సోమవారం 08 మార్చి 2021
Sunday - Feb 21, 2021 , 00:12:18

మూడు తరాలు ముచ్చటైన స్వరాలు

మూడు తరాలు ముచ్చటైన స్వరాలు

భారతీయ సంస్కృతిలో సంగీతం ఓ అంతర్భాగం. సప్తస్వరాలనే వారసత్వ ఆస్తిగా భావించిన సంగీత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోవకే చెందుతుంది జక్కెపల్లి వంశం.  సంగీతజ్ఞులకు పుట్టిల్లు ఈ కుటుంబం. మూడు తరాలుగా సంగీత సాధనలో తరిస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు చెందిన జక్కెపల్లివారు. 

కాలాన్ని మరిపించి, మానసిక ఆనందంతోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదించే దివ్యౌషధం సంగీతం. రాళ్లనైనా కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానికుంది. అలాంటి సంగీతాన్ని తమ వారసత్వ సంపదగా మలుచుకున్నారు జక్కెపల్లి వంశీయులు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో అపార ప్రావీణ్యం వీరి సొంతం. తమ అమృత గానంతో, అసాధారణ వాద్య ప్రతిభతో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక కచేరీలు నిర్వహించి అశేష కీర్తిని గడించారు. తమ సంగీత పరిజ్ఞానంతో వంశానికి వన్నె తేవడమే కాదు, చెన్నూరు పట్టణానికి సైతం కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు.

స్వర శిరోమణి కృష్ణశాస్త్రి..

ఉమ్మడి జిల్లా ఆణిముత్యాల్లో ఒకరు స్వర శిరోమణి జక్కెపల్లి కృష్ణశాస్త్రి 1918 అక్టోబర్‌ 26న చెన్నూరులో జన్మించారు. ఆయన హయాంలోనే ఆ ఇంట సంగీత సరస్వతి కొలువుదీరింది. సంగీతం నేర్చుకోవాలనే తపనతో 11వ ఏట ఇంటినుంచి పారిపోయారు కృష్ణశాస్త్రి. మహారాష్ట్రలో యాయవరం (వారాలు ఉండటం) చేసి సంగీత గురువుల దగ్గర స్వరభిక్ష పొందారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను ఆపోసన పట్టారు. పంచవాద్యాల (సితార్‌, తబలా/ మృదంగం, హార్మోనియం, వేణువు, వయొలిన్‌)పై పట్టు సాధించారు. ‘ఖేల్‌కర్‌' మహారాజాలాంటి సంగీత సమ్రాట్టులను సైతం తన గాత్ర విన్యాసంతో ఓడించి ఘన సన్మానాలు అందుకున్నారు. మహారాష్ట్రలోని పలు సంస్థానాల్లో కచేరీలు నిర్వహించి అనేక బిరుదులు పొందారు. చెన్నూరులో ఉమామహేశ్వర నాటక సమాజాన్ని స్థాపించి పౌరాణిక, చారిత్రక నాటకాలను ప్రదర్శింపజేశారు. సంగీత, నాటక రంగాలను ప్రోత్సహిస్తూనే అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారు కృష్ణశాస్త్రి. చెన్నూరు శ్రీ అంబా అగస్త్యేశ్వరాలయంలో కల్యాణ మంటపం, పారుపల్లిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, చెన్నూరు ప్రాథమికోన్నత పాఠశాల  భవన నిర్మాణాలకు నిధులు సమకూర్చారు.   

తండ్రికి తగ్గ తనయులు

కృష్ణశాస్త్రి తన కళనే ‘ఆస్తి’గా సంతానానికి పంచి ఇచ్చారు. వారి పెద్దకొడుకు జక్కెపల్లి మధూకర్‌ వృత్తిరీత్యా లెక్చరర్‌. డైట్‌ కళాశాలలో ఉపన్యాసకుడిగా పదవీ విరమణ పొందారు. కర్ణాటక, హిందుస్థానీ గాత్రంతోపాటు హార్మోనియంలో నిష్ణాతులు. ఈలపాట రఘురామయ్యకు హార్మోనియం వాద్యంలో సహకారం అందించారు. ఈయన కుమారుడు ఫణి సైతం సంగీతంలో ఎంఏ పట్టా అందుకున్నారు. కృష్ణశాస్త్రి మరో తనయుడు హిమాకర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే సంగీత కళాకారుడిగా వినుతికెక్కారు. తంబుర, తబలా, హార్మోనియం, ఫ్లూట్‌ వాద్యాలను పలికించడంలో పేరెన్నికగన్నారు. వీరి కుమారుడు గురుచరణ్‌  హార్మోనియం మెట్లపై అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తూ తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నారు. కృష్ణశాస్త్రి మరో కుమారుడు ముక్తేశ్వర్‌ సహకార బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు. చిన్నప్పటి నుంచీ సంగీతంలో విశేష ప్రతిభ కనబర్చేవారు. మృదంగం, తబలా వాయించడంపై పట్టు సాధించారు. ఈయన కుమారుడు గిరీశ్‌కుమార్‌, కూతుళ్లు సౌమ్య, సుమ  సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారే! కృష్ణశాస్త్రి ఆరో సంతానం నాగేశ్వర్‌ జాతీయస్థాయి సంగీత కళాకారుడిగా ఎదిగారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే వెయ్యికి పైగా కచేరీలు నిర్వహించారు. వీరి సంతానం కూడా సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తుండటం విశేషం. ఇలా జక్కెపల్లి వంశమంతా సంగీత అంశతోనే అలరారుతున్నది. సరిగమలనే ఆస్తులుగా పంచుతున్నది.

కూతుళ్లూ విదుషీమణులే

జక్కెపల్లి కృష్ణశాస్త్రి కూతుళ్లు సైతం విదుషీమణులుగా గుర్తింపు పొందారు. ఆయన పెద్ద కుమార్తె దివంగత రేగళ్ల శ్యామలది అమృత గాత్రం. హార్మోనియం వాయించడంలో నేర్పరి. రేడియో కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు రచించిన గీత రామాయణానికి నాగేశ్వర్‌రావుతో కలిసి శ్యామల స్వరాలు సమకూర్చారు. ఆమె కుమారులు శ్రీనివాస్‌, భూషణ్‌ శర్మ కూడా సంగీత కళాకారులే. కృష్ణశాస్త్రి మరో కూతురు విమలాబాయి సంగీతజ్ఞురాలు. ఆమె కొడుకులు పురోహితులుగా పనిచేస్తూనే భజన పాటలు పాడటంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

-కొమ్మెర రామమూర్తి

VIDEOS

logo