ఏది పాపం?


Sun,December 30, 2018 12:24 AM

- మల్లాది వెంకట కృష్ణమూర్తి
Crime
వాళ్ళు పథకం వేసుకున్నట్లుగానే అరబ్ ఆయిల్ షేక్ కొడుకుని ఉదయం సరిగ్గా పదకొండూ ఆరుకి కిడ్నాప్ చేసారు. వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. వాళ్ళు నియమించిన అమ్మాయి ఆ పిల్లవాడి బాడీగార్డ్ దృష్టిని సరిపడేంత సమయం మరల్చింది. ఓ తాడు చివర కట్టిన హెలికాఫ్టర్ ఎగరడం చూసి ఆ కుర్రాడు కూడా వాళ్ళు అనుకున్నట్లుగానే స్పందించి తన బాడీగార్డ్‌కి దూరంగా వచ్చాడు. మొదటిసారి లండన్ నగరానికి వచ్చిన ఆ అరబ్ షేక్ ఎనిమిదేళ్ళ కొడుకు కిడ్నాప్ కోసం వాళ్ళు ఆ ఖరీదైన ఆట వస్తువుని కొన్నారు.

ప్రతీది గడియారం ముళ్ళు తిరిగినంత క్రమశిక్షణగా ఆ కిడ్నాప్ జరిగిపోయింది. పార్క్ నించి వెళ్ళేప్పుడు ట్రాఫిక్‌లో వాళ్ళ వాహనం ఆగలేదు. కార్లని మార్చడంలో ఇబ్బంది కలగలేదు. ఆ కుర్రాడు కూడా పెద్దగా ప్రతిఘటించలేదు. జరిగిన దానికి సాక్షులు ఎవరూ లేరు. భయంతో కళ్ళు విశాలమైన ఆ కుర్రాడు చెప్పినట్లు చేసాడు.
దాంతో వాడ్ని కిడ్నాప్ చేసిన అరగంటలో ఇద్దరూ ఆ గదిలో ఉన్నారు. కిల్‌బర్న్‌లో పడగొట్టడానికి సిద్ధంగా ఉన్న పురాతన ఇంట్లో వాళ్ళు సిద్ధం చేసుకున్న గదికి క్షేమంగా చేరుకున్నారు. వాళ్ళకి నగదు అంది, ఆ కుర్రాడ్ని వదిలేసాక వాడు ఆ ఇంటికి దారిని గుర్తు పెట్టుకునేంతగా వాడిని బయటకి చూడనివ్వలేదు. కళ్ళకి గంతలు కట్టారు.

బలిష్టుడైన పీటర్ ఆ గదిలో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నాడు. నలభై ఏళ్ళు జైలుకి, బయటకి తిరిగిన పీటర్ని చూస్తే ఎవరైనా భయపడి తీరుతారు. అతని ఆకారం అంత భీకరంగా ఉంటుంది. వాళ్ళు కిడ్నాప్ చేసిన కుర్రాడి తండ్రిని డబ్బు అడగడానికి బయటకి వెళ్ళినా నూట ముప్పై కిలోల పీటర్ ఆ కుర్రాడు పారిపోకుండా చూసుకుంటాడు.

వాళ్ళ మొదటి ఫోన్ కాల్‌ని రాత్రి ఏడున్నరకి, మేఫెయిర్‌లో ఆ అరబ్ అద్దెకి తీసుకున్న ఇంటికి చేసారు. ఆసరికి ఆ అరబ్ తండ్రి కొడుకు ఏమయ్యాడా అనే ఆదుర్దాతో సతమతమై ఉండటంతో డబ్బిచ్చి వాడిని విడిపించడానికి మానసికంగా సన్నద్ధంగా ఉంటాడని వాళ్ళు నమ్మారు.
మీ కొడుకు భద్రంగా ఉన్నాడు. కొద్ది సేపట్లో డిన్నర్ ఇస్తాం. వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. వాడిని మీరు మళ్ళీ ప్రాణాలతో చూడాలనుకుంటే పోలీసులకి మా ఫోన్ గురించి చెప్పకండి.
వాళ్ళు చెప్పింది నిజమే. ఆ సమయంలో పీటర్ బేక్డ్ బీన్స్‌ని, టీని వాళ్ళు కొని తెచ్చిన పిక్‌నిక్ స్టవ్ మీద వండి పెడుతున్నాడు. ఆ కుర్రాడు ఆ అసాధారణ ఆహారం వంకవాడికి అది అసాధారణమే వింతగా చూసాడు. వాడు చాలా మామూలుగా ఉండటం చూసి పీటర్ కొద్దిగా అబ్బుర పడ్డాడు.
నువ్వు ఓకేనా? అడిగాడు.

నీకు నరకంలో ఉండటం ఇష్టమేనా? ఆ కుర్రాడు పీటర్ని తన పెద్ద కళ్ళతో జాలిగా చూస్తూ అడిగాడు.
వాడి ముందు ఆహారాన్ని ఉంచి ఆ గదిలోంచి చేతిలో తాళంకప్పతో తలుపు వైపు నడిచే పీటర్ ఆ మాటలకి తుళ్ళిపడి ఆగి, రివ్వున వెనక్కి తిరిగి వాడి వంక చూస్తూ అడిగాడు.
నీకు ఇంగ్లీష్ వచ్చా?
వచ్చు. మీలా ఇంగ్లీష్ మాట్లాడేలా నాన్నగారు నాకో ట్యూటర్ని ఏర్పాటు చేసారు. ఇప్పుడు అతని అవసరం లేదు. బాగా మాట్లాడగలను.
ఆశ్చర్యంలోంచి తేరుకున్న పీటర్ అడిగాడు.
నరకమంటే ఏమిటి?
శాశ్వతంగా నరకంలో ఉండటం నీకు ఇష్టమేనా?

నేను నరకంలో ఉండటం ఏమిటి?
నువ్వు అక్కడికి తప్పక వెళ్తావు. కిడ్నాపింగ్ పాపం. నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్ళి తీరాలి.
ఎడారి వాసుల ఆ సామాన్య మౌలిక వేదాంతపు మాటలు ఆ పిల్లవాడి నోట్లోంచి ఎంతో విశ్వాసంతో బయటకి వచ్చాయని పీటర్ గ్రహించాడు.
అదంతా పాత చింతకాయ పచ్చడి బాబు. మనం ఎక్కడ నించి వచ్చామో తెలీనప్పుడు చచ్చాక ఎక్కడికి వెళ్తామో ఎలా తెలుస్తుంది? అవన్నీ పుక్కిటి పురాణాలు మాత్రమే. పాశ్చాత్య చొక్కా, షార్ట్‌లలోని ఆ కుర్రాడి వంక గుచ్చి గుచ్చి చూస్తూ పీటర్ చెప్పాడు.
తర్వాత తాళం కప్పతో బయటకి వచ్చి ఆ గదికి తాళం వేసాడు.
* * *

షేక్ డబ్బు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఆయన మీదకి వత్తిడి తెచ్చే తేలిక మార్గం ఏదా అని వాళ్ళు ఆలోచిస్తూండటంతో ఆ కుర్రాడు మర్నాడు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాడు.
వాడికి పాశ్చాత్య, ఆధునిక వేదాంతం తెలీదు. మర్నాడు ఉదయం పీటర్ బ్రేక్‌ఫాస్ట్ తెచ్చిచ్చినప్పుడు ఆ కుర్రాడు ఆ కార్న్‌ఫ్లేక్స్‌ని ఆత్రంగా తీసుకున్నాడు.
నువ్వు నరకానికి వెళ్తావు. తెలుసా? తప్పదు. నువ్వు తప్పు చేసావు. క్రితం రోజు ఆపేసిన అంశాన్ని ఆ కుర్రాడు మళ్ళీ వాళ్ళ మధ్యకి తీసుకువచ్చాడు.
చెప్పాగా. అలాంటిదేం లేదు. పీటర్ చెప్పాడు.
లేదని ఎందరు చెప్పినా సరే నరకం ఉంది. ఎవరైనా, ఏదైనా తప్పు చేస్తే అందుకు శిక్ష పడి తీరాలి. అవునా?
నాకు దాని గురించి తెలీదు కాని పోలీసులు అందర్నీ పట్టుకోలేరు. అంటే తెలివైన వాళ్ళని. మా వాళ్ళు తెలివైన వాళ్ళు. మేము ఇక్కడ ఉన్నామని పోలీసులకి ఎంతమాత్రం తెలీదు పీటర్ చెప్పాడు.
అవును. అందుకే నరకానికి వెళ్తావు. తినే ఆ కుర్రాడు చెప్పాడు.

అదే కారణమా?
అవును. నిన్ను పట్టుకుని ఇక్కడ శిక్షించకపోతే మరణించాక నీకు శిక్ష పడాలి. నువ్వు అల్ సిరత్ వంతెనని దాటగానే అది ఓ వెంట్రుకంత వెడల్పు మాత్రమే ఉంటుందనీ పాపం బరువు నువ్వు కింద నరకంలో పడేలా చేస్తుంది. నువ్వు ఆ నరకంలో శాశ్వతంగా ఉంటావు.
పీటర్ క్రితం రాత్రి ఎంగిలి ప్లేట్లని తీసుకుని వేగంగా బయటకి వెళ్ళాడు.
లంచ్ టైంలో మళ్ళీ పీటర్ ఆ గదిలోకి రాలేదు. ఆ సాయంత్రం ఆరుకి ఆ కుర్రాడిని మారుస్తున్నామని షేక్‌కి చెప్పాక ఆయన డబ్బు చెల్లిస్తానని మాట ఇచ్చాడు. పీటర్ ఆ బరువైన తాళాన్ని తెరచి, ఆవిర్లు కక్కే మరో బేక్డ్ బీన్స్ పళ్ళెంతో వచ్చాడు. ఆ కుర్రాడు మాట్లాడకుండా ఆ ప్లేట్‌ని ఆత్రంగా అందుకున్నాడు. పీటర్ వాడు తినేదాకా ఆగి మళ్ళీ ఆ ఎంగిలి పళ్ళాన్ని అందుకున్నాడు. తర్వాత అడిగాడు.

శాశ్వతంగానా?
ఆ కుర్రాడికి పీటర్ ప్రశ్న అర్థమై వెంటనే జవాబు చెప్పాడు.
అవును. స్వర్గానికి శాశ్వతంగా వెళ్ళాలంటే నువ్వు మంచివాడివి అవ్వాలి. నరకానికి శాశ్వతంగా వెళ్ళాలంటే నువ్వు చెడ్డవాడివి అవాలి. అదీ నియమం.
పీటర్ తలని కొద్దిగా పంకించి చెప్పాడు.
నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. నేను నీకు చెప్పకూడదు కాని నువ్వు త్వరలోనే ఇంటికి వెళ్తున్నావు. మీ నాన్న డబ్బిస్తానని చెప్పాడు.
కాని అందువల్ల తేడా ఏం రాదు. ఆ కుర్రాడు అడగని ప్రశ్నకి జవాబు చెప్పాడు.
పీటర్ బయటకి నడిచాడు. ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి అడిగాడు.
నేను తలుపు దగ్గరకి వేసి వెళ్ళాను తప్ప మూసి బయట తాళం వేయలేదు. గాలికి అది తెరచుకున్నా, నేను వంటగదిలో గిన్నెలు తోమేప్పుడు నువ్వు పారిపోలేదే?
లేదు. నువ్వే నన్ను మా ఇంటికి తీసుకెళ్ళాలని ఆగాను. లేదా నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఆగాను.
నేనా పని చేయలేను. నిన్ను విడుదల చేస్తే ఆ ఇద్దరూ నన్ను తప్పక పట్టుకుని తీరతారు. పీటర్ పెద్దగా నిట్టూర్చి చెప్పాడు.
* * *

మే ఫెయిర్లోని తన ఇంటి తలుపు దగ్గర ఆగి ఆ కుర్రాడు తనతో వచ్చిన పీటర్‌తో చెప్పాడు.
నువ్వు ఇక వెళ్ళు. డోర్ బెల్ నొక్కుతున్నాను. లేదా నిన్ను పట్టుకుంటారు.
పీటర్ వెనక్కి తిరిగి దూరంగా వెళ్ళాక ఓ చోట ఆగి దాక్కుని చూడటం కుర్రాడు గమనించాడు. తలుపు తెరచుకోవడం, అతను లోపలకి వెళ్ళడం పీటర్ చూసాడు.
కొద్ది నిమిషాల తర్వాత అతనికి ఓ పెద్ద తిట్టు వినిపించింది. అది అతను జైల్లోని నేరస్తుల దగ్గర చాలాసార్లు విన్న తిట్టు. ఆ కుర్రాడి కంఠం పెద్దగా వినిపించింది.
నువ్వు మా నాన్న గారి నించి డబ్బు తీసుకోకుండా నన్ను ఇంటి దగ్గర దింపినా నరకానికి వెళ్ళి తీరుతావు. అసలా ఆలోచనే పాపం.
(హెచ్.ఆర్.ఎఫ్. కీటింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

426
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles