కదళికథ


Sun,December 30, 2018 02:11 AM

Kadhali-khatha
సృష్టి ఒక అద్భుత ఆవిష్కరణ. ఆ సృష్టి కొనసాగటానికి అనాది నుంచి ఆధునికం దాకా మరెన్నో ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆవిష్కరణ అంటే ఏదో ఊసుపోక చేసేది కాదు. నిగూఢమైన జ్ఞానం ప్రపంచీకరణకు రూపమిచ్చేందుకు పుట్టుకొచ్చే అద్భుతం. ప్రతీ ఆవిష్కరణ వెనుక ఒక ఆలోచన, అవసరంగా మారెందుకు రూపకల్పన. నిస్వార్థమైన భావన ఉండనే ఉన్నాయి. కానీ ఆవిష్కరణ అనేది జరగాలంటే ఏదైనా తన రూపాన్ని కోల్పోయి మరో రూపమై ప్రపంచంలో కొనసాగాలి. ఆవిష్కరణలు అంటే వస్తువులకే పరిమితమయ్యేవి కావు. కొన్నిసార్లు జీవితాలే రూపం కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఏది జరిగినా అంతా మంచికే అన్న అంతరార్థం ఆవిష్కరణలకు ఆస్కారమిస్తుందంటుందీ కథ.

- ఇట్టేడు అర్కనందనా దేవి

చెట్టు రూపం కోల్పోయి కాగితంగా మారినట్టు ఇసుక తన రూపం కోల్పోయి అద్దంగా మారినట్టు, కదళి తన రూపం కోల్పోయి అందరికీ ఇష్టమైన కదళి వృక్షజాతిగా సృష్టిలో నిలిచిపోయింది.

పూర్వం దుర్వాసమహర్షి తపస్సు చేసుకుంటుంటే తానూ గృహస్థ జీవనంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడువు తగిన వధువుకోసం అన్వేషణ మొదలుపెట్టాడు. కానీ దుర్వాసునికి అసలే ముక్కుమీద కోపం. అంతటి కోపిష్టివానికి పిల్లనెవరిస్తారు. అయినా సరే తన ప్రయత్నం మానక వెళుతూ వెళుతూ ఔర్వుడనే మహర్షిని కలిసి తన కూతురిని ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు దుర్వాసుడు. ఔర్వుడు తన కూతురు కదళిని నీకివ్వడానికి అభ్యంతరం లేదు కానీ నాకొక మాటను ఇవ్వాల్సి ఉంటుందని షరతు పెడతాడు.

ఔర్వుడు దుర్వాసునితో తన కూతురికి శాంత స్వభావం లేదనీ, విపరీతమైన కోపమనీ, నీవూ కోపిష్టివే గనుక మీ ఇద్దరి కోపాలకు మీ జీవితాలు ఏమైపోతాయోననీ నాకు చాలా భయంగా ఉంది. అందుకని నాకొక వాగ్దానం చేయి. అప్పుడే నీకూ కదళికీ పెళ్ళి చేస్తానని అంటాడు. సరేనంటాడు దుర్వాసుడు. నాకూతురు కదళి ఏం చేసినా, ఎంత కోప స్వభావంతో ప్రవర్తించినా క్షమించి ఏలుకుంటానని మాట ఇవ్వమని దుర్వాసునితో అంటాడు ఔర్వుడు. అలా కదళీ దుర్వాసుల వివాహం జరుగుతుంది.

దుర్వాసుడూ, కదళీ ఇద్దరూ ఇద్దరే. వీరిలోని కోపం కోపానికి పరాకాష్ట. కానీ వారిద్దరి కోపాల వెనుక వారి బంధంలో ప్రేమ కూడా బలపడింది. దుర్వాసునికి ఎవరైనా తనని ధిక్కరిస్తేనో అవమానపరిస్తేనో కోపం వస్తుంటుంది. అదే కదళికి మాత్రం ప్రతీ విషయంలోనూ కోపమే. దుర్వాసుడు మాట్లాడితే ఎందుకంతగా మాట్లాడుతున్నారనీ, మౌనంగా ఉంటే నేనింతగా వాగుతుంటే సమాధానం చెప్పలేదనీ, చేస్తే ఎందుకు చేసామనీ, చేయకపోతే ఎందుకు చేయలేదనీ, అడిగితే ప్రశ్నించావనీ, అడుగలేదంటే అలుసైపోయాననీ ఇలా ప్రతీదానికి కోపంతోనే ముడిపెట్టేది కదళి. నిజం చెప్పాలంటే కదళికోపం ముందు దుర్వాసుని కోప ప్రభావం చాలా తగ్గిపోయింది. కదళి స్థానంలో ఇంద్రుడున్నా సరే క్షణంలో శపించి బూడిద చేసేవాడు దుర్వాసుడు. కానీ ఔర్వుడికిచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ విషయంలోనూ కదళిని క్షమిస్తూనే ఉన్నాడు దుర్వాసుడు.

కదళి దుర్వాసుల సంసారం గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. వారిద్దరి కోప ప్రభావంతో ఎప్పుడేం అనర్థం జరుగుతుందేమోననే భయం ఏర్పడిపోయింది. ఒకరోజు దుర్వాసుడు ఒంటరిగా కూర్చొని తనలోని కోపాన్ని అదుపుచేసుకునే ప్రయత్నానికి విసుగెత్తిపోయాను. అలాంటిది కోరిమరీ గృహస్థ జీవనం కోసమని భార్యగా కదళిని కాక కోపాన్నే కట్టుకోవాల్సి వచ్చిందని చాలా బాధపడుతుంటాడు. కాసేపు ధ్యానంలో కూర్చుంటే గాని మనఃశ్శాంతి ఉండదని, అగ్ని హోత్రం లోపల రగిలిపోతుండగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు దుర్వాసుడు. ఇంతలో దుర్వాసుడిని వెతుక్కుంటూ రానే వచ్చింది కదళి. ధ్యానంలో కూర్చున్న దుర్వాసుని ముందు నిలబడి, నేను ఎదురుగా వచ్చి నిల్చున్నా, రాయిలా కూర్చుని ఉండిపోయావు. నాతో మాట్లాడవా? అంటూ చాలా దురుసుగా మాట్లాడుతుంది. ధ్యానాగ్నితో రగిలిపోతున్న దుర్వాసుడు కళ్ళు తెరిచి కదళిని తీక్షణంగా చూస్తాడు. అంతే అక్కడికక్కడే బూడిదై నేలరాలుతుంది కదళి. అప్రయత్నంగా జరిగిన ఆ చర్యకు చాలా మదనపడుతాడు దుర్వాసుడు. తన భార్యపై గల ప్రేమకు చిహ్నంగా ఆ బూడిదలోంచే ఒక వృక్షాన్ని ఆవిష్కరిస్తాడు. అదే కదళీ వృక్షజాతిగా, దాని ప్రతీ భాగం ప్రపంచానికి ఉపయోగపడేలా, ఆ కదళీ వృక్షఫలం అమృతఫలమై అందరినీ తృప్తి పరుస్తుందనీ ఆశీర్వదిస్తాడు. కదళి అంటే అరటి. అరటి చెట్టు ప్రతీ భాగం అమృతమే. అవసరమే.

చెట్టు రూపం కోల్పోయి కాగితంగా మారినట్టు ఇసుక తన రూపం కోల్పోయి అద్దంగా మారినట్టు, కదళి తన రూపం కోల్పోయి అందరికీ ఇష్టమైన కదళి వృక్షజాతిగా సృష్టిలో నిలిచిపోయింది.

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles