5 థింగ్స్


Sun,December 30, 2018 02:00 AM

Dimond

కోడిగుడ్డంత వజ్రం!

ఒక చిన్న వజ్రం దొరికితే సంతోషంతో గాల్లోకి ఎగిరి గంతేస్తాం. అలాంటిది ఇంకాస్త పెద్ద వజ్రం దొరికితే లైఫ్ సెటిల్ అయినట్లేనని భావిస్తాం. అలాంటి వజ్రం కోసం కళ్లు పెద్దవిగా చేసుకుని ఏడాది పొడవున వెతుకుతూ ఉంటారు కొందరు. తాజాగా ఉత్తర అమెరికాలోని ఓ వజ్రాల గనిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వజ్రం ఒకటి బయటపడింది. డొమినియన్ డైమండ్ మైన్స్‌లో ఇది బయటపడింది. ఈ వజ్రం కొలతలు 33.74 మిల్లీ మీటర్లు x 54.56 మిల్లీ మీటర్లు. 552 క్యారట్ గల పసుపు పచ్చ వజ్రం. ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద వజ్రం కంటే మూడు రెట్లు పెద్దది. ఈ తరహా వజ్రాలు సాధారణంగా దక్షిణాఫ్రికా వజ్రాల గనుల్లో దొరుకుతాయి. ప్రస్తుతం దొరికిన వజ్రం ఒక కోడిగుడ్డు సైజుకంటే కొంచెం పెద్దదిగా ఉంది. ఇది అత్యంత విలువైన, అరుదైనది. ప్రస్తుతం దీని విలువను అంచనా వెయ్యలేకపోతున్నారు. ఈ శతాబ్దంలో దొరికిన వజ్రాల్లో ఇది ఏడో అతి పెద్ద వజ్రం.
Sleeping-Village

ఆ ఊరంతా నిద్రపోతుంది!

ఆ ఊరిలో అడుగుపెడితే చాలు నిద్ర ముంచుకొస్తుంది. శరీరం నియంత్రణ కోల్పోతుంది. కొన్ని క్షణాలు ఏం జరుగుతుందో తెలీదు. అకస్మాత్తుగా నిద్ర పట్టేస్తుంది. ఆ మత్తులో ఎప్పుడు.. ఎక్కడ పడుకున్నామనేది కూడా తెలియదు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రపోతారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది కజకిస్థాన్‌లోని కలాచీ గ్రామం. ఈ ఊర్లో ప్రజలు అకస్మాత్తుగా నిద్రపోవడం వెనుక గల రహస్యాన్ని మొదట్లో శాస్త్రవేత్తలు కూడా కనుగోలేకపోయారు. కొంతమంది పనులు చేస్తూ నిద్రపోవడం, మరికొందరు నడుస్తూ నిద్రలోకి జారుకోవడం. ఇంకొందరు రోడ్లపైనే నిద్రపోతున్నారు. నిద్ర నుంచి కోలుకున్న తర్వాత కొందరు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడతారట. కొంతమందైతే రెండు రోజులైనా నిద్రలేవరట. కారణం యురేనియం మైనింగ్ అని ఇటీవల తెలిసింది. యురేనియం నుంచి విడుదలయ్యే గ్యాస్.. ఆ ఊరి ప్రజలపై దుష్ప్రభావం చూపుతున్నది. ఆ గ్యాస్‌ను పీల్చడం వల్లే వారికి ఇన్ని తిప్పలు. దీంతో చాలామంది కలాచీ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే నిద్రపోతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
Beauty

పండ్లతో మెరుగైన అందం

అందంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లు, క్రీములు రాస్తుంటారు చాలామంది. అయితే వీటికి బదులుగా సహజపద్ధతిలో సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అదికూడా పండ్లను తినడం ద్వారా. పాలకూరలో ఏజింగ్ లక్షణాలను తగ్గించే బీటా కెరాటిన్‌లు పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జా గింజలు ముందుంటాయి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జా గింజల్ని తింటే చర్మం యవ్వనంగా ఉంటుంది. టమోటాలో ఉండే లైకోపీన్ చర్మానికి మెరుపుని ఇచ్చి, యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తుంది. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే మంచిది. విటమిన్ సి అధికంగా ఉండే క్యారెట్‌ను ప్రతిరోజూ తింటే మరీ మంచిది. దోసకాయను తొక్కుతో తింటే.. విటమిన్ కె సమృద్ధిగా అందుతుంది. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి. ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. దీన్ని ఫేస్ ఫ్యాక్‌గా కూడా వేసుకోవచ్చు.
cold-people

మంచు మనుషులు!

పెథాయ్ తుఫానుకు వీచిన చలిగాలులకే మనం గజగజ వణికాం. ఎండకోసం తహతహలాడాం. మనమే ఇలా అనుకుంటే.. వీళ్లు ఏకంగా మంచులోనే జీవిస్తారు. గడ్డకట్టే చలిలో కూడా నివసిస్తున్నారు. వాళ్లే ఆర్కిటిక్ పరిధిలోని ఇన్యూట్స్ ప్రజలు. వీరితో పాటు ఉత్తర రష్యాలో ఉండే నెనెట్స్ కూడా అంతే. వాళ్ల శరీర నిర్మాణం ఇతరులకంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే చలికి వాళ్ల శరీరం స్పందించే తీరు కూడా భిన్నం. వాళ్ల చర్మం ఇతరులకంటే వేడిగా ఉంటుంది. వీరి జీవక్రియల వేగం కూడా ఎక్కువే. వారి శరీరంలో స్వేద గ్రంథులు తక్కువగా ఉంటాయి. చలికి వణకరు. ఇవి ఇన్యుట్స్, నేనట్ ప్రజలకు పూర్తిగా జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు. ఇతర జాతుల ప్రజలు అక్కడి వారితో సహజీవనం చేసినా.. అలాంటి లక్షణాలు పుణికి పుచ్చుకోలేరు.
Sleeping-Woman

టైంకి పడుకుంటున్నారా?

తినే వేళకు తినాలి, పడుకునే వేళకు పడుకోవాలి. ఈ రోజుల్లో ఈ నియమాన్ని చాలామంది పాటించడం లేదు. స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని రాత్రి నిద్రను మరిచిపోయి, పగటి నిద్రకు అలవాటు పడుతున్నారు. అయితే పగటిపూట కునికిపాట్లు భవిష్యత్‌లో అల్జీమర్స్(మతిమరపు)కు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరిస్తున్నది. 70 ఏళ్లు పైబడిన పదవీ విరమణ చేసిన దాదాపు 300 మందిపై అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి బ్రెయిన్ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు పరిశోధకులు. రాత్రిపూట నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లు తీస్తే అది అల్జీమర్స్‌కు దారి తీస్తుందంటున్నారు. మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వృద్ధులు పగలు అతిగా నిద్రపోవడం మంచిది కాదని తేలింది.

- డప్పు రవి

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles