e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home బతుకమ్మ 57 ఏండ్ల నవీన గ్రంథాలయం

57 ఏండ్ల నవీన గ్రంథాలయం

గ్రంథాలయం అనగానే ఓ పాత భవనం, పెచ్చులూడిన గోడలు, బూజుపట్టిన ర్యాక్‌లు, మాసిపోయిన పుస్తకాలు.. ఇలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ, వరంగల్‌లోని ప్రాంతీయ గ్రంథాలయానికి ఈ పోలికలు వర్తించవు. రంగురంగుల చిత్తరువులతో ముస్తాబైన ఈ లైబ్రరీని చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. లోనికి వెళ్లామా.. గంటల తరబడి ఉండాలనిపిస్తుంది. నచ్చిన పుస్తకాలన్నీ చదివేయాలనిపిస్తుంది.

గ్రంథాలయం అంటే పుస్తకాలన్నీ ఒకచోట ఉండే భవనం మాత్రమే కాదు. చరిత్రను, వారసత్వాన్ని, చైతన్యాన్ని భవిష్యత్‌ తరాలకు అందజేసే వేదిక. కానీ, తరాలు మారేకొద్దీ పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోయింది. సామాజిక మాధ్యమాల ప్రభావంతో గ్రంథాలయానికి వెళ్లడం ఏ కొద్దిమంది అభిరుచిగానో మిగిలిపోయింది. యువతలో, పిల్లల్లో పఠనాసక్తిని పెంచడమే లక్ష్యంగా వరంగల్‌లోని గ్రంథాలయాన్ని సమూలంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. 57 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన వరంగల్‌ ప్రాంతీయ గ్రంథాలయం కార్పొరేట్‌ హంగులతో నవీన పుస్తక భాండాగారంగా దర్శనమిస్తున్నది.రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ గ్రంథాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించారు.

- Advertisement -

పుస్తకాల గోడలు
1964లో వరంగల్‌ ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని లైబ్రరీలు దీని పరిధిలోకి వస్తాయి. కాలక్రమంలో గ్రంథాలయాలు పేరుకు మాత్రమే అన్న చందాన తయారయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, వరంగల్‌ లైబ్రరీకి మంచిరోజులొచ్చాయి. మౌలిక వసతులు కరువై వెలవెలబోతున్న గ్రంథాలయానికి కొత్త శోభను తీసుకొచ్చింది ప్రభుత్వం. నాటి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పర్యవేక్షణలో స్మార్ట్‌సిటీ కార్యక్రమంలో భాగంగా నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. గోడలపై పుస్తకాల వరుసలు పేర్చినట్టుగా చిత్రాలు వేయించారు. లైబ్రరీ లోపలి గోడలపైనా ఆముక్తమాల్యద, భేతాళ కథలు, విక్రమార్క కథలు వంటి బొమ్మలతో, పుస్తక పఠనంపై జిజ్ఞాసను కలిగించే దృశ్యాలను ఆవిష్కరించారు.

అన్ని వర్గాల కోసం..
పుస్తకాలు చదువడానికి గ్రంథాలయానికి వస్తారు. కానీ, వరంగల్‌లోని ఈ లైబ్రరీ భవనాన్ని మాత్రం చూసేందుకు కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చిన సందర్శకులు లోనికి వెళ్లకుండా ఉండలేరు. లోనికి వెళ్లినవాళ్లు అక్కడున్న హంగులు చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆ పుస్తక సంపదను చూసి మైమరచిపోతారు. నచ్చిన పుస్తకాన్ని అందుకొని నిశ్శబ్దంగా అక్షర ప్రపంచంలో లీనమైపోతారు. ఈ లైబ్రరీలో మహిళలు, పిల్లలు, యువతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. వీరనారీమణుల జీవిత గాథలతోపాటు మహిళా సాధికారతకు మార్గం చూపే పుస్తకాలనూ ఇక్కడ పొందుపరిచారు. పిల్లలకోసం చందమామ, బాలమిత్ర, విక్రమార్క, డిస్నీ ఇలా రకరకాల బొమ్మల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. మారిన కాలానికి అనుగుణంగా లైబ్రరీలో 25 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలూ ఇక్కడున్నాయి. ఇలా అన్ని వర్గాల వారికీ చేరువైన ఈ గ్రంథాలయం పఠనాసక్తికి దూరమవుతున్న ఈ తరాన్ని పుస్తక ప్రపంచానికి చేరువ చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఆవరణలో చదువుకొన్న ఎందరో విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించారు. ఉన్నతోద్యోగాలు సాధించారు.

వేల గ్రంథాల ఖజాన
ఈ లైబ్రరీలో 17,335 తెలుగు పుస్తకాలు , 12,075 ఇంగ్లిష్‌ పుస్తకాలు, 4,031 హిందీ పుస్తకాలు, 2,941 ఉర్దూ రచనలు ఉన్నాయి. చందమామ కథల పుస్తకాలు మొదలు అంతరిక్ష విజ్ఞానాన్ని పెంచే గ్రంథాల వరకూ అపార విజ్ఞాన సంపద ఉంది. కంప్యూటర్స్‌, రోబోటిక్స్‌, జెనెటిక్స్‌ గ్రంథాలు కోకొల్లలు. రోజూ 10 తెలుగు, 10 ఆంగ్ల, 2 హిందీ, 4 ఉర్దూ దినపత్రికలు వస్తాయి. 60 రకాల మ్యాగజైన్లు, జర్నల్స్‌, పక్ష, మాస పత్రికలూ లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం 20 రకాల జర్నల్స్‌, మ్యాగజైన్లు తెప్పిస్తున్నారు. రోజూ లైబ్రరీకి వందల సంఖ్యలో చదువరులు వస్తుంటారు. దాదాపు 15,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. రోజుకు ఒకసారైనా, ఇటువైపు రాకపోతే, ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది చాలామందికి.

  • డా॥ రవి కుమార్‌ చేగోని
    ప్రధాన కార్యదర్శి,తెలంగాణ గ్రంథాలయ సంఘం,
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana