లిజ్జత్.. ఒక విప్లవం


Sun,January 6, 2019 02:01 AM

STORY
పిండి కొద్ది రొట్టె అంటారు. ఎంత చెట్టుకు అంతే గాలి అని కూడా అంటారు. ఈ రెండూ ఒకే అంశాన్ని చెప్పే మాటలు. బహుశా ఈ మాటలు ఎవరో నిరాశాజీవులు చెప్పి ఉంటారని ఈ అప్పడాల కథ చదివాక మీకు అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎంత పిండికి అంతే రొట్టె వస్తుందని.. ఎంత పరిమాణంలో ఉన్న చెట్టు అంతే పరిమాణంలో గాలి వీస్తుందని పై మాటలు చెబుతున్నాయి. కానీ లిజ్జత్ అప్పడాలు.. పిండే కొద్దీ రొట్టెలు.. ఇంతటి చెట్టుకు అంతటి గాలి అని బోధిస్తున్నాయి. పరాకుగా చూస్తే ఇది ఎలాంటి ప్రత్యేకతలూ లేని మామూలు గడ్డిపరక. గాలికెగిరి పోయేంత దుర్బలమైన గడ్డిపరక. కానీ, దీని శక్తి ఏపాటిదో నాకు తెలుసు. ఏదో ఒకరోజు ఈ గడ్డిపరకతోనే విప్లవం మొదలవుతుంది అన్నాడు జపాన్ ప్రకృతి వ్యవసాయ తత్వవేత్త మసనోబు ఫుకుఓకా. ఇది కూడా అలాంటి విప్లవమే. అప్పడాలతో సృష్టించిన ఆర్థిక, ఆహార విప్లవం. గుప్పెడు పిండితో ఎంతటి విప్లవాన్నయినా సృష్టించొచ్చు అని, ఓ మహా వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించి నిరూపించింది లిజ్జత్ పాపడ్. అచ్చంగా అలాంటి విప్లవమే త్వరలో మన దగ్గరా రానున్నది. ఆ వివరాలే ఈ వారం ముఖచిత్రకథనం..
STORY1
నగేష్ బీరెడ్డి
సెల్ : 80966 77 177

STORY2
- సిద్దిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

పటిష్ఠ పరిచే విప్లవం

ముంబైలో ఒక మురికివాడ ఉంది. ఆ మురికివాడ పేరు ధారవి. ఆ వాడలో క్రియాశీలంగా ఆలోచించే మహిళ పేద ఆడవాళ్లందరినీ జమ చేసి ఒక సంఘం పెట్టింది. పాపడ్‌లు తయారు చేసే కార్యక్రమం చేపట్టింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్. చాలా పాపులర్ ఇండియాలో. ముంబైలోని ఒక మురికివాడలో తయారైన లిజ్జత్ సంస్థ ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా పాపడ్‌లు అమ్ముతున్నది. దాని టర్నోవర్ నిన్నటికి లెక్కతీస్తే 1176 కోట్లు ఉన్నది. అంటే.. ఒక మహిళా సంఘం అంత పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నది. ఇట్లనే మన తెలంగాణ కూడా చేసుకుందాం. మన రైతులు పండించే మిర్చిని మన మహిళలే కొంటరు.. పొడి చేస్తరు.. ప్యాకెట్లు చేసి అమ్ముతరు. మన రైతులు పండించే పసుపు మన మహిళా సంఘాలే కొంటయి.. వాటినీ పొడి చేస్తరు.. సీల్ చేస్తరు. అమ్ముతరు. వీటిని మన రాష్ట్రంలో రేషన్ డీలర్‌ల ద్వారా అమ్ముతం. ఇంగ్లీష్‌లో దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటరు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ అంటరు. ఈ రేషన్ డీలర్లు కూడా మా కడుపు నిండుత లేదు, అర్ధాకలున్నది, మా జీతాలు పెంచమని మాటిమాటికీ సమ్మెలు చేస్తా ఉన్నరు. దీంతో భవిష్యత్తులో వారికి ఆ బాధ ఉండదు. మన నాలుగు కోట్ల మందికి శుద్ధమైనటువంటి వస్తువులు అందుతయి. బియ్యంతోపాటు ఇంక అనేక వస్తువులు.. మన మహిళా సంఘాలు తయారు చేస్తరు. ఫుడ్ ప్రాసెస్డ్ వస్తువులు.. అన్నీ కూడా మన రేషన్ డీలర్ల ద్వారానే.. ప్రజలందరికీ అన్ని గ్రామాలకు సరఫరా జరుగుతయ్. అంటే అటు రేషన్ డీలర్ల వ్యవస్థ.. పటిష్టమైతది. ఇటు మహిళా సంఘాలు పటిష్టం అవుతయి.

రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యమే కాదు.. అన్నీ అమ్ముదాం. రెగ్యులర్‌గా వారు షాపు తెరిచిపెడుతరు. మన పంటలు.. మనమే తింటం. మన గాలిలో.. మన ఎండలో.. మన భూమిలో.. మన వాతావరణంలో పెరిగే తిండి తింటే.. మనం కూడా ఇదే మట్టిలో పుట్టి పెరిగినం కాబట్టి మన ఆరోగ్యాలు కూడా బందబస్తుగ ఉంటయ్. ఈ మాట నేను చెప్తలే.. డబ్ల్యూహెచ్‌వో చెప్తున్నదీ ముచ్చట. ఇదొక విప్లవం. పంటలు పండిస్తరు రైతులు.. కరెంటు ఉంటది. పెట్టుబడి ఇస్తం.. మందులు, ఎరువు బస్తాలు అందుబాటులో ఉంటయి. గోదాములు ఉన్నయ్. ఇప్పుడు గిట్టుబాటు రాబట్టాలంటే మన ఐకేపీ మహిళా బృందాల శక్తి అవసరం. మహిళా సంఘాలు.. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా.. తయారు చేసే సరుకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడుకుని ఉంటయ్. ఈ వస్తువులను స్థానికంగానే అమ్ముకోవడం మాత్రమే కాదు.. యావత్ భారతదేశంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా అమ్ముడు పోయేలా చేద్దాం. అలాంటి నాణ్యతతోని తయారు చేయిద్దాం. రైతు తన పంట మహిళా సంఘాలకు ఇస్తే.. చెక్కు తీసుకుని పోయే పరిస్థితులు అప్పటికప్పుడే ఉంటయ్. ఈ విధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధర దొరుకుతది.


STORY3

మార్చి 15, 1959..

ఎండలు మండుతున్న కాలం.. దక్షిణ ముంబైలోని ధారవి అనే మురికివాడ అది. ఓ పాత ఇంట్లో ఏడుగురు మహిళలు కలుసుకున్నారు. క్రియాశీల ఆలోచనలున్న ఓ మహిళ వారిని ఏకం చేసింది. వారిలో ఒకరు పిండి తెచ్చారు. మరొకరు నీరు పోసి కలిపారు. ఇంకొకరు పిండి పిసికారు. మరొకరు తాల్చారు. వారు చేస్తున్నది అప్పలు కాదు. వారు చేసుకుంటున్నది పార్టీ కాదు, ఫంక్షన్ అంతకన్నా కాదు.. వారు అప్పడాలు చేసి ఎండబెట్టారు. సాయంత్రానికి ప్యాక్ చేశారు. నాలుగు ప్యాకెట్ల అప్పడాలు అవి. వాటిని అమ్మాలి. ఆ ఆదాయంతోనే ఇక వారు బతకాలి. ఇదే వారి దినచర్య. వారి మొదటి పెట్టుబడి 80 రూపాయలు. గిర్గామ్ నుంచి ఓ పెద్దాయన దగ్గర తీసుకున్న అప్పు అది. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కానీ, అందరి అవసరం మాత్రం ఒక్కటే.. డబ్బు. ఆర్థిక స్వావలంబన. ఒక్కొక్కరుగా కాదు.. అందరం కలిసి ఏదైనా చేయాలనుకున్నారు. అప్పడాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వాటికో పేరు పెట్టుకున్నారు. అదే.. లిజ్జత్ పాపడ్ మొదలైంది ఏడుగురితోనే.. అందులో ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు. అందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. సంఘటితమయ్యారు. రోజుకొకరు చేరారు. ఏడుగురు ఎనిమిది మంది అయ్యారు. తొమ్మిది.. పది.. సంఖ్య పెరుగుతూనే ఉంది. సంఘం బలపడుతూనే ఉంది. పదులు వందలయ్యారు. నాలుగు ప్యాకెట్లు కాస్తా.. నాలుగు వందల ప్యాకెట్లు అయ్యాయి. సంఖ్య పెరుగుతూనే ఉంది. వందలు వేలు అయ్యాయి.

ఒకరు ఇంట్లో అప్పడాలు చేసుకుని వస్తున్నారు. ఒకరు ఇంట్లో చేసేందుకు పిండి తీసుకుని వెళ్తున్నారు. వారు గృహ ఉద్యోగులు. అంటే ఇంట్లో కూడా పని చేసుకోవచ్చు. పెరుగుతున్న ఆ సంఘానికి ఓ పేరు పెట్టుకున్నారు. శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్. ఈ ప్రయాణంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఎదుర్కొన్నారు. ప్రతికూలతలు ఏర్పడ్డాయి. జయించారు. తమ మీద తమకు విశ్వాసం. పని మీద నమ్మకం. అంతకు మించి సహనం.
ఉత్పత్తి పట్ల నమ్మిన సూత్రాలు, నాణ్యత పై పెంచుకున్న అవగాహన, స్పృహ.. అవే వారికి స్వావలంబన చేకూర్చాయి.
లిజ్జత్ అంటే ఇప్పుడొక బ్రాండ్..
లిజ్జత్ అంటే ఒక విప్లవం..
ఆహార విప్లవం.. ఆర్థిక విప్లవం..
ఇది మహిళలు సాధించిన ఘనత.
మహిళల కోసం.. మహిళల చేత.. మహిళలు సాధించిన విజయం.
దేశవ్యాప్తంగా లిజ్జత్‌కు ఇప్పుడు 27 డివిజన్లలో 82 బ్రాంచీలున్నాయి.
ఏడుగురితో మొదలైన లిజ్జత్‌లో ఇప్పుడు 45 వేల మంది పనిచేస్తున్నారంటే నమ్మగలరా?
లిజ్జత్ ప్రస్తుత వార్షిక ఆదాయం ఎంతో తెలుసా?.. సుమారు 12 వందల కోట్లు.
దటీజ్ లిజ్జత్.
* * *

శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ సంస్థ మహిళలకు కేవలం ఒక ఆదాయ మార్గంగా మాత్రమే కాకుండా వాణిజ్యరంగంగానూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అసమానతలు లేకుండా, ఆత్మగౌరవంతో ఈ సంస్థ మహిళలు పనిచేస్తూ ఉంటారు. వారంతా స్వయంసమృద్ధిని సాధిస్తూ ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ సంస్థకు మరింత గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. ఈ సంస్థ స్థాపించి 59 ఏండ్లు అవుతున్నా నేటికీ దీని ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలలో, మహిళల్లో అప్పటికీ ఇప్పటికీ ఒకే సాంప్రదాయం కొనసాగుతుండడం విశేషం.
లిజ్జత్ సంస్థ ఆదాయం లేక జీవనోపాధి కోసం అలమటించే నిర్భాగ్య మహిళల కోసం స్థాపించింది. దీనిలో కులమత, పేదధనిక జాతి విభేదాలు లేకుండా ఏ మహిళలైనా చేరొచ్చు. కాకపోతే కాస్త శారీరక శ్రమ చేయగలిగేలా ఉండాలి. అంతే.. అదే అర్హత. సంస్థ విలువల్ని తప్పక పాటించాలి. నాణ్యత పట్ల గౌరవంగా, బాధ్యతగా ఉండాలి. ఇలా ఉన్నవారు ఎవరైనా లిజ్జత్ సభ్యులు, సహ యజమానులు కావొచ్చు.

STORY4

లిజ్జత్ పని విధానం

లిజ్జత్‌లో పనిచేసే మహిళల పని తెల్లవారు జామున 4.30 గంటల నుంచే మొదలవుతుంది. ప్రతి మహిళనూ ఇంటి దగ్గరి నుంచి బ్రాంచి దాకా తీసుకువచ్చేందుకు, పని ముగిశాక తిరిగి ఇంటి దగ్గర దించేందుకు మినీ బస్సుల ద్వారా రవాణా వసతిని కూడా కల్పిస్తుంది లిజ్జత్ సంస్థ.
కొందరు మహిళలు అప్పడాల పిండిని కలుపడానికి వస్తారు. కొందరు కలిపిన పిండి ముద్దను తీసుకువెళ్లడానికి వస్తారు. ఇలా తీసుకెళ్లిన వారు ఇంటి దగ్గర చుట్టి (తాల్చి) అప్పడాలు చేసుకుని ఎండబెట్టి మరుసటి రోజు బ్రాంచిలో ఇవ్వడానికి తీసుకువస్తారు. ఇంటి దగ్గర రోల్స్ చుట్టే వారి ఇల్లు తప్పకుండా శుభ్రంగా ఉండాలి. అలాంటి వసతి లేని వారు లిజ్జత్‌లో మరో పనిని ఎంచుకోవచ్చు. పిండి కలుపడం, ప్యాకింగ్, నాణ్యతను పరీక్షించడం.. ఇలాంటి పనులు కూడా ఉంటాయి. లిజ్జత్‌లో కేవలం మహిళలకే తప్ప మగవాళ్లు పనిచేసే అవకాశం లేదు. లిజ్జత్‌లో ప్యాక్ చేసిన పాపడాలను డబ్బాల్లో పెట్టి సీల్ చేస్తారు మహిళలు. ఒక డబ్బా 13.6 కేజీల బరువు ఉంటుంది. ప్రతి కేంద్రంలో ఉత్పత్తి అయిన డబ్బాలను దగ్గరలోని ఆ ప్రాంతపు డిపోకు తరలిస్తారు. ఒక్క ముంబైలోనే లిజ్జత్‌కు ఇలాంటి డిపోలు 16 ఉన్నాయి. ప్రతి డిపోలో దగ్గరలోని మూడు, నాలుగు బ్రాంచీల నుంచి వచ్చిన డబ్బాలను నిల్వ చేస్తుంటారు. సుమారుగా రోజుకు 400 డబ్బాలు వస్తుంటాయి.

కొన్ని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో బ్రాంచీలు సొంత డిపోలను కలిగి ఉంటాయి. ఈ డిపోల నుంచే డిస్ట్రిబ్యూటర్లు తమకు కావాల్సిన పాపడ్ డబ్బాలను తీసుకుని వెళ్తుంటారు. వారు క్యాష్ ఆన్ డెలివరీ మీద డబ్బు చెల్లిస్తుంటారు. కాకపోతే ముందుగానే లక్షా 50 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బెన్స్ (లిజ్జత్‌లో పనిచేసేవారిని ఇలా పిలుస్తారు, సిస్టర్స్ అని కూడా అంటారు)కు లిజ్జత్‌లో రోజువారీ చెల్లింపులు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్‌కు సరుకు చేరవేయడంతో లిజ్జత్ సంస్థ పని ముగుస్తుంది. వారు ఎలా ఎప్పుడు అమ్ముకుంటారనేది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన విషయం. ప్రతి డిస్ట్రిబ్యూటర్ ప్రత్యేకంగా సేల్స్‌మెన్‌ను పెట్టుకుని తమ ప్రాంతంలోని రిటెయిల్ అవుట్‌లెట్స్‌కు అమ్ముతుంటారు. డిమాండ్ ఉన్న చోట లిజ్జత్ కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేస్తుంటుంది. డిస్ట్రిబ్యూటర్లను వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తీసుకుంటుంది. తరచూ వారితో సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తుంటుంది. సమస్యలుంటే పరిష్కారం చేస్తుంటుంది.

ఎగుమతి

లిజ్జత్ సొంత ఎగుమతి వ్యవస్థను నిర్వహించదు. ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నవారు కోరిన ఉత్పత్తులను మాత్రమే వారికి సరఫరా చేస్తుంటుంది. వారు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే ఉత్పత్తిని ప్రారంభించి, వారు కోరిన సమయానికి సరఫరా చేస్తుంటుంది. లిజ్జత్ మొత్తం ఉత్పత్తుల్లో 30 నుంచి 35 శాతం ఇలా ఎగుమతి అవుతున్నాయి. యూకే, యూఎస్‌ఏ, మధ్య తూర్పు దేశాలు, థాయ్‌లాండ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, హాలండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు లిజ్జత్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

పంపిణీలో లాభాలు

లిజ్జత్ ప్రతి బ్రాంచీ, కేంద్రంలో డెయిలీ అకౌంట్స్‌ను మెయింటెన్ చేయడానికి అకౌంటెంట్స్ ఉంటారు. ఏ రోజు లెక్క ఆ రోజు రాసి పెడతారు. ఏ రోజు చెల్లింపులు (వనాయ్) ఆ రోజు ఉంటాయి. లాభాలు (నష్టాలు, ఇతర) ఆ బ్రాంచీలోని ప్రతి ఒక్కరితో పంచుకుంటుంది లిజ్జత్. సెంట్రల్ మేనేజింగ్ కమిటీ ఆ లాభాలను ఎలా పంచుకోవాలో నిర్ణయిస్తుంటుంది. ప్రతి ఒక్కరికీ సమానమైన చెల్లింపు ఉంటుంది. అంతేగానీ సీనియారిటీ, సిన్సియారిటీ, రెస్పాన్సిబిలిటీ లాంటివి ఉండవు.

వికేంద్రీకరణ

లిజ్జత్ సిస్టర్స్ అందరూ ఈ సంస్థకు యజమానులే. లాభాలను అందరికీ సమానంగా పంచుతారు. ఆ లాభాన్ని నష్టాన్ని ఎలాంటి పద్ధతిలో పంచాలన్నది నిర్ణయించే అధికారం మాత్రమే సెంట్రల్ మేనేజింగ్ కమిటీకి ఉంటుంది. బ్రాంచీ లేదా కేంద్రం రోజువారీ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి సంచాలికలు ఉంటారు. పని విషయంలో మాత్రం బెన్స్ ఎలాంటి చొరవ, నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు. ప్రతి బ్రాంచీ నాణ్యత పట్ల సొంత బాధ్యతను కలిగి ఉంటుంది. స్వతంత్రంగా ఉంటుంది. అంతేగానీ ప్రతి విషయంలోనూ సెంట్రల్ నిర్ణయాలపై ఆధారపడితే మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే లిజ్జత్ వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని పాటిస్తున్నది. ఒక ముడిసరుకు కొనుగోలు, పంపిణీ, ధరల నిర్ణయం విషయంలో మాత్రమే కేంద్రీకరణ ఉంటుంది. అదీ ఎందుకంటే స్థిరమైన నాణ్యతా ప్రమాణాల కోసం ఈ పద్ధతి తప్పదు.

విలువలు

59 ఏండ్ల ఈ ప్రయాణంలో లిజ్జత్ పాపడ్ అడుగడుగునా కనిపించే లక్ష్యం ఒక్కటే మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం. గౌరవప్రదమైన జీవనోపాధితో వారిని మంచి సంపాదనాపరులుగా తీర్చిదిద్దడమే. పనిపట్ల అంకితభావం, నాణ్యత పట్ల నిబద్ధతే తప్ప లిజ్జత్‌లో చేరడానికి ఇతర ఏ అర్హతలూ అక్కర్లేదు. జాతివర్ణ భేదాలు ఇక్కడ ఉండవు. లిజ్జత్‌లో చేరిన క్షణం నుంచే ఒక మహిళ అందులో సభ్యురాలు అవుతుంది. భాగస్వామి అవుతుంది. సమాన వేతనాలుంటాయి. పేద, ధనిక, కుల మత బేధాలు ఉండవు. దానాలు, విరాళాలను స్వీకరించదు. డబ్బు విషయంలో పక్కా లెక్కలుంటాయి. ప్రతి లెక్కా ఏ రోజుకారోజు రాసి పెట్టుకోవాలి.
అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ లిజ్జత్ నమ్మేది ఒక్కటే.. సింపుల్‌గా ఉండాలి.. సీరియస్‌గా ఉండాలి. లిజ్జత్ ఒక సీరియస్ బిజినెస్ ఆర్గనైజేషన్.. అంతేకానీ, చారిటీ ఆర్గనైజేషన్ కాదు.
STORY5

లిజ్జత్ మైలురాళ్లు

- లిజ్జత్ సంస్థ ఉత్తమ గ్రామీణ పరిశ్రమగా రెండుసార్లు ఎంపికయ్యింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఇచ్చిన ఈ అవార్డు 1998-99, 2000-01లలో లిజ్జత్‌కు దక్కింది.
- 2002లో లిజ్జత్ సంస్థ ఎకనామిక్ టైమ్స్ వారిచ్చే బిజినెస్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2001-02 ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డును సొంతం చేసుకుంది.
- 2003లో లిజ్జత్ సంస్థ బెస్ట్ విలేజ్ ఇండస్ట్రీస్ అవార్డును దక్కించుకుంది.
- బ్రాండ్ ఈక్విటీ అవార్డును లిజ్జత్ 2005లో సొంతం చేసుకుంది.
- లిజ్జత్ పాపడ్‌ను ఇండియన్ కన్జూమర్ 2010-11 సంవత్సరానికి గాను పవర్ బ్రాండ్‌గా గుర్తించింది.
- నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ క్వాలిటీ అండ్ రియలబిలిటీ ఇచ్చే అవుట్‌స్టాండింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవార్డును శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ సంస్థ 2012లో సొంతం చేసుకుంది.
- నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చే నేషనల్ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్ అవార్డు 2013లో లిజ్జత్‌కు దక్కింది.
- క్వాలిటీ బ్రాండ్స్ ఇండియా అవార్డు (2013-15)
- బెస్ట్ విలేజ్ ఇండస్ట్రీస్ ఇనిస్టిట్యూషన్ (2012-13)
- లిజ్జత్ సంస్థ అధ్యక్షులు స్వాతి ఆర్. పరాద్కర్‌కు 2014కు గాను ఎంట్రప్రెన్యూర్ అవార్డు దక్కింది. లైవ్‌లీవుడ్ ఫెసిలిటేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2016)ను కూడా సొంతం చేసుకున్నారు. మహిళా వికాస్ అవార్డు (2016-17), గ్లోబల్ ఎకనామిక్ అవార్డ్ (2017)
STORY6

యాజమాన్య నిర్మాణం

శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ సంస్థకు 21 మందితో కూడిన సెంట్రల్ మేనేజింగ్ కమిటీ ఉంది. వీరు కాక ఆరుగురు ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఇందులో ఒకరు అధ్యక్షులుగా, మరొకరు ఉపాధ్యక్షులుగా, ఇద్దరు కార్యదర్శులుగా, ఇద్దరు కోశాధికారులుగా ఉంటారు.

ప్రస్తుత ఆఫీస్ బేరర్స్

1. స్వాతి ఆర్. పరాద్కర్, అధ్యక్షులు
2. ప్రతిభ ఈ. సావంత్, ఉపాధ్యక్షులు
3. శారద డి, కుబల్, కార్యదర్శి
4. ప్రియాంక జి, రెద్కర్, కార్యదర్శి
5. నమిత ఎన్, సక్పాల్, కోశాధికారి
6. సాక్షి ఎస్, పలవ్, కోశాధికారి
లిజ్జత్ పాపడ్ సంస్థకు ఇప్పుడు దేశవ్యాప్తంగా 82 బ్రాంచీలున్నాయి. ప్రతి బ్రాంచీకి ఒక సంచాలిక నాయకత్వం వహిస్తూ బ్రాంచి ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. ప్రతి బ్రాంచీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. లాభనష్టాలను ఆ బ్రాంచీ, బ్రాంచీకి సంబంధించిన ఓనర్ సిస్టర్స్ మెంబర్స్ భరించాల్సి ఉంటుంది. బ్రాంచీ పురోగతి, నాణ్యత మీద నిరంతర నిఘా ఉంటుంది. సభ్యుల శ్రమకు, అంకితభావానికి, పాటించిన నాణ్యత ప్రమాణాలకు తగిన గుర్తింపు కూడా ఉంటుంది.

లిజ్జత్ విజయసూత్రాలు

1 నిబద్ధత

ఏడుగురితో మొదలైన లిజ్జత్ పాపడ్ ఇప్పుడు ప్రపంచానికి సరికొత్త విజయసూత్రాలను చెబుతున్నది. సరికొత్త వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్పుతున్నది. మహిళల ఇంతటి విజయానికి ఆ సంస్థ పాటిస్తున్న నియమాలు, నిబద్ధతే కారణం. పని పట్ల నిబద్ధత, నాణ్యత పట్ల బాధ్యత, స్థ్థిరమైన నాణ్యత ఇవే ఆ సంస్థను ముందుకు నడిపిస్తున్నాయి. లిజ్జత్ కూడా తమ సంస్థలో పనిచేసే వారిపట్ల నిబద్ధతతో ఉంటుంది. తమ పనివారిని ఉద్యోగులు, కార్మికులుగా కాకుండా సోదరీమణుల్లా చూసుకుంటుంది. ఎక్కువ తక్కువ, సీనియర్ జూనియర్ అనే భేదాలిక్కడ ఉండవు. అందరికీ ఒకే గౌరవం ఉంటుంది. లిజ్జత్ తన సభ్యుల పిల్లలు చదువుకునేందుకు స్కాలర్‌షిప్పులను కూడా ఇస్తుంటుంది. పదో తరగతి, ఇంటర్ పాసైన తర్వాత సభ్యుల పిల్లలను ఉన్నత చదువులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్‌షిప్పులు ఉపయోగపడుతుంటాయి.

2 నాణ్యత

నిలకడగా మంచి నాణ్యత ఇదే లిజ్జత్ నమ్మిన నాణ్యతా సూత్రం. ఇదే ఆ సంస్థ యూఎస్‌పీ (యూనిక్ సెల్లింగ్ ప్రొపెజిషన్, ఏకైక అమ్మకాల ప్రతిపాదన). ఒక కొత్త వ్యక్తి సంస్థలో చేరితో వారికి తరచూ లిజ్జత్ చెప్పేది ఒక్కటే మాట.. నాణ్యత. శిక్షణలో పర్‌ఫెక్షన్ ఉంటుంది. అందుకే దేశ వ్యాప్తంగా ఇన్ని బ్రాంచీలు ఉన్నా.. అంతటా ఒకే విధమైన, ఒకే నాణ్యత గల అప్పడాలను సరఫరా చేయగలుగుతున్నది లిజ్జత్. బెన్‌కు ఒక కేజీ పిండి (డౌ) ఇస్తే కనీసం 800 గ్రాముల (తేమ పోగా) అప్పడాలైనా తిరిగి ఇవ్వాలి. లేకపోతే చెల్లింపుల్లో కోతలుంటాయి. తెచ్చిన అప్పడాలను ప్రతి కేంద్రంలోనూ పరీక్షిస్తుంది లిజ్జత్. నాణ్యత, రుచిలో ఏదైనా తేడా వస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక బెన్ తెచ్చిన అప్పడాల్లో ఉప్పు ఎక్కువో తక్కువో అయిందనుకోండి.. ఆ సంబంధిత సెంటర్‌కు వెంటనే సమాచారం అందుతుంది. ఆ మొత్తం వెంటనే రద్దు చేయాలని.. దాని విలువ వేలల్లో ఉన్నా లక్షల్లో ఉన్నా సంస్థ పట్టించుకోదు. ఇలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించడం వల్లే మార్కెట్‌లోకి అప్పడాలు అమ్మేందుకు ఎన్ని కంపెనీలు వచ్చినా లిజ్జత్ ఇంకా విస్తరిస్తూనే ఉంది.

3 విభిన్నత

లిజ్జత్ అప్పడాలతోనే ఆగిపోకుండా నిరంతరం కొత్త ఉత్పత్తులను చేర్చడాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అలా లిజ్జత్ ఇప్పుడు మసాలా, గోధుమ పిండి, చపాతీలు, డిటర్జెంట్ పౌండర్లు, లాండ్రీ సబ్బులను కూడా తయారుచేస్తున్నది. శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ ఒకే ఉత్పత్తితో మార్కెట్‌లోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు విభిన్నత పాటించడం, విభిన్నమైన ఉత్పత్తులను ఎంచుకోవడం దాని విజయానికి మరో కారణం. దీనిలో భాగంగానే లిజ్జత్‌లో విభిన్న డివిజన్లు ఏర్పడ్డాయి.

మసాలా డివిజన్ : ఈ డివిజన్ ముంబై నగర శివారులోని కాటన్‌గ్రీన్‌లో ఉంది. లిజ్జత్ క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీ కూడా ఇక్కడే ఉంది. పసుపు, మిర్చి, కొత్తిమీర, రెడీ మిక్స్ మసాలా, గరం మసాలా, టీ మసాలా, పావ్‌బజ్జీ మసాలా, పంజాబ్ చోలే మసాలా అన్నీ ఇక్కడే తయారవుతాయి. ప్యాకింగ్ కూడా ఇక్కడే అవుతుంది. ప్రింటింగ్ డివిజన్ కూడా ఇక్కడే ఉంది.

ఫ్లోర్ డివిజన్ : ఈ డివిజన్ ముంబైలోని వాసిలో ఉంది. మినుపపప్పు, పెసరపప్పును ఇక్కడే పిండి పడతారు. లిజ్జత్ బ్రాంచీలు స్వతంత్రంగా ఉన్నా అది అప్పడాల తయారీలో మాత్రమే కానీ పిండి కొనుగోలు విషయంలో కాదు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ధాన్యాలు దొరుకుతాయి. అవి భిన్నమైన రుచులు కలిగి ఉంటాయి. బ్రాంచీలు సొంతంగా వాటిని కొనుగోలు చేసి అప్పడాలు చేస్తే లిజ్జత్ అప్పడాల రుచి స్థిరంగా ఉండదు. అందుకే కావాల్సిన ధాన్యాన్ని కొని ఈ ఫ్లోర్ డివిజన్ ద్వారానే పిండి పట్టి దాన్ని బ్రాంచీలకు పంపుతుంటుంది లిజ్జత్. ఒకేచోట ఈ పనిచేయడం వల్ల పిండి పట్టేందుకు అయ్యే ఖర్చు కూడా కలిసి వస్తుంది.
అడ్వర్జయిజింగ్ డివిజన్: బాంద్రాలో ఉంది. డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకునేందుకు ఈ విభాగం పనిచేస్తుంటుంది.

చపాతీ డివిజన్ : బాంద్రా, వాడాల, ములుంద్, కండివాడీలలో ఈ డివిజన్లు ఉన్నాయి.

పాలీప్రొపైలన్ : ప్యాకింగ్‌కు అవసరమైన రకరకాల పాలిథిన్ కవర్లు ఇక్కడ తయారవుతాయి.

డిటర్జంట్ డివిజన్ : పౌడర్, కేక్స్ ఇక్కడ తయారు చేస్తారు. ఈ యూనిట్ పూనెలోని సనస్‌వాడీలో ఉంది.

1537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles