ఊరంతా.. మీసాల ఆసాములే!

నూనూగు మీసం యవ్వనాన్ని పరిచయం చేస్తుంది.మిరమిర తిప్పిన మీసం పౌరుషాన్ని తెలియజేస్తుంది. సంపంగి నూనె పట్టించుకున్న దట్టమైన మీసం ఆ వ్యక్తి స్థాయిని చెబుతుంది. మెలితిప్పిన మీసం పరువు ప్రతిష్ఠల్ని ప్రదర్శిస్తుంది. మీసాల వెనుక ఇంత విషయం ఉంది. ఈ విశేషాలతో ఏ సంబంధం లేకుండా ఆ ఊళ్లోని ఆసాములంతా బారెడు మీసాలతో దర్శనమిస్తారు. అలాగని వారు క్షత్రియ పుత్రులు కారు, రాచరికపు వారసులూ కారు! ఇంతకీ ఎక్కడుందా ఊరు? ఏమిటా మీసాల జోరు? చదివేయండి..
అది లింగంపల్లి ఉరఫ్ మీసాలపల్లి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఉంటుందీ పల్లె. మెదక్ జిల్లాతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ గ్రామంలో ఇంటింటికీ మీసాల రాయుళ్లు దర్శనమిస్తారు. బుర్రమీసాల తాతలు, మెలితిప్పిన మీసాలున్న మామయ్యలు, మీసాల పోషణలో నిమగ్నమైన చాకుల్లాంటి కుర్రాళ్లూ ఇలా ఎందరెందరో మీసాల చుట్టూ తిరుగుతుంటారు. ఈ మీసాల గోల ఇప్పుడు మొదలైంది కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. దశాబ్దాల కిందట రజాకార్ల అరాచకాలు ప్రబలిన రోజుల్లో ప్రాణాలొడ్డి మానప్రాణాలు కాపాడుకున్నారట లింగపల్లి వీరులు. ఎవరైనా తమ జోలికి వస్తే వదిలేది లేదనే సంకేతం ఇవ్వడానికి మీసాలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ఆనాటి నుంచి మీసాలను పౌరుషానికి ప్రతీకగా భావించారు వాళ్లు. మీసం మెలి తిప్పడాన్ని జీవన విధానంలో భాగం చేసుకున్నారు.
వీరప్పన్.. పెదరాయుడు..
లింగంపల్లిలో 200 పైచిలుకు కుటుంబాలున్నాయి. గ్రామ జనాభా 1200 పైమాటే. ప్రధాన ఆధారం వ్యవసాయం. పుష్కలమైన జలవనరులు ఉండటంతో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో సస్యశ్యామలంగా కనిపిస్తుంది. ఈ పల్లె గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ విశేషాలేవీ ప్రస్తావనకు రావు. ఎంతసేపూ మీసాల రాయుళ్ల గురించే చర్చించుకుంటూ ఉంటారు పరిసర గ్రామాల ప్రజలు. రజాకార్ల జమానాలో మొదలైన ఈ మీసాల కథ.. తరాలు మారినా అంతే జోరుగా కొనసాగుతున్నది. ఊళ్లోని మగాళ్లలో సగానికి సగం మంది మెలితిరిగిన మీసంతో దర్శనమిస్తారు. వయసు మళ్లిన వృద్ధులైతే, రచ్చబండ దగ్గర కూర్చొని తమ మీసాల వీరగాథలు చెబుతూ ఉంటారు. మీసాలపై మోజులేని వాళ్లపై పదునైన పంచ్‌లు విసురుతుంటారు. ఈ మీసాల రాజులకు కుర్రకారు వేసే కౌంటర్లు విచిత్రంగా ఉంటాయి. గుబురు మీసాల తాతయ్యను వీరప్పన్ అని, మెలితిప్పన ఆసామిని పెదరాయుడు అనీ ఆటపట్టిస్తుంటారు. ఎవరేమన్నా.. వాళ్లు మాత్రం మీసాలపై మక్కువ ప్రదర్శిస్తూనే ఉంటారు. మీసాలపై నిమ్మకాయలు నిలబెడతామని చాలెంజ్లూ విసురుతుంటారు. మీసాలే తమ కేరాఫ్‌గా భావిస్తుంటారు. ఏపుగా పెరిగిన మీసాల్ని దువ్వెనతో దువ్వుకుంటూ దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇక గ్రామంలో పెండ్లి, పండుగల వేళ ఈ మీసాలరాయుళ్ల సందడి అంతాఇంతా ఉండదు. అతిథుల దృష్టంతా వీరి మీసాలపైనే ఉంటుంది. ఆ తరంతో పోలిస్తే యువతకు మీసాలపై మోజు తగ్గిందంటారు గ్రామస్తులు. పైచదువుల కోసం పట్నం బాట పట్టిన యువకులు ట్రెండ్‌కు తగ్గట్టుగా క్లీన్ షేవ్‌తో ఊళ్లోకి అడుగుపెడుతున్నారు. కాకపోతే ఊళ్లో ఉన్నన్ని రోజులు మీసాలు కత్తిరించుకునే సాహసం చేయరు. పెద్దల మీద గౌరవంతో ఆ పనికి పూనుకోమని యువకులు చెబుతుంటారు. నిజమే, ఆ పల్లె వారసత్వ సంపద.. మీసాలు. సంపెంగ నూనెలు కాకపోయినా, కొబ్బరి నూనె పూసుకుని అయినా కాపాడుకుంటారు!
మీసాలకో మాసం
మీసాల్లో భారతీయులకు తిరుగులేని చరిత్ర ఉంది. పురాణేతిహాసాలు మొదలు నిన్నమొన్నటి చరిత్ర వరకు యోధులుగా పేరున్న వారి చిత్రాలన్నీ మెలితిప్పిన మీసాలతోనే కనిపిస్తాయి. ‘ముంజేతికి మీసం మొలిపిస్తాం’ అనే మాట పౌరుషానికి పరాకాష్టగా ప్రయోగిస్తుంటారు. అంతేకాదు నవంబర్‌కు మీసాల మాసంగా పేరు కూడా ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఈ నెలలో మీసాలు కత్తిరించుకోరు. నవంబర్‌ను మువంబర్గా పిలుచుకుంటారు.
-జూపల్లి రమేష్, నిజామాబాద్ ప్రతినిధి
తాజావార్తలు
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్
- వాట్సాప్‌లో నెలకు ఎన్ని మేసెజ్‌లు వెళ్తాయో తెలుసా?