ఆ కాలపు తెలంగాణ చరిత్ర కందూరి చోడుల పాలన


Sun,December 30, 2018 12:44 AM

(క్రీ.శ. 1040-1290)

PANAGALLU
కందూరి చోడుల చరిత్రను ఆ కాలపు తెలంగాణ చరిత్రగా భావించవచ్చని ప్రముఖ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి రాశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం ప్రాంతంలోని కొన్ని భాగాలను ఏఱువ చోడులు, కందూరు చోడులు పాలన సాగించారు. క్రీ.శ. 1040 నుంచి 1290 వరకు సుమారు 250 సంవత్సరాలపాటు వీరు పాలించారు. వీరు కొంత కాలం కల్యాణీ చాళుక్యులకు, కాకతీయులకు సామంతులుగాను, ఇంకొంత కాలం స్వతంత్రులుగా, మరికొంత కాలం మహామండలేశ్వరులుగాను పాలన సాగించారు.

నగేష్ బీరెడ్డి
సెల్ : 80966 77 177

250 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన కందూరి చోడులు అనేక దేవాలయాలు నిర్మించారు. ప్రజాహిత కార్యాలు చేపట్టారు. వారి కాలంలో
నిర్మించిన దేవాలయాలు నల్లగొండ, పెరూరు, వర్ధమానపురం, కొలనుపాక, గంగాపురం, రాచూరు, పరడ, వల్లాల, ఆకారం మొదలగు ప్రాంతాల్లో నేటికీ కనిపిస్తున్నాయి.

తెలుగు చోడ వంశంలోని ఒక శాఖ వారే ఈ కందూరు చోడులు. వీరి పూర్వనామం ఏఱువ చోడులు. ఏఱువ నాడును పాలించినందుకుగాను వీరికి ఆ పేరు వచ్చింది. ఏఱువనాడు ప్రాచీనాంధ్రదేశ విభాగాలలో ఒకటి. ఏఱువ నాడు కమ్మనాటికి పడమరన, పాకనాటికి పశ్చిమాన, పలనాటి సీమకు వాయవ్యాన ఉంటుంది. కృష్ణానదికి దక్షిణాన కర్నూలు మండలంలోని ఆత్మకూరు, మార్కాపురం, దోర్నాల ప్రాంతాలు, కృష్ణానదికి ఉత్తరానవున్న మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం మండలాల్లోని కొన్ని భాగాలను కలుపుతూ పూర్వం ఏఱువ సీమ అనేవారు. నల్లగొండ దుర్గానికి ఏఱువ సింహాసనం, ఏఱువ పీఠం అనే పేర్లున్నట్లు శాసనాల్లో కనిపిస్తుంటుంది. దీని పరిధిలో మొదట చాలా ప్రాంతాలు ఉన్నా కాలక్రమంలో కృష్ణానది ఉత్తర, దక్షిణ ప్రాంతాలకే ఏఱువ నాడు పరిమితమైంది.

ఎవరీ కందూరి చోడులు?

చోడ(ళ) వంశీయులందరూ సుప్రసిద్ధుడైన చోళరాజు కరికాల చోడుని సంతతి వారని శాసనాలు చెబుతున్నాయి. చోళ సామ్రాజ్యం 13వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యులది. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తోంగ చోళుడు ఈ చోళ రాజులలో ప్రముఖులు. ఈ సామ్రాజ్యం కావేరి నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. తెలుగునాట విస్తరించిన చోళులు తెలుగు చోడులుగా చలామణి అయ్యారు. తెలుగు చోడ వంశీయుల్లో రేనాటిచోడులు, పొత్తపి చోడులు, కొణిదెన చోడులు, నెల్లూరు చోడులు, వెలనాటి చోడులు, ఏఱువ చోడులు(కందూరు చోడులు) ముఖ్యులు. చోళ సామ్రాజ్యం 10 నుంచి 12 శతాబ్దాలలో ఉచ్ఛస్థితిని పొందింది. 12వ శతాబ్దంలో పాండ్య రాజులు, 13వ శతాబ్దంలో హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్రమంగా క్షీణించసాగింది.

కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం వైదుంబరాజుల ఆధీనంలో ఉండేది. ఈ ప్రాంతాన్నే ఐజె మండలం అని కూడా అంటారు. తుంగభద్రా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాలను తెలుగు చోడ వంశీయులు పాలిస్తుండేవారు. సబ్బి మండలం, కొఱవి సీమ, హనుమకొండ విషయము కాకతీయ వంశీయుల ఆధీనంలో ఉండేవి. ఈ మాండలిక రాజులు, మహామండలేశ్వరులు కల్యాణీ చాళుక్య త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని సామంతులుగా ఆయా ప్రాంతాలను పాలిస్తూ చక్రవర్తికి కప్పం చెల్లిస్తుండేవారు.
PANAGALLU1
కందూరి చోడుల చరిత్ర కల్యాణీ చాళుక్య చక్రవర్తియైన త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని కాలం నుంచి తెలుసుకొనేందుకు వీలవుతున్నది. ఆరో విక్రమాదిత్యుడు మిక్కిలి సమర్థవంతుడైన రాజు. క్రీ.శ. 1076లో ఇతడు చోళ సింహాసనాన్ని అధిష్టించాడు. తన విధేయులను, సమర్థులైన వారిని మాండలిక రాజులుగా, సామంతరాజులుగా ఆయా ప్రాంతాల్లో నియమించి సామ్రాజ్యాన్ని పాలించాడు. తెలంగాణలో కందూరు చోడులు, కాకతీయులు మొదట కల్యాణీ చాళుక్యులకు సామంతులుగా, మహామండలేశ్వరులుగా ఉన్నారు. అటు తర్వాత కాకతీయ సామ్రాజ్యం విస్తరించే కొలదీ కందూరు చోడరాజ్యం తన ప్రాభవాన్ని కోల్పోయి కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైపోయింది.

ఆరో విక్రమాదిత్యునికి యుద్ధంలో సహకరించినందుకు ఏఱువ రెండో భీమరాజుకు చాళుక్య త్రిభువనమల్ల కొలనుపాక 7000 గ్రామాలకు తోడు, కందూరు నాడు 1100 గ్రామాలను పాలించేందుకు నియమించాడు. అప్పటి నుంచే ఏఱువ చోడులకు కందూరు చోడులు అనే పేరు వచ్చింది. ఇతని తరువాత ఈ వంశీయులు క్రీ.శ. 1290 వరకు కందూరు రాజ్యాన్ని పాలించారు. ఏఱువ మొదటి భీముడి నుంచి రామనాథ దేవ చోడమహారాజు వరకు 17మంది రాజులు పాలించారు.వీరి రాజధానులుగా వర్ధిల్లిన కొలనుపాక, పానుగల్లు (పానగల్) పట్టణాలు నల్లగొండ మండలంలో ఉన్నాయి. కందూరు, కోడూరు, వర్ధమానపురం మహబూబ్‌నగర్ మండలంలో ఉన్నాయి. కొలనుపాక, పానగల్లు, కందూరు, వర్ధమానపురం, కోడూరులు వీరి ముఖ్యపట్టణాలు. కృష్ణా మండలంలోని కొండపల్లి దుర్గం, దాని పరిసర ప్రాంతాలు, ఖమ్మంలోని నేలకొండపల్లి సీమ, నల్లగొండ మండలం, మహబూబ్‌నగర్ మండలంలోని కొన్ని ప్రాంతాలు కొలనుపాక ఏడు వేల పరిధిలోకి వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం కోసం నల్లగొండ మండలంలోని పెరూరు ప్రాంతం, వంగూరు ప్రాంతాన్ని కూడా కందూరు నాడులో చేర్చారు.

కల్యాణీ చాళుక్యరాజ్యం అంతరించిన పిదప ఈ వంశీయులలో ప్రసిద్ధుడైన ఉదయనచోడ మహారాజు కుమారుడు భీమదేవ చోడుడు కల్యాణీ రాజ్య వైభవాన్ని కొంతకాలం అనుభవించాడు. కాకతీయ రుద్రుని కాలం నుంచి కందూరి చోడ రాజ్యం క్షీణించసాగింది. కాకతీయ గణపతిదేవుని కాలంలో వర్ధమానపురం గోన వంశీయుల వశమైంది. కాకతీయ సామంతులుగా కందూరు చోడులు పానుగల్లు పరిసర ప్రాంతాలను మాత్రమే పాలించారు. గోకర్ణదేవ చోడుని అనంతరం కందూరు చోడులు నల్లగొండ మండలంలోని పానుగల్లు ప్రాంతానికి మాత్రమే పరిమితమై పాలించారు. కాకతి రుద్రమదేవి పరిపాలన అనంతరం కందూరి చోడ రాజ్యం అంతరించింది.
250 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన కందూరి చోడులు అనేక దేవాలయాలు నిర్మించారు. ప్రజాహిత కార్యాలు చేపట్టారు. వారి కాలంలో నిర్మించిన దేవాలయాలు నల్లగొండ, పెరూరు, వర్ధమానపురం, కొలనుపాక, గంగాపురం, రాచూరు, పరడ, వల్లాల, ఆకారం మొదలైన ప్రాంతాల్లో నేటికీ కనిపిస్తున్నాయి. స్థల, గిరి, వన, జలదుర్గాలు శిథిల రూపాల్లో ఉన్నాయి. ఉదయ సముద్రం, భీమ, చోడ సముద్రాలు, నమిలె కాలువ నేటికీ నిలిచి ఉన్నాయి.

వచ్చేవారం:
కందూరు చోడులు - తొలిరం నాయకులు

824
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles