటలు, తన నవ్వు తప్ప ఇంకేం గుర్తు లేవు. ఇప్పటికీ ప్రతిరోజూ, ప్రతి క్షణం తనే గుర్తొస్తుంటుంది. నిజంగా ప్రేమకు చాలా శక్తి ఉంది. ఈ విషయం తనను ప్రేమించిన తర్వాత తెలిసింది.

అది చలికాలం నేను పదో తరగతి చదివే రోజుల్లో క్లాస్‌రూం నుంచి ఇంటర్వెల్‌కి బయటకి వచ్చాను. నన్ను చూసి ఓ అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు నా కోసమే అనిపించి నేను ఆమెనే చూస్తున్నా. నన్ను చూసి నవ్వుతూనే ఉంది. ఆ వయసులో ఆమె నన్ను ప్రేమిస్తుందేమో అనుకొని ఆమె చుట్టూ తిరిగాను. వాళ్ల ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరే. రోజూ ఆమె స్కూల్ వెళ్లేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ఆమె వచ్చే వరకు ఆగి తనని చూస్తూ ఆమెతో పాటే వెళ్లేవాడిని. తనని చూసి నవ్వేవాడిని. తను కూడా నేను చూసిన ప్రతీసారి నవ్వేది. కాకపోతే తను నాకంటే వయసులో చిన్నది. ప్రేమ అంటే తెలియని వయసులోనే తన నవ్వు చుసి ప్రేమ అనుకున్న రోజు సాయంత్రం తన నవ్వు కోసం వాళ్ల ఇంటి ముందు నిలబడి ఎదురుచూసేవాడిని. ఆదివారాలు కూడా తననే చూసేవాడిని. స్కూల్ ఉంటే ఉదయం, ఇంటర్వెల్, మధ్యాహ్నం సమయాల్లో తనని చూడొచ్చు.

అదే సెలవు అయితే.. తను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే తనని చూడడానికి కుదిరేది. ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే చాలు.. తను ఇంట్లోంచి బయటకు వస్తే కనిపించేలా వాళ్ల ఇంటికి ఎదురుగా కూర్చొని ఆమె రాక కోసం ఎదురుచూసేవాడిని. తను ఇంట్లోకి, బయటకు తిరిగినప్పుడల్లా నా వైపు చూసి నవ్వేది. తను నవ్వుతుంటే ఏదో మత్తు చల్లినట్టుగా అనిపించేంది. అందుకే ఆ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అలా ఒకరినొకరం చూసుకొని నవ్వడం, అదే లోకంగా ఆ ఏడాదంతా గడిచిపోయింది. తన నవ్వు మత్తులో మునిగిపోయి ఉన్నందుకేమో పదో తరగతి చాలా తొందరగా పూర్తయినట్టు అనిపించింది. ఇంటర్మీడియట్‌లో అడుగుపెట్టాను. కాలేజీ అయిపోగానే తను స్కూల్ నుంచి ఇంటికి రాకముందే నేను ఇంటికొచ్చేసేవాడిని. ఎందుకంటే తను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తనని చూడొచ్చన్న ఆశతో. తను స్కూల్ నుంచి వచ్చే టైమ్‌కి ఆమె కోసం ఎదురుచూస్తూ వాకిట్లో నిల్చునేవాడిని.

అది వర్షాకాలం. జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎప్పట్లాగే ఓ రోజు తను స్కూల్‌కి వెళ్లింది. నేను ఆరోజు కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నా. ఆ రోజు సాయంత్రం బడిపిల్లల్ని వదిలిపెట్టే టైమ్ అయింది. సరిగ్గా అప్పుడే వర్షం మొదలైంది. చూస్తుండగానే వర్షం జోరువానగా మారింది. ఇంతలో స్కూల్ బెల్ కొట్టారు. పిల్లలందరూ వర్షంలో తడుస్తూ ఇళ్లకు పరుగెడుతున్నారు. అంతమందిలో తను కూడా ఉంది. చుక్కల్లో చంద్రుడిలా, రాళ్ల మధ్యలో రత్నంలా ఆమె తడుచుకుంటూ, నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే ఓ ఐడియా వచ్చింది. ఇంట్లోకి పరుగెత్తికెళ్లి గొడుగె తెచ్చా. తనకిచ్చి తన మనసులో చోటు సంపాదిద్దామని. నేను ఇంట్లోంచి బయటకు వచ్చే లోపే.. తన చెల్లి గొడుగు తీసుకొని వచ్చింది. ఇద్దరూ వర్షంలో తడువకుండా గొడుగు కింద నడుచుకుంటూ వెళ్లడం చూసి తనతో మాట కలుపుదామన్న నా ఆశ తుస్సుమన్నది. ఆమెకు నా ప్రేమ విషయం చెప్పాలని మనసు తహతహలాడేది. కానీ ధైర్యం సరిపోయేది కాదు. మా ఇంటి పక్కనే నాకు అక్క వరసయ్యే నా క్లాస్‌మేట్ ఉండేది. ఓ రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగింది. అవునక్కా.. నువ్వే ఎలాగైనా సాయం చేయాలి అని బతిమిలాడాను. అక్క ఆమె దగ్గరికి వెళ్లి నేను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పింది. దీంతో తను నన్ను చూడడం, నా వైపు చూసి నవ్వడం ఆపేసింది. తన నవ్వు చూసి ప్రేమ అనుకున్న నా ఆశలు ఆవిరైపోయాయి. రోజూ తన కోసం వెతికేవాడిని. తనను వెతుకుతూ తిరిగేవాడిని. ఎన్నో రోజులు క్షణాల రూపంలో గడిచిపోయాయి. తను గుర్తుకు రాని రోజులు, ఆమె నవ్వును తలచుకోని క్షణాలే లేవు.

ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ పూర్తయింది. పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్‌కాల్. లిఫ్ట్ చేశాను. అవతలి వైపు నుంచి బాగున్నవారా? అని పిలుపు. ఆ గొంతు అక్కది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తను నీతో మాట్లాడుతదటరా అన్నది. అక్క చెప్పేది నిజమా? అబద్ధమా, కలనా కొద్దిసేపు అర్థం కాలేదు. ఇంతలో ఫోన్‌లో తను బాగున్నవా? ఎప్పుడు వస్తున్నావ్ అని అడిగింది. తను నాతో మాట్లాడడం అదే ఫస్ట్ టైం. రావొచ్చు కదా అని తను అడిగి ఉంటే ఆ క్షణమో ఇంటికి బయల్దేరేవాడిని. తనతో మాట్లాడిన సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. పక్కన ఎవరూ లేరు. అప్పటి నుంచి ఫోన్ రింగైన ప్రతీసారి తనేనేమో అనుకునేవాడిని. కానీ అదే తన నుంచి వచ్చిన తొలి, చివరి ఫోన్ కాల్ అని ఊహించలేకపోయా. తన మాటలు, తన నవ్వు తప్ప ఇంకేం గుర్తు లేవు. ఇప్పటికీ ప్రతిరోజూ, ప్రతి క్షణం తనే గుర్తొస్తుంటుంది. నిజంగా ప్రేమకు చాలా శక్తి ఉంది. ఈ విషయం తనను ప్రేమించిన తర్వాత తెలిసింది. తనని చూస్తూ, తన నవ్వును చూస్తూ గడిపిన రోజులు నాకు చాలా అమూల్యమైనవి. తను నాతో మాట్లాడిన ఆ రెండు మాటలు నాకు ఎంతో విలువైనవి. అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. నేను కోరుకునేది ఒక్కటే.. నువ్వు ఎక్కడ ఉన్నా.. సంతోషంగా ఉండాలి. నవ్వుతూ ఉండాలి.

- ఎప్పటికీ నిన్ను మరిచిపోలేని నేను

1261
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles