వికసించినస్ఫూ ర్తి!

ఒకప్పుడు వాళ్లంతా కాఫీ తోటల్లో బాలకార్మికులు. ఇప్పుడు వారిలో ఒక లాయర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, టీచర్ ఉన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ లేకపోతే వాళ్లేమయ్యేవారు? అదే కాఫీ తోటల్లో కూలీలుగానే పనిచేసేవాళ్లు. వికాసన ఎన్జీఓ నడిపించే బ్రిడ్జి స్కూల్ వారిని చేరదీసింది. విద్యాబుద్ధులు నేర్పింది. ఉన్నతులుగా తీర్చిదిద్దింది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కోటి మందికి పైగా బాలకార్మికులు ఉన్నారు. వారిలో 56 లక్షలమంది అబ్బాయిలు, 45 లక్షల మంది అమ్మాయిలు. వీళ్లలో దాదాపు 80 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. బాలకార్మికులు ఈ స్థితిలో ఎందుకు ఉంటున్నారు? అసలు లోపం ఎక్కడ ఉంది? బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలంటే ఏం చేయాలి? వికాసన ఎన్జీఓలా బాధ్యత తీసుకోవాలి. బడిలో ఉండాల్సిన పిల్లలు బట్టీల్లో ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నది వికాసన.
వికాసన ఆవిర్భావం
ఏఎం వర్ఘీస్.. వికాసన ఎన్జీఓ వ్యవస్థాపకులు. కాఫీ తోటల్లో, ఇండ్లలో పనిచేసే వందలాది మంది బాలకార్మికులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారిలో ఒకరు సుప్రిత. ఆమె ఒకప్పుడు కాఫీ తోటల్లో బాలకార్మికురాలు. పొద్దున లేచింది మొదలు సాయంత్రం దాకా పనిచేసేది. ఇప్పుడు చిక్మగళూరులోని హాస్పిటల్లో పనిచేస్తున్నది. ఎందరికో వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ నర్సుగా గుర్తింపు పొందింది. ఆమెలాంటి వేలాది బాలకార్మికులు ఇప్పుడు ఇంజినీర్లుగా, ఉపాధ్యాయులుగా ఉన్నత స్థానంలో ఉన్నారు. 1988లో చిక్‌మగళూరు జిల్లాలో ‘వికాసన’ను స్థాపించారు. మహిళా సాధికారతను ప్రచారం చేస్తూ..సేంద్రియ వ్యవసాయం చేపట్టిన మహిళలకు అండగా నిలుస్తున్నది వికాసన.
బాల కార్మికులను చేరదీసి
సంస్థ ద్వారా మొదట్లో కాఫీ తోటల్లో పనిచేస్తున్న మహిళల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేవారు. పని దొరక్క ఇంటిదగ్గరే ఉంటున్న మహిళల వద్దకూ వెళ్లి వారికి భరోసా కల్పించేవారు. పనిచేస్తున్నవారైనా, ఉపాధి లేనివారైనా ప్రభుత్వం ఇచ్చే రుణాల ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉందని అవగాహన కల్పించేవారు. కాఫీ తోటల్లో మహిళలతో పాటు వందలాది చిన్నపిల్లలు కూడా ఉండేవారు. చదువుకోవాల్సిన పిల్లలు ఇలా కార్మికులుగా మారేందుకు కారణాలను తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను పనిలోకి తీసుకోవద్దని కాఫీ తోటలు, పండ్ల తోటల యజమానులకు హెచ్చరిక జారీ చేశారు. ఇండ్లలో పనిచేస్తున్న బాల కార్మికులను పంపించేయాలని పల్లెపల్లెలో అవగాహన కల్పించారు. కానీ, పిల్లల సంపాదన లేకపోతే కుటుంబ పోషణ కష్టం అవుతుందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారుల పోషణ, చదువు బాధ్యత తామే తీసుకోవాలని నిర్ణయించింది వికాసన.
ఉన్నత హోదాలో
బడి వయసు పిల్లలు కార్మికులుగా పనిచేయడానికి వీలు లేదని వికాసన నిర్వాహకులు ప్రజలకు చెప్పారు. చదువుకుంటే ఎన్ని అవకాశాలు ఉంటాయో వివరించారు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని సూచించడమే కాకుండా, బ్రిడ్జి స్కూల్స్‌ను స్థాపించారు. చిక్‌మగళూరు పరిసర ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో పనిచేస్తున్న వేలాదిమంది బాలకార్మికులను వెట్టినుంచి విముక్తి కల్పించి ఈ బడిలో చేర్పించారు. చదువుతో పాటు ఆటపాటల్లో శిక్షణ ఇచ్చి ఉత్తమంగా తీర్చిదిద్దారు. వికాసన స్వచ్ఛంద సంస్థద్వారా నడుస్తున్న స్కూల్లో చదివిన వేలాదిమంది ఇప్పుడు మంచి హోదాలలో ఉన్నారు. ఇక్కడ నేర్చుకున్న చదువు, క్రమశిక్షణే తమ జీవితాలను నిలబెట్టాయని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకార్మికులుగా పనిచేసిన తాము, ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే అది వికాసన పెట్టిన భిక్షేనని చెప్తున్నారు. కానీ, వికాసన దాన్ని ఎప్పుడూ దానమనో, విరాళమనో భావించలేదు. ఒక సామాజిక బాధ్యతగా భుజానికి ఎత్తుకున్నది. పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతున్నది.