యూనివర్సల్ హీరో కమల్ హాసన్


Sun,January 13, 2019 01:04 AM

Kamal-Haasan
కమల్ హాసన్ భారత చలన చిత్ర పరిశ్రమలో తన నటనా చాతుర్యంతో అగ్రనటుల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. చలన చిత్ర రంగంలోనే తొలిసారిగా 1994లో కోటి రూపాయల పారితోషికాన్ని అందుకున్న నటుడు. కమల్ 1982లో నటించిన ఐదు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కేవలం ఏడాదిలోనే వరుస విజయాలను అందుకున్న అరుదైన నటుడిగా కమల్ హాసన్ అప్పట్లోనే చరిత్ర సృష్టించాడు. ఆరుపదుల వయసు దాటినా ఏమాత్రం జోష్ తగ్గకుండా తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు పార్థసారధి శ్రీనివాసన్.. కమల్ హాసన్‌కు వారి తల్లిదండులు పెట్టిన పేరు అదే. ఆయనలో నటుడే కాదు డాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్ లాంటి కోణాలెన్నో ఉన్నాయి. అందుకే ఈ కమల్ హాసన్‌లోని మరో మనిషిని ఆవిష్కరిస్తున్నాం.

పసుపులేటి వెంకటేశ్వరరావు
ఫోన్: 8885797981

Kamal1-Haasan

డైరెక్టర్- ప్రొడ్యూసర్

రాజ్‌కమల్ పేరుతో 1981లో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి కమల్ హాసన్ ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. రాజ పార్వై అనే సినిమాను తన బ్యానర్ పై తొలిసారిగా నిర్మించాడు. ఆ తర్వాత వరుసగా రాజ్ కమల్ పతాకంపై అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్‌ప్రెస్ వంటిచిత్రాలను తీసి సంచలనం సృష్టించాడు. దర్శకుడిగా శంకర్ లాల్ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళ హాస్య చిత్రం సతీ లీలావతితో మరోసారి దర్శకుడిగా మారి కమల్ తన సత్తా చాటాడు.

నిజ జీవితంలోనూ అవతారాలు

సినిమా రంగంలోనే కమల్ హాసన్ ఒక సంచలనం. ఒకటి రెండు సంచలనాలు కాదు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు ఆయన. దశావతారం సినిమాలో తన నటనా కౌశలంతో పది పాత్రల్లో నటించి మెప్పించాడు. కేవలం నటుడిగా పలు పాత్రల్లో నటించడమేకాకుండా, ఆయన నిజ జీవితంలోనూ చాలా పాత్రలను పోషిస్తుంటాడు. హీరో, డాన్సర్, సింగర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, పొలిటీషియన్ వంటి పాత్రలను నిజ జీవితంలోనూ పోషిస్తుంటాడు. ఆయన తండ్రి శ్రీనివాసన్ న్యాయవాది, తల్లి రాజలక్ష్మీ శ్రీనివాసన్. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీ వంటి భాషల్లో నటించి ప్రేక్షకాభిమానులను మెప్పించాడు. ఇప్పటి వరకు భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి 7 సినిమాలు కమల్ హాసన్ నటించిన ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు ఎంట్రీ వరకూ వెళ్లాయి. అంతేకాదు 100కు పైగా గొప్ప చిత్రాల్లో నటించిన కమల్‌ను టైమ్ మ్యాగజైన్ గుర్తించింది.

ఉత్తమ బాలనటుడిగా బోణీ

కమల్ హాసన్ తన నటనా ప్రస్థానాన్ని బాలనటుడిగా మొదలు పెట్టాడు. అతి చిన్న వయసులో మూడున్నరేండ్ల ప్రాయంలోనే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రం ద్వారా వెండి తెరకు బాలనటుడిగా పరిచయం అయిన కమల్ తొలి చిత్రంతోనే ఉత్తమ బాలనటుడిగా ఎంపికై, బోణీ కొట్టాడు. అలా తన నటనా జీవితాన్ని ఆరంభించిన కమల్ అప్పట్లో అగ్రనటులైన ఎం.జి. రామ్‌చంద్రన్, శివాజీ గణేషన్, నాగేష్, జెమినీ గణేషన్ వంటి వారు నటించిన పలు చిత్రాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.
Kamal-Haasan2

రైటర్- డాన్సర్

కమల్ ఇప్పటి వరకూ 200 సినిమాలకు పైగా నటించాడు. కమల్ 18 ఏండ్ల వయసులోనే సినిమాకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. 1976లో వచ్చిన ఉనర్చిగళ్ అనే చిత్రానికి కథారచయితగా మారాడు. తమిళ చిత్ర పరిశ్రమకు ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కథలను అందించి తనదైన శైలిని నిరూపించుకున్నాడు. భరత నాట్యంలో ఆయన్ను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. నృత్యంలో తన అభినయానికి ప్రేక్షకులు చప్పట్లు కొట్టకుండా ఉండలేరనడానికి 1983లో వచ్చిన సాగర సంగమం చిత్రమే ఉదాహరణగా నిలుస్తుంది.

రుచులు-అభిరుచులు

నటనలో విలక్షణత కనబరుస్తూ ఇటువంటి పాత్రల్లో కమల్ హాసనే కరెక్టు అనేలా తనదైన శైలితో ముద్ర వేశాడు. నాన్ -వెజ్ అంటే కమల్‌కు ఎంతో ఇష్టం. ముఖ్యంగా చేపలంటే మరింత ఇష్టంగా తింటాడు. అందులోనూ కొర్రమీను చేపంటే చెప్పలేనంత ప్రీతి. బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా, తమిళ నటులు శివాజీ గణేషన్, ఎంజీ రామ్‌చంద్రన్, నగేష్ వంటి నటులంటే ఆయనకు ఎంతో అభిమానం. తన అభిమాన తారలు శ్రీదేవి, శ్రీప్రియ. కమల్‌కు నచ్చిన సినిమాలు షోలే, బైస్కిల్ తీఫ్, ముఘల్ ఏ ఆజమ్. సంగీత దర్శకులు నౌషద్, ఇళయరాజా. ప్రముఖ రచయిత జానకి రామన్ రాసిన అమ్మ వందాళ్, మరపసు అనే పుస్తకాలంటే కమల్‌కు చాలా ఇష్టం.

సేవా గుణానికి గుర్తింపు

కమల్ హాసన్ దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా స్పందించే వారిలో ముందు వరుసలో నిలబడతాడు. కమల్ నర్పని ఇయక్కమ్ పేరుతో రక్తదానం, కండ్ల దానం పై ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కమల్ అందించిన విశిష్ట సేవలకు 2004లో అబ్రహామ్ కొవూర్ నేషనల్ అవార్డు దక్కింది. పలు సేవాకార్యక్రమాల ద్వారా ప్రజలకు తన వంతుగా సాయమందిస్తూనే అందరి కంటే ముందుగా సాయమందించి ఆదర్శంగా నిలుస్తాడు.

1018
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles