బుధవారం 03 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 22:51:28

అమెరికాలో..హైదరాబాద్‌ హీరో!

అమెరికాలో..హైదరాబాద్‌ హీరో!

యువత కలల మజిలీ అమెరికా. యూఎస్‌లో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, స్థిరపడాలి.. అనేది చాలామంది కోరిక. అలా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లాడు రాకేశ్‌ గాలెబె. మంచి ఉద్యోగం,  మంచి సంపాదన.. ఒక రకంగా సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ తనది. కానీ, డబ్బే గెలుపు కాదని అర్థమైంది.  ‘నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారాలి’ అనే కలామ్‌ సూక్తి ఆలోచింపజేసింది. అమెరికాలో ఉంటూనే, తెలుగు సినిమాలో హీరోగా  నటించాడు.  రాకేశ్‌ గాలెబె అమెరికాలోని వర్జీనియాలో ఉంటాడు.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అందరిలాగే అతనిదీ  బిజీ జీవితం. ఒక రకంగా రాకేశ్‌ కూడా ఆ పరుగుకు అలవాటు పడ్డవాడే. కానీ ‘గతం’ తనను వెంటాడింది. హైదరాబాద్‌లో ఉన్నప్పటి  జాయ్‌ఫుల్‌ జీవితం గుర్తుకొచ్చింది. రొటీన్‌ బతుకు  నుంచి  బయటపడేందుకు ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలని అనుకున్నాడు. అప్పుడే,  మనసు నటన మీదికి మళ్లింది.  ‘నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే సక్సెస్‌' అనే అబ్దుల్‌ కలామ్‌ సూక్తి  ఆలోచింప జేసింది. దీంతో, సినిమాలవైపు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. రాకేశ్‌కు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. పొద్దున లేస్తే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండేవాడు. అదొక సినిమా అడ్డా లాంటిది రాకేశ్‌ మిత్ర బృందానికి. వారానికి మూడు నాలుగుసార్లు థియేటర్ల దగ్గరే కనిపించేవాడు. ఏదో సరదా కోసం సినిమాలు చూసే అలవాటున్న తను, ఇంత సీరియస్‌గా సినిమాల్లోకి వెళ్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదట. 

తొలి సినిమా ‘గతం’ 

రాకేశ్‌కు ‘గతం’ తొలి సినిమా. ఇంతకు ముందు ఇండిపెండెంట్‌ సినిమాలు చాలానే చేశాడు. వాటన్నింట్లోనూ బాగా నటించాడు. కాబట్టే,  పెద్ద సినిమా అవకాశం వరించింది. దాన్ని సద్వినియోగం చేసుకొని  మెప్పించాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘గతం’ మంచి ఆదరణ పొందుతున్నది. టీజర్‌, ట్రైలర్‌తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నా, కరోనావల్ల వీలు కాలేదు. అయితేనేం, ‘గతం’ అందరినీ మెప్పించింది. ఇది సైకో థ్రిల్లర్‌ సినిమా. మతిమరుపు నేపథ్యంలో సాగుతుంది. ఈ పాయింట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘గతం’ కథ, కథనం వేరుగా ఉన్నాయని చెబుతారు విశ్లేషకులు.

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ 

హైదరాబాద్‌లో ఉన్నప్పుడే కాలక్షేపం కోసం కొన్ని లఘు చిత్రాల్లో నటించాడు రాకేశ్‌. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తర్వాత కనీసం సినిమా చూసేందుకు కూడా తీరిక లేకుండా పోయింది. ఒకరోజు సరదాగా స్నేహితుడి ఇండిపెండెంట్‌ మూవీ షూటింగ్‌ చూసేందుకు వెళ్లాడు. అనూహ్యంగా ఒక పాత్రకు ఎంపికయ్యాడు. ఇక అప్పటి నుంచీ వరుసగా ఇండిపెండెంట్‌ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటివరకు ఇరవైకి పైగా ఇండిపెండెంట్‌ సినిమాల్లో నటించాడు రాకేశ్‌. అవన్నీ ప్రేమకథలే కావడంతో లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందాడు.  ‘ఇంతదాకా వచ్చాక పెద్ద సినిమాల్లో ఎందుకు నటించొద్దు’ అనిపించింది తనకి. ఆ ప్రయత్నంలో భాగమే ‘గతం’. 

ఉద్యోగం చేస్తూనే 

‘ఏదైనా తేడా జరిగితే?’ అనే ఆలోచనతో ఉద్యోగాన్ని వదల్లేదు రాకేశ్‌. జాబ్‌ చేస్తూనే షూటింగ్‌లో పాల్గొన్నాడు. కానీ దర్శకుడు, సహ నటులు, చిత్రబృందం.. అందరూ ఇలా ఉద్యోగాలు చేస్తున్నవారే, అందరూ తెలుగువాళ్లే.  దీంతో ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా వారాంతాల్లో షూటింగ్‌ షెడ్యూల్‌  చేసుకొని, చాలా తక్కువ సమయంలో పూర్తిచేశారు. ‘అమెరికాలో ఉంటూ సినిమాలు చేయడం, అది కూడా ఉద్యోగం చేస్తూ నటించడం.. తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో ఇదే మొదటిది అనుకోవచ్చు’  అంటున్నాడు రాకేశ్‌.

అంతా అమెరికాలోనే! 

‘గతం’ సినిమాకు కిరణ్‌ కొండమడుగుల దర్శకుడు. రాకేశ్‌తో పాటు భార్గవ్‌ పోలుదాసు, పూజిత కూరపర్తి నటించారు. సినిమాకు ప్రధాన బలం కథే.  ‘మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా మొత్తం అమెరికాలోనే చిత్రీకరించడం ఇదే మొదటిసారి కావొచ్చు’  అంటున్నాడు రాకేశ్‌. అమెరికాలోని లొకేషన్లు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. కిరణ్‌తో రాకేశ్‌కు నాలుగేండ్లుగా పరిచయం. అప్పటికే కిరణ్‌ కొన్ని ఇండిపెండెంట్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీళ్లిద్దరూ  కలిసినప్పుడు సినిమాల గురించే చర్చ జరిగేది. అప్పుడే సినిమా పట్ల తనకున్న ఆసక్తిని తెలియజేశాడు రాకేశ్‌. ఇంకేముంది, దర్శకుడు ఉన్నాడు, హీరో దొరికాడు. ముహూర్తం షాట్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు.. శుభం!

VIDEOS

logo