బుధవారం 03 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 23:07:28

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో  తెలియజేస్తాడు.   స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి.  నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో  ఓ తాపసి తారసపడతాడు. ఆయన ప్రభావంతో  సకల ఆభరణాల్నీ త్యజించి.. ఒంటరిగా స్వామి అన్వేషణకు బయల్దేరుతాడు త్రిభువనమల్లుడు.

భవనగిరి కోటను వీడి త్రిభువనమల్లుడు, శ్రీ నారసింహుని దర్శనార్థమై ఒంటరిగా అడవికి వెళ్లడం మహారాణి చంద్రలేఖను నిరాశకు గురిచేసింది. కుమారుడి అనారోగ్యం ఆమెను మానసికంగా కుంగదీసినప్పటికీ, రాజులేని సమయంలో తాను నిరాశను ప్రదర్శించరాదని, పైకి గంభీరంగా కనిపించేది. యువరాజు సోమేశ్వరుని తరపున దాదాపు రాజ్యభారం తనే వహించింది. మంత్రులు, దండనాయకులు పరిపాలన సవ్యంగా నడవడానికి తమ కృషి తాము చేస్తారు. అందులో సందేహం లేదు కానీ, విధాన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలలో అగ్ని పరీక్షలే ఎదురవుతాయి. త్రిభువనమల్లుడు పరాక్రమవంతుడే కాక, రాజకీయ పాలనా వ్యవహారాల్లో అపరిమిత పరిణతి సాధించినవాడు. శత్రుభయం లేకుండా చాళుక్య సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నిలబెట్ట్టిన సాహసికుడు. ఇదే సమయంలో కర్ణాటక ప్రాంతం హొయసల రాజవంశం పాలనలో ఉంది. హొయసల రాజు మహావీరుడైన విష్ణువర్ధనుడి వేగులు, భువనగిరి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను, త్రిభువన చక్రవర్తి ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రహస్య సమాచారాన్ని సేకరించి.. విష్ణువర్ధనుడికి చేరవేశారు. 

భువనగిరి కోటను స్వాధీనం చేసుకోవడానికి ఇదే తగిన సమయం అని యుద్ధ్ద సన్నాహాలను ప్రారంభించాడు. ఒక తాపసి మాటలు నమ్మి.. కట్టుబట్టలతో నిరాయుధుడై అడవిలోకి వెళ్లాడన్న మాటను ముందు నమ్మలేదు.  ‘నేనే స్వయంగా నా కళ్లతో చూశాను ప్రభూ’ అన్నాడు ఆ రహస్య సమాచారాన్ని మోసుకొచ్చిన వార్తా వాహకుడు గోపదేవుడు.‘ఎలా ఉన్నాడతను.. ఆ సమయంలో?’ ఉత్సుకతతో అడిగాడు విష్ణు వర్ధనుడు.గోపదేవుడు రెట్టించిన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభించాడు. ‘దండనాయకులు వద్దంటున్నా.. నగలు, కిరీటం విసిరేసి బయల్దేరాడు’.

‘దేనికోసం బయల్దేరాడు? ఏం సాధిద్దామని?’

‘స్పష్టంగా వినబడలేదు ప్రభూ!.. 

ఏదో సింహం అనే మాట మాత్రం లీలగా వినిపించింది’

‘ఓహో.. సింహం వేట కోసం, తన సాహస స్వభావంతో ఒంటరిగా వెళ్లాడన్న మాట.. ఒంటరిగా వెళ్లినవాడు ఇక ఇంటికి తిరిగి రాకూడదు. మంచి తరుణం మించిన దొరకదు. 

భళా గోపదేవా! చాలా మంచి వార్త తెచ్చావు. మరి త్రిభువనుడు లేని రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?’

‘పదేళ్ల పసివాడైన సోమేశ్వరుని పేరుమీద, మహారాణి చంద్రలేఖ పాలనా వ్యవహారాలు చూస్తున్నారని విన్నాను’

విష్ణువర్ధనుడి వదనంలో సన్నటి హాసరేఖ మెరిసింది. 

‘యుద్ధం-అనివార్యం’

మనసులో తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు.

రాజుగారి వదనంలో ప్రశాంతతను చూసి ఆశ్చర్య పోయాడు గోపదేవుడు.

‘రాణిగారు మీ కోసం ఎదురు చూస్తున్నారు’

ప్రవేశద్వారం వద్దకు వస్తున్న విద్యాపతిని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు రాజ వైద్యుడు. 

విద్యాపతి త్రిభువనమల్లుని ఆస్థాన కవి! ‘విక్రమాంకదేవ చరితము’ అనే పేరుతో చక్రవర్తి జీవిత చరిత్రను గ్రంథస్తం చేయిస్తున్నాడు. ఆ రచనా సంబంధమై, ఎప్పుడైనా ఎవరినైనా కలిసే వెసులుబాటు ఉన్నది. చక్రవర్తి అడవికి వెళ్లిన దగ్గర్నించీ జరుగుతున్న పరిణామాల గురించి విద్యాపతికి ఒక అవగాహన ఉన్నది.

అయితే తనను రాణీగారు, అత్యవసరంగా పిలిపించిన కారణం ఏమిటా అని అతడికీ ఆత్రుతగానే ఉన్నది.

‘మహారాణి చంద్రలేఖాదేవి గారికి అనేకానేక శుభాభినందనలు.. నమస్సులు’ వినయంగా అభివాదం చేశాడు విద్యాపతి. 

ఏకాంత మందిరంలో ఆసీనురాలై ఉన్న చంద్రలేఖ సన్నని పరదా మాటున అస్పష్టంగా కనిపిస్తున్నది. 

‘కవి పండితులు, శ్రీవారి ఆప్తమిత్రులు విద్యాపతి గారికి మా అభివాదములు’

‘అమ్మా! నన్ను అత్యవసరంగా పిలిపించిన కారణం..’

‘ఇదిగో, ప్రభువుల వారు పంపిన లేఖ’

ప్రథమ పరిచారిక నాగమల్లిక- ఆ లేఖను రాణీగారి చేతుల నుంచి సవినయంగా తీసుకొని, విద్యాపతికి అందజేసింది.

‘స్వామివారి దర్శనం కాకుండా, నేను తిరిగి రాను. ఈ లోగా ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే.. విద్యాపతి  కవి వరేణ్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవలసిందిగా.. మహారాణి చంద్రలేఖా దేవిని ఆదేశించడమైనది.’

‘ఇప్పుడున్న విపత్కర పరిస్థితి ఏమిటమ్మా?’

‘యుద్ధ వాతావరణం మన దేశ సరిహద్దుల దాకా వచ్చిందని మాకొచ్చిన సమాచారం. ప్రభువులవారు తిరిగొచ్చేంత వరకూ ఆగే వ్యవధి లేదు.

ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. సంధి ప్రయత్నాలా? సంగ్రామమా? యుద్ధానికి సంసిద్ధం అని మంత్రిమండలి సంయుక్త తీర్మానం చేసి నాకు తెలియజేశారు. ఏది ఏమైనా ఇది ఆలోచించి చేయాల్సిన పని. అయినా ఈ సమయంలో సంధి ప్రయత్నాలను విష్ణువర్ధనుడు ఆమోదిస్తాడా? అసలు అతడు ఎవరు చెప్తే వింటాడో, ఎవరు అతడిని ప్రభావితం చేయగలరో తెలుసుకొనుంటే బాగుండేది’ సాలోచనగా అన్నది మహారాణి.

‘తెలుసమ్మా- విష్ణు వర్ధనుడిని ప్రభావితం చేయగల మహాత్ముడు ఒకరున్నారు’ స్పష్టంగా చెప్పాడు విద్యాపతి. 

‘ఎవరు ఆ మహాత్ముడు?’ఆత్రుతగా అడిగింది. 

‘భగవత్‌ స్వరూపులైన రామానుజాచార్యుల వారు’

‘రామానుజాచార్యుల వారా?’

‘అవునమ్మా.. వారు సాక్షాత్త్తు దైవ స్వరూపులని అంటారు. చోళరాజ్యం నుంచి వెడలి వచ్చి ప్రస్తుతం కర్ణాటక ప్రాంతం మేల్కొటెలో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. వారే విష్ణువర్ధనుడిని ప్రభావితం చేయగలరు. యుద్ధాన్ని నివారించగలరు.’

అప్రయత్నంగా చేతులు జోడించి, మనసులోనే రామానుజ యతీంద్రుల వారికి ప్రణామాలు అర్పించింది. 

‘అయితే మన పరిస్థితులు వివరిస్తూ లేఖరాసి, వారికి అందజేసే ప్రయత్నం చేయాలి.’

‘మంచి ఆలోచన- మహారాణీ! మేం స్వయంగా వెళ్లి.. కార్యాన్ని సాధిస్తాం.’

అంగీకార సూచకంగా తల ఊపింది. మహారాణి చంద్రలేఖ.  

సాయం సంధ్యా సమయం.

అడవిలో త్రిభువన మల్లుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇది అడవా, రాజమందిరమా? పగలా, రాత్రా? ఏమీ తెలియడం లేదు.

అయితే, ఒకటి మాత్రం స్ఫురణలో ఉంది. దేశ క్షేమం కోసం తాను నారసింహ దేవుని దర్శనార్థమై వచ్చాడు. దారి చూపేవాడు దేవుడు. ఆయన పరీక్ష పెడుతున్నాడు. నా కొండకు నువ్వే రావాలని అంటున్నాడు. చూద్దాం, అనుకోని పరిస్థితులు ఎదురైనా, అనుకున్నది సాధించి తీరాలి. అనేది తన తత్వం, మనస్తత్వం!

ఇంతలో.. సర్రుమని ఆకులను చీల్చుకొంటూ ఒక బల్లెం దూసుకొచ్చింది.

క్షణంలో పక్కకు తప్పుకొన్నాడు. అది వెంట్రుకవాసిలో పక్కనుంచి రాసుకుంటూ వెళ్లి ఒక బలమైన చెట్టు కొమ్మను రెండు ముక్కలు చేసింది. 

ఒక వికటాట్టహాసం వినిపించింది.

చెట్లమధ్య నుంచి కొండ దిగుతూ కనిపించాడు గిరి పుత్రుడైన ఒక వేటగాడు. ఆజానుబాహుడు. నుదుట తిరునామాలు ధరించి ఉన్నాడు. నీలమేఘ శ్యాముడు అనిపించేలా నల్లటి శరీరచ్ఛాయ. కండ్లు మాత్రం చింత నిప్పుల్లా ఉన్నాయి.

‘ఈ కొండదొర బల్లెం ఎప్పుడూ గురితప్పదు. నూకలు రాసి పెట్టున్నాయ్‌ కాబట్టి, ఇంకా ప్రాణాలతో ఉన్నావ్‌. ఎవరు నువ్వు?’ ఎవరూ రాని, ఎవరూ రాలేని ఈ కొండమీదకు అడుగు ఎందుకు మోపావ్‌?’

‘నేను త్రిభువనమల్లుడిని’

‘..అంటే’

‘ఈ దేశాన్ని పరిపాలించేవాణ్ణి’

‘ఇక్కడికెందుకు వచ్చావ్‌?’

‘కొండ గుహలో కొలువైన సింహదేవుణ్ని దర్శించుకుందామని..’ స్థిరంగా పలికాడు 

త్రిభువనమల్లుడు.

‘ఈ దేశాన్ని ఏలే వాడికి కొండమీదున్న నరసింహుడు కావలసి వచ్చాడా? నీ శక్తిమీద నీకు నమ్మకం తగ్గిపోయిందా? బతుకంటే భయం ఏర్పడిందా? లేకపోతే అందరానిది ఏదో అందుకోవాలని ఆరాటం మొదలైందా?’

ఈ ప్రశ్నల పరంపర చూసి నివ్వెరపోయాడు త్రిభువనుడు. చూడ్డానికి ఆటవికుడిలా ఉన్నా మాటల్లో మార్మికత కనిపిస్తున్నది. ఇతడెవరో సామాన్యుడు కాదు.

‘అయినా నువ్వు సామాన్యుడిలా కనిపించడం లేదు. ప్రభువునంటున్నావ్‌. నువ్వు నిజంగా ఎందుకొచ్చావో తెలిస్తేనే అడుగు ముందుకు వేయగల్గుతావ్‌! కాదంటే, ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. అర్థం అయిందా?’ కఠినమైన ఆ మాటలు విని త్రిభువనుడు ఆశ్చర్యపోయాడు. తనను ఎవరూ ఈ విధంగా ప్రశ్నించలేదు. తన పట్ల అవిధేయత చూపినవారు తగిన శిక్ష అనుభవించారు. 

చిన్నగా నవ్వాడు

“దైవ దర్శనానికి కూడా కారణం కావాలా? స్వార్థం ఉండాలా? నరుడికీ నరసింహుడికీ మధ్యన ఏర్పడి ఉన్న బంధం.. నిస్వార్థమనే నేను అనుకుంటున్నాను. తల్లి బిడ్డలను కాపాడటం, బిడ్డలు తల్లినే అంటి పెట్టుకొని ఉండటం.. అది స్వార్థం కాదు, ఆత్మీయ బంధం. దేవుడికి భక్తుడికీ ఉన్న బంధం కూడా అటువంటిదే!

‘మరి నువ్వెందుకొచ్చావ్‌, మరిన్ని సుఖాలు ప్రసాదించమనా, పరిపాలిస్తున్న భూమండలం సరిపోక ఇంకా కావాలనా?

రాజా నిజమైన సమాధానం చెప్పు.’

‘నేను స్వామి దర్శనం కోరుతున్నది నా కష్టాను తొలగించమని కాదు. మరిన్ని సుఖాలను ప్రసాదించమనీ కాదు!’ ‘మరి?’

‘నా ప్రజలు కష్టాలపాలు కాకూడదు- అన్న తపన.. రేపటినాడు, నా తదనంతరం.. ఈ రాజ్యం బలహీన పడకూడదు - అన్న భావన నన్నిక్కడికి రప్పించింది. పరిపాలకుడు బలహీనుడైతే, ఆ విషయం బయటికి తెలిస్తే.. వ్యవస్థలు పెళుసుబారతాయి. కుప్పకూలిపోతాయ్‌. ఇప్పుడు నాకూ, నా ప్రజలందరికీ శ్రీ నారసింహదేవుని అభయం కావాలి, అనుగ్రహం కావాలి’ భక్తి తన్మయత్వంతో అన్నాడు  త్రిభువనుడు.

‘అంటే దేవుడిపైనే మొత్తం భారం వేశావన్న మాట.. దేవుడంటే మన కోసం పని చేసే సేవకుడు కాదు. మనల్ని క్రమశిక్షణతో పని చేయించే యజమాని. కష్టపడేవాడికి దైవానుగ్రహం ఉంటుంది. నిజంగా పూర్తిగా నమ్మిన వాడికే దేవుడితోడు ఉంటుంది. ఇంకో విషయం మర్చిపోకు...నిరాశలో ఉండి మనకి మనం హాని తల పెట్టుకున్నా, దురాశకు పోయి ఇంకొకరికి హాని తలపెట్టినా నారసింహదేవుడు ఎప్పటికీ క్షమించడు.’ అంటూనే పక్కకు తప్పుకొన్నాడు.

‘పో-ముందుకే పో! అదిగో కొండమీదున్న జ్వాలా చక్రాన్ని చూడు.. చేరుకో’ ఆ మాటతో త్రిభువనుడు వడివడిగా అడుగులు వేశాడు.

VIDEOS

logo