సోమవారం 01 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 22:46:43

పెండ్లిపిలుపు డిజిటల్‌ మలుపు

పెండ్లిపిలుపు డిజిటల్‌ మలుపు

పెండ్లిసందడిని ముందస్తుగా చాటేవి లగ్నపత్రికలే! పత్రిక అందుకోగానే.. మాటవరసకు ‘ముహూర్తం ఎన్ని గంటలకు?’ అంటారే కానీ, కండ్లన్నీ పత్రిక రంగుహంగులపైనే. కాస్త మందంగా, ఇంకాస్త అందంగా ఉంటే పదికాలాలూ పదిలపరుచుకుంటారు. తమ ఇంట జరిగే పెండ్లికి అదే తరహా పత్రికలు అచ్చువేయిస్తారు. ఇక పత్రికపై ప్రతిష్ఠితమైన వినాయకుడి చిట్టి ప్రతిమ మనసుకు నచ్చితే.. బీరువా డోర్‌పైనో, టీవీ స్టాండ్‌కో అతికించుకుంటారు. ఇన్ని విశేషాలున్న లగ్నపత్రిక ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నది. పెండ్లి పిలుపులు డిజిటల్‌ మలుపులు తీసుకొని ఇ-కార్డ్స్‌గా పలుకరిస్తున్నాయి. వియ్యాలవారి మనసుకు నచ్చేలా, అతిథులను ఆశ్చర్యపరిచేలా ఇ-కార్డ్స్‌ను తీర్చిదిద్దే డిజైనర్లూ పుట్టుకొచ్చారు.డిజిటల్‌ వెడ్డింగ్‌ కార్డ్స్‌ ట్రెండ్‌ కొన్నేండ్లుగా ఉన్నదే! డూడుల్స్‌, ఫన్నీ ఇలస్ట్రేషన్స్‌ పెండ్లి పత్రికల్లోకి  తొంగిచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇలస్ట్రేషన్స్‌ వేయడమే కెరీర్‌గా మలుచుకుంటున్న వారూ ఉన్నారు. కొవిడ్‌ కాలంలో ఇంటింటికీ వెళ్లి పత్రికలు పంచే సంప్రదాయాన్ని కాస్త తగ్గించారు. డిజిటల్‌ కార్డ్స్‌ నేరుగా అతిథులకు షేర్‌ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో ఇ-కార్డ్స్‌ మేకర్స్‌కు డిమాండూ విపరీతంగా పెరిగిపోయింది. ఎలాగూ డిజిటల్‌ పెండ్లి పత్రికే కాబట్టి, తమ అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్టుగా వాటి రూపురేఖలు మారుస్తున్నారు. 

కార్డుకార్డుకో కొత్తదనం 

నేటి యువత అంచనాలకు తగ్గట్టుగా ఇన్విటేషన్‌ కార్డ్స్‌కు రూపునిస్తున్నారు ఇలస్ట్రేటర్లు. ‘టూ మ్యాడ్‌ గాళ్స్‌' పేరుతో లగ్నపత్రికలకు సరికొత్త హంగులు అద్దుతున్నారు రాధిక, కవిత. వధూవరులకు నచ్చిన థీమ్‌తో డిజిటల్‌ కార్డును తయారు చేయించి అందరికీ షేర్‌ చేస్తున్నారు. కార్డులపై డూడుల్స్‌తో పాటు ఫన్‌ థీమ్స్‌ని యాడ్‌ చేస్తున్నారు.

కథలు చెప్పే కార్డులు

డిజిటల్‌ కార్డులో ‘స్టోరీ టెల్లింగ్‌' కొత్త ట్రెండ్‌. వధూవరులు పెండ్లిపీటల దాకా వచ్చిన వైనాన్ని అందమైన చిత్తరువుల ద్వారా పత్రికలో వివరిస్తారు. అమ్మాయి, అబ్బాయి మొదటగా కలుసుకున్న చోటు, మనసులు ఇచ్చిపుచ్చుకున్న తీరు, పెద్దలను ఒప్పించిన సందర్భం వీటన్నిటినీ బొమ్మలకథగా వివరిస్తారన్నమాట. వధూవరుల అభిరుచులు ప్రతిబింబించేలా కార్డులకు రూపాన్నిస్తున్నారు. 

3 రోజుల నుంచి 3 నెలలు..

కస్టమర్లు  సెలెక్ట్‌ చేసుకునే థీమ్‌, డిజైన్‌ను బట్టి డిజిటల్‌ కార్డ్‌ ధర రూ.5వేల నుంచి రూ.50వేల వరకు ఉంటున్నది. కస్టమైజ్డ్‌ కార్డు తయారీకి మూడు రోజుల నుంచి మూడు నెలల సమయం పడుతుందట. మొత్తానికి డిజిటల్‌ కార్డులు వధూవరులకు జ్ఞాపకాల్ని, తయారీదారులకు కాసులను పంచి పెడుతున్నాయి.

VIDEOS

logo