కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పులు తెచ్చింది. కొందరు ఉద్యోగం కోల్పోయారు. కొందరు ఉపాధిని పోగొట్టు కున్నారు. కొందరు ఒంటరితనంతో కుమిలిపోయారు.వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ వర్లు మాత్రం శారీరకదారుఢ్యంపై దృష్టి సారించారు. పట్టుబట్టి సిక్స్ ప్యాక్ సాధించారు. యాభై ఏడేండ్ల వ్యక్తి కాస్తా.. ఇరవై ఏడేండ్ల
యువకుడిలా మారిపోయారు.ఆ సిక్స్‌ప్యాక్ శరీరాకృతిని తీర్చిదిద్దుకున్న విధానంపై
వర్లు ఏం చెబుతున్నారంటే..!
పరిస్థితులనుబట్టి ప్రతి వ్యక్తీ తనను తాను మార్చుకుంటూ ఉండాలి. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ప్రారంభం నుంచే లక్ష్యంపైన స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సాధించి తీరతామన్న సానుకూల దృక్పథమే నన్ను విజయం వైపు తీసుకువెళ్లింది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని, శారీరక దారుఢ్యంపై దృష్టి పెట్టాను. రోగ నిరోధక శక్తి కోసం వ్యాయామం చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 22 నిమిషాలు ఏదో ఓ శారీరక వ్యాపకం చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అప్పటికప్పుడు జిమ్ పరికరాలను కొనుగోలు చేశాను. వ్యాయామం ప్రారంభించాను. ఆ రెండు నెలల ప్రయత్నం నా శరీరాకృతిలో ఎంతో మార్పు తెచ్చింది. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సిక్స్ ప్యాక్ సాధించాలన్న లక్ష్యం వైపు నడిపించింది. ఇండియాలోనే బెస్ట్ సిక్స్ ప్యాక్ ట్రైనర్ వెంకట్ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించాను. నా నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులు మెచ్చుకున్నారు. కొత్తలో ఒళ్లు నొప్పులు సహజం. వాటికి భయపడకుండా వారం రోజులపాటు కొనసాగిస్తే శరీరం వ్యాయామానికి తగ్గట్లుగా మారిపోతుంది.
సెల్ఫ్ మోటివేషన్‌తో..
అప్పట్లో నా బరువు డబ్భు ఎనిమిది కిలోలు. పొట్ట బాగానే ఉండేది. అప్పటికి, ఇప్పటికి నాలో ఎంతో తేడా. ‘నేనేనా.. ఈ శరీరాకృతిని సాధించింది?’ అనిపిస్తూ ఉంటుంది. సిక్స్ ప్యాక్ సాధించాలంటే గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే మనిషి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ నిరంతరం వ్యాయామం చేయడం ద్వారా నా శరీరాకృతిని మార్చుకోగలిగాను. నేను చేస్తున్న ప్రయత్నంలో నా శ్రీమతి కూడా తగిన డైట్‌ను అనుసరించి, 10 కిలోలు బరువు తగ్గడం విశేషం.
నా రోజువారీ డైట్
ఉదయం టిఫిన్‌లో రెండు ఇడ్లీలు, 5 ఎగ్‌వైట్స్
లంచ్‌కు ముందు పండ్లు
లంచ్‌లో.. బ్రౌన్‌రైస్ (25 గ్రా.) చికెన్ 100 గ్రా., కూరగాయలు 100 గ్రా.
మధ్యలో నట్స్.. బాదాం, జీడిపప్పు వంటివి 10
డిన్నర్లో.. రైస్ లేకుండా మజ్జిగ, చేపలు 100 గ్రా., కూరగాయలు 100 గ్రా.
చివరగా ఒక్క మాట. సాధ్యమైనంత వరకూ చక్కెరను, మిఠాయిలనూ దూరం పెట్టండి. తీపి వలలో పడి పోకండి. తొలిదశలో ఒకటి రెండు నెగెటివ్ విమర్శలు వచ్చినా పట్టించుకోకండి. మీ లక్ష్యమే మీ సర్వస్వం కావాలి. అలా అని, సిక్స్ ప్యాక్ ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలిస్తేనే ఇలాంటి ప్రయత్నం చేయండి.
-వరకవుల దుర్వాసరాజు