మంగళవారం 09 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 22:28:26

తియ్యని ప్రేమ చాటుకొందాం..

తియ్యని ప్రేమ చాటుకొందాం..

ప్రియురాలి అనుగ్రహం పొందాలన్నా, ఆగ్రహం తీర్చాలన్నా ఏకైక మార్గం చాక్లెట్‌. తీపితీపి చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడంతో చిగురించే ప్రేమలు కోకొల్లలు. లక్షలు విలువ చేసే బహుమతి ఇచ్చినా కొసరుగా చాక్లెట్‌ సమర్పించకపోతే ఆ ప్రేమ పండదు. మరిగిన కొద్దీ దప్పళం.. చాక్లెట్లు ఇచ్చిన కొద్దీ ప్రేమ మరింత చిక్కగా తయారవుతాయి. శివుడిపై మన్మథుడు ప్రయోగించిన సుమశరం కన్నా పవర్‌ఫుల్‌  చాక్లెట్లు. ప్రేమికుల రోజు సాక్షిగా చాక్లెట్‌ బార్‌ ఇచ్చి.. బార్‌ బార్‌ దేఖోఁ అని పాడుకోండి. చాక్లెట్‌ తయారీకి ఉపయోగించే కోకో చెట్టు శాస్త్రీయ నామం.. థియోబ్రామా కకావ్‌. దీని అర్థం ‘దేవతల ఆహారం’. మొదటి సారిగా చాక్లెట్లను ఐరోపాలో తయారు చేశారు. పదహారో శతాబ్దం నుంచీ చాక్లెట్‌ అందరి నోర్లూ తీపి చేస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ఎక్కువగా చాక్లెట్లను ఇష్టపడేది యూరోపియన్లు. మొత్తం వినియోగంలో సగం ఐరోపాలోనే జరుగుతున్నది. జర్మనీలో ఏటా ఒక్కో మనిషి 11 కిలోల  చాక్లెట్లు తింటారట. 

ప్రేమికుల రోజు బహుమతుల్లో పూలది అగ్రస్థానమని అనుకుంటారంతా! గ్రీటింగ్‌ కార్డులే కింగులని భావిస్తారు కూడా. కానీ, ఆ పూల మాటున, గ్రీటింగ్‌ కార్డుల చాటున తను కరిగిపోతూ ప్రేమికుల మనసులు కరిగించే చాక్లెట్‌ కూడా ఉంటుంది. చాక్లెట్లంటే చిన్నాపెద్దా అందరికీ ఇష్టమే! యుక్తవయసులో అమ్మాయిలకైతే మరీనూ! చాక్లెట్‌ అన్నా, దాన్ని ప్రేమగా అందించే చాక్లెట్‌బాయ్‌ అన్నా చాలా మక్కువ.  చాక్లెట్లకు ఎల్లవేళలా డిమాండ్‌ ఉంటుంది. ప్రేమికుల రోజు వచ్చిందంటే ఇబ్బడిముబ్బడిగా అమ్ముడవుతాయి. వీటిలో చాలా రకాలున్నా ఎక్కువమంది ఇష్టపడేది మాత్రం డార్క్‌ చాక్లెట్‌నే. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మెదడును చురుగ్గా ఉంచేందుకు చాక్లెట్స్‌  ఉపయోగపడుతాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు, ఫ్లేవనాయిడ్లుగా పిలిచే ఫైటో కెమికల్స్‌, థియోబ్రోమిన్‌.. రోగనిరోధక శక్తిని, జ్ఞాపక శక్తిని, మెదడు పనితీరును పెంచడంలో సాయపడుతాయి. డార్క్‌ చాక్లెట్లు వారానికి రెండు మూడుసార్లు మితంగా తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. చాక్లెట్లలోని ఓలియాన్‌ ఆమ్లం గుండె జబ్బుల్ని రానివ్వదు. మెదడులో న్యూరోట్రాన్స్‌ మిటర్లుగా పనిచేసే సెరిటోనిన్‌, డొపమైన్‌ వంటి రసాయనాలను విడుదల చేసి మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు మాత్రం క్యాలరీలను లెక్కించుకుని తినాల్సిందే. 

ప్రేమికుల రోజైనా, పుట్టిన రోజైనా, పెండ్లి రోజైనా, ప్రియురాలు అలిగినా, స్నేహితుడిని కలిసినా..సందర్భం ఏదైనా ఓ చాక్లెట్‌తో మీ భావాలను ప్రేమగా చెప్పండి. అన్ని రకాల వేడుకలనూ తియ్యగా జరుపుకోండి.

VIDEOS

logo