బుధవారం 03 మార్చి 2021
Sunday - Feb 21, 2021 , 01:11:33

ఆత్మగౌరవానికి.. ఆలయం!

ఆత్మగౌరవానికి.. ఆలయం!

ఆదిలాబాద్‌ అంటే ఆదివాసీ గడ్డ. తెగలు తెగలుగా ఉన్న వారి జీవితం.. కథలు కథలుగా చెప్పుకున్నా ఒడువదు. నిండైన అమాయకత్వం, ఏ రాజకీయాలూ తెలియని మనస్తత్వం. ప్రతి చెట్టు, పుట్ట, మనిషిలో దేవుడిని చూస్తారు. తరాల సంప్రదాయంలో తరగని, చెరగని సంతోషం ఆ అడవిబిడ్డల  సొంతం.  అపారమైన ఆత్మవిశ్వాసమూ వారి సొత్తు. అదే, నాగోబా ఆలయ పునరుద్ధరణకు పురిగొల్పింది. 

చుక్కబొట్టు పెట్టుకొని చూడముచ్చటగా ముస్తాబై, దండారీ నృత్యంతో పరవశిస్తుంటారు. తమను నాలుగు కాలాలు చల్లగా చూసే ఇష్టదైవం నాగోబాను ఎల్లప్పుడూ స్మరిస్తుంటారు. నాగోబా ఆలయం ఆ గిరిజనుల చరిత్రకు ప్రతీక, సంప్రదాయానికి సాక్ష్యం, సంస్కృతికి నిలువుటద్దం. కాబట్టే, ఆ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి.. రేపటి తరాలకు భద్రంగా అందించడానికి అందరూ చేతులు కలిపారు. నిధులు సమీకరించారు. ఆదివాసీ అంతరాత్మ ప్రతిబింబించేలా ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు. నాగోబా ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఉంది. ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా.  తమ ఇష్టదైవం ఘనత తరతరాలూ మార్మోగాలంటే నూతన ఆలయ నిర్మాణం అనివార్యమని అంతా భావించారు. తలా ఓ చేయి వేసి గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా లక్షల రూపాయలు సేకరించారు. ఆ సమూహంలో ఎవరూ కుబేరులు కాదు, పారిశ్రామిక వేత్తలు లేరు. అయితేనేం, ఆర్థిక స్థోమతను బట్టి, సామాజిక హోదాను బట్టి, పదవులను బట్టి, ప్రతిష్ఠను బట్టి... ఎవరెంత ఇవ్వాలన్నది తీర్మానించారు. ఓరకంగా శక్తికి మించిన కార్యమే ఇది. అయితేనేం, ధైర్యంగా అడుగు ముందుకేశారు. నాగోబా తమను లక్ష్యం వైపు నడిపిస్తాడన్న కొండంత నమ్మకం.

కష్టసుఖాల వేదిక 

గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు నాగోబాతో విడదీయరాని అనుబంధం ఉంది. మెస్రం వంశస్థులు ఏ ప్రాంతంలో స్థిరపడినా నాగోబా ఉత్సవాల నాటికి కెస్లాపూర్‌ చేరుకుంటారు. కష్టసుఖాలు తెలుసుకోవడానికి, బాధలు పంచుకోవడానికి, మంచి చెడులు విశ్లేషించుకోవడానికి నాగోబా ఆలయం ఓ వేదికవుతుంది.  కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లపై తరలివచ్చి నాగోబా సన్నిధిలోని మర్రిచెట్ల నీడలో సేద తీరుతారు. జొన్నగటక, అంబలి, సాంబారు మట్టికుండలో వండి నైవేద్యంగా సమర్పిస్తారు. పెండ్లి తర్వాత ఇక్కడకు వచ్చి పూజలు చేస్తేనే, ఆ దంపతులకు అధికారిక ముద్ర పడినట్టు. దివంగతులకు నాగోబా ఆలయానికి కిలో మీటరు దూరంలోని మర్రిచెట్లవద్ద కర్మకాండ నిర్వహిస్తారు. దీనిని ‘తూమ్‌' అంటారు. నాగోబా సమక్షంలో చివరి క్రతువులు నిర్వహిస్తే పోయినవారి ఆత్మ శాంతిస్తుందని విశ్వాసం. అలా, జననం నుంచి మరణం వరకూ, శుభం నుంచి అశుభం వరకూ ఏ కార్యమైనా నాగోబా సమక్షంలోనే. ఆ ఆదివాసీలకు నాగోబా.. దేవుడు, గురువు, బంధువు, హితుడు, సన్నిహితుడు- సర్వస్వమూ!

చరిత్ర తెలిపే ఆలయం

పూర్వం ఈ ప్రాంతం గోండ్వాన రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పట్లో ఓ గుడిసె కింద నాగోబా పూజలు అందుకున్నట్లు మెస్రం వంశీయులు చెప్తారు. తమ ఇంటి దైవం, ఇష్టదైవం అయిన నాగోబాకు పెద్ద ఆలయం కట్టాలని సంకల్పించారు. తామే తలా కొంత జమచేసి నిర్మించాలని భావించారు. అలా, 2005లో రూ.10 లక్షలతో  ఆలయాన్ని విస్తరించారు. నాగోబా చరిత్రను భావితరాలకు అందించేలా నిర్మాణం ఉంటే బావుంటుందన్న ఉద్దేశంతో.. మళ్లీ, 2017 జూన్‌లో విస్తరణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పని చివరిదశలో ఉంది. మరో రూ. 2 కోట్ల నిధులు సేకరించి  గర్భగుడిని నిర్మిస్తున్నారు. మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందిస్తున్నది. 

శిల్పకళా నిలయం 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డనుంచి తెప్పించిన గండ శిలలను ఆలయ నిర్మాణానికి వాడుతున్నారు. అహోబిలం, మహానంది, యాగంటి, ఒంటిమిట్ట ఆలయాలకూ వీటినే వినియోగించారట. ఆళ్లగడ్డకు చెందిన తలారి రమేశ్‌తోపాటు తలవంచిపట్నానికి చెందిన 25 మంది శిల్పకారులు, కార్మికులు ఈ కళాయజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. తెల్ల, నల్ల, ఎరుపు రాళ్లతో వివిధ కట్టడాలు చేపడుతున్నారు. 350 టన్నుల బండను స్లాబ్‌కు, 100 టన్నులు పిల్లర్లకు, 60 టన్నులు బేస్‌మెంట్‌ కోసం వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్మాణంలో భాగంగా 34 స్తంభాలు సిద్ధమయ్యాయి. గర్భగుడి కోసం ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలతోపాటు నాగోబా జాతరలోని క్రతువులను కండ్లకుకట్టేలా  శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు. గిరిజన సంప్రదాయాలకు సంబంధించి, నాగోబా జాతర నిర్వహణకు సంబంధించి రేపటి తరాలకు ఏ సందేహం వచ్చినా ఆ బొమ్మలను చూస్తే చాలు.. పరిష్కారం దొరికిపోతుంది. వాటిని చూపిస్తూ పిల్లాపాపలకు మోస్రం వంశ చరిత్రను వివరించవచ్చు. ఒకప్పటి గోండ్వానా రాజ్య ఘనతను కండ్లకు కట్టవచ్చు. తమ సంప్రదాయాన్ని బతికించుకోడానికి ఆ ఆదివాసీలు ముందుచూపుతో చేస్తున్న ఏర్పాటు ఇది. ఆలయ నిర్మాణంలో భాగంగా రాజగోపురాలు, ప్రాకారం, మండపంతోపాటు మినీ స్టేడియం కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల్లు మంజూరు చేసింది. రూ.90 లక్షలతో దర్బార్‌ హాలు నిర్మించారు. రోడ్ల నిర్మాణం చేపట్టారు. పడగ ఆకారంలోని గర్భగుడి ద్వారం చూపరులను ఆకట్టుకుంటున్నది. స్థానిక ఐతిహ్యం..

వందల ఏండ్ల క్రితం.. కెస్లాపూర్‌ గ్రామ గిరిజనుడైన పడియేరు శేషశాయి ఇష్టదైవం నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్తాడు. ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేడని చెబుతారు. శేషశాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పాన్ని తాకి వెనుదిరుగుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకొని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు. ఉగ్రరూపుడై శేషశాయిని అంతమొందించేందుకు భూలోకానికి వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శేషశాయి ప్రాణభయంతో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్‌ పడమార్‌ను శరణు వేడతాడు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలతో పాటు.. పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తాడు. గోదావరి హస్తలమడుగు నుంచి 125 గ్రామాల మీదుగా తిరుగుతూ తీసుకొచ్చిన జలంతో నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో, నాగరాజు కెస్లాపూర్‌ వద్ద ఉన్న పుట్టలోకి వెళ్లి అక్కడే తన నివాసం ఏర్పరచుకుంటాడు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి పూట మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తున్నారు. చాలాకాలం వరకూ నాగోబా దేవతకు ఓ గుడిసెలో పుష్యమాస మహాపూజలు నిర్వహించేవారు. అక్కడే, 1956లో చిన్న గుడిని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న గోడం నగేశ్‌ హయాంలో నాగోబా ఆలయంతోపాటు గర్భగుడి, సతీదేవత గుడి, ఆలయ మండప నిర్మాణం చేపట్టారు. అన్ని హంగులతో మూడేండ్ల కిందట గ్రైనేట్‌ రాయితో ఆలయ  నిర్మాణాన్ని ప్రారంభించారు. త్వరలోనే పనులన్నీ పూర్తవుతాయి. ఆదివాసీల ఆది దైవమైన నాగోబాకు శిల్పకళా శోభితమైన వేదిక సిద్ధం అవుతుంది. ఆ నిర్మాణాన్ని చూసి గిరిజనుల గుండె ఉప్పొంగుతుంది. ఆ గుండెల్లో నాగోబా నామం ప్రతిధ్వనిస్తుంది.  ఆ ఆలయం జగద్విఖ్యాతం అవుతుంది. నాగోబా.. మహా పూజారులు

నాగోబా దేవతకు ఆదివాసీ గిరిజనులైన మెస్రం వంశీయులే అర్చకులు. మెస్రం వంశంలో 22 తెగలు ఉన్నాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశస్తులు. మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత.. ఇలాంటి ఇంటిపేర్లు గలవారంతా మెస్రం వంశంలోకే వస్తారు. ఏటా  జాతర ప్రారంభానికి నాలుగు రోజుల ముందే మెస్రం వంశీయులు కెస్లాపూర్‌ చేరుకొని అక్కడి మర్రిచెట్ల వద్ద కుటుంబ సమేతంగా బసచేస్తారు. మహాపూజ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. మెస్రం వంశ మహిళలు మట్టి కుండలలో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం నాగోబా దేవత పూజారి ప్రధాన్‌లతోపాటు మరో ఐదుగురు పెద్దలు నాగోబా గర్భగుడిలో గంగాజలంతో శుద్ధి చేసి, నాగోబా దేవతకు మహాపూజలు నిర్వహిస్తారు. ఈ పూజలో ఏడు రకాల పండ్లు, నవధాన్యాలు, పాలు, నెయ్యి, తీపి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇది చాలా కీలకమైన ఘట్టం. 22 పొయ్యిలపై వంటలు 

నాగోబా జాతర సందర్భంగా.. మెస్రం వంశానికి చెందిన మహిళలు మాత్రమే వంటలు చేసుకునేందుకు గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. వీటిపైనే సామూహిక వంటలు చేస్తారు. మహాపూజలకు కావలసిన నైవేద్యాలు కూడా ఇక్కడే వండుతారు. నాగోబా జాతర సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్దది. ఇది ఆదివాసీల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది దర్బార్‌ నిర్వహించకుండానే మెస్రం వంశీయులు నాగోబాకు సంప్రదాయ పూజలు చేశారు. అమావాస్యకు ముందురోజు మెస్రం వంశస్తులు ఒకేచోట తూం (పితృ కర్మ) పూజలు చేస్తారు. పుష్య అమావాస్య గడియ మొదలుకాగానే  తాము తీసుకువచ్చిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబాను అభిషేకించడంతో జాతర ప్రారంభమవుతుంది. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. నవవధువులు భేటీ (భేటింగ్‌ కియ్‌వల్‌) కనువిందైన ఘట్టం. కొత్తగా వివాహమైన వధువులను దేవుడికి పరిచయం చేసి, వారితో నాగోబాకు పూజలు చేయిస్తారు. 
-భాకే రఘునాథ్‌ రావు నమస్తే తెలంగాణ, ఆదిలాబాద్‌ ప్రతినిధి

VIDEOS

logo