ఇలయ దళపతి పుట్టినరోజు.. బంగారు గొలుసులు


Sun,January 6, 2019 01:13 AM

Vijay
బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నేపథ్య గాయకుడిగా పాటలు పాడాడు. అక్షరాలను పేర్చి డైలాగులు రాశాడు.. డబ్బులు పెట్టి నిర్మాతగా మారాడు.డాక్టరేట్ అందుకొని తమిళ ఇండస్ట్రీకి ఇలయ దళపతి అయ్యాడు.జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ విజయ్‌లోని మరో మనిషికి సంబంధించిన మరిన్ని విశేషాలు..

- పసుపులేటి వెంకటేశ్వరరావు
ఫోన్: 8885797981

Vijay2
ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 100 మంది సంపన్నుల జాబితాలో రెండు సార్లు చోటు దక్కించుకున్నాడు విజయ్. ఓసారి సంపన్నుడిగా, రెండో సారి ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వ్యక్తిగా జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఎంజీఆర్ యూనివర్సిటీ విజయ్‌కు గౌరవ డాక్ట్టరేట్ ప్రదానం చేసింది.

తమిళ నటుడు విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన నటుడే కాదు నేపథ్యగాయకుడు కూడా. తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణ పొందిన నటుడు విజయ్. ఆయన అభిమానులు ముద్దుగా దళపతి(కమాండర్) అని పిలుచుకుంటారు. విజయ్ తండ్రి కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వాడే కావడం విజయ్‌కు బాగా కలిసి వచ్చింది. 1984లో తన తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన వెట్రి సినిమాతో విజయ్ బాల నటుడిగా పరిచయమయ్యాడు. నాలయ తీర్పు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా విజయ్ గాయకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ తల్లి శోభ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు. శోభ సినీ నేపథ్య గాయనిగా రాణించింది. విజయ్ తన తల్లి దగ్గర సంగీతం నేర్చుకుని గాయకుడిగా మారాడు. విజయ్ సోదరి విద్య రెండేండ్ల ప్రాయంలో చనిపోయింది. 2005లో సుక్రన్ అనే చిత్రం ద్వారా తన సోదరి విద్య కథను తెరకెక్కించాడు. నటుడిగా రాణిస్తూనే ఇప్పటి వరకూ పలు చిత్రాల్లో 31 పాటలు పాడాడు.
Vijay1

సేవకుడు-కథానాయకుడు

సాటి మనిషికి తన వంతుగా ఏదో ఒక రకంగా సాయం చేయాలనే తత్వం విజయ్‌ది. ప్రజా సేవకుడిగా సినిమాల్లోనే కనిపించడమే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన ప్రజలకు వివిధ రకాలుగా సేవలందిస్తున్నాడు. సామాజిక సేవ చేసేందుకు విజయ్ విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా, వివిధ రకాల సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి యేటా తన పుట్టిన రోజు నాడు చిన్నారులకు బంగారు ఉంగరాలను అందిస్తున్నాడు. కొన్ని వేలమంది నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, స్టేషనరీ ఉచితంగా అందించి తనలోని దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. తనలా టాలెంట్ ఉన్న కళాకారులంటే విజయ్‌కు చాలా ఇష్టం. తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహిస్తుంటాడు. ఇప్పటి వరకు 20మంది కొత్త దర్శకులను తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత విజయ్‌కు దక్కింది. తన సినిమా కెరీర్‌లో ఇప్పటి వరకూ నటించిన 57 చిత్రాలల్లో 20 మంది దర్శకులను వెండితెరకు పరిచయం చేశాడు. సుభాష్ గాయ్, మహేష్ భట్ వంటి వారిని దర్శకులుగా పరిచయం చేసింది కూడా విజయే.

ప్రొడ్యూసర్-డైలాగ్ రైటర్

చిన్నప్పటి నుంచి చిత్ర పరిశ్రమను చూస్తూ పెరిగాడు విజయ్. తండ్రి దర్శకుడు కావడంతో ఆయన రంగప్రవేశానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ దొరికింది. అలా దొరికిన అవకాశాన్ని విజయ్ తనలోని సత్తా చూపించి సినిమా పరిశ్రమలో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్‌గా కూడా అవతారమెత్తాడు. తన చెల్లెలి మరణానంతరం ఆమె పేరు, తన పేరు కలిపి విజయ్-విద్య క్రియేషన్స్ బ్యానర్‌తో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అదే బ్యానర్‌పై పలు చిత్రాలను రూపొందించి విజయ దుందుభి మోగించాడు. తాను నటించిన పలు చిత్రాలకు పవర్‌ఫుల్ డైలాగ్‌లు కూడా తానే స్వయంగా రాసుకున్నాడు. విజయ్ తన నటనకుగాను ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం ఉత్తమ నటుడిగా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించింది. తుపాకీ చిత్రంలో గూగుల్ గూగుల్ అంటూ పాడి యువతను హుషారెత్తించాడు. పెల్ఫీ పుల్లా అనే పాటకు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా అవార్డు వచ్చింది. ప్రముఖ గాయనీ, గాయకుల సరసన కూడా విజయ్ పాటలు పాడి తనలోని సింగర్‌ను ఆవిష్కరించాడు. ఆదరణ పొందాడు.

1155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles