పలుకుబడులు

బండి విరుగుతె ఎడ్లు కాయవచ్చు
ఏ పనీ చేతకాక కులవృత్తిని పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా, అప్పనంగా తింటూ తిరిగే సోమరి పోతుల గురించి మాట్లాడుతూ ఈ సామెతను వాడుతుంటారు. ‘వీడేంది రా ఏ పని చెప్పినా చెయ్యడు. పొద్దస్తమానం తిని తిరుగుతనే ఉంటడు. బండి విరుగుతె ఎడ్లు కాయవచ్చు అన్నట్టు బతుకుతడు! ఏంది వీని కథ’ అంటుంటారు పెద్దలు. ఒకప్పుడు ఎడ్లబండి కుటుంబానికి ఆదెరువు. ఎవుసం దగ్గర్నుంచి సుదూర ప్రయాణాల వరకూ అదే ఆధారం. ఎవుసంలో ఎడ్లబండిదే కీలకపాత్ర. దుక్కి దగ్గర్నుంచి, పంట ఇంటికి చేరేదాక ఎడ్లు, బండి ఉండాల్సిందే. ఆ విలువ తెలియక బండి విరిగితే హాయిగా ఎడ్లు కాచుకోవచ్చు అనుకున్నడట ఓ ప్రబుద్ధుడు. ఇలాంటి వ్యక్తులకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది.
ఆడొట్టి ‘పునుకుడు’ చేతులోడు..
ఈ పదబంధంలో పునుకుడు అంటే చేతిలో ఉన్న వస్తువును జాగ్రత్తగా పట్టుకోకుండా జారవిడువటం. అలా వచ్చిందే ‘పునుకుడు సేతులకు అనుకుడు రోగం’ అనే సామెత. గ్రామాల్లోని చెరువులో నీరు తక్కువ అయినప్పుడు చేతులతో చేపలు పట్టే సందర్భంలో.. పునుకుడు అనే పదం బాగా వినిపిస్తుంది. అయితే అలా చేపలు పట్టేటప్పుడు కొన్ని చేపలు చేతిలో చిక్కినట్టే చిక్కి చేతివేళ్ల మధ్యలో నుండి జారిపోతాయి. అలాగే ఎవరైనా ఏదైనా వస్తువుని జాగ్రత్తగా పట్టుకోకుండా జార విడిస్తే అతన్ని ‘పునుకుడు చేతులోడు’ అంటారు.
తొలుసూరోనికే తొలంగిలు..
మొదటగా పుట్టిన బిడ్డ, తొలిసూరు గొడ్డు, ప్రేమతో మొదట కొన్న వస్తువు.. ఇలా మొదటి వాటిపైనే ప్రేమ చూపించి రెండోవాటిపై పక్షపాతం చూపించే సందర్భంలో ఈ సామెతను విరివిగా వాడతారు. ఎక్కడైనా ‘తొలుసూరోనికే తొలంగిలు.. మలుసూరోనికి మారంగిలు అర్థమైందారా అబ్బాయ్!’ అంటుంటారు. ఈ సామెత అర్థం ఏంటంటే.. మొదట పుట్టినోని మీద ఉన్న పట్టింపు రెండోవానిమీద ఉండదు. ఇలాంటిదే మరో సామెత ‘తొలుసూరోనికి తొమ్మిది అంగీలు.. మలుసూరోనికి మారు అంగీ లేదు’. అనుబంధాల విషయంలోనే కాదు, చేసే పనుల్లోనూ పక్షపాతం చూపినప్పుడు ఈ రకం సామెతలు ఉపయోగిస్తుంటారు.
‘ఒడిపిలి’ తిన్న ఒళ్లురా ఇది..
‘రేయ్ బిడ్డా ఏమన్కున్నవ్! నా జోలికత్తవా!! దా సూసుకుందాం. ఇది ఒడిపిలి తిన్న ఒళ్లురా’ అని పెద్దోళ్లు అంటుంటారు. ‘ఒడిపిలి’ అనే పదం నేటి యువతరానికి తెలియకపోవచ్చు. కానీ కరువు కాలంలో మన ముత్తాతలకు బతుకునిచ్చింది ఒడిపిలి బువ్వ. కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, వరిగెలు వంటి అనేక తృణధాన్యాల్లో ఇదీ ఒకటి. ఇది గట్టి పైపొట్టు (ఫైబర్) కలిగిన ఆహారం. కానీ వరి వంగడ సామ్రాజ్యం విస్తరించాక ఇదొక కలుపుమొక్కగా మారిపోయింది. ‘ఒలిపిడి’ అంటే ఒకప్పుడు లేనోళ్లబువ్వ. ‘అట్టి చేపలకూర ఒడిపిల్ల మెతుకులు.. బుక్కన్న తినిపోడె ఈని రేసు మెుకం మీద మన్నువడ’ అని ఎనకటికి ఓ జానపద గేయం కూడా ఉంది.
-డప్పు రవి
తాజావార్తలు
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత