పక్కింట్లో పిస్తోలు


Sun,January 6, 2019 12:50 AM

- మల్లాది వెంకట కృష్ణమూర్తి
Crime
ఐదు నిమిషాల తర్వాత బేస్‌మెంట్లోంచి రివాల్వర్ పేలిన శబ్దం వాళ్ళకి వినిపించింది. వెంటనే మార్క్ చెప్పాడు.అది మీరు తెచ్చిన రివాల్వర్ శబ్దం ఫ్రీడా. కాటన్ వేస్ట్ పెట్టెలోకి దాన్ని పేల్చారు. ఓ రివాల్వర్ లోంచి పేల్చిన గుండు మీది గుర్తులు ఒకేలా ఉంటాయి. వాటిని బట్టే పోల్చి ఓ గుండు ఓ రివాల్వర్ లోంచి పేల్చబడిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే.


పాకెట్ ఉదయం పోస్ట్‌లో వచ్చింది. ఫ్రీడా దాన్ని తెరిచేముందు కదిపి చూస్తే లోపల నించి ఎలాంటి చప్పుడూ లేదు. పై కాగితం చింపితే అందులో ఓ సిగార్ బాక్స్ కనిపించింది. దాన్ని ఆసక్తిగా తెరచి అందులోని వస్తువుని చూసి తుళ్ళిపడింది.
అది పాయింట్ 38 రివాల్వర్. అది టైట్‌గా పెట్టెలో కూర్చుని ఉంది. దాని ట్రిగర్‌కి కట్టిన టేగ్ మీద టైప్ చేసి ఉంది.
లేడీ, ఇది మీకు పెళ్ళి బహుమతి. డెక్సటర్ తన మొదటి భార్యని చంపిన రివాల్వర్ ఇది.
ఫ్రీడా మొదట అది ఎవరో వేసిన ప్రాక్టికల్ జోక్ అనుకుంది. తను పెళ్ళి చేసుకోబోతున్న డెక్సటర్ ఆమెకి చిన్నప్పటి నుంచీ తెలుసు. ఐదేళ్ళ క్రితం అతని భార్య ఆల్మా మరణించిన సందర్భానికి చెందిన అన్ని విషయాలు ఆమెకి తెలుసు. వాళ్ళిద్దరికీ తెల్లవారుజామున ఇంట్లో ఏదో అలికిడి వినిపించింది. ఆ దొంగ పారిపోయే అవకాశం లేకపోవడంతో ఓ సారి రివాల్వర్‌ని పేల్చి ఆల్మాని చంపాడు. తర్వాత ఆమె అడ్డుగా నిల్చున్న కిటికీ లోంచి దూకి పారిపోయాడు. ఇరుగుపొరుగు అతను పారిపోవడం చూసారు.

పక్కింట్లోని ఫ్రీడా కూడా ఆ సాక్షుల్లో ఒకరు. ఐదు నిమిషాల తర్వాత వచ్చిన పోలీసులు పగల కొట్టిన ఆ ఇంటి కిటికీ తలుపుని, దొంగ పాదముద్రలని చూసారు. గుర్తు తెలీని దొంగ లోపలకి ప్రవేశించి వాళ్ళని నిద్ర లేపాడని, ఆయుధాన్ని ఉపయోగించి పారిపోయాడని నిర్ధారించారు.
ఇప్పుడు ఈ రివాల్వర్. ఆ పెట్టెలో టైట్‌గా కదలకుండా ఉన్న ఆ రివాల్వర్‌ని గట్టిగా లాగి తీస్తే కింద ఇంకో టైప్డ్ ఉత్తరం కనిపించింది.
లేడీ, ఆ రాత్రి నా దగ్గర రివాల్వర్ లేదు. నేను ఎన్నడూ ఆయుధంతో దొంగతనానికి వెళ్ళలేదు. ఆ దంపతులు నా అలికిడి విని నేనున్న గదిలోకి వచ్చారు. నేను భయపడి పారిపోయాను. నేను వాళ్ళ ఇంటి ఫెన్స్ మీంచి అవతలకి రోడ్ మీదకి దూకాక నాకు లోపల నించి రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. డెక్సటర్ కిటికీ లోంచి నా మీదకి కాల్చాడని అనుకున్నాను. కాబట్టి అతనే ఆ గుండుతో తన భార్య ఆల్మాని కాల్చి చంపి ఉంటాడు.
నమ్మలేని సమాచారం! ఐతే ఇది ఫ్రీడా వినడం మొదటి సారి కాదు. డెక్సటర్ ఆల్మాని వదిలించుకోవాలని అనుకున్నాడు. దొంగ రాకతో ఆ అవకాశాన్ని తన మీదకి అనుమానం రాకుండా ఉపయోగించుకున్నాడు. ఆమె అలాంటి వదంతులని నమ్మనని డెక్సటర్‌కి చెప్పింది. ఆమెకి అతనంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఇటీవల తనని పెళ్ళి చేసుకోమని అతను కోరితే కాదనలేక పోయింది. కాదంటే అతను ఆల్మాని చంపాడని తనూ నమ్ముతోందని అనుకోవచ్చని ఆమెకి అనిపించింది. ఆమె తర్వాతి పేరాని చదివింది.

లేడి, ఆల్మా మరణం గురించి మర్నాడు దినపత్రికల్లో చదివాను. నేను పోలీసుల దగ్గరకి వెళ్ళి గత రాత్రి జరిగింది చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు. నేను చిక్కుల్లో పడతాను. అతనా రివాల్వర్‌ని ఏం చేసి ఉంటాడని ఆలోచించాను. దాన్ని ఇంట్లో దాచే సాహసం చేయడు. బయటకి వెళ్ళి దాచే అవకాశం కూడా లేదు. పోలీసులు వచ్చే ఐదు నిమిషాల్లో దాన్ని ఎక్కడ దాచి ఉంటాడు?
ఆ ఇంట్లో దొంగతనం చేయబోయే ముందు కుక్కలున్నాయా అని పరిశీలించినప్పుడు అతని వెనక ఇంటి వాళ్ళు వేసవి సెలవులకి ఇల్లు తాళం పెట్టి వెళ్ళారని గ్రహించాను. తాళం పెట్టిన వెనుక ఇంటిని పోలీసులు వెతుకరని డెక్సటర్ నమ్ముతాడని భావించాను. అతను దాన్ని అందులోకి విసిరి, వాళ్ళు తిరిగి వచ్చే లోపలే దాన్ని తిరిగి తీసుకుని నదిలో పారేయచ్చు.

ఇది తెలుసుకోడానికి నేను మర్నాడు రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళాను. అది ముందు గదిలో బయట తలుపుకి ఉన్న ఉత్తరాల రంధ్రం లోంచి హాల్లో తలుపుకి వేలాడే ఉత్తరాలు పడే సంచీలో కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళాను. పరీక్షిస్తే హత్య చేసిన గుండు ఈ రివాల్వర్ లోంచే పేల్చబడిందని పోలీసులు తేలిగ్గా గుర్తిస్తారు. ఈ రివాల్వర్ సీరియల్ నంబర్ని బట్టి దీన్ని డెక్సటరే కొన్నాడని కూడా వాళ్ళు కనుక్కోగలరు. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ రివాల్వర్ నేను నిర్దోషినని రుజువు చేస్తుందని దీన్ని దాచాను. ఇక వాళ్ళు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. కారణం నా గురించి వారికి తెలీదు. పైగా దొంగతనాలు మానేసి మంచి వ్యాపారం చేసుకుంటున్నాను.
రెండేళ్ళ క్రితం జరిగిన హత్యకి సంబంధించిన ఈ రివాల్వర్ ఇక నాకు అవసరం లేదు. కాని మీకు దీని అవసరం ఉందని పంపుతున్నాను. డెక్సటర్‌ని మీరు పెళ్ళి చేసుకోబోతున్నారని నేను దినపత్రికల్లో చదివాను. అందువల్ల నిజం తెలుసుకోవడానికి దీన్ని నేను మీకు పంపుతున్నాను.
ఫ్రీడా ఆ రివాల్వర్‌ని తిరిగి పెట్టెలో ఉంచింది. దాన్ని డెక్సటర్‌కి చూపించి ఏం చేయాలో అతన్నే నిర్ణయించమని కోరాలని అనుకుంది.
అతను ఇంట్లోనే ఉన్నాడు. ఆమె అతనికా పెట్టె ఇచ్చి చెప్పింది.

ఇది పోస్ట్‌లో వచ్చింది. ఇది వదంతుల్లోని ఓ భాగం. నేను దీన్ని నమ్మలేదు. దీన్నేం చేయాలని నువ్వు అనుకుంటే అది చేయచ్చు.
అతను ఆ ఉత్తరాన్ని చదివి సన్నగా నవ్వి, ఆమె నడుం చుట్టూ చేతిని వేసి చెప్పాడు.
దీన్ని సీరియస్‌గా తీసుకోకు ఫ్రీడా.
అతను సాలోచనగా పైప్‌ని అందుకున్నాడు. దాన్ని వెలిగించబోయి ఆగి ఆ పెట్టెని తెరచి అందులోని రివాల్వర్ వంక చూసాడు. అతను తక్షణం తీసుకున్న నిర్ణయం ఫ్రీడాలో ఏ మూలో ఉన్న రవ్వంత అనుమానాన్ని పటాపంచలు చేసింది.
ఫ్రీడా! మనం ఈ సిగార్ పెట్టెని వెంటనే పోలీసుల దగ్గరకి తీసుకెళ్దాం పద.
ఇరవై నిమిషాల తర్వాత ఫ్రీడా ఇన్స్‌పెక్టర్ మార్క్‌కి దాన్ని గురించి వివరించింది. ఆ పెట్టె తెరచి అతను ఆ రివాల్వర్‌ని చూసి చెప్పాడు.
పాపులర్ మోడల్ రివాల్వర్. చాలా ఇళ్ళల్లో ఇది ఉంటుంది.
ఆ ఉత్తరాన్ని చదివాక పకపకా నవ్వి మార్క్ చెప్పాడు.
ఇలాంటి పిచ్చి ఉత్తరాలు తరచూ మా దృష్టికి వస్తుంటాయి. ఇవన్నీ మోసపూరిత నిందలు. ఐనా మేం వేటినీ వదలకుండా పరిశీలిస్తుంటాం. ఇందులో నిజం ఎంతుందో పది నిమిషాల్లో తేల్చుకోవచ్చు.

అతను ఆల్మా హత్యకేస్ ఫైల్‌ని ఫైల్ రేక్ లోంచి వెతికి తీసాడు. అందులో జిప్ లాక్ ఎవిడెన్స్ కవర్లో ఓ గుండు ఉంది.
ఇదే ఆల్మాని చంపిన గుండు. ఎక్స్‌క్యూజ్ మి. చెప్పి అతను ఆ కవరు, రివాల్వర్‌తో బయటకి వెళ్ళాడు.
నాలుగైదు నిమిషాల్లో తిరిగి వచ్చి చెప్పాడు.
మీరు తెచ్చిన రివాల్వర్‌లో గుండుని పేల్చి ఆల్మాని చంపిన గుండుతో పరిశీలించే ఏర్పాటుని చేసాను. బాలిస్టిక్ నిపుణులు పది నిమిషాల్లో ఆ గుళ్ళు మేచ్ అయ్యాయో లేదో చెప్తారు. మా వాళ్ళు ఎన్నడూ పొరపాటు చేయరు.
ఐదు నిమిషాల తర్వాత బేస్‌మెంట్లోంచి రివాల్వర్ పేలిన శబ్దం వాళ్ళకి వినిపించింది. వెంటనే మార్క్ చెప్పాడు.
అది మీరు తెచ్చిన రివాల్వర్ శబ్దం ఫ్రీడా. కాటన్ వేస్ట్ పెట్టెలోకి దాన్ని పేల్చారు. ఓ రివాల్వర్ లోంచి పేల్చిన గుండు మీది గుర్తులు ఒకేలా ఉంటాయి. వాటిని బట్టే పోల్చి ఓ గుండు ఓ రివాల్వర్ లోంచి పేల్చబడిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే.
ఫ్రీడా డెక్సటర్ వంక చూసింది. అతను ఎంతో ప్రశాంతంగా సిగార్ కాలుస్తూ కనపడ్డాడు. తనలోని స్వల్ప ఆందోళన కూడా అతనిలో లేదు అనుకుంది. ఆ గుండు తను తెచ్చిన రివాల్వర్‌కి మేచ్ అవుతుందా, లేదా అన్న దాని మీద తమ ఇద్దరి భవిష్యత్ ఆధారపడి ఉంది అనుకుంది.
కొద్ది సేపటికి బాలిస్టిక్ నిపుణుడు ఆ రివాల్వర్‌తో వచ్చి చెప్పాడు.
రిలాక్స్! మేచ్ కాలేదు. ఎవరో మీ ఇద్దర్నీ విడగొట్టాలనే ప్రయత్నం కోసం దీన్ని పంపినట్లున్నారు.
రివాల్వర్‌ని తిరిగి మార్క్‌కి ఇచ్చి అతను వెళ్ళిపోయాడు.

నేను చెప్పాగా పిచ్చి వాళ్ళ పనని. మీరు చేసింది సరైన పని మిస్టర్ డెక్సటర్. మీరు దీన్ని మా దగ్గరకి తీసుకురావడం ఒక్కటే మీరీ పరిస్థితుల్లో చేయాల్సింది. మీరీ రివాల్వర్ తీసుకువెళ్ళచ్చు. ఇంక అంతా మర్చిపోవచ్చు.
డెక్సటర్ ఆ రివాల్వర్‌ని మళ్ళీ పెట్టెలో ఉంచాడు. అది చూసిన ఫ్రీడా గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోసాగింది. దీని గొట్టం కొద్దిగా చిన్నది కాబట్టి ఆ రివాల్వర్ ఆ పెట్టెలో ఇరుకుగా కూర్చోలేదు. అటు ఇటు కొద్దిగా ఖాళీ కనిపించింది. తను పాకెట్‌ని కదిపినప్పుడు చప్పుడు కాలేదు. ఇప్పుడు వస్తోంది. అది తను డెక్సటర్‌కి ఇచ్చిన రివాల్వర్ కాదని ఇట్టే గ్రహించింది.
పద ఫ్రీడా. అతను ఆ పెట్టెని కోటు జేబులో ఉంచుకుని చెప్పాడు.
లేదు. ఇప్పుడు కాని, ఎప్పుడు కాని నీతో రాను. అరిచింది.
మార్క్, డెక్సటర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూసారు.
ఏమైంది మిస్ ఫ్రీడా? మార్క్ అడిగాడు.
డెక్సటర్. ఇది నాకు పోస్ట్‌లో వచ్చిన రివాల్వర్ కాదు. నువ్వు ఇక్కడికి రాబోయే ముందు టోపీని, కోటుని తీసుకోవడానికి రివాల్వర్‌తో లోపలకి వెళ్ళావు. లోపల నువ్వు రివాల్వర్‌ని మార్చావు. ఇప్పుడు నీ ఇంట్లో వెదికితే, ఈ పెట్టెలో ఆ దొంగ పంపిన రివాల్వర్ దొరుకుతుంది. ఆమె డెక్సటర్‌ని కోపంగా చూస్తూ చెప్పింది.

(అలెన్ వాన్ ఎల్‌స్టన్ కథకి స్వేచ్ఛానువాదం)

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles