సోమవారం 08 మార్చి 2021
Sunday - Feb 21, 2021 , 00:52:01

అత్యంత అరుదు.. మానవాకృతశిలలు

అత్యంత అరుదు.. మానవాకృతశిలలు

తెలంగాణ చరిత్రలో బృహత్‌ శిలాయుగం ప్రత్యేకమైంది. ఈ కాలానికి (ఇనుప రాతియుగానికి) సంబంధించిన వేలకొద్దీ స్థావరాలు, సమాధులకు మన రాష్ట్రం వేదికైంది. స్థానికంగా ముడి ఇనుము లభించడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లోని అడవుల్లో 1868వ సంవత్సరంలో ముల్హర్న్‌ అనే శాస్త్రవేత్త వేలాది సమాధులను కనుగొన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందునుంచి 75 కి. మీ.ల దూరంలో గలభ అనే గ్రామం ఉంది. దీనికి సమీపంలోని అటవీప్రాంతంలోనే ‘గలభగుట్ట’ ఉన్నది. సుమారు 300 అడుగుల ఎత్తయిన ఈ గుట్టమీద వందలాది మెగాలిథిక్‌ సమాధులున్నాయి. 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ, 1991లో అదే శాఖకు చెందిన రంగాచారి, గోవిందరెడ్డి, 2000లో ప్రొఫెసర్‌ పుల్లారావు బృందం చేపట్టిన పరిశోధనల ఫలితంగా వీటిగురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ మూడు రకాల సమాధులను గుర్తించారు. అవి :

  •  వృత్తాకార నిర్మాణం లేని డోల్మన్లు (300)
  •  వృత్తాకార నిర్మాణమున్న డోల్మన్లు (40)
  •  వృత్తాకారపు రాతి బంతుల డోల్మన్లు (40)

ఈ డోల్మన్లకు అనుబంధంగా ప్రపంచంలోనే అత్యంత అరుదుగా కనిపించే ‘ఆంథ్రోపోమార్ఫిక్‌' శిలలు ఉన్నాయి. డోల్మన్‌ సమాధుల మధ్యలో గానీ, తూర్పు, దక్షిణ దిక్కులలోగానీ వీటిని ఏర్పాటుచేశారు. పూర్వీకుల జ్ఞాపకార్థం వేసిన ఇలాంటి శిలువ రాళ్లు ప్రపంచంలోరు అరుదు. ఇవి మానవాకృతిని పోలి ఉంటాయి. కానీ, శరీర భాగాలు స్పష్టంగా ఉండవు. చాలావరకు రాతిపై భుజాల వరకే చెక్కి ఉంటారు. అస్పష్టమైన తల భాగాన్ని కలిగి ఉంటాయి. వీటిలో స్త్రీ, పురుషరూపాల శిలలు వేరువేరుగా చెక్కి ఉండటం విశేషం. ఆయా శిలలమీద చెక్కిన వక్షోజాకృతుల ద్వారా లేదా వాటి పరిమాణాన్నిబట్టి ఆ తేడాను గుర్తించవచ్చు. పురుషరూప శిలలతో పోలిస్తే స్త్రీరూప శిలలు పరిమాణంలో పొట్టిగా ఉంటాయి. వీటిని స్థానికంగా దొరికే ఇసుకరాతితో నిర్మించారు. 

విదేశీ శాస్త్రవేత్తల పరిశోధనలు

ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ నిర్మాణాలను అమెరికా క్యాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం అరుదైనవిగా గుర్తించి, అధ్యయనానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో వీటిని శాన్‌ డియాగో వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ లెవీ పరిశీలించారు. సంఖ్యా పరంగానూ, ఆకృతి విషయంలోనూ భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక ఎంతో బలమైన చరిత్ర ఉన్నదని సదరు విశ్వవిద్యాలయం నిర్ధారించింది. గోదావరి తీరం వెంట భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి, దామరవాయి, జానంపేటతోపాటు ఖమ్మం జిల్లాలోని దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలభ, గుండాల.. అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇలాంటి సమాధులున్నాయి. వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకూ తేలలేదు. తాజాగా, సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వీటిని నిర్మించినవారు వలస జీవులని తేలింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కె.పుల్లారావు ఆధ్వర్యంలో ఖమ్మం ప్రాంతంలో ఉన్న సమాధుల్లోని ఎముకల డీఎన్‌ఏను సీసీఎంబీ పరీక్షించింది. అది స్థానికుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని పరిశోధకులు భావించారు. ఈ సమాధులన్నీ వలస జీవులవేనని కె.పుల్లారావు అభిప్రాయపడ్డారు. దీన్ని నిర్ధారించడానికి సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లోనూ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని సీసీఎంబీ భావిస్తున్నది. ఇలాంటి స్త్రీ, పురుష రూపాల శిలలను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మీదిమల్ల గ్రామం, తెలంగాణలోని దొంగతోగు, కాటాపూర్‌ గ్రామాల్లోనూ గుర్తించారు. మరణానంతరం కూడా జీవితం కొనసాగుతుందని, ఆత్మకు చావు లేదని బృహత్‌ శిలాయుగపు ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆత్మలకు కూడా కోరికలు ఉంటాయనీ, బతికున్న వారు వాటిని తీర్చాలనీ, లేకుంటే వారి పశువులను ఆత్మలు బలి తీసుకుంటాయనీ బలంగా నమ్మేవారు.  పునర్జన్మల మీదున్న ఆ విశ్వాసంతోనే మృతుల అవశేషాలను ప్రకృత్తి విపత్తులు, జంతువుల నుండి రక్షించుకోవడానికి ఇలాంటి సమాధులను నిర్మించారు. వేలాది ఏండ్లు గడిచినా కూడా ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. లోతైన అధ్యయనాలు జరిపితే చరిత్ర గతిని మార్చే సత్యాలు బయటికి రావచ్చు.ఎంతో అద్భుతం

తాడ్వాయి అటవీ ప్రాంతంలోని మెగాలిథిక్‌ సమాధుల ప్రాంతం ఎంతో అద్భుతమైంది. తెలంగాణ ప్రాంత సామాజిక పరిణామాల గురించి మనకు తెలియని ఎన్నో విశేషాలను ఇవి తెలియజేస్తాయి. సంప్రదాయ పద్ధతిలో పురావస్తు తవ్వకాలతోపాటు ఆధునిక పద్ధతిలో రాడార్‌, లైడార్‌ సర్వేలు, కార్బన్‌ డేటింగ్‌ ప్రక్రియలను ఉపయోగించి ఇక్కడ మరిన్ని పరిశోధనలు జరపాలి.

- థామస్‌ ఈవాన్‌ లేవి, ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త-

ప్రొఫెసర్‌, శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం

-అరవింద్‌ ఆర్య , 7997 270 270 

VIDEOS

logo