భీమ గోకర్ణుల వైరం(మ‌న చ‌రిత్ర 85)


Sun,January 13, 2019 01:11 AM

History

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణసెల్ : 80966 77 177


రుద్రదేవుని చేతిలో మేడరాజు, దొమ్మరాజు, జగ్గదేవుడికి పట్టిన దుర్గతి గురించి మైళగి వేగుల ద్వారా విన్నాడు. రుద్రదేవుని సైన్యాలను ఎదుర్కోలేక తన సైన్యంతో బతుకు జీవుడా అని కళ్యాణి వైపు తిరిగి పారిపోసాగాడు.

కాకతీయ రుద్రదేవుని హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం ద్వారా కాకతీయ రెండో ప్రోలరాజు గోవిందరాజును ఓడించి అతని రాజ్యాన్ని ఉదయనకు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఎవరీ గోవిందరాజు? ఎవరీ ఉదయన??
కాకతీయ ప్రోలరాజు కళ్యాణీ (పశ్చిమ) చాళుక్యుల సామంతుడు. మహామండలేశ్వరుడు. కందూరు చోడులు కూడా కళ్యాణీ చాళుక్యులకు సామంతులు. తెలంగాణలో బలమైన కాకతీయ, కందూరు రాజ్యాలు ఆనాడు కల్యాణీ చాళుక్య చక్రవర్తి అయిన త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యునికి అండగా ఉండేవి.

త్రిభువన మల్ల ఆరో విక్రమాదిత్యుని కొడుకులు కుమార సోమేశ్వరుడు, కుమార తైలపుడు.
కుమార సోమేశ్వరునికి భూలోకమల్ల, మూడో సోమేశ్వరుడు అనే పేర్లు ఉండేవి. కుమార తైలపునికి తైలపుడు, తైలపదేవ అనే పేర్లు ఉండేవి. తైలపుడు తండ్రి పాలనలోనే కుమార వృత్తిగా కందూరునాడును పొందాడు.

తైలపుడు రెండో తొండయ చోళుని కొడుకులైన రెండో భీమదేవచోడునికి, ఒకటో గోకర్ణకు కందూరునాడును పంచి ఇచ్చాడు. ఇందులో భాగంగా కందూరు విషయము భీమదేవచోడునికి, పాలనగల్లు విషయము గోకర్ణుని ఏలుబడిలోకి వచ్చాయి. దీంతో కందూరు సోదరులిద్దరూ ఒకేసారి పాలన చేయసాగారు. భీమదేవ చోడుడు తన రాజధానిని కందూరు నుంచి వర్ధమానపురానికి మార్చాడు.

ఆరో విక్రమాదిత్యుడు బతికి ఉన్నంత కాలం కందూరు చోడులు చాళుక్య ప్రభువులకు విధేయులుగా ఉన్నారు. కానీ ఆయన మరణం తర్వాత, అంటే.. పెద్ద కొడుకు భూలోకమల్లుడు (తైలపుడి అన్న) రాజ్యానికి వచ్చినప్పటి నుంచి ప్రభువు పట్ల ఆ నాయకుల్లో అపనమ్మకం ఏర్పడింది. ఇందుకు కారణం తైలపుడు. తనకు కుమారవృత్తిగా వచ్చిన కందూరునాడును స్వతంత్రంగా ఏలాలన్నది అతని కోరిక. అందుకే కందూరు చోడరాజ సోదరులు భీమ, గోకర్ణుల మధ్య కలహం పెట్టాడు. ప్రభువు భూలోకమల్లునికి కాస్త విశ్వాసపాత్రుడుగా ఉండే గోకర్ణుని భీముడితో చంపించాడు. ఈ విషయం మహారాజు భూలోకమల్లునికి తెలిస్తే యుద్ధం తప్పదని భావించిన తైలపుడు గోవిందరాజు మద్దతు కూడగట్టుకున్నాడు.

గోవిందరాజు చాళుక్య సేనాని. కొండపల్లి సీమ (పానగల్లు రాజ్యానికి ఆగ్నేయ దిశగా ఉన్న రాజ్యం- ప్రస్తుత హుజూర్‌నగర్ దాకా)ను పాలించేవాడు. ఇతనికి శౌచ గాంగేయుడు అనే బిరుదు ఉండేది. ఇతని మద్దతుకుగాను తైలపుడు పానగల్లు ప్రాంతంలో కొంత భాగాన్ని గోవిందరాజుకు ఇచ్చాడు.
గోకర్ణుని హత్య తర్వాత తండ్రినీ, మండలాన్నీ పోగొట్టుకున్న రెండో ఉదయనచోడుడు (గోకర్ణుని కొడుకు) చక్రవర్తి భూలోకమల్లుని దగ్గరకు వెళ్లాడు. తైలపుని కూటమి, కుట్రల గురించి ఫిర్యాదు చేశాడు. ఇందుకు ఆగ్రహించిన భూలోకమల్లుడు ఉదయచోడునికి రాజ్యం ఇప్పించాల్సిందిగా కాకతీయ రెండో ప్రోలుడిని ఆదేశించాడు.
ఈ ఆజ్ఞానుసారం కాకతీయ ప్రోలరాజు గోవిందరాజును తరిమివేసి పానగల్లులో ఉదయనచోడుడిని పునఃపట్టాభిషిక్తుడిని చేశాడు. దీంతో తైలపుడు ప్రోలుడిపై పగతో రగిలిపోయాడు. కాకతీయ రాజ్య ఉత్తర సరిహద్దులో అలజడి సృష్టించేందుకు మేడరాజు, ఇతని సోదరుడు గుండన (మంత్రకూట నాయకుడు-ప్రస్తుత మంథని)ను మచ్చిక చేసుకున్నాడు.

History1
రుద్రదేవుని చేతిలో మేడరాజు, దొమ్మరాజు, జగ్గదేవుడికి పట్టిన దుర్గతి గురించి మైళగి వేగుల ద్వారా విన్నాడు. రుద్రదేవుని సైన్యాలను ఎదుర్కోలేక తన సైన్యంతో బతుకు జీవుడా అని కళ్యాణి వైపు తిరిగి పారిపోసాగాడు.

మేడరాజు పొలవాస మండల నాయకుడు. పొలవాస వరంగల్‌కు ఉత్తరాన ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని పొలాస. హనుమకొండను తాకుతూ నర్సంపేట వరకూ ఈ మండలం ఉండేది. కాకతీయులు, మేడరాజు కుటుంబాల వారు ఒకే స్థాయి హోదా ఉన్న రాష్ట్రకూట సేనానులు. రాష్ట్రకూటుల తర్వాత పక్కపక్కనే ఉన్న తమ ప్రాంతాలను మహా మండలేశ్వరులుగా కొనసాగటానికి చాళుక్యులు అనుమతించారు. పొలవాస నాయకులు చాళుక్యుల పట్ల మొదట్లో స్నేహపూర్వకంగానే ఉన్నా కొంతకాలం తర్వాత విభేదించారు. చివరగా మేడరాజు చాళుక్య ప్రభువు వైరులతో చేయి కలిపి స్వతంత్రుడవ్వాలని ఆకాంక్షించాడు.
దీన్ని అదునుగా చేసుకుని తైలపుడు పొలవాస నాయకులను తనతో కలుపుకొన్నాడు. దీన్నంతటినీ గమనిస్తూనే ఉన్న భూలోకమల్లుడు తన కుమారుడు జగదేకమల్లుడిని ఉత్తరాధికారిగా నియమించి సింహాసనంపై కూర్చోబెట్టాడు.

చాలాకాలం నుంచి తమ సార్వభౌమత్వాన్ని అలక్ష్యం చేస్తూ వస్తున్న మేడరాజు, గుండరాజులపై జగదేకమల్లుడు బలగాన్ని పంపాడు. ఈ నాయకులను అణచివేయడంలో తన శౌర్యప్రతాపాలను చూపుతూ కాకతీయ ప్రోలరాజు యుద్ధంలో కీలకపాత్ర పోషించాడు. మంత్రకూటలో జరిగిన యుద్ధంలో కాకతీయ ప్రోలుడు గుండయను ఓడించాడు. అతన్ని బందీగా పట్టుకొచ్చి నిండుసభలో ప్రభువు ముందు గుండు కొట్టించాడు. వక్షస్థలంపై వరాహ ముద్రను వేసి, అతని తల నరికాడు.
ఈ గుండయ శిరోఖండనం గురించి తెలుసుకున్న తైలపుడు హడలిపోయాడు. అసలు కుట్రకు కారకుడినైన తనని వదిలిపెట్టరని భావించాడు. అనుకున్నట్లుగానే తైలపుడిని కూడా ప్రోలరాజు యుద్ధంలో ఓడించి, బందీగా పట్టుకుని వచ్చాడు. కానీ జగదేకమల్లునికి తైలపుడు పినతండ్రి, రాజకుటుంబీకుడు అయిన కారణంగా జాలితో, ప్రేమతో వదిలివేశాడు.

చాళుక్య చక్రవర్తి తరఫున కోట వంశస్థుడైన చోడోదయుడు, హైహయ నాయకులను ప్రోలరాజు ఎదుర్కొన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో ప్రోలుడు వీరమరణం పొందినట్లుగా క్రీ.శ. 1169 నాటి ద్రాక్షారామ శాసనంలో, క్రీ.శ. 1195 నాటి పిఠాపుర శాసనంలో ఉన్నది. రెండో ప్రోలుడి తర్వాత అతని పెద్ద కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు.

కాకతీయ ప్రోలరాజు మరణానంతరం ఉదయనచోడ మహారాజు స్వతంత్రుడవ్వాలనుకున్నాడు. అటు కళ్యాణీ చాళుక్యుల సార్వభౌమాధికారాన్ని, ఇటు కాకతీయుల అధికారాన్నీ లెక్కచెయ్యలేదు. తన కుమారులైన భీమ (నాలుగో), గోకర్ణు (రెండో)లకు పరాక్రమవంతులుగా తీర్చిదిద్ది స్వతంత్ర జెండా ఎగురవేయాలనుకున్నాడు.
తైలపుడిని రుద్రదేవుడి తండ్రి రెండో ప్రోలరాజు యుద్ధంలో ఓడించి, బంధించి పట్టుకొచ్చాడు. కానీ చాళుక్య రాజు జగదేకమల్లుడు అతన్ని వదిలిపెట్టాడు. పైగా తన పినతండ్రి అయిన తైలపుడు పూర్వం అనుభవించిన హక్కులు, గౌరవాలు కూడా ఇచ్చాడు. ఈ మేరకు పానగల్లు ఉదయనచోడుడు, వర్ధమానపురం మూడో భీమచోళుడు కప్పం కడుతూ ఉండేవారు. అయినా తైలపుడు సంతృప్తి చెందలేదు. తనకు జరిగిన పరాభవాన్ని మరిచిపోలేదు. జగదేకమల్లునిపై తిరుగుబాటు చేసి తైలపుడు కళ్యాణి రాజ్యాన్ని చీల్చాడు. ఇంతలోనే కాలచూరి బిజ్జలుడు తైలపుడిని పడదోసి క్షీణిస్తున్న కళ్యాణి రాజ్యానికి రాజయ్యాడు. తైలపుడు రాజ్యభ్రష్టుడయ్యాడు.

బలమైన పశ్చిమ చాళుక్య రాజ్యం బలహీనపడ్డ ఈ సందర్భం, ఉదయనచోడుని స్వతంత్ర కాంక్ష కాకతీయుల్ని ఆత్మరక్షణలో పడేసింది. అప్పటి వరకు రుద్రదేవుడు చాళుక్యులకు నామమాత్రపు సామంతుడిగానే ఉన్నాడు. ఇప్పుడు స్వతంత్ర పాలనవైపు, సార్వభౌమత్వం వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భాన్ని, అవకాశాన్ని రుద్రదేవుడు సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఇదే సమయంలో కాలచూరి బిజ్జలుడి కన్ను కాకతీయ సామ్రాజ్యంపై పడింది. ఇతడు కాకతీయుల శత్రువులను చేరదీయడం మొదలెట్టాడు. ప్రోలరాజు కాలంలో హనుమకొండపైకి దండెత్తి ఓడిపోయిన పరమార జగద్దేవున్ని అక్కున చేర్చుకున్నాడు. ఇతనికి పొలవాస నాయకుల మద్దతు అప్పటికే ఉంది. ఇరుగు పొరుగు రాజ్యాలైన కాకతీయ, పొలవాస రాజుల మధ్య ఒకప్పుడు మైత్రి ఉండేది. కానీ వారి ప్రభువులైన చాళుక్యుల పట్ల విధేయత విషయంలో వైరుధ్యాలు ఏర్పడి శత్రువులుగా మారారు. పైగా రుద్రదేవుని తండ్రి ప్రోలరాజు పొలవాస మేడరాజు తమ్ముడు గుండరాజును యుద్ధంలో ఓడించి బందీగా పట్టుకుపోయి నిండుసభలో గుండు కొట్టి వక్షస్థలంపై వరాహ ముద్ర వేసి తల నరికాడు. దీంతో కాకతీయులపై పొలవాస మేడరాజు ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. వీరికి తోడు నగునూరు ప్రాంతాన్నేలే దొమ్మరాజు కూడా కాకతీయుల శత్రువే. వీరందర్నీ చేరదీసి బిజ్జలుడు సరికొత్త యుద్ధ తంత్రాన్ని రచించాడు.

ఈ యుద్ధ తంత్రం ప్రకారం పొలవాస మేడరాజు, నగునూరు దొమ్మరాజులిద్దరూ ఉత్తర దిక్కు నుండి ఓరుగల్లు కోటను ముట్టడించాలి. మరోవైపు కాలచూరి బిజ్జలుని కుమారుడైన మైళగి తన అపార సైన్యంతో దక్షిణ దిశ నుండి ఓరుగల్లు కోటను ముట్టడిస్తాడు.
ఈ ప్రయత్నాన్ని వెంటనే గ్రహించిన కాకతీయ రుద్రదేవుడు తన సైన్యాన్ని రెండు భాగాలుగా చేశాడు. అందులో ఒక దానిని మైళగిని ఎదుర్కోవడానికి పంపించి మరో దానికి తానే నాయకత్వం వహిస్తూ మేడరాజు, దొమ్మరాజులిద్దరినీ ఎదుర్కోవడానికి స్వయంగా బయలుదేరాడు.
నేటి కరీంనగర్ దగ్గర ఉన్న నగునూరు ప్రాంతం వద్ద మేడరాజు, దొమ్మరాజుల సైన్యంపై రుద్రదేవుడు విరుచుకుపడ్డాడు. ఈ యుద్ధంలో దొమ్మరాజును, అతని కొడుకు జగ్గదేవుడిని రుద్రదేవుడు హతమార్చాడు.

యుద్ధం జరుగుతున్న సమయంలో పొలవాస మేడరాజు రుద్రదేవునితో సంధి చేసుకుని తన కూతురునిచ్చి వివాహం చేసి బంధుత్వం కలుపుకొమ్మని అతడి సలహాదారులు ఎంతగానో చెప్పారు. అయినా వినకుండా రుద్రదేవునితో యుద్ధానికి దిగి మేడరాజు సర్వం కోల్పోయాడు. యుద్ధ రంగం నుండి పారిపోయి, గోదావరి నది దాటి జన్నారం అడవుల్లో తలదాచుకున్నాడు.
ఇక రుద్రదేవుని సైన్యంలో మరో భాగం చేర్యాల వద్ద గల ఆకునూరు ప్రాంతం వరకు చొచ్చుకు వచ్చిన మైళగి సైన్యాన్ని ఎదుర్కొన్నది. ఆ సైన్యాన్ని ఎటూ కదలకుండా అష్టదిగ్బంధనం చేసింది.
రుద్రదేవుని చేతిలో మేడరాజు, దొమ్మరాజు, జగ్గదేవుడికి పట్టిన దుర్గతి గురించి మైళగి వేగుల ద్వారా విన్నాడు. రుద్రదేవుని సైన్యాలను ఎదుర్కోలేక తన సైన్యంతో బతుకు జీవుడా అని కళ్యాణి వైపు తిరిగి పారిపోసాగాడు. అయినా కాకతీయ సైన్యాలు మైళగిని తరిమి కొడుతూ కళ్యాణి పట్టణం దాకా వెళ్లాయి. ఇక అటు తర్వాత కాలచూరి బిజ్జలుడు ఏనాడూ కాకతీయుల రాజ్యం పైకి కన్నెత్తి చూడలేదు.

వచ్చేవారం: ఇంకోవైపు..తన తండ్రిని చంపిన విషయాన్నీ, గతంలో కాకతీయులు తనకు చేసిన సహాయాన్నీ మరిచి ఉదయనచోడుడు శత్రువులతో చేతులు కలిపి తిరుగుబాటుకు సిద్ధపడ్డాడు. ఈ కుట్ర ఎటువైపు దారి తీసింది?

1144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles