నా స్వప్న లోకాల సౌందర్య రాశి


Sun,December 30, 2018 12:38 AM

పెదాలు తడారి, గొంతు ఎడారయ్యింది. కళ్లళో నీళ్లు తిరిగాయి. ఏండ్ల నీరీక్షణ అనంతరం ఇదేనా దేవుడా నాకిచ్చే బహుమతి అని కుమిలిపోయాను. కానీ దేవుడు కరుణించాడు. మా అపార, అజరామర ప్రేమ ముందు కష్టాలన్నీ బలాదూర్ అయ్యాయి.
love
నా మనసు మొత్తం స్వప్న మీదే ఉండిపోయింది. పాత జ్ఞాపకాల్ని రోజూ తవ్వుతూ ఎలాగైనా స్వప్నను పెండ్లి చేసుకోవాలనుకున్నాను. ఎన్నోసార్లు కాల్ చేశాను. కొన్ని రోజులకు ఆమె నంబర్ మార్చినట్లుంది.

తొమ్మిదో తరగతి నుంచి పదిలోకి అడుగుపెట్టాను. ఆ రోజే కొత్త పుస్తకాలిచ్చారు. అన్నింటికీ అట్టలు వేసి సాయంత్రం మంచి దస్తూరి కలిగిన స్వాతి వదినతో పుస్తకాలపై పేర్లు రాయించాలి. ఒక్క పేజీ కూడా చిరిగిపోకుండా పుస్తకాల్ని ఏడాది పాటు కంటికి రెప్పలా కాపాడాలి అనుకున్నాను. అప్పుడే టంగ్ టంగ్.. ఇంటర్వెల్.. ప్రాణానికి ప్రాణమైన కొత్త పుస్తకాల్ని బెంచీపై పెట్టేసి గ్రౌండ్‌లోకి పరిగెత్తాను. బెల్ మోగగానే క్లాస్‌లోకి పరిగెత్తాను. లోపలికి వెళ్లగానే పుస్తకాలన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయ్. కోపమొచ్చింది. ఏం చేయాలో తెలియక కన్నీటిని కండ్లలోనే దాచుకున్నాను. వెంటనే జీవశాస్త్రం క్లాస్ ప్రారంభమైంది. సార్ చెప్పేదేం బుర్రలోకెక్కట్లేదు. బాధతోనే ఇంటికెళ్లాను. మరుసటి రోజు ఇంటర్వెల్ తర్వాత పుస్తకంలో ఒక లెటర్ ప్రత్యక్షమైంది. సారీ నన్ను క్షమించు.. కవిత్రయం అంటే చెప్పలేదని.. ముక్కు పట్టుకుని చెంపమీద కొట్టావ్.. తెలుగుసార్ కొట్టమన్నంత మాత్రాన అంత గట్టిగా కొడతావా.. నీపై తీర్చుకోలేని కోపం నీ పుస్తకాలపై తీర్చుకున్న నన్ను క్షమించవా.. ఇట్లు మీ విధేయురాలు స్వప్న అని లేఖలో ఉంది. లీవ్ లెటర్లలో రాసిన అలవాటు క్షమాపణ లేఖలో కొనసాగించింది. అయినా నేను ఒప్పుకోలేదు. పగ తీర్చుకోవాల్సిందే.. పంతమంటే పంతమే అనుకున్నాను. నా పుస్తకాల సెట్టు తనకిచ్చి ఆమె పుస్తకాలన్నీ తీసుకున్నాను. అప్పటికే ఆమె పుస్తకాలన్నింటి మీద పేరు రాసుకుంది.

మేం టెన్త్‌లో ఉన్నప్పుడే టెన్త్ క్లాస్ సినిమా రిలీజైంది. అప్పుడప్పుడే క్లాస్‌లో ప్రేమ అనే పదం ప్రచారంలోకొచ్చింది. క్లాస్‌లో అమ్మాయిలతో మాట్లాడితే పుకార్లు గోడలకెక్కేవి. అందుకని నేను స్వప్న ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇంటర్వెల్ సమయంలో లేఖలు వచ్చి నా పుస్తకంలో చేరేవి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె పుస్తకాల్లోకి నా లేఖలు వెళ్లాయి. అలా పోస్ట్‌మ్యాన్ పాత్ర వహించాయి పుస్తకాలు. ఒక రోజు లెక్కల మాష్టారు దగ్గరికి ట్యూషన్‌కి వస్తావా మేమంతా వెళ్తున్నాం.. ప్లీజ్ నువ్వు కూడా రావా అని చీటీ రాసి పెట్టింది. ఆమె నా పుస్తకంలో లేఖ పెడుతుండగా లాస్ట్ బేంచి శీను చూసి ఇద్దరి మధ్య నిర్మించుకున్న లేఖల వంతెన కూల్చేశాడు. మా ఇద్దరి స్నేహాన్ని ప్రేమగా చిత్రీకరించి స్కూల్ మొత్తం ఠాం ఠాం చేశాడు. అప్పుడు స్వప్న మనసుకు అయిన గాయం పాఠశాల వీడ్కోలు సమావేశం రోజు వరకు మానలేదు. నేను ఏడువలేదు గానీ ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. మా నాన్న నన్ను వరంగల్ హాస్టల్‌లో ఇంటర్ చదువిస్తాడంట. నువ్వు దూరంగా ఉంటావు ఎలా? అని స్వప్న కంటి మేఘాలు కరిగి చిన్నపాటి వర్షమే పడింది. ఎక్కడున్నా మనం మంచి స్నేహితులమే అని ధైర్యం చెప్పాను. వార్షిక పరీక్షలయ్యాయి. ఫలితాలొచ్చాయి. టీసీ తీసుకునే రోజు మేమిద్దరం హెడ్‌మాస్టర్ గది ఎదుట ఎదురుపడ్డాం. నాన్నను వెంట తీసుకొచ్చిన ఆమె నన్ను చూసి కూడా మాట్లాడలేదు. వేసవి సెలవుల తర్వాత ఆమె మళ్లీ వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

ఫ్రెండ్ పర్వీన్ వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి మా ఇంటికొచ్చింది. నువ్ కూడా వరంగల్ వచ్చెయ్ అని అడ్రస్ చెప్పింది. కానీ నేను ఇప్పటివరకు మా జిల్లా దాటలేదు. చూడమ్మా! మావాడికి నీకంటే ఎక్కువ మార్కులొచ్చాయి. మొదటి కౌన్సిలింగ్‌లోనే గవర్నమెంటు కాలేజీలో సీఈసీ గ్రూపులో సీటు వచ్చింది. మీ నాన్న లక్షల్లో డొనేషన్ కట్టి వరంగల్‌లో ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాడట కదాఅంది మా అమ్మ. కాలేజీకెళ్తున్న నేను అప్పుడప్పుడే ట్రెండ్ ఫాలో అవుతున్న రోజులవి. అమ్మాయిలకు సైట్ కొట్టడం.. క్లాస్ డుమ్మా కొట్టి సినిమాకెళ్లడం. ఇలా ఇంటర్ మొదటి ఏడాది ఆనందంగా సాగిపోతుంది. ఎంజాయ్‌మెంట్‌లో పడి మొదటి ఏడాది ఏదోలా అరకొర మార్కులతో పాసయ్యాను. ఎంజాయ్‌మెంట్‌లో మాత్రం కాలేజీ లైఫ్ ఇంత బాగుంటుందా అనుకునేవాడిని. ఆ ఏడాది మా జిల్లాలో కరువు రాజ్యమేలింది. పంటలు సక్కగా పండలేదు. ఇంట్లో తిండికి కూడా కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీ మానేసి బట్టల షాపులో పనికి కుదిరాను. ఖాళీ సమయాల్లో కాలేజీకి వెళ్తూ సెకండియర్ పరీక్షలు రాశాను. నాకిష్టమైన తెలుగు మినహా అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. ఆ తర్వాత కాలేజీ బంద్.. పూర్తి జీవితం బట్టల దుకాణంలోనే కొనసాగింది. ఏ కాస్త సమయం దొరికినా అమ్మా, నాన్నతో పాటు పొలం పనులకు వెళ్లేవాణ్ని. పదో తరగతి స్వప్నను దాదాపుగా మరిచిపోయాను. స్వప్న వాళ్ల అమ్మమ్మ చనిపోయిందని ఊరికి రావడం మానేసింది. టెన్త్ తర్వాత ఐదేళ్లకు స్వప్న నా జాడ వెతుక్కుంటూ ఊరొచ్చింది. తన స్నేహితుల ద్వారా వివరాలు తెలుసుకుని నేను పనిచేస్తున్న బట్టల షాపుకు వచ్చింది. ఒక్కసారిగా నన్ను చూసి బోరున ఏడ్చింది. నేను పని చేస్తున్న షాప్ పక్కనే ఇంటర్ ఫ్రెండ్ ఇల్లు ఉండేది. ఆమెను అక్కడికి తీసుకెళ్లాను. ఇంట్లోకెళ్లగానే స్వప్న నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని కన్నీటిలో తడిపేసింది.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పాఠశాల స్థాయి నుంచి ఇప్పటి వరకు నిన్ను మరిచిపోలేదు. నువ్వే నా జీవితమంటూ ఏడవసాగింది. అప్పుడే తన సెల్ తీసుకుని నంబర్ డయల్ చేసి సేవ్ చేసుకున్నా. నా ఫ్రెండ్‌కు ఏం అర్థం కాలేదు. ఎవర్రా ఈ అమ్మాయి. ఏం చేశావ్‌రా? అంటుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పింది స్వప్న. ఆమెది నిజమైన ప్రేమ నువ్ పెళ్లి చేసుకుంటే నీ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు అని చెప్పింది నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ. నా పరిస్థితి ఇంట్లో బాగలేదు. స్వప్న తొందరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. కానీ నా మనసు మొత్తం స్వప్న మీదే ఉండిపోయింది. పాత జ్ఞాపకాల్ని రోజూ తవ్వుతూ ఎలాగైనా స్వప్నను పెండ్లి చేసుకోవాలనుకున్నాను. ఎన్నో సార్లు కాల్ చేశాను. కొన్ని రోజులకు ఆమె నంబర్ మార్చినట్లుంది. ఎప్పుడు కాల్ చేసినా స్విచ్‌ఆఫ్ అని వచ్చేది. ఎక్కడ వెతికినా స్వప్న కనిపించలేదు. జాడ దొరుకలేదు. ఏండ్లు గడుస్తున్నాయి. మా అక్క పెళ్లయింది. ఒక రోజు అక్కను, బావను చూద్దామని హైదరాబాద్ బస్టాండ్‌లో బస్ కోసం వేచి చూస్తున్న నాకు ఇద్దరు పిల్లలతో స్వప్న కనబడింది. పక్కనే ఎవరో పెద్దమనిషి ఉన్నాడు. ధైర్యం చేసి వెళ్లి అడిగాను ఎక్కడికి పోయావ్ ఇన్ని రోజులు? ఈ పిల్లలేంటి?? అని. ఎవడ్రా నువ్వు? అని ఆ పెద్దాయన దబాయించాడు. తను నా క్లాస్‌మేట్. టెన్త్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్వప్న చెప్పింది. తనకు పెళ్లయిందని, ఇద్దరు ఆడపిల్లలు అని, ఈయనే మా ఆయన అని స్వప్న చెప్పడంతో నా ప్రాణాలు పైపైనే పోయాయి.

అంతలోనే వాళ్లు వెళ్లాల్సిన బస్సు వచ్చేసింది. వెళ్లిపోయింది. నాకేమీ మిగల్లేదు. దేవదాసునైపోయాను. ఆమెను మరిచిపోదామని కొద్ది కొద్దిగా కోలుకుంటూ షాపులోనే ఎక్కువగా గడిపాను. ఓ రోజు కార్తీక్ పెద్దగా కేకలు వేస్తూ నేను పని చేసే షాపుకొచ్చాడు. అర్జెంటుగా ఇంటికి రమ్మంటే ఏమైందోనని ఓనర్‌కు చెప్పకుండానే వెళ్లాను. చూస్తే ఇద్దరు పిల్లలతో స్వప్న. రెండు నెలల క్రితమే తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయిండని చెప్పింది. తన జీవితం నాశనమైందని తనకు దేవుడు అన్యాయం చేశాడని ఏడ్చింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూడలేక నేనూ ఏడ్చేశాను. కొన్ని క్షణాల మౌనం అనంతరం ఆమె సెల్‌నంబర్, అడ్రస్ ఇచ్చి వెళ్లిపోయింది. టైలరింగ్ చేస్తూ ఇంటి వద్దే జీవనం సాగిస్తున్న స్వప్న ఓ రోజు వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. అలా రోజూ చాటింగ్‌లు, టాకింగ్‌లు పెరిగిపోయాయి. ఒక రోజు ఉండబట్టలేక నేను నిన్ను పెండ్లి చేసుకుంటా నీకిష్టమేనా అని అడిగాను. ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. మళ్లీ కాల్ కట్ చేసి ఫోన్ చేశాను. నువ్ నామీద జాలి చూపిస్తున్నావ్.. కానీ నీకు నిజమైన ప్రేమ లేదు జాలితో కూడిన ప్రేమ నాకొద్దు అంది. కానీ తర్వాత ఒప్పించాను. మా ఇంట్లో మాత్రం పరువుపోతది.. పైగా ఇద్దరు పిల్లల తల్లి.. నా చావు చూస్తావ్ అని నాన్న బెదిరించాడు. ఏం చేయాలో తెలియలేదు. స్వప్నను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదల్చుకోలేదు.

లోకులు పలు కాకులు కదా ఇష్టమొచ్చినట్లు అనేవారు. బంధువులు కూడా శుభకార్యాలకు మమ్మల్ని దూరంగా ఉంచేవారు. ఆర్థిక కష్టాలతో సంసార జీవితం సాగుతున్నా.. ఎక్కువ సేపు పని చేశాం. తర్వాత సొంతంగా బట్టల దుకాణం పెట్టుకుని స్థిరపడ్డాం. ఆస్తి పెరగడంతో బెల్లం చుట్టూ ఈగల్లా బంధువులు కూడా దగ్గరయ్యారు. మా ప్రేమ ముందు కష్టాలన్నీ బలాదూర్ అయ్యాయి. ఒకరికోసం ఒకరు బతికిన మేమిద్దరం ఇప్పుడు మా పిల్లల కోసం బతకడం ప్రారంభించాం. ప్రేమలో దాగి ఉన్న జీవితపు పరమార్థాన్ని తెలుసుకున్నాం.
- పడమటింటి రవికుమార్

1166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles