ఆంగ్లసాహిత్యంలో జ్ఞానపీఠం అమితావ్ ఘోష్


Sun,December 30, 2018 12:27 AM

prasthanam
సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి అందించే సర్వోన్నత పురస్కారం జ్ఞానపీఠ్‌కు ఈ ఏడాది ప్రముఖ ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్ ఎంపికయ్యారు. అవార్డుతో ఘోష్‌ను సత్కరిస్తున్నట్లు భారతీయ జ్ఞానపీఠం ఎంపిక కమిటీ ప్రకటించింది. ఆయన నవలలు చారిత్రక నేపథ్యానికి, ఆధునిక యుగానికి మధ్య వారధిగా నిలుస్తాయి. గతం గతః అనుకోవడానికి భిన్నంగా ఆయన ఆలోచనా పథంలోని అక్షర ఆవిష్కరణలు గతం వర్తమానానికి మధ్య సముచిత ఔచిత్య బంధాన్ని ఏర్చికూర్చిపెడుతాయని జ్ణానపీఠ కమిటీ వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. వినూత్న సృజనాత్మక నవలా రచయితగా పేరుగాంచిన అమితావ్ ఘోష్ ప్రస్థానం.

- మధుకర్ వైద్యుల

అమితావ్ రచనల్లోని కాల్పనికత విశిష్ఠం. అపూర్వం, కాల్పనికతకు తోడుగా విషయ పరిజ్ఞానాన్ని కూడా జోడించి, చరిత్రకారుడిగా, సామాజిక విశ్లేషకుడిగా ఆయన అపార అనుభవాన్ని పాఠకులకు అందించారు. వాస్తవికంగా జరిగిన సంఘటనలకు తనదైన కథనాన్ని జతచేసి చదువరుల హృదయాలకు హత్తుకునేలా రాయడం ఘోష్ ప్రత్యేకత. 57 సంవత్సరాలుగా ఇస్తున్న జ్ఞానపీఠ్ చరిత్రలో 54వ పురస్కారాన్ని తొలిసారి ఆంగ్ల సాహిత్యానికి స్వీకరించే అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు.

అమితావ్ ఘోష్ 1956 జూలై 11న కోల్‌కతాలోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 62 సంవత్సరాలు. ప్రస్తుతం భార్య దెబోరాహ్ బేకర్‌తో ఘోష్ న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఘోష్ చిన్నతనం అంతా ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలలో గడిచింది. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్లో చదివారు. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సంస్థల్లో చదువుకుని, 1978లో స్నాతకోత్తర పట్టభద్రుడయ్యారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీటర్ లీన్వార్ట్ పర్యవేక్షణలో మానవ పరిణామ శాస్త్రంలో 1982లో డాక్టరేటు పొందారు.

న్యూఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికతో ఆయన ఉద్యోగజీవితంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ది హిందూ వంటి పలు ఆంగ్ల పత్రికల్లోనూ పనిచేశారు. కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్, ట్రివేండ్రంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఫెలో (1999)గా వ్యవహరించారు. అలాగే క్వీన్స్ కళాశాల, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో తులనాత్మక సాహిత్యంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. విజిటింగ్ ప్రొఫెసర్‌గా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా పనిచేశారు.

ఘోష్ తొలి నవల ది సర్కిల్ ఆఫ్ రీజన్‌ను 1986లో, ది షాడో లైన్స్ 1988లో ప్రచురించారు. ఈ రెండు నవలలు అనేక భాషల్లోకి అనువదింపబడ్డాయి. ది కలకత్తా క్రోమోజోవ్‌ు(1995).ది గ్లాస్ ప్యాలెస్ (2000). ది హంగ్రీ టైడ్ (2004). సీ ఆఫ్ పాపీస్ (2008), రివర్ ఆఫ్ స్మోక్(2011), ఫ్లడ్ ఆఫ్ ఫైర్ (2015), వంటి నవలలు రాశారు. ఇన్ యాన్ ఆంటిక్ లాండ్(1992), డాన్సింగ్ ఇన్ కాంబోడియా అండ్ ఎట్ లార్జ్ ఇన్ బర్మా (1998), ది ఇమాం అండ్ ద ఇండియన్ (2002), ఇన్సెండియరీ సర్కవ్‌ుస్టాన్సెస్ (2008) అనే వ్యాస సంపుటాలనూ రాశారు. ఎ క్రానికల్ ఆఫ్ ద టర్మాయిల్ ఆఫ్ అవర్ టైవ్సు అనే నాన్ ఫిక్షన్ రచనను 2005లో ఆయన వెలువరించారు. ది గ్రేట్ డిరేంజ్మెంట్ : కై ్లమేట్ ఛేంజ్ అండ్ ద అన్ థింకబుల్ అనే గ్రంథాన్ని 2016లో రచించారు. రాజకీయ అంశాలు, ప్రేమ, హింస, యాత్ర, చరిత్ర ఉద్యమాలు, పోరాటాలు ఇలా అన్నీ తన సాహిత్యంలో ప్రతిబింబింపచేశారు.

1989లో సాహిత్య అకాడమీ వార్షిక పురస్కారాన్ని స్వీకరించారు ఘోష్. 1990లో ఆనంద పురస్కార్, 1997లో ఆర్థర్ సి క్లార్క్ అవార్డు, 2011లో మ్యాన్ ఆసియా లిటరరీ ప్రైజ్ పొందారు. సాహిత్యంలో సేవలకు 2007లో పద్మశ్రీ పురస్కారాన్నీ పొందారు. జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఇబుక్ అవార్డ్‌ను 2001లో, ఇటలీకి చెందిన గ్రింజేన్ కేవర్ అంతర్జాతీయ బహుమతిని 2007లో, ఇజ్రాయిల్‌కు చెందిన డాన్ డేవిడ్ బహుమానాన్ని 2008లో, మ్యాన్ బుకర్ ప్రైజ్ 2010లో, కెనడాకు చెందిన బ్లూ మెట్రోపాలిస్ అంతర్జాతీయ లిటరరీ గ్రాండ్ ప్రిక్స్ పురస్కారాన్ని 2011లో ఆయన స్వీకరించారు. దిగ్లాస్ ప్యాలెస్ నవలకుగాను కామన్‌వెల్త్ రైటర్స్ ప్రైజ్‌ను అందుకున్నారు. ముంబాయి లిటరేచర్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారాన్నీ పొందారు. 2009లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెలోగా ఎంపికయ్యారు. 2015లో ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ చేంజ్ ఫెలోగా ఆయనకు గౌరవం లభించింది. దేశీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను అందజేశాయి.

ఊహించలేదు

ఆంగ్ల సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరుచుకున్న అమితావ్ అంతర్జాతీయత అంశాలకు భారతీయతను, ప్రాచీన అంశాలకు ఆధునికతను మేళవించి రాయడంలో దిట్ట. సాహిత్య సృజనలో అనేక ప్రయోగాలు చేసి, ఆంగ్ల సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం ఆయనలోని రచనాశక్తిని ఇనుమడింపజేస్తుంది.

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles