మహిమాన్వితం పబ్బతి ఆంజనేయస్వామి


Sun,January 6, 2019 12:28 AM

DARSHANAM
చెట్టు తొర్రలోంచి స్వయంభువుగా పుట్టి, భక్తుల పాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు పబ్బతి ఆంజనేయస్వామి. శాంతమూర్తిగా అవతరించిన ఆంజనేయుడు తన మహిమలతో భక్తుల కోరికలు తీరుస్తూ లంబాడీ, చెంచులకు ఆరాధ్యదైవంగా పేరుగాంచాడు. ఆయన మహత్యంతో ఏడాది పొడవునా ధుని వెలుగుతుంటుంది. అత్యంత నియమనిష్టలతో స్వామివారి మాల ధరించి మండల దీక్షచేస్తే మంచి జరుగుతుందని గిరిజనులు నమ్ముతారు. తన మహిమాన్విత శక్తితో భక్తుల ఇష్టదైవంగా పూజలందుకుంటున్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం.

- అన్వేషిక

ఎక్కడ ఉంది?: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 186 కి.మీ, మహబుబ్‌నగర్‌కు 147కి.మీ, అచ్చంపేటకు 70 కి.మీ దూరంలోని నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలోఉంది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలుకు అర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి ఆర్టీసీ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా మద్దిమడుగు చేరుకోవచ్చు.

స్థల పురాణం: పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలుతుక్కుంటూ వుండేవారట. వారు బట్టలు పిండి పక్కనేవున్న బండమీద వేసేవారుట. అలా వేసినప్పుడల్లా వేసినవారికి కాళ్ళు నెప్పులూ వగైరాలతో బాధపడేవారట. ఏమిటా అని ఒకసారి ఆ రాతిని పరిశీలనగా చూస్తే స్వామి ఆకారం కనబడిందట. వెంటనే తమ తప్పు తెలుసుకుని, ఆ విగ్రహాన్ని నిలబెట్టి, దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేసి, అక్కడ దొరికిన సామాగ్రితో నాలుగు గోడలు, పైన కప్పు వేశారట. సరిగా లేకపోవటంవల్ల ఆ గోడలు, కప్పూ కూలినా, స్వామి విగ్రహానికి ఏమీ కాలేదుట. ఇంకొక కథనం ప్రకారం, స్వామి స్వయంభువు. చెట్టు తొఱ్ఱలోంచి ఉద్భవించారు. నైఋతి దిక్కుగా, కొంచెం వంగినట్లు వుండే స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నంచినా కుదరలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే వుంటుంది. ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది శ్రీ మానిసింగ్ బావూజీ వల్ల. ఈ ఆలయంలో ఆ బావూజీ ఫోటో కూడా వుంది. ఆ బావూజీనే ఆలయం వెలుపల ధుని ఏర్పాటు చేశాడు. ఆ ధుని అలాగే 365 రోజులూ వెలుగుతూనే వుంటుందట. అది స్వామి మహత్యం అని చెబుతారు. ఇక్కడ వుండే లంబాడీవారికీ, చెంచులకీ ఈ స్వామి మీద అపరిమితమైన భక్తి.

ప్రత్యేకతలు: పబ్బతి అంటే గిరిజనుల భాషలో ప్రసన్న, శాంతమూర్తి అని అర్థం. ఇక్కడికి వచ్చేవారు ఇక్కడి హోమగుండంలో గోధుమ పిండి, బెల్లం కలిపిన ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. దీన్ని మలేజా అని పిలుస్తారు. దానిని ఇక్కడికొచ్చిన ప్రతివారూ ధునిలో నివేదన చేస్తారు. ఇదేకాక స్వామికి పాదుకలు సమర్పించటం కూడా ఇక్కడి భక్తులకు అలవాటు. శనివారంనాడు ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తా రు. ఇక్కడే వండుకుని తిని, రాత్రి నిద్ర చేసి మరునాడు వెళ్తారు.

దేవాదాయ శాఖవారి నిర్హహణ: శ్రీ హంపీ పీఠాధిపతి ఇక్కడి స్వామిని పునః ప్రతిష్టించారు. స్వామికి కుడిపక్కన ఎదురుగా శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామిని ప్రతిష్టించారు. కొద్దికాలం క్రితం దేవాదాయశాఖ వారు ఈ ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని అభివృధ్ధి చేస్తున్నారు. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా హనుమద్గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం 4-30 నుంచి 1 గంటదాకా, మళ్ళీ సాయంత్రం 3 గంటలనుండీ 9 గంటలదాకా దర్శన సమయాలుంటాయి.

గిరిజనులు అమిత విశ్వాసంతో కొలిచే ఈ స్వామి ఆలయానికి హైదరాబాదునుంచీ రోజూ మూడు బస్సులు నడుస్తుంటాయి. దేవరకొండ, అచ్చంపేటల నుంచి కూడా బస్సులున్నాయి.

దీక్షలు

1992లో గురుస్వామి జయరాం ఆధ్వర్యంలో 15మంది భక్తులతో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్ష ప్రారంభమైంది. చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రజలు ఇక్కడకు వచ్చి కార్తీక మాసంలో ఈ దీక్ష స్వీకరిస్తారు. మాలలు ధరించి ఈ దీక్షను చేపట్టిన స్వాములు 41రోజులు నియమనిబంధనలతో ప్రతి రోజు తెల్లవారుజామున, సాయంత్రం చన్నీటి స్నానం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టి, దీక్షా కాలం మద్దిమడుగులో జరిగే మహాయజ్ఞంలో పాల్గొంటారు.

360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles