కోటి ఆశలు.. కొత్త ఏడాది!


Sun,December 30, 2018 01:14 AM

new-year-2019
ఈరోజు .. రేపు.. దాటితే.. మనం ఈ పాతను వొదిలి కొత్తలోకి పోతాం. కొత్త అంటే డైరీలు.. క్యాలెండర్ల పేజీలు.. మారడం మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం.. కొత్త ప్రణాళికలు వేసుకోవడం.. కొత్త పనులు ప్రారంభించడం..ఇలాంటివెన్నో ఉంటాయి. కొత్త సంవత్సరం మార్పునకు మెట్టు లాంటిది. అలాంటి మెట్లను మనం ఎన్ని ఎక్కుతున్నాం? ఎలా ఎక్కుతున్నాం? కొత్త ఆనందాన్ని దేంట్లో వెతుక్కుంటున్నాం? చెక్‌చేసుకొని ఈ కొత్త సంవత్సరం నుంచి జీవితపు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్!

- దాయి శ్రీశైలం, సెల్: 8096677035

new-year-20191
శ్రీనివాస్ ఇంజినీరింగ్ ఫైనలియర్‌లో ఉండగానే మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్నెళ్లకే చాలా బిజీ అయిపోయాడు. ఫ్రెండ్స్.. రిలేషన్స్ అక్కడితోనే ఆగిపోయాయి. ఇప్పుడు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్.. టాబ్లెట్స్.. సెల్‌ఫోన్స్. పొద్దున్నే లేచీ లేవగానే ల్యాప్‌టాప్ ముందరేసుకొని ఏదో చేస్తూ ఉంటాడు. టైమ్ అవ్వగానే రెడీ అయి ఆఫీస్‌కు వెళ్లిపోతాడు. నైట్ ఇంటికొచ్చి ఎవర్నీ పలకరించకుండానే పడుకుంటాడు. ఇంతవరకు బాగనే ఉందికానీ.. క్రమంగా ఈ జీవనశైలి అతడికి సమస్యగా మారింది. ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసింది. దీన్నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకొని గత కొత్త సంవత్సరం నుంచి నిశ్చయించుకున్నాడు. కట్ చేస్తే.. ఈ 363 రోజుల్లో అతడిలో చాలా మార్పు వచ్చింది. కొత్త నిర్ణయం ఫలించి.. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇది కదా అసలైన కొత్త సంవత్సరం అంటే.

new-year-20192
సుజాత డిగ్రీ వరకు చదువుకున్నది. ఏదో చేయాలనే తపన ఉండేది. కానీ.. పెండ్లి.. పిల్లలు.. సంసారం బాధ్యల్లో మునిగిపోయి కెరీర్‌కు ఆప్షన్ లేకుండా పోయింది. పొద్దున పదింటికల్లా భర్త ఆఫీస్‌కు.. పిల్లలు స్కూల్‌కు వెళతారు. సుజాత ఆ పనీ.. ఈ పనీ చేసేసుకొని టీవీ ముందు కూర్చునేది. డైలీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం పొందేది. అదే దినచర్యగా అలవాటైపోయిందామెకు. ఒక్కోసారి ఆత్మవిమర్శ చేసుకొని నేను చదివిన చదువు ఏంటి? చేస్తున్న పని ఏంటి? అని ప్రశ్నించుకునేది. కెరీర్‌కు ఆప్షన్ లేకపోవడం కాదు.. తానే కొన్ని ఆప్షన్లు సృష్టించాలనుకున్నది. ఆన్‌లైన్లో జువెలరీ.. వన్‌గ్రామ్ గోల్డ్ డిజైనింగ్.. మార్కెటింగ్ నేర్చుకున్నది. కట్‌చేస్తే.. ఇప్పుడు ఆమె సొంతంగా ఒక బొటిక్ ఏర్పాటుచేసింది. దానికి కొత్త సంవత్సరాన్నే వేదికగా మార్చుకొని కొత్త జీవితం ప్రారంభించింది.

new-year-20193

కొత్త ఆశలతో వెళ్లండి

Every new beginning comes from some other beginnings end.
ప్రతీ ప్రారంభం.. కొన్ని ప్రారంభాల ముగింపు నుంచి వస్తుంది అనే లైన్‌లో ఆలోచించి అడుగేయండి. పైన ఉదహరించిన ఇద్దరి విషయాల్లోనూ కామన్ పాయింట్ కొత్త జీవితం. అది ఎలా సాధ్యమైంది? కొత్త సంవత్సరం సందర్భంగా మార్పు అనే ఒక ఆలోచన ద్వారా. కాబట్టి కొత్త సంవత్సరం ఉత్సవాలు మార్పు వేదికగా జరిగితే బావుంటుంది. థర్టీఫస్ట్ నైట్ ఉత్సవాలను సంవత్సరాంతం వేడుకలుగానే కాకుండా ఇంకో సంవత్సరానికి ఆరంభంగా సెలబ్రేట్ చేసుకుంటే కొంతలో కొంతైనా మార్పు ఉంటుంది.

new-year-20194

కొత్త పనులు ప్రారంభించండి

Every day is a new day, and youll never be able to find happiness if you dont move on.
ప్రతీరోజు కొత్త రోజే. అక్కడి నుంచి నువ్వు కదలకపోతే దాంట్లో ఉండే ఆనందాన్ని పొందలేవు అన్నమాట. అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. వీటివల్ల గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ప్లాన్ వేసుకొని చేసిన పని విజయవంతం అయితే అది ఇచ్చే సంతృప్తి మరో పనిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా రేపటి నుంచే కొత్త పనులు.. కొత్త పద్ధతులకు లైన్ క్లియర్ చేసుకోండి.

కొత్త పాలన అందిపుచ్చుకోండి

We like to change. A new lamp, a piece of art, can transform a room.
మార్పును కోరుకుంటే వెలుగును కోరుకున్నట్టే. కొత్త సంవత్సరం కానుకగా ఈ సారి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజా ప్రతినిధులు పాతవారే అయినప్పటికీ నూతనోత్తేజంతో పనిచేసే అవకాశం ఉన్నందున వారు కొత్త పాలనను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పాలనా ఫలాలను పొందేందుకు.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజలు ఆసక్తిగా.. ఉత్సాహంగా ఉన్నారు. పాలకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త పదవీ బాధ్యలు చేపట్టి.. నూతన పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కొత్త బంగారులోకం నిర్మించుకోండి

True happiness comes from the joy of deeds well done, the zest of creating things new.
పనిని విజయవంతం చేయడం వల్ల కలిగే ఆనందం వేరు. ఇది ఇంకో కొత్త అభిరుచికి.. కొత్త ఆకాంక్షకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి జీవితంలోని ప్రతీ సందర్భాన్ని.. సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ చేయాలి. అలా ప్రతి పనినీ ఇష్టపడి చేస్తేనే జీవితం సంపూర్ణంగా అనుభవించవచ్చు. ప్రతీ పనిని ఇష్టపడి చేయండి. అలా చేయడం వల్లనే ఆ పనిలోని మాధుర్యం తెలుస్తుంది. శ్రద్ధగా చేయడం వల్ల.. బుద్ధిగా ఉండటం వల్ల కొత్త బంగారు లోకాన్ని నిర్మించుకోవచ్చు.

కొత్త అవకాశాలు పొందండి

You get a new year, you get a new start, you get a new opportunity.
కొత్త సంవత్సరాన్ని పొందడమంటే కొత్త పనిని ప్రారంభించడం.. కొత్త అవకాశాలను పొందడమే. కానీ పని ప్రారంభం కావాలంటే ముందు కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్‌తో పనిచేస్తే ఎలాంటి పనినైనా పూర్తిచేయొచ్చు. దీనివల్ల అవకాశాలను మనం వెతకడం కాకుండా.. అవకాశాలే మనల్ని వెతుక్కొని వస్తాయి. ఒకపని దిగ్విజయంగా పూర్తి చేయడం వల్ల వచ్చిన మరొక కొత్త అవకాశాన్ని పొందడంలో ఉండే ఆనందం మరెక్కడా దొరకదు. కాబట్టి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

new-year-20195

కొత్త దారి వెతుక్కోండి

New roads; new ruts
కొత్త దారిలో వెళితే కొత్త జాడలు కనిపిస్తాయి. విజయవంతంగా జీవితం అనుభవించాలంటే మూస ధోరణి పనికిరాదు. మేం ఇలానే చేస్తాం.. ఇలానే ఉంటాం. మావాళ్లు ఇలాగే ఉండేవాళ్లు అని కాకుండా ప్రతీ విషయంలో అప్‌డేట్ కావాలి. ఎప్పుడూ ఒకేరీతిలో.. ఒకే దారిలో వెళ్లడం కన్నా కొత్త దారిలో వినూత్న రీతిలో వెళితే ఫలితాలు ఆశావహంగానే ఉంటాయి. కొత్త దారులు వెతుక్కోవడం అంటే పాతను నిర్లక్ష్యం చేయడం కాదు. రూట్ మార్చాలి.. మార్చిన రూట్‌లో వినూత్న రీతిలో వెళ్లడం అన్నమాట.

పాతను మర్చిపోండి

Forgiveness says you are given another chance to make a new beginning.
మర్చిపోవడం అనేది కొత్త ఆరంభానికి అవకాశం లాంటిది. కాబట్టి గతాన్ని డిసెంబర్ 31వ తేదీ నుంచే మర్చిపోండి. కానీ మనవాళ్లు ఏం చేస్తారు? డిసెంబర్ 31వ తేదీన భలే ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు గ్యాప్ తీసుకుంటారు. మరలా పాతకథే నడుస్తుంది. అలా కాకుండా ఈ జనవరి 1 వచ్చేనాటికి పాత అలవాట్లు.. పాత పద్ధతులు.. పాత ఆలోచనలు అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసుకోవడం కన్నా మంచి పని వేరే ఇంకేదీ లేదు.

భయం వీడండి

Just try new things. Dont be afraid. Step out of your comfort zones and soar, all right?
కొత్త వాటికోసం ప్రయత్నించేటప్పుడు భయపడొద్దు. అలా చేస్తేనే సౌకర్యవంతమైన పరిధిలోకి వెళ్లగలుగుతాం. వాస్తవంగా మార్పు సాధించాలంటే కొంతం ధైర్యం అవసరమే. సాహసమూ కావాలి. ఎందుకంటే డిసెంబర్ 31 దాకా ప్రతీది మన జీవితంతో ముడిపడి ఉన్న సంఘటనే కాబట్టి. కానీ మనం ఎంచుకున్నది అది కాదు అని గ్రహిస్తే మాత్రం పాతను తరిమికొట్టాల్సిందే. అలా చేయాలంటే ముందు భయపడొద్దు. భయాన్ని వీడి వేసిన ఏ అడుగు విఫలం కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

మందే మార్గం కాదు

Alcohol is not the only way.
కొత్త సంవత్సర వేడుకలు ఎంత ఘనంగా జరిపాం అనేది కొలవడానికి మద్యం తూకమేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కూ.. మద్యానికి విడదీయరాని బంధం ఏర్పరిచారు మనోళ్లు. కాబట్టి ఉత్సవానికి మందే మార్గం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అతి ఏదైనా అనర్థమే. కాబట్టి అనివార్యం అనుకుంటే ఓ మోతాదు పాటించండి. కొత్త సంవత్సరం నుంచి తాగడం ఆపేస్తా కాబట్టి ఈ ఒక్కరోజు ఫుల్టుగా తాగుదాం అనే ఆలోచన వీడండి. మందు అనేది ఒక చాయిస్ మాత్రమే. అది కచ్చితంగా తీసుకోవాల్సిన పదార్థం అయితే కాదు.

new-year-20196

కొత్త లెక్కలు వేసుకోండి

With the new day comes new strength and new thoughts.
కొత్త రోజు నుంచే కొత్త శక్తి.. కొత్త ఐడియాలు వస్తాయి. ప్రతి ఒక్కరికీ జీవితంపై.. చేసే పనులపై ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే అందరూ నడుచుకుంటారు. ఒక్కసారి లెక్క తప్పితే దారి కూడా తప్పుతుంది. కాబట్టి ఏ లెక్కా తప్పకుండా కొత్త సంవత్సరం నుంచి మరోసారి మన లెక్కలన్నీ వేసుకుందాం. అంతా సజావుగానే సాగుతున్నా కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల.. మిస్ గైడెన్స్ వల్ల లెక్కలు తప్పవచ్చు. అందుకోసమే కొత్త రెక్కలతో ఊరేగుతూ కొత్త లెక్కలు అంటే కొత్త పునాదులు వేసుకొని ముందుకెళ్లాలి.

new-year-20197

అనాథలను అక్కున చేర్చుకోండి

Help the orphans.
జీవితం ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచే మొదలుపెడితే సక్సెస్ సాధించవచ్చు. మీకు మంచి అవకాశాలు వచ్చాయనిగానీ.. సంపదలు సిద్ధించాయనిగానీ వెలితి పడొద్దు. వాటిలో నుంచి పక్కోడికి పావలా స్థాయిలోనైనా సాయం చేస్తే వాడూ మనగలుగుతాడు. కాబట్టి ఈసారి నుంచి న్యూ ఇయర్ వేడుకలను అనాథ ఆశ్రమాల్లో.. వృద్ధాశ్రమాల్లో చేసుకోండి. మాకు ఎవరూ లేరు.. మేం అనాథలం అనే భావన వాళ్ల నుంచి తీసేసీ మీకు మేమున్నాం.. సాటి మానవుడిగా స్పందిస్తాం అనే భరోసాను కల్పించండి. జీవితం సార్థకత అవుతుంది. కొత్త సంవత్సరానికి అర్థం ఉంటుంది.

new-year-20198

ఆత్మీయులతో గడపండి

Stay with your people.
దేన్నీ ఆస్వాదించకుండా.. ఏ పద్ధతీ పాటించకుండా.. ఇలాగే ఉంటా అంటే మాత్రం ఎవరూ ఏం చేయలేరు. కానీ ఒక్క విషయం.. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక రీతిలో తన అనుభవాలు.. ఆనంద క్షణాలు గుర్తుకొస్తాయి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఖాళీ కనిపించిందనుకోండి.. ఆ జీవితం విఫలం అయినట్టే. కాబట్టి దొరికిన ప్రతీ క్షణాన్ని అందిపుచ్చుకొని అందరితో ఆత్మీయంగా గడపండి. స్వార్థం.. ద్వేషాలకు ఏమాత్రం తావులేకుండా ఈ కొత్త సంవత్సరం నుంచి ఆత్మీయ జీవితాన్ని ఏర్పరచుకోండి.

907
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles