ఆర్‌బీఐకి 25వ గవర్నర్


Sun,January 6, 2019 01:16 AM

ShaktikantaDas
భారతదేశ ఆర్థికవ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక రంగానికి కీలకమైందిగా భావించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా శక్తికాంతాదాస్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్న దాస్ ఒడిశా నుంచి ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతానంటున్న శక్తికాంతాదాస్ ప్రస్థానం.

- మధుకర్ వైద్యుల

ఆర్‌బీఐ చాలా గొప్ప సంస్థ, దీనికి సుదీర్ఘ వారసత్వం ఉంది. ఈ వ్యవస్థ మౌలిక విలువలు, విశ్వసనీయత విశిష్ఠమైంది. ఆర్‌బీఐ సిబ్బంది అత్యంత సమర్థులు. ఆర్బీఐలో పని చేస్తూ, దేశానికి సేవలందించడం ఎవరికైనా సంతోషం, మరీ ముఖ్యంగా నాకు ఈ అవకాశం దక్కినందుకు గొప్పగా భావిస్తున్నాను. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రధానమైనవి. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నది. బ్యాంకింగ్ రంగ సమస్యలపై తక్షణం దృష్టిసారిస్తాం. భారత ఆర్థికవ్యవస్థ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది.

మొన్నటి వరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంతదాస్ ప్రస్తుతం ఆర్థిక సంఘంలో సభ్యునిగా కొనసాగుతున్నారు. పెద్దనోట్ల రద్దులో కీలకంగా వ్యవహరించారు. కాగా దువ్వూరి సుబ్బారావు తర్వాత ఆర్బీఐ ఉన్నత పదవికి ఎంపికైన ఐఏఎస్ కేడర్ అధికారి దాస్ మాత్రమే.

శక్తికాంతదాస్ 1957 ఫిబ్రవరి 26న ఒడిశాలోని భువనేశ్వర్‌లో జన్మించారు. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. మొదట తమిళనాడు క్యాడర్‌లో బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆయన హిస్టరీ విద్యార్ధి అయినప్పటికీ , 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఆర్థిక శాఖ విభాగాల్లోనే ఎక్కువ కాలం పని చేశారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రెవెన్యూ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆర్‌బీఐ సంబంధిత విషయాలు, పరపతి విధాన వ్యవహారాలు చూసుకునే ఆర్థిక వ్యవహారాల విభాగానికి కార్యదర్శి అయ్యారు. 2017 మేలో పదవీ విరమణ చేశారు. విరమణ అనంతరం 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు.

దాస్ సుదీర్ఘ కెరీర్లో తమిళనాడు పరిశ్రమల శాఖ సెక్రెటరీగా, తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా, ఎల్‌ఐసీ డైరెక్టర్‌గా అనేక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మొదట రెవెన్యూ విభాగం బాధ్యతలు చూసుకునేందుకు ప్రధాని మోదీ ఆయన్ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయన్ను ఆర్థిక వ్యవహారాల శాఖకు మార్చారు. మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దును ముందుకు తీసుకువెళ్లింది శక్తికాంతా దాసే. కేంద్ర బ్యాంకుతో సన్నిహితంగా పని చేసిన అనుభవం దాస్‌కు ఉంది. జీ20 సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. 2016లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రధాని మోదీకి సహకరించిన వారిలో దాస్ ఒకరు. మోదీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు కూడా దాస్ చాలా సన్నిహితుడని చెబుతుంటారు.
ShaktikantaDas1
ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జీత్ పటేల్ వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్త గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితుల య్యారు. అర్ధాంతరంగా ఉర్జిత్ పటెల్ పదవి నుంచి వైదొలిగారు. 2019 సెప్టెంబరు వరకు ఉర్జిత్ పటేల్ పదవీకాలం ఉండగా.. పదినెలల ముందుగానే ఆయన పదవి నుంచి వైదొలిగారు. 2015-17 మధ్య దాస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల సెక్రటరీగా ఉంటూ ఆర్‌బీఐతో కలిసి పనిచేశారు. 2016లో మోదీ సర్కారు అమలులోకి తెచ్చిన నోట్లరద్దు ప్రక్రియను స్వయంగా దగ్గరుండి మరీ అమలు చేస్తూ.. లోటుపాట్లను స్వయంగా సమీక్షించారు. అదే విధంగా జిఎస్టీ అమలులోనూ అత్యంత కీలక పాత్ర పోషించారు. నోట్ల రద్దు సమయంలో మోడీ చర్యను సమర్థిస్తూ రోజూ మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేశారు. మోదీ సర్కారు నిర్ణయాన్ని వీలైనంత గరిష్ట స్థాయిలో వెనుకేసుకురావడం వంటి చర్యలను చేపట్టి మోదీ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

శక్తికాంతదాస్‌కు ముగ్గురు ఆర్థిక మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, అరుణ్ జైట్లీలతో పనిచేసిన అనుభవం ఉంది. ఆయా మంత్రులతో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రణబ్, చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ల్లోనూ సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. కీలక సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యమున్న అధికారిగా శక్తికాంత దాస్‌కు పేరుంది. 2017 మేలో ఒక రూపాయి నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ నోట్లపైన శక్తికాంత దాస్ సంతకమే ఉంది. అంతకు ముందు ఆర్‌బీఐ గవర్నర్లుగా పని చేసిన వారంతా.. ఆర్థశాస్త్రంలో ప్రపంచ ఖ్యాతి సాధించినవారే. కానీ శక్తికాంత దాస్ మాత్రం చరిత్ర చదువుకుని ఆర్‌బీఐ చీఫ్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.

874
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles