కందూరు చోడుల తొలితరం నాయకులు


Sun,January 6, 2019 01:23 AM

PACHALA
తెలుగు చోడుల్లో ఏఱువ సీమను ఏలిన చోడులు ఏఱువ చోడులుగా అటు తర్వాత కందూరు నాడును బహుమానంగా పొంది కందూరు చోడులుగా వెలుగొందారు. వీరి చరిత్ర మనకు కల్యాణీ చాళుక్య చక్రవర్తియైన త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని కాలం నుంచి మాత్రమే అందుబాటులో ఉంది. ఏఱువ వంశానికి ఆద్యుడైన మొదటి భీముడి నుంచి రామనాథ దేవ చోడమహారాజు వరకు మొత్తం 17 మంది రాజులు ఏఱువ సీమను పాలించారు.

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77 177

వల్లాల గ్రామాన్ని గుండనకు అగ్రహారంగా ఇచ్చే సమయంలో ఈ శాసనం వేశాడు. పాములపాడు లో కూడా అదే సంవత్సరం మల్లికార్జునుడు మరో శాసనం వేయించాడు. మల్లికార్జునుడు కళాప్రియుడు. దానధర్మాలు ఆచరించేవాడు.

ఏఱువ మొదటి భీమదేవ చోడుడు (క్రీ.శ. 1040-1050)

ఏఱువ భీమదేవ చోడుడు ఏఱువ వంశానికి ఆద్యుడు. మొదటి రాజు. కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న నల్లగొండ జిల్లాలోని పానగల్లు పట్టణం ఇతని రాజధాని. చోళ సామ్రాజ్యానికి మూలపురుషుడైన కరికాల చోడ వంశీయులలో ఒక శాఖవారు చోడులు. వైదుంబ వంశీయులకు తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ఇలా జరిగిన యుద్ధాల్లో ఓడిన చోడులు (భీమచోడుని పూర్వీకులు) ఏఱువ సీమకు వచ్చి రాజ్యస్థాపన చేశారు. కృష్ణానదికి ఉత్తర దక్షిణ భూభాగాల్లో వ్యాపించి ఉన్న ఏఱువ మండలంలో కొంతభాగాన్ని ఏలుతుండడం వల్ల వీరికి ఏఱువ చోడులనే పేరు వచ్చింది.

ఏఱువ ఒకటో తొండయ భీముడు (క్రీ.శ. 1050-65)

ఏఱువ భీముడి తర్వాత అతని కొడుకు ఏఱువ ఒకటో తొండయ భీమ చోడుడు సింహాసనం అధిష్టించాడు. ఇతడు కూడా పానగల్లు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ తన రాజ్యాన్ని విస్తరించాడు. సిరికొండ (సూర్యాపేట జిల్లా మోతె మండలంలో గ్రామం), నేలకొండపల్లి (ఖమ్మం జిల్లాలో మండల కేంద్రం), రాచకొండ (యాదాద్రి భువనగరి జిల్లాలోని ప్రాంతం), భువనగిరి(యాదాద్రి భువనగరి జిల్లా కేంద్రం), దేవరకొండ (నల్లగొండ జిల్లాలో మండలం) ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలుపుకొన్నాడు. కృష్ణానదీ తీరంలోని ఓడపల్లి (మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి) దుర్గాన్ని పటిష్ఠం చేసి అక్కడి నుంచి వర్తక వాణిజ్యాలకు ఏర్పాటు చేశాడితడు. ఇక్కడి నుండి పడవలు కృష్ణానదిలో ప్రయాణించి తూర్పు తీరంలోని పట్టణాలకు వస్తుసామాగ్రిని చేరవేస్తుండేవట.
PACHALA1
ఏఱువ రెండో భీమదేవ చోడుడు (క్రీ.శ. 1065-77)ఒకటో తొండయ తర్వాత అతని కుమారుడు ఏఱువ రెండో భీమదేవ చోడుడు రాజ్యానికి వచ్చాడు. పానగల్లు కోటను ఇతడు మరింత పటిష్ఠపరిచాడు. సామంత మాండలికులను అదుపులో ఉంచుకుంటూ రాజ్యాన్ని చక్కగా పాలించాడు. కల్యాణీ చాళుక్య ప్రభువు త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యునికి భీమదేవ చోడుడు యుద్ధాలలో సహాయం చేసేవాడు. ఇందుకుగాను భీమదేవ చోడుని కొలనుపాక (యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం) ఏడువేల గ్రామాలకు తోడు, కందూరునాడు 1100 గ్రామాలనూ పాలించే అధికారాన్ని ఇచ్చాడు ఆరో విక్రమాదిత్యుడు. దీంతో క్రీ.శ. 1076-77 ప్రాంతం నుంచి ఏఱువ చోడులు కాస్తా కందూరు చోడులుగా మారిపోయారు.రెండో భీమదేవ చోడుని భార్య గంగాదేవి. వీరికి నలుగురు కుమారులు. తొండయ (రెండవ) చోళుడు, ఇరుగణ చోళుడు, కొండయ చోళుడు, మల్లికార్జున చోళుడు.

రెండో తొండయ చోళ మహారాజు (క్రీ.శ. 1077-1098)

రెండో భీమదేవుని తర్వాత అతని పెద్ద కుమారుడు రెండో తొండయ చోళ మహారాజు అయ్యాడు. కొప్పోలు (నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో గ్రామం) శాసనం ఇతని గురించి చెబుతున్నది. అనుముల శాసనం ఇతడిని ఆదిచోళ కులజుడని కీర్తిస్తున్నది. అనుముల అహల్యా (నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన హాలియా) దగ్గరలో ఉన్న ప్రాచీన నగరం నేడు శిథిలావస్థలో ఉంది. ఇక్కడి కోట పూర్వం కందూరు చోడుల సామంతులకు నిలయం. రెండో భీమదేవుని రాజ్యంలో భువనగిరి దుర్గం, సిరికొండ, కొండపల్లినాడు, కందూరు (మహబూబ్‌నగర్ జిల్లా అద్దక్కర్ మండలంలో గ్రామం) విషయము, వంగూరు (నాగర్ కర్నూల్ జిల్లాలో మండలం) విషయము, కొలనుపాక ప్రాంతం, నేలకొండపల్లి ప్రాంతాలు భాగాలుగా ఉండేవి. కోడూరు (మహబూబ్‌నగర్ జిల్లాలోని కదూర్?), మగతల (మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్) కూడా ఇతని రాజ్యంలోనే ఉండేవి. కందూరు చోడులు చాళుక్యులకు సామంతులుగా ఉంటూ మహామండలేశ్వరులు బిరుదుతో వెలుగొందేవారు. రెండో తొండయ పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1050-1080) పాలిస్తుండేవాడు. కాకతీయ రెండో బేతరాజు(క్రీ.శ. 1080-115)కు కూడా ఇతడు సమకాలీనుడు. అప్పట్లో కాకతీయ రాజ్యం కంటే కందూరు చోడ రాజ్యం విస్తీర్ణం పెద్దదిగా ఉండేదట. ఏఱువ రెండో తొండయ చోళుని భార్య మైలాంబిక. ఈవిడ ద్రాక్షారామ భీమేశ్వర శాసనాన్ని వేయించింది. వీరికి ముగ్గురు కొడుకులు. ఒకటో ఉదయనచోడుడు, రెండో భీమదేవ చోడుడు, ఒకటో గోకర్ణదేవుడు.

కుమార కొండయ చోళ మహారాజు

తొండయ అనంతరం అతని సోదరుడు కుమార కొండయ చోళ మహారాజు రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1100 నాటి కొలనుపాక శాసనంలో కొండయ రాజుగా పేర్కొనడాన్ని ఆధారం చేసుకుని బి.ఎన్. శాస్త్రి నిర్ధారించారు. కానీ కందూరి చోడులలో రాజు కాకుండానే శాసనం వేసే అలవాటు, అందులో అతణ్ణి రాజుగా పేర్కొనే సంప్రదాయం ఉందని పరబ్రహ్మ శాస్త్రి రాశారు. దీన్నిబట్టి కొండయ రాజ్య పాలన చేయనట్లుగానే భావించాలని, రెండో తొండయ తర్వాత అతని మరొక సోదరుడు (రెండో భీమదేవ చోడుడు, గంగాదేవిల చిన్నకొడుకు) మల్లికార్జున చోడుడు రాజైనట్లు భావించాలని తన తెలంగాణ చరిత్రలో డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

మల్లికార్జున చోడుడు

ఏఱువ రెండో భీమదేవ చోళ మహారాజు కొడుకుల్లో చివరివాడు మల్లికార్జున చోడుడు. ఇతడు వల్లాల (నల్లగొండ జిల్లా శాలీగౌరారం మండలంలోని గ్రామం) శాసనం వేయించినవాడు. క్రీ.శ. 1098 నాటి ఈ శాసనంలో మల్లికార్జున చోడుని మంత్రి గుండన ప్రస్తావన, ఆరో విక్రమాదిత్యుని ప్రస్తావనలు ఉన్నాయి. వల్లాల గ్రామాన్ని గుండనకు అగ్రహారంగా ఇచ్చే సమయంలో ఈ శాసనం వేశాడు. పాములపాడు (నల్లగొండ జిల్లా వేములపల్లి మండలానికి చెందిన పాములపహాడ్)లో కూడా అదే సంవత్సరం మల్లికార్జునుడు మరో శాసనం వేయించాడు. మల్లికార్జునుడు కళాప్రియుడు. దానధర్మాలు ఆచరించేవాడు. బ్రాహ్మణులకు, ఆప్తులకు, దేవాలయాలకు, అగ్రహారాలను, భూదానాలు చేస్తూ తన దైవభక్తిని, బ్రాహ్మణ భక్తినీ చాటుకునేవాడు.

మూడో భీమదేవ చోడుడు

కందూరు రెండో తొండయ చోళ మహారాజుకు ముగ్గురు కొడుకులు. వారు.. ఒకటో ఉదయనచోడుడు, మూడో భీమదేవ చోడుడు, ఒకటో గోకర్ణదేవుడు. పెద్దవాడైన ఉదయనచోడుడు తొండయ తర్వాత రాజవ్వాలి. కానీ, ఒకటో ఉదయనచోడుడు రాజైనట్లు చరిత్రలో లేదు. దీన్నిబట్టి ఒకటో ఉదయనచోడుడు చిన్నవయసులోనే మరణించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇతని తర్వాతి వాడు భీమదేవచోడుడు. ఇతనికి మూడో భీమదేవచోడుడు, నల్లభీమదేవ చోడుడు, చోడభీమనారాయణుడనే వ్యవహార నామాలున్నాయి. మైలాంబిక తన రెండో కొడుకు భీముని క్షేమాన్ని కోరుతూ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చింది. ఓ గ్రామానికి చోడభీమనారాయణపురం అనే పేరు పెట్టింది. పెద్ద కొడుకు సూర్యతేజ సంపన్నుడైతే, రెండో కొడుకు భీముడు సమస్త రాజవంశాలను యుద్ధాలలో ఎదుర్కొని భీముడంతటివాడు అయ్యాడని, గోకర్ణుడు దానకర్ణుడని శాసనాలు చెబుతున్నాయి. నల్లగొండకు సమీపంలోని రామలింగాలగూడెం మార్కండేశ్వరాలయ శాసనంలో భీమదేవచోడుని ప్రస్తావన ఉన్నది. మూడో భీమదేవ చోడుని భార్య ధెన్నమహాదేవి. ఈవిడ గట్టు తుమ్మెన శాసనం (క్రీ.శ. 1106) వేయించింది.

సోమనాథదేవ చోడ మహారాజు

సోమనాథదేవ చోడ మహారాజు గురించి ఉప్పునూతల (నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మండలకేంద్రం)శాసనం చెబుతున్నది. కానీ, ఆ శాసనం ఇతని తండ్రి పేరును మాత్రం ప్రస్తావించడం లేదు. ఇతడు ఉదయనచోడుని కుమారుడై ఉండొచ్చని బి.ఎన్.శాస్త్రి భావించారు. కానీ, ఆ ఉదయుని కొడుకు శ్రీదేవి తొండయ కావొచ్చన్నది పి.వి. పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం.

గోకర్ణదేవ చోడ మహారాజు (క్రీ.శ. 1109-1126)

రెండో తొండయ చోళ మహారాజు, మైలాంబికల నలుగురు పుత్రుల్లో చిన్నవాడీ గోకర్ణదేవుడు. మైలాంబిక పానగల్లు శాసనం ఇతడిని దానకర్ణునిగా వర్ణిస్తున్నది. ఇతడు ఏలేశ్వరంలో శాసనం వేయించాడు. కోడూరు గ్రామాన్ని ఏలేశ్వర దేవరకు దానమిచ్చినట్లు ఆ శాసనంలో ఉంది. గోకర్ణుడు మామిళ్లపల్లి, పానగల్లు శాసనాలను కూడా వేయించాడు. పానగల్లు శాసనాన్ని గోకర్ణదేవుడు వేయించాడు. కుక్కళము 30 గ్రామాల్లో ఒకటి మాడువుల. ఈ గ్రామాన్ని కావలి అయిన భీమన ప్రెగ్గడకు అగ్రహారంగా దానమిచ్చాడు. ఆమనికల్లు 70 గ్రామాల్లో ఒకటైన అడ్డలూరు గ్రామాన్ని దొడ్డభట్లకు కాళ్లుకడిగి దానమిచ్చాడు. ఈ సందర్భంగా వేయించిన శాసనం ఇది. ఈ శాసనంలో పేర్కొన్న మాడువుల నేటి మాడుగులపల్లి, కుక్కళము నేటి కుక్కడం, ఆమనికల్లు నేటి ఆమనగల్లు.. ఇవన్నీ మిర్యాలగూడ సమీపంలో ఉన్నవే. గోకర్ణదేవుడి తొలి రాజధాని పానగల్లు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతడు తన రాజధానిని పానగల్లు నుంచి మహబూబ్‌నగర్ మండలంలోని వర్ధమానపురానికి మార్చినట్లు చరిత్రకారులు చెబుతారు. గోకర్ణదేవుని కుమారుడు కందూరు చోడరాజులలో ప్రసిద్ధుడైన ఉదయనచోడుడు. ఇతడినే రెండో ఉదయన చోడుడు అని కూడా అంటారు. గోకర్ణుడు తన రెండో అన్న భీమదేవ చోడుని కాలంలోనే తాను కూడా పరిపాలన సాగించాడు. అప్పటి రాజకీయ ఎత్తుగడలు, ఆధిపత్యం కోసం సాగిన పోరులో ఈ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

వచ్చేవారం: అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు లేవనెత్తింది ఎవరు? ఆ తర్వాత పరిణామాలు, పర్యవసానాలు ఏంటి??

1001
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles