సరమ


Sun,December 30, 2018 02:09 AM

Sarama
ప్రతీ పలకరింపునకూ ఒక అర్థముంటుంది. పలకరింపు ఉత్సాహాన్ని, ఊరటనీ అందించే దివ్యౌషధం. అదిచ్చే భరోసా అంతా ఇంతా కాదు. పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ప్రపంచ పలకరింపులో వ్యంగ్యం తొణికిసలాడినా మనస్సు చివుక్కుమనదు. పైగా సరదాగా తీసుకొని నవ్వుకునే సందర్భంగా మారిపోతుంది. కానీ జీవితపు అంకంలో పరిస్థితుల అసమతుల్యత అనివార్యమై, జీవితమే భారమైనప్పుడు మనసుకు సాంత్వన అవసరమైనప్పుడు రాబోయేదంతా మంచి కాలమేనని ధైర్యంగా ఉండమనే అపరిచిత పలకరింపైనా జీవితాలను నిలబెడుతుంది. ప్రపంచం ఎప్పుడూ పరిస్థితుల ప్రభావంతో తల్లడిల్లిపోయే జీవితాలను వేలెత్తి చూపిస్తూ అవహేళన చేస్తూ పలకరించే ప్రయత్నం వెదుకులాటకై తహతహలాడుతుంది. కానీ మంచికి ఆకర్షితమయ్యే మంచి మనసులకూ, మనుషులకూ కొదువే లేదు లోకంలో. జనకుని కూతురూ, దశరథుని కోడలూ అయిన సీతకు ఊరడింపునిస్తూ రామాయణం సరమ గొప్పమనసును గౌరవిస్తూ సరమ వాక్యానినికి ప్రాధన్యమిచ్చింది.

- ప్రమద్వర

ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునే మనస్తత్వాలూ, బలహీన పరిస్థితుల్లో ఎదురయ్యే దెప్పిపొడుపు పలకరింపులూ, అబద్ధాలూ, అధార్మిక చర్యలూ మనుషుల జీవితాలు అతలాకుతలం అయ్యేలా చేస్తాయనీ, చేతనైతే మనకు తోచిన మాటల్లో మనిషికి ఊతమివ్వాలనే సందేశాన్ని చెప్పిన సరమ వాక్యాలు ఆచంద్రతారార్కాలు.

శైబాషుడనే గంధర్వుని కూతురూ, విభీషణుని భార్య, మండోదరి తోడికోడలూ, రాక్షస స్త్రీలందరికీ తోడూ నీడ సరమ. విలక్షణమైన వ్యక్తిత్వం, మంచితనం, విభిన్నమైన ఆలోచనలు సరమతోపాటే పెరిగి పెద్దవైనాయి. సరమ చిన్నతనంలో మానస సరోవరంలో నీటి అలల శబ్దానికి భయపడి పోయినప్పుడు ఆమె తల్లి నీటి ఉధృతి తగ్గించమని సరమా మాఉధృత అన్న కారణంగా ఆమెకు సరమ అనే పేరు పెట్టారని ప్రతీతి. ఆమె పేరుకు తగ్గట్టుగానే సరళమైన నిండుదనంతో జీవితాన్ని కొనసాగించింది. గంధర్వకన్యగా పుట్టిన సరమ విభీషణుడి భార్యగా రాక్షస రాజ్యం లంకలో అడుగుపెట్టింది. కాఠిన్యం, రాక్షసత్వం సరమ చుట్టూ ఉన్నా ఆమెలోని మృదుత్వాన్నీ, సహృదయతనూ కనీసం ముట్టుకోలేకపోయాయి.

ఆదర్శభావాలు సమానమైన ఆలోచనా విలువలు, నైతికత విభీషణుడిలో ఎంత స్థిరత్వంతో ఉన్నాయో అంతే ఉన్నతమైన స్థిరత్వం సరమలోనూ ఉందంటే అతిశయోక్తి కాదు. రక్త సంబంధంలోనే భావవారసత్వం ఒక్కటిగా ఉండదు. దాంపత్యబంధం భావ వారసత్వానికి పునాదై చివరిదాకా ఏకత్వమై నిలిచి ఉంటుందనే ఆదర్శానికి ప్రతీక సరమా విభీషణులు. మాటలకందని భావవ్యక్తీకరణ సరమలో భాగమై రాక్షస లంకలో విభీషణునితో కలిసి విలువలను కాపాడేందుకు ఆస్కారమిచ్చింది. సరమలోని ఆ విలువలే సీతకు ఊరడింపుగా మారిన పలకరింపులైనాయి. వాస్తవాన్ని చూపించే భరోసా అయినాయి.

రావణుడు తన మాయలో రాముని శిరస్సుభాగాన్ని సృష్టించి, దానిని ప్రహస్తుడు రాముని శరీరం నుంచి వేరు చేసి తీసుకొచ్చాడని సీతకు చూపించి ఇకనైనా తనకు సమాధానం ఇష్టపూర్వకంగా ఇవ్వక తప్పదని బెదిరించి వెళ్ళిపోయినప్పుడు నివ్వెరపోయిన సీతను చేరిన సరమ, సీతను ఊరడించిన తీరు అత్యద్భుతం.
రావణుడు మోసకాడనీ, అబద్ధాల కోరనీ, సువేలపర్వతంపై శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడనీ, ఒక్క కోతి వస్తేనే లంక తగలబడి పోయిందే, అన్ని కోతులూ వస్తే లంక పరిస్థితేంటనే భయంతో నటించే రావణ గాంభీర్యాన్ని గమనించమనీ, రావణుడి పాపం పండిందనీ, సూర్యుని సాక్షిగా రాముడు వస్తాడనీ, నీ జీవితంలోకి వెలుగుల రాకను ఆపేవారెవరూ లేరనీ, మంచి వంశంలో పుట్టి, మంచి వంశంలో కోడలిగా అడుగుపెట్టిన నీవు లోకరీతి తెలియని దానివి కావనీ, మోసం అబద్ధం - అధర్మం.. రాక్షసుల బుద్ధే అంతనీ, నీవు అవునంటే నా మహావాయు గమన విద్యతో క్షణంలో నిన్ను రాముని చెంతకు చేర్చగలననీ, నీ మనసు మాట వింటే నిజం నీకే అర్థమవుతుందనీ సీతతో సరమ చెప్పిన మాటలు సీత ప్రాణాల్ని నిలబెట్టాయి. సీత మాటల్లో చెప్పాలంటే దాహంతో గొంతు ఎండిపోతున్న వాడికి మహానది కనిపించినట్టుగా ఉన్న సరమ ఊరడింపు సీత కథను ముగిసిపోకుండా ఆపగలిగింది. ధర్మం పక్షాన నిలబడిన వారి జీవితాలే అసలైన జీవమున్న జీవితాలనే నియమాన్ని ఆపాదించుకుంది సరమ.

మృదుభాషిణీ, స్నేహలత అయిన సరమ లంకను రావణుని రాజ్యపాలనలోనూ, విభీషణుని రాజ్య స్థాపన తర్వాత కూడా ప్రజాక్షేత్రంగా చూసింది. అందుకనే అందరి జీవితాలూ నిలబడాలనీ, బాగుండాలనీ తన జీవితమంతా కాంక్షించింది. ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునే మనస్తత్వాలూ, బలహీన పరిస్థితుల్లో ఎదురయ్యే దెప్పిపొడుపు పలకరింపులూ, అబద్ధాలూ, అధార్మిక చర్యలూ మనుషుల జీవితాలు అతలాకుతలం అయ్యేలా చేస్తాయనీ, చేతనైతే మనకు తోచిన మాటల్లో మనిషికి ఊతమివ్వాలనే సందేశాన్ని చెప్పిన సరమ వాక్యాలు ఆచంద్రతారార్కాలు.

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles