బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sunday - Feb 13, 2021 , 22:42:34

ఆమెను అర్థం చేసుకోండి

ఆమెను అర్థం చేసుకోండి

నాకు పెండ్లయి రెండేండ్లు అయింది. నా భార్య మొదటిసారి గర్భవతి అయినప్పుడు అబార్షన్‌ అయింది. ఆరు నెలల తర్వాత మళ్లీ గర్భం దాల్చింది. వైద్యులను సంప్రదిస్తే గర్భసంచి వదులుగాఉందని, మళ్లీ అబార్షన్‌ కాకుండా కుట్లు వేశారు. విశ్రాంతి ఎక్కువగా తీసుకోమన్నారు. అలాగే కాన్పు అయ్యే వరకు సెక్స్‌కి దూరంగా ఉండమన్నారు. నాకు చాలా కష్టంగా ఉంది. కోరికలు ఆపుకోలేకపోతున్నా. నా భార్యతో సున్నితంగా శృంగారంలో పాల్గొనచ్చా! తనేమో నన్ను పూర్తిగా దూరం పెడుతున్నది. నా వల్ల కాక మొన్న తనపై చేయి కూడా చేసుకున్నా...! ఇతర స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనాలని ఉంది. కానీ, రోగాలు వస్తాయన్న భయమూ ఉంది. సరైన సలహా ఇవ్వండి? - దివాకర్‌ (పేరుమార్చాం), హైదరాబాద్‌

మీ భార్యకు గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్‌ వదులుగా ఉండటం వల్ల అబార్షన్‌ కాకుండా కుట్లు వేశారు. దీన్ని ‘సర్కిలాజ్‌' ఆపరేషన్‌ అంటారు. ఈ సమయంలో ఆమెకు పూర్తిస్థాయిలో శారీరక విశ్రాంతి, మానసిక ప్రశాంతత అవసరం. ఇప్పుడు తను బరువు పనులు చేసినా, సెక్స్‌లో పాల్గొన్నా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనా మళ్లీ అబార్షన్‌ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సెక్స్‌కు దూరంగా ఉండాలి. పైపైన సెక్స్‌ చేసినా గర్భసంచి కండరాలు సంకోచానికి గురై లోపల పిండానికి, తల్లికీ ఇద్దరికీ ప్రమాదం తలెత్తవచ్చు. గతంలోనూ అబార్షన్‌ అయిందంటున్నారు. ఈ సమయంలో మీరు సెక్స్‌ కోసం భార్యను వేధించడం, చేయి చేసుకోవడం శిక్షార్హమైన నేరం. సెక్స్‌ కోసం పక్కదారులు పట్టాలనుకోవడం నైతికంగా పతనమే అవుతుంది. తాత్కాలికంగా శృంగారంలో పాల్గొనకూడని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆమె ఉందని గమనించండి. ఈ సమయంలో ఒక భర్తగా ఆమెకు మీ సంపూర్ణ సహకారం అవసరం. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే! అది మరచిపోయి సెక్స్‌ కోసం గర్భిణిని వేధించడం సమంజసం కాదు. గర్భధారణ సమయంలో భార్య కూడా సెక్స్‌కు దూరంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ కోసం అన్ని సుఖాలనూ వదులుకుంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా సెక్స్‌కు ఉపక్రమిస్తే నేరం చేసిన వారు అవుతారు. మీ భార్య ప్రమాదకరమైన గర్భావస్థలో ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సింది సెక్స్‌ గురించి కాదు. ఆమె ఆరోగ్యం గురించి. మీ వారసత్వాన్ని మోస్తున్న భార్యపట్ల బాధ్యతతో ఉండండి. కాన్పు అయి, వైద్యులు సూచించే వరకు నిగ్రహంతో వ్యవహరించండి.

డాక్టర్‌ భారతి

సెక్సాలజిస్ట్‌, సైకోథెరపిస్ట్‌, రైస్‌ హాస్పిటల్‌, హస్తినాపురం, 

హైదరాబాద్‌. ఫోన్‌: 9849770409

ఈ మెయిల్‌: [email protected]

VIDEOS

logo