ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sunday - Feb 21, 2021 , 01:03:47

స్వరాబిన్‌ సరిగమలు!

స్వరాబిన్‌ సరిగమలు!

కథనుబట్టి సాహిత్యం. సాహిత్యాన్నిబట్టి సంగీతం. ఇవి రెండూ చక్కగా కుదిరితేనే మైమరిపించే సరిగమలను సృజించవచ్చు. అలాంటి పాటలకు పెట్టనికోట.. మార్క్‌ కే రాబిన్‌. గొప్పకథలే మంచిపాటలకు ప్రేరణ అంటూ అత్యుత్తమ సంగీతాన్ని అందిస్తున్నారాయన. ‘అ!’, ‘మల్లేశం’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘జాంబిరెడ్డి’ వంటి చిత్రాలద్వారా సినీ అభిమానులను అలరించిన రాబిన్‌ స్వరాల సంగతులివి. 

కాలేజీ రోజులనుంచే సినిమాలకు మ్యూజిక్‌ చేయాలనే కోరిక ఉండేది. మా స్నేహితులు తీసిన పలు లఘు చిత్రాలకు సంగీతాన్నందించాను. ‘నీలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. సినిమాలకు ఎందుకు ప్రయత్నించకూడదు?’ అంటూ ఫ్రెండ్స్‌  ఒత్తిడి తెచ్చేవాళ్లు. వారి ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టాను. తొలుత సినీ ప్రయాణం ఆశించినంత సాఫీగా సాగలేదు. ఐదు సంవత్సరాలపాటు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నా. అవకాశాలిస్తామంటూ చాలామంది నా ట్యూన్స్‌ను వాడుకునేవారు. కొంతమంది డబ్బులు ఇచ్చేవారు కాదు. అయితే ఒడుదొడుకుల మధ్య కూడా నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, సినిమా ఛాన్స్‌ వస్తే బాగుంటుందని ఎదురుచూసేవాడిని. 

ఫిల్మ్‌ నగర్‌కు షిఫ్టయ్యా 

మా ఇల్లు పద్మారావ్‌నగర్‌లో ఉండేది. అక్కడినుంచి సినిమాల్లో అరంగేట్రానికి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటేనే నా కలలు సాఫల్యమయ్యే దారి దొరుకుతుందని ఫిల్మ్‌నగర్‌కు షిఫ్ట్‌ అయ్యాను. ఈ క్రమంలో నాకు గీత రచయిత కృష్ణకాంత్‌ పరిచయమయ్యారు. అతను నాకు కెరీర్‌ పరంగా సరైన మార్గదర్శనం చేశారు. కృష్ణకాంత్‌ ఓ సందర్భంలో నన్ను దర్శకుడు ప్రశాంత్‌వర్మకు పరిచయం చేశారు. ఆ టైమ్‌లో ప్రశాంత్‌వర్మ ‘డైలాగ్‌ ఇన్‌ ది డార్క్‌' షార్ట్‌ఫిల్మ్‌ చేశారు. ఆ లఘు చిత్రానికి వర్చువల్‌ ఆడియో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. 360 డిగ్రీల కోణంలో శబ్దాన్ని ఆస్వాదించే వీలుండటం వర్చువల్‌ ఆడియో ప్రత్యేకత. ఆ తరహా టెక్నాలజీ ఇప్పుడు కామన్‌ అయిపోయింది కానీ.. 2016లోనే షార్ట్‌ఫిల్మ్‌కోసం నేను ఆ టెక్నాలజీ ఉపయోగించాను. అది బాగా నచ్చడంతో ప్రశాంత్‌వర్మకు, నాకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత నేను చేసిన ‘మళ్లీ కలుద్దాం’ షార్ట్‌ఫిల్మ్‌కు ‘సైమా’ అవార్డు వచ్చింది. ‘ఢిల్లీ బెల్లీ’ లఘుచిత్రాన్ని నొయిడా ఇంటర్నేషనల్‌ అవార్డు వరించింది. ఒకరోజు ప్రశాంత్‌వర్మ పిలిచి, నాని ‘మజ్ను’ సినిమా ట్రైలర్‌కు మ్యూజిక్‌ ఇవ్వాలని కోరాడు. కేవలం గంటన్నర సమయంలోనే ‘మజ్ను’ ట్రైలర్‌ మ్యూజిక్‌ చేశాను. అది నానికి బాగా నచ్చింది. ‘ట్రైలర్‌కే ఇంత మంచి మ్యూజిక్‌ ఇచ్చావు. నీ దగ్గర ఎంతో టాలెంట్‌ ఉంది. ఫ్యూచర్‌లో మనం తప్పకుండా ఓ ప్రాజెక్ట్‌ చేద్దాం’ అని ఉత్సాహపరిచారు. ట్రైలర్‌ మ్యూజిక్‌కు నాకు ఆఫర్‌ చేసిన పారితోషికాన్ని కూడా వద్దన్నాను. ఫ్రెండ్‌షిప్‌ కోసం ఆ మ్యూజిక్‌ చేశాను కాబట్టి, డబ్బు లొద్దని సున్నితంగా తిరస్కరించా. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో నాని నిర్మించిన ‘అ’ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశమొచ్చింది. అలా ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఫలించి చిత్రసీమలోకి ప్రవేశించాను. 

అడాప్ట్‌ చేస్తేనే..  

నేను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా చేస్తానని చాలామంది చెబుతుంటారు. సినిమా కథకు నేపథ్య సంగీతం ఓ ఆత్మలాంటిదని నేను నమ్ముతా. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కంపోజ్‌ చేసే ముందు చాలా కసరత్తు చేస్తా.  పదేపదే ఆ సినిమా చూస్తూ ఆ కథతో, పాత్రలతో సహానుభూతి పొందే ప్రయత్నం చేస్తాను. ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు ఆ ఏజెంట్‌లాగానే ప్రవర్తించాను. సినిమాలోని క్యారెక్టర్స్‌ను అడాప్ట్‌ చేసుకున్నప్పుడే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత ఎఫెక్టివ్‌గా వస్తాయని నేను బలంగా నమ్ముతా. 

సంగీతం కోసమే..

సంగీతం విషయంలో మా నాన్నగారితోపాటు కావలిలో ఉంటున్న నా గురువు జోయల్‌ మాస్టర్‌ ఎంతగానో స్ఫూర్తినిచ్చారు. వారిద్దరి ప్రోత్సాహంతోనే సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఎంచుకున్నా. ఇళయరాజా, రెహమాన్‌ సంగీతాన్ని బాగా ఇష్టపడతాను. నాకు సంగీతం తప్ప మరో ప్రపంచం తెలియదు. నేను సంపాదిస్తున్న డబ్బుతో కార్లు, బైకులు, ఖరీదైన బట్టలు అస్సలు తీసుకోను. ప్రతి పైసా సంగీత వాయిద్యాలపైనే ఖర్చు పెడతాను. మ్యూజిక్‌ పరంగా నన్ను నేను మరింతగా ఉన్నతీకరించుకోవాలని తపిస్తుంటాను. ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రానికి సంగీతాన్నందిస్తున్నా. మారుతిగారి ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాతోపాటు ‘ఆహా’ ఓటీటీలో ‘త్రీ రోజెస్‌' చిత్రానికి పనిచేస్తున్నా. సుమంత్‌తో చేసిన ‘అనగనగా ఓ రౌడీ’ విడుదలకు సిద్ధమవుతున్నది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలకు సంగీతాన్ని అందించడమే నా తక్షణ కర్తవ్యం. నా కలలన్నీ మ్యూజిక్‌తోనే ముడిపడి ఉన్నాయి.

కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు 

నేను ఇప్పటివరకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన ‘అ’, ‘మల్లేశం’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలన్నీ కాన్సెప్ట్‌ ప్రధానంగా రూపుదిద్దుకున్నవే. స్వతహాగా నాకు ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్స్‌, థీమ్స్‌ బాగా ఇష్టం. ఆ జోనర్‌ సినిమాలకు మ్యూజిక్‌ చేస్తే ప్రయోగాలు చేసే వీలుంటుందని నమ్ముతాను. ‘జాంబిరెడ్డి’ సినిమా కమర్షియల్‌ పంథాలో తీసిన తొలి తెలుగు జాంబి జోనర్‌ చిత్రం. ఈ సినిమా మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాద్వారా లభించిన గుర్తింపుతో ప్రస్తుతం పెద్ద సినిమాల అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తులో అగ్రహీరోల చిత్రాలకు పనిచేయాలనే ఆకాంక్ష ఉంది.రాజమౌళి ప్రశంస 

నాకు కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలపై అవగాహన ఉంది. భవిష్యత్తులో ఏ సినిమాలోనైనా సంప్రదాయ స్వరాల అవసరం ఉంటే తప్పకుండా కంపోజ్‌ చేస్తాను. దర్శకుడి అభిరుచులకు అనుగుణంగా సంగీతాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తాను. స్వరాల్ని సమకూర్చే సమయంలో ఒక్కోసారి దర్శకులను కూడా ఆహ్వానిస్తా. వాళ్లకు నచ్చిన బాణీలు వచ్చేంతవరకు విరామం లేకుండా పనిచేస్తా. దర్శకులందరికీ సంగీత పరిజ్ఞానం ఉండదు కాబట్టి, శాంపిల్‌ ట్యూన్స్‌ వినిపిస్తే వారికి ఎలాంటి పాట కావాలో ఐడియా వస్తుందని నేను భావిస్తా. ‘అ’ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళిగారు నా పనితనం బాగుందని మెచ్చుకున్నారు.కథే ప్రేరణ సంగీతం

సప్తస్వరాల కలబోత. ఆ ఏడు రాగాలతోనే కొన్ని కోట్ల పాటలు ప్రాణం పోసుకుంటాయి. ఈ క్రమంలో కొన్ని పాటలు వింటుంటే ఎక్కడో విన్నామనే భావన కలుగుతుంది. అలాంటి పాటల్ని కాపీ అనలేం. అయితే ట్యూన్‌ను యథాతథంగా తస్కరించి వాడటం మాత్రం కచ్చితంగా కాపీ కిందికే వస్తుంది. కాపీ సంగీతం చేస్తే తప్పకుండా ఎవరో ఒకరు గుర్తిస్తారు. దానివల్ల సంగీత దర్శకులకు చెడ్డ పేరొస్తుంది. అలాంటి కాపీ సంస్కృతి నాకు నచ్చదు. ఇక, మంచి పాట పుట్టాలంటే సినిమా కథ బాగుండాలి. దర్శకుడికి ఆ కథను మ్యూజిక్‌ డైరెక్టర్‌కు అర్థవంతంగా వివరించి, తాను కోరుకున్న ఫలితాన్ని రాబట్టుకునే నేర్పు ఉండాలి. అంతిమంగా మంచి పాట సృజనకు గొప్ప కథే కారణమవుతుంది. ‘మల్లేశం’తో పురస్కారం

నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను కాబట్టి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై చక్కటి అవగాహన ఉంది. అందుకే ‘మల్లేశం’ సినిమాకు దర్శకనిర్మాతలు కోరుకున్న విధంగా సంగీతాన్ని అందించగలిగాను. ‘మల్లేశం’ కథ వినగానే ఎంతో స్ఫూర్తివంతంగా అనిపించింది. ఆ సినిమాకోసం నల్లగొండ జిల్లాలోని మల్లేశం స్వగ్రామానికి వెళ్లి ఆయన్ని కలిశాను. సంగీతపరంగా విస్తృత పరిశోధన చేశాను. తెలంగాణలో ఉపయోగించే సంప్రదాయ వాద్యాలు ఏమిటో తెలుసుకున్నా. అయితే, ఆ సినిమా బృందంలోని కొంతమంది నా పేరును చూసి ‘ఇతను వెస్ట్రన్‌ మ్యూజిక్‌ మాత్రమే చేయగలడని అనిపిస్తున్నది. తెలంగాణ నేపథ్య చిత్రానికి పని చేయలేడు. సంగీత దర్శకుడిగా తీసుకోవద్దు’ అని దర్శకనిర్మాతలకు సూచించారట. ఈ విషయాలన్నీ తెలుసుకొని ‘మల్లేశం’ సినిమాను ఓ సవాలుగా తీసుకొని పనిచేశా. ‘మిర్చి’ మ్యూజిక్‌ అవార్డ్స్‌లో జెర్సీ, ఇస్మార్ట్‌శంకర్‌, సాహో వంటి పెద్ద సినిమాలను అధిగమించి ‘మల్లేశం’ బెస్ట్‌ మ్యూజిక్‌ అవార్డును కైవసం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది.


VIDEOS

logo