లవ్@ బుక్స్ సైట్


Sun,January 6, 2019 01:28 AM

ఒకప్పుడు నిన్ను ప్రేమించాను.. ఇప్పుడు నీ జ్ఞాపకాల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను.నీ పెదాలు మాట్లాడకుంటేనేమి? నీ మోము నిపించకుంటేనేమి?నువ్వు నా ఆలోచనల్లో ఎప్పటికీ నిలిచే ఉంటావు.మొదటిసారి నువ్వు నన్ను కలిసిప్పుడు ఎలా ఉంటావో అచ్చం అలాగే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా.
love
ఈ మూడు నెలలు నాకు క్షణమొక నరకంగా అనిపించింది. స్వర్గం నుంచి నువ్వు నన్ను చూస్తున్నావేమో కానీ ఈ సమాజం నుంచి నేను నిన్ను చూడలేకపోతున్నా. నీ ప్రతి అడుగులో, నీడలో వెన్నంటి ఉందామనుకున్నా.. చివరకు నన్నిలా ఒంటరిని చేసి, నువ్వలా ఒంటరిగా వెళ్లిపోతావనుకోలేదు.

పరిధుల్లేని పయణం. అవధుల్లేని నయనం. మీరు నుంచి మొదలు నువ్వుగా మారినప్పుడు పొందిన ఆ తన్మయత్వం. నిన్ను చూసిన మొదటిసారి నన్ను నేను మరిచిపోవడం. నన్ను నిన్నుగా ఊహించుకోవడం. అన్నీ అలా అకస్మాత్తుగా జరిగిపోయాయి. అదే ప్రేమంట. అందుకే ఈ ప్రేమంట. చూసిన వెంటనే నచ్చి నీ చూపులతో గిచ్చి నన్ను మెప్పించావు. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారట. మన ప్రేమ కథ కొంత భిన్నమే.. నీ బ్రాడ్ మైండ్ ముందు ఈ బ్రాండ్‌లన్నీ దిగదుడుపులే. సరదాగా ప్రారంభమైన నా ఈ ప్రేమ కథ.. స్వర్గం దాకా వెళ్లింది.

2016 సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో నిన్ను చూసింది మొదలు.. ఆ రోజు నుంచి రాత్రింబవళ్లు లేవు. అందమంటే అందమని చెప్పలేను. అందుకుందామని ట్రై చేస్తే అందుతావని అనలేను. చూడగానే అలా ఊహల్లో విహరించేలా చేశావు. నాజూకు నడుము, చిన్నపిల్లలా చిరునవ్వు, ఆ బుగ్గలేంటో పోలికకు కూడా అందట్లేదు. చూడగానే వచ్చి మాట్లాడాలని అనిపించింది. కానీ మాట్లాడితే కిక్కేముంటుంది. కాసేపు వెంటపడాలి. కొన్నాళ్లు నీ రాక కోసం ఎదురుచూడాలి. అప్పుడే కదా ప్రేమలో మజా దొరికేది. చూసిన వెంటనే అనుకున్నా.. నాకు కావాల్సిన బార్బీడాల్ నువ్వేనని. మరి నిన్ను పట్టుకోవడం ఎలా?. నా పావురాన్ని ప్రేమ పంజరంలో బంధించడం ఎలా? దానికి పెద్ద సమయం పట్టలేదు. ఆ రోజు నుంచి వేట మొదలుపెట్టాను. తను ఎవరు? ఎక్కడ ఉంటుంది? ఎవరికి సంబంధించిన అమ్మాయి? ఇప్పుడేం చేస్తుంది? అని ఆరా తీస్తే చివరకు ఒక చిన్న క్లూ దొరికింది. దాన్ని పట్టుకొని సంవత్సరం పాటు వెతికితే నువ్వు దొరికావు.

సంవత్సరం నుంచీ నీ కోసం వెతికాను. నీ ఊహలు తప్ప నీ రూపం ఎక్కడా దొరుకలేదు. ఫేస్‌బుక్‌లో లేవు. వాట్సప్‌లో లేవు. నువ్వేంటో.. అప్‌డేట్ అవ్వలేదని బాధపడ్డ. తర్వాత తెలిసింది. వాటన్నింటినీ బ్లాక్ చేసి ఇప్పుడు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నావని. బుక్‌ఫెయిర్‌కి కూడా గ్రూప్స్‌కు సంబంధించిన పుస్తకాలు కొనడానికి వచ్చావని. నీ మీద నీకు ఎంత నమ్మకమో నీతో మాట్లాడుతున్నప్పడు గమనించా. ఏ అంశం అయినా చకచకా ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడుతున్నపుడు పడిపోయా. ఎంత విషయం ఉన్నా.. పదిమందిలో అలా మాట్లాడేస్తుంటే నువ్వు తప్పకుండా గ్రూప్స్‌లో పాసయ్యి ఆఫీసర్ అవుతావన్న నమ్మకం కుదిరింది. నమ్మకం అయితే కుదిరింది, మరి మన జోడీ ఎప్పుడు కుదురుతుందో? అని ఆలోచించా. అచ్చమైన ఆడపిల్లలా కనిపించి నాలో అల్లకల్లోలం సృష్టించింది మొదలు.. ఇప్పటికీ నా కళ్లముందు ఇంకా తిరుగుతూనే ఉన్నావు.

నువ్వు ఇష్టంగా చదివే పుస్తకాల సాక్షిగా, నేను నిన్ను మొదటిసారి చూసిన పుస్తక విక్రయ కేంద్రాల సాక్షిగా నిన్ను పెళ్లాడాలనుకున్న. అందరిలా కాకుండా వందలో ఒకరిగా ఉండాలన్న నీ ఆలోచనకు మరింత ముగ్ధుడినయ్యా. ప్రేమ విషయం చెప్పాలనుకొని కలిసినప్పుడు అది తప్ప అన్నీ నీతో చర్చించాను. ముందు కెరీర్ ఆ తర్వాతే ప్రేమ, పెళ్లి అన్న నీ క్లారిటీకి మరింత పడిపోయాను. అయినా ఓపిక పట్టి నిన్ను సాధించుకుందామనుకున్న. అలా ఒక సంవత్సరం పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ లేకుండా కేవలం ఫోన్ కాల్స్(లిమిటెడ్)గా మాటా ముచ్చట సాగించావు. బతుకమ్మ పండుగకు నువ్వు మీ నాన్న వాట్సాప్‌లో పంపిన ఫొటో చూసి నువ్వే నా సహచరివి అని ఫిక్స్ అయిపోయా. ఆ విషయం నీతో కూడా చెప్పాను. తొందరేముంది నేను గ్రూప్స్ అయితే పాసవ్వనివ్వు అన్నప్పుడు నీ మీద నీకున్న నమ్మకం నాకు మరింత ధైర్యానిచ్చింది. ఎంత ధైర్యం ఉన్నా.. ఎంత నమ్మకం ఉన్నా ఏం లాభం? చివరికి నువ్వే లేవు. ఈసారి బుక్‌ఫెయిర్‌కి నిన్ను తీసుకెళ్లి పుస్తకాలు కొనిపిద్దాం అనుకున్నా. నువ్వు లేవు. అయినా పుస్తకాలు కొన్నా. నీ కోసమే. అవును నువ్వు కలలు కన్న గ్రూప్స్ పరీక్షల కోసమే. నేను రైల్వే శాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. అది కేవలం బతుకు దెరువు కోసం. నీ కోసం, మన కోసం గ్రూప్స్‌లో ఉద్యోగం సాధిస్తాను. ఆ ఉద్యోగంలో నిన్ను చూసుకుంటాను.

ఏడడుగులు నడుద్దామనుకున్నా.. ఎన్నో కలలు కన్నా.. గుండె ఛిద్రమయ్యే ఒక వార్త వింటానని ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ మూడు నెలలు నాకు క్షణమొక నరకంగా అనిపించింది. స్వర్గం నుంచి నువ్వు నన్ను చూస్తున్నావేమో కానీ ఈ సమాజం నుంచి నేను నిన్ను చూడలేకపోతున్నా. నీ ప్రతి అడుగులో, నీడలో వెన్నంటి ఉందామనుకున్నా.. చివరకు నన్నిలా ఒంటరిని చేసి, నువ్వలా ఒంటరిగా వెళ్లిపోతావనుకోలేదు. నీ కోరిక గ్రూప్స్ రాయాలని, ఉద్యోగం సాధించాలని.. కానీ అది తీర్చుకోకుండానే వెళ్లిపోయావు. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు కన్న ఆ కలను నేను నిజం చేస్తా. నువ్వు సాధిస్తానన్న ఆ ఉద్యోగాన్ని నేను సాధిస్తా. అంతిమంగా నీ ఆలోచనలను ఆకలింపు చేసుకొని అన్నింటా నిన్ను నిలుపుతా. అర్ధాంతరంగా నన్నిలా వదిలి వెళ్లిన ఓ ప్రియ సఖి. నువ్వున్న స్వర్గంలోనే నీ పక్కన నాకు చోటివ్వు.

- నీ భాను

1414
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles