పుస్తక సమీక్ష

‘సినిమా’ చదివేద్దాం!
మనిషి ప్రత్యేక లక్షణం అనుభూతి చెందడం. ఒక కళారూపాన్ని ఆస్వాదించాలంటే దాన్ని సరిగ్గా అనుభూతి చెందగలగాలి. ఇందుకోసం దానిలోని విషయాలు మనకు సరిగ్గా కమ్యూనికేట్ కావాలి. ఏదైనా పరభాషా చిత్రాన్ని.. అందులోని సన్నివేశాలు, నటీనటుల హావభావాల ఆధారంగా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ, ఆ చిత్రాన్ని పూర్తిగా అనుభూతి చెందాలంటే మాత్రం భాష తెలియాల్సిందే. ఇంగ్లిష్‌పై పట్టు ఉన్నా హాలీవుడ్ సినిమాల్లో పలికే భాష విరుపులు అర్థం కాకపోవచ్చు. దాంతో ఆయా సినిమాల సాహితీ స్వరూపాన్నీ, కళాస్వాదనను మిస్సవుతాం. అలా కాకుండా హాలీవుడ్ సినిమాను కూడా తెలుగు సినిమా అంత బాగా ఆస్వాదించగలగాలంటే.. ప్రముఖ రచయిత్రి శ్రీదేవీ మురళీధర్ రాసిన ‘నా హాలీవుడ్ డైరీ’ పుస్తకం చదవాల్సిందే. రచయిత్రి చెప్పినట్టు సబ్ టైటిల్స్ మీద ఆధారపడి సినిమా చూస్తే నటీనటుల హావభావాలను, వారి నట ప్రాభవాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది. ఈ పుస్తకం చదివిన తరువాత ఆయా సినిమాలను చూస్తే, ముందుగానే మనకు కథ తెలిసి ఉండటం వల్ల, మరింత సులువుగా అర్థం చేసుకోగలుగుతాం.
సాహిత్యం సముద్రమంత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి పుస్తకాలన్నీ చదువాలంటే మన జీవితకాలం సరిపోదేమో. సినిమాలూ అంతే. మనకు తెలిసినవి ఆవగింజలో అరభాగమంత. ప్రపంచ సినిమాల్లో కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవన్నీ చూడాలంటే మనకున్న సమయం చాలదేమో. కాబట్టి కనీసం ఆ సినిమాల కథలు, సన్నివేశాల గురించి తెలుసుకున్నా కొంతవరకు మేలే కదా. సినిమాలన్నీ చూసేంత సమయం దొరుకకపోయినా ఈ పుస్తకం చదివితే సినిమా చూసినంత ఆనందం కలుగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో చార్లీచాప్లిన్ సినిమా ‘ది కిడ్' తో మొదలుపెట్టిన పుస్తకం ఆద్యంతం ఆసక్తికరంగా, కండ్ల ముందు సినిమా రీలు తిరుగుతున్నట్టు చదివింపజేస్తుంది. రచయిత్రి చక్కని భాషతో, సొగసైన పదాలతో ప్రతి సినిమాను ఎంతో ఇష్టంగా పుస్తకమనే వెండితెరపైకి ఎక్కించారు. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ‘సినిమా చూద్దాం రండి’ పేరుతో ప్రచురించిన సినిమా పరిచయాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. 1921 నుండి 2013 వరకు వచ్చిన హాలీవుడ్ క్లాసిక్స్లోంచి 55 సినిమాల కథా పరిచయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సినిమా అభిమానులకు నచ్చే పుస్తకం ఇది.
- రచన
నా హాలీవుడ్ డైరీ
రచన: శ్రీదేవి మురళీధర్
పేజీలు: 364, వెల: రూ.525/-
ప్రతులకు: 9849012166
అనువాద కథా పరిమళాలు
ఉవ్వెత్తున ఎగసిపడే అంతరంగ తరంగాలకు చెలియలి కట్టలూ ఉండవు, ఆనకట్టలూ ఉండవన్నది నిజం. అలాంటి మనిషి తత్వాన్ని బొమ్మ కట్టగలిగేది గొప్ప రచయితలు మాత్రమే! తను ఒకటనుకుంటే దేవుడొకటి అనుకుంటాడనేది లోకోక్తి. భాష తెలియని కారణంగా తన మేకలను వంద రూపాయలకు ఒక బ్రిటిష్ దొరకు అప్పగించి ఇంటికి వచ్చాడు భర్త. అంతలోనే బయట వాకిట్లో ‘మే..మే..’ అంటూ అరిచాయి మేకలు. భర్త ఎవరినో మోసగించి డబ్బుతెచ్చాడని భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. నిజానికి భార్యాభర్తల తప్పేమీలేదు. మోసం అన్న అనుమానంతోనే ఆమె వెళ్లిపోవడం పెద్దల్లో కొరవడి, పేదల్లో మాత్రమే మిగిలిన నిజాయతీకి అద్దం పడుతుంది ఆర్కే నారాయణ్ ‘మేకలు’ కథ. ఆస్తి కోసం నాటకమాడిన కొడుకు కోడళ్ల పరిస్థితి ఏమైందో గుజరాతీ కథ ‘తిరగలి’ వెల్లడిస్తుంది. సుప్రసిద్ధ కథకులు కిషన్ చందర్, రవీంద్రనాథ్ ఠాగూర్, అమృతా ప్రీతమ్, కమలాదాస్, వైకం మహ్మద్ బషీర్, అగాథా క్రిస్టీ వంటి హేమాహేమీలు రాసిన యాభై ఒక్క దేశవిదేశీకథల సంపుటి ఈ ‘వరదగుడి’. అనువాదంలో ఆరితేరిన పరేశ్ దోశీ మూలకథల ఆయువు పట్టును ఆవిష్కరించడంలో కృతకృత్యులయ్యారు.
- ప్రణవి నండూరి
వరదగుడి -అనువాద కథలు
అనువాదం: పరేశ్ దోశీ
పేజీలు 353, వెల: రూ. 200/-
ప్రతులకు: 9848023384
తాజావార్తలు
- ఏనుగుకు ప్యాంట్, షర్ట్ వేస్తే ఎలా ఉంటదో చూశారా?
- పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?
- పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక
- ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!