వాస్తు


Sun,January 6, 2019 01:55 AM

vasthu

యాగాన్ని (యజ్ఞం) ఎక్కడైనా చేసుకోవచ్చా? వ్యవసాయ భూమిలోనే చేయాలా?

ఎమ్.రజినీ, మంచిర్యాల
యజ్ఞం ఎక్కడైనా చేయవచ్చు. చేసే యాగాన్ని బట్టి స్థలం ఎంతమేరకు అవసరం అనేది ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామందికి యజ్ఞాలపైన ఒక అవేర్‌నెస్ ఏర్పడుతున్నది. ఇది మన సనాతన భారతీయ ఆర్య సంస్కృతిలోని గొప్ప ప్రక్రియ. నేటి ఆధునిక భారతం కాదు. ప్రపంచం కూడా అర్థం చేసుకొని పర్యావరణ ప్రక్షాలనా కార్యం మన ఋతు పవనాలను వేగవంతం చేసి క్రమబద్ధం చేసే మహోన్నత శాస్త్రీయ ప్రక్రియ. మీరు ఇంటివద్ద స్థలం ఉన్నా చేసుకోవచ్చు. అయితే యజ్ఞ కుండాలను ఒక సమయంలో యజమాని హస్త ప్రామాణిక కొలతలో నిర్మించాల్సి ఉంటుంది. స్థలం తప్పక దిశానుకూలంగా చేసుకొని నిష్ఠతో చేసే వారితో చేయించడం చేసేవాళ్లు త్రికరణ శుద్ధిగా చేయడం అవసరం. ఏదైనా కృత్రిమంగా కాక సహజసిద్ధ యజ్ఞ హవిస్సులు వాడడం, యాగశాల నిర్మాణం జాగ్రత్తగా చేయడం తెలుసుకొని చేయండి. మీరే కాదు అందరూ చేయవచ్చు.

మా ఇంట్లో పడమరలో అంతా పెద్ద బండ ఉంటే దానిని అలాగే ఉంచి బెడ్‌రూమ్స్ ఎత్తుమీద కట్టాము. మంచిదేనా?

వి.రామసుబ్బారెడ్డి, ఫిల్మ్‌నగర్
చాలామంది నైరుతి ఎత్తు గొప్పది ఈశాన్యం పల్లం మహా గొప్పది అనుకుంటారు. వాటికీ ఒక విధానం ఉంటుంది. శిలలు, ఎప్పుడూ జారిపడే కొండమీద ఇల్లు కడితే ఎలా ఉంటుంది. ఆ కొండ నైరుతే కావచ్చు ఒప్పుకుందామా? పెద్ద మోటబావి ఈశాన్యంలో ఉంటుంది దానిని ఆనుకొని ఇల్లు కట్టుకుంటామా? బత్తాయి రసం గొప్పదే.. రోజుకు పదిగ్లాసులు తాగితే విరేచనాలు పెట్టి హాస్పిటల్‌లో పడతారు ఎవరైనా. అతి సర్వత్ర వర్జ్యయేత్) ఎక్కువ ఏదీ పనికిరాదు. దీనినే శాస్త్ర దృక్పథం అంటారు. మీరు పంపిన ప్లాన్ చూసాను పడమర, నైరుతి దాదాపు ఐదు ఫీట్లు పెంచి కట్టారు. కారణం దాని కింద అంత ఎత్తు బండ ఉంది కాబట్టి తద్వారా ఆ దిశ ఎత్తు అయింది. కానీ ఇంటికి పడమర, నైరుతి తెగిపోయింది కదా.. ఇంటిలోపల నిజానికి హెచ్చుతగ్గులు పెట్టి ఇల్లు కట్టవద్దు. కొన్ని అనివార్య పరిస్థితులలో వాణిజ్య స్థలాలలో నిర్మాణాలలో అలా పెంచవలసి వస్తుంది. అది కూడా అంగుళాలు మందంలో మాత్రమే. మీరు ఆ కొండ భాగాన్ని (ఫ్లోరింగ్) తొలగించండి లేదా అంత ఎత్తు ఇంటి మొత్తాన్ని నింపండి. పై మేడలను సవరించుకొని కింద గోడౌను చేసుకొని పైన నివాసం ఉండండి లేదా గృహం తక్షణం మార్చండి.

ఇంటిమీద ధ్వని ప్రభావం ఉంటుందా? మా ఇల్లు రైల్వేస్టేషన్ దగ్గరలో ఉంది.

మచ్చ సోమయ్య, కొరటికల్, ఆలేరు
శబ్దమే.. శక్తి శబ్దమే, దైవం... శబ్దమే మానవ మహోన్నత విజయ రహస్యమే. ధ్వనిని కూడా ఒక విద్యుత్తుగా సైన్స్ అంగీకరించింది. కానీ అంతకన్నాముందే మన ఋషి జ్ఞానం విద్యుత్తుకు పునాది శబ్దం అని, పంచభూతాలలో మొదటిది శబ్దమని, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని పంచభూతాల సృష్టి క్రమాన్ని తెలిపారు. ఇంటిమీద కాదు ఇంట్లో , శబ్దం ప్రభావం మిక్కుటంగా ఉంటుంది. ఈ కాలుష్యం చేసే బీభత్సంలో మనస్సు వికలం అవుతుంది. శబ్ద ప్రభావంతో రాక్షసుడు మనిషి అవుతాడు. మనిషి (గొప్పవాడు) రాక్షసుడు అవుతాడు ప్రధానంగా చిన్న పిల్లలమీద శబ్ద ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇల్లు సౌండ్ ప్రూఫ్‌గా మార్చుకోండి. లేదా మంచి ఇంట్లోకి మారండి.

చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా? స్థలం మార్చాలా?

మారేడు కౌసల్య, కీసర
శిథిలమైన ఆలయాలు పునర్నిర్మాణం చేయడం అనివార్యం. వాటిని కాపాడుకోవడం అంటే మన జాతి సంపదను కాపాడుకోవడం. ఒక్కో ఆలయానికి ఒక్కో విధంగా కట్టడం ఉంటుంది. ఆగమాన్ని బట్టి ఆయా గర్భగుడుల వైశాల్యం విగ్రహ ప్రతిష్ఠాప స్థానాలు మారుతుంటాయి. మీరు ఏ ఆలయం కట్టాలనుకుంటున్నారో తెలుపలేదు. ఆలయం పూర్తిగా జార్గమయి (శిథిలం) ఉంటే తప్పక తొలగించి కట్టండి. స్థలం మార్చాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలోనే కట్టుకోవచ్చు. లేదా స్థలం కూడా మార్చవచ్చు. తప్పనిసరికాదు. కొన్ని ఆలయాలు స్వయంభువులుగా ఉంటాయి. అలాంటి ఆలయ నిర్మాణాలలో బాగు చేయాల్సి వస్తే తప్పనిసరిగా అదే స్థలంలో మూలవిరాట్టును (స్వయంభువు)ను మార్చకుండా ఆలయనిర్మాణాన్ని తిరిగి గొప్పగా పునరుద్ధరించవచ్చు. మనం యాదగిరి (యాదాద్రి) గుట్టను అలాగే బృహత్తరంగా చేసుకుంటున్నాము. మీరు ఆలయ నిర్మాణ నిపుణుల సూచనలు, సలహాల మేరకు అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా నిర్మాణం చేసుకోండి.


sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

329
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles