ఒక్కడే వచ్చి.. ఊరినే పొందిచ్చి

అనుకోని పరిస్థితుల్లో సొంతూరిని వదిలిన వ్యక్తి, ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించాడు. 90 ఏండ్ల క్రితం ఒక్కడిగా అడవిలో అడుగు పెట్టినా, ప్రస్తుతం 60 మందికిపైగా కుటుంబసభ్యులను సంపాదించుకున్నాడు. చెన్నంగలగడ్డ గ్రామాన్ని తన అడ్డాగా మార్చుకున్న 105 ఏండ్ల రామయ్య తన వారసులందరికీ అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేశాడు. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఊరంతా తన రక్తసంబంధీకులే. అందరితో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు ఆ పెద్దాయన.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కారుకొండ గ్రామానికి చెందిన కుంజా లచ్చయ్య, బుచ్చమ్మ దంపతుల పెద్దకొడుకు రామయ్య. ఇతనే మన కథా నాయకుడు. గొడవల కారణంగా 90 ఏండ్ల క్రితమే సొంతూరుని వదిలిపెట్టాడు రాము. కొన్నిరోజులపాటు అనేక గ్రామాలు తిరిగాడు. నిలువ నీడలేక అష్టకష్టాలు పడ్డాడు. ఏం చేయాలో తెలియక, బయ్యారం మండలంలోని పెద్దగుట్ట అటవీప్రాంతంలో పూరి గుడిసె వేసుకున్నాడు. ఆ తర్వాత సొంతూరిలోని తల్లిదండ్రులను తీసుకొచ్చి, తన వద్దే ఉంచుకున్నాడు. చుట్టుపక్కల అడవిని పోడు చేసుకొని వ్యవసాయం ప్రారంభించాడు. కొన్నిరోజులకు రామచంద్రాపురానికి చెందిన పిచ్చమ్మను పెండ్లి చేసుకొన్నాడు. ఇద్దరు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు పుట్టారు. పిల్లలంతా తన కండ్లముందే ఉండాలన్నది రామయ్య ఆశ. అందుకే, కొడుకులూ కూతుళ్లకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారితోనే పెండ్లిళ్లు చేశాడు. కూతుళ్లకు కట్నం కింద అర ఎకరం పొలంతోపాటు వ్యవసాయం చేసుకునేందుకు ఎడ్లను కూడా ఇచ్చాడు. వాళ్లుకూడా తన ఇంటి పక్కనే ఉండాలని కొడుకులతోపాటు కూతుళ్లకూ ఇంటి జాగాలు సమకూర్చాడు. దీంతో, అంతా అక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే, ఎత్తయిన ప్రదేశం (గడ్డ) మీద చెన్నెంగల చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్రామానికి ‘చెన్నంగల గడ్డ’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం అక్కడ 16 కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది వరకూ జీవనం సాగిస్తున్నారు. వీరందరూ రామయ్య రక్త సంబంధీకులే.
కలిసికట్టుగా జీవనం
చెన్నంగల గడ్డలో రామయ్య నాలుగుతరాల వారసులు జీవిస్తున్నారు. సౌకర్యం కోసం వేర్వేరుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నా, అందరూ కలిసి కట్టుగానే ఉంటారు. పండుగలు, శుభకార్యాలు కలిసే జరుపుకొంటారు. ఇప్పటివరకూ ఎలాంటి గొడవలూ రాలేదు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా ఉంటారు. 105 ఏండ్ల వయస్సులోనూ రామయ్యకు ఎలాంటి అనారోగ్యాలూ లేవు. వారసులకు కూడా రామయ్య మాట అంటే ఆదేశమే. ఆయన ఆలనాపాలనా ఇద్దరు కొడుకులూ చెరో ఏడాది చూసుకుంటారు. వారసులు కూడా ఎంతో ఆప్యాయంగా మెదులుతుంటారు. ‘అప్పట్లో వరిబువ్వ తక్కువ, జొన్న గడక, అరికెల బువ్వ, సజ్జ రొట్టెలు లాంటివి తినడం వల్లే ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. తెలంగాణ రైతాంగ పోరాటంలో పనిచేసిన. రజాకార్ల చేతిలో దెబ్బలు కూడా తిన్నా’ అంటూ జ్ఞాపకాల్ని పంచుకున్నాడు రామయ్య తాత.
ఆ గ్రామస్తులంతా రక్త సంబంధీకులే
ఆయనే మాకు ఆదర్శం
మా నాన్నే మాకు ఆదర్శం. ఆయన మాటను అందరం పాటిస్తాం. వారసులంతా తన దగ్గరే ఉండాలని కోరుకునేవాడు. అందుకే ఒకే ఊరిలో ఉంటున్నాం. వేర్వేరు ఇండ్లలో ఉంటున్నా, అందరం కలిసికట్టుగానే ఉంటాం. పండుగలు కలిసే
చేసుకుంటాం.
- కుంజా ముత్తయ్య, రామయ్య పెద్దకొడుకు
ఇంటి జాగ ఇచ్చిండు
కొడుకులతో సమానంగా నాకు కూడా ఇంటి జాగ, పొలం, రెండు ఎడ్లు ఇచ్చిండు నాయన. పెండ్లి తర్వాత కూడా ఆడబిడ్డలు తన కండ్లముందే ఉండాలన్నది ఆయన కోరిక. అందుకే నాయిన ఇచ్చిన జాగలోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నా. నాయనను మేమందరం మంచిగా చూసుకుంటాం.
- రాములమ్మ, రామయ్య పెద్దబిడ్డ
దాదా అంటే ఇష్టం
మా దాదా అంటే మాకు ఎంతో ఇష్టం. మాతో ఎప్పుడూ మంచిగా మాట్లాడుతాడు. ఇంట్లోవాళ్లు అందరు కూలీ పనులకు వెళితే, దాదా మమ్ముల్ని చూసుకునేవాడు. ఇప్పటికీ మాకు తెలియని అనేక విషయాలు చెబుతాడు. ఆయనకు 105 ఏండ్లు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. పిల్లలందరం ఒకేచోట ఆనందంగా ఉంటున్నాం.
- అంజలి, రామయ్య ముని మనవరాలు
-వేమిశెట్టి సతీశ్
తాజావార్తలు
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర