శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sunday - Feb 13, 2021 , 21:31:13

ఆ గ్రామాల్లో.. చుక్క, ముక్క ముట్టుకోరు!

ఆ గ్రామాల్లో.. చుక్క, ముక్క ముట్టుకోరు!

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆ అటవీ గ్రామాలు ఆధ్యాత్మికతకు నిలయమయ్యాయి. మద్యమాంసాల్ని నిషేధించి, గ్రామస్తులందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నాయి.  ఒకప్పుడు అశాంతితో, సమస్యలతో కొట్టుమిట్టాడిన స్థానికులు, ఇప్పుడు భక్తిభావంలో మునిగితేలుతున్నారు. వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చిన బాజీరావు మహరాజ్‌ అందరికీ ఆదర్శనీయుడయ్యారు. 

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం బెదోడ గ్రామం. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఈ పల్లెలో జన్మించిన బాజీరావు మహరాజ్‌ చిన్నతనంలోనే ఆధ్యాత్మికతవైపు అడుగులేశారు. సంత్‌ జ్ఞానేశ్వర్‌ రాసిన శ్రీ జ్ఞానేశ్వరీ గ్రంథాన్ని చదివి ఎంతగానో ప్రభావితులయ్యారు. మహారాష్ట్రలోని అడేగావ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ ప్రభాకర్‌ సాక్రే మహరాజ్‌ వద్ద శిష్యునిగా చేరారు. వారివద్దే శాస్ర్తాలు, ప్రాచీన గ్రంథాలను చదివారు. వాటి సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి.. వారిలో భక్తిభావం, సత్ప్రవర్తన తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. సుకినేగావ్‌లోనే ఉంటూ అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. వ్యక్తిలో మార్పు ద్వారా సమాజాన్ని మార్చవచ్చనే సంకల్పంతో తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన బాజీరావు మహరాజ్‌ 2011 నవంబరు 19న సుకినేగావ్‌లో కన్నుమూశారు.

సప్తాహ వేడుకలు

బాజీరావు మహరాజ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లినా ఆయన బోధనలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల, జైనథ్‌, ఆదిలాబాద్‌ మండలాల్లోని అనేక గ్రామాల ప్రజల్లో మహరాజ్‌ బోధనలు  స్ఫూర్తిని నింపాయి. కాబట్టే, అక్కడి ప్రజలు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏటా  పుణ్య తిథిని నిర్వహిస్తారు. 15రోజులు సప్తాహం జరిపిస్తారు. వేడుకల తేదీలను మహరాజ్‌ శిష్యులు ముందుగానే ప్రకటిస్తారు. ఆ మేరకు, ఆయా మండలాల్లో ప్రచారం చేస్తారు. వారం రోజులపాటు జరిగే వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొంటారు. నియమ, నిష్ఠలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. కులమత భేదాలు లేకుండా సామూహిక ప్రార్థనలు, సహపంక్తి భోజనాలు చేస్తారు. మహరాజ్‌ బోధనలు వివరిస్తారు. వేడుకల్లో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు  చేపడతారు. ఇంటింటా మొక్కలు నాటుతారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. చదువులతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. దురలవాట్లకు దూరంగా బతకాలని హితవు చెబుతారు.

ప్రశాంతంగా పల్లెలు

జిల్లాలోని అనేక గ్రామాల్లో బాజీరావు మహరాజ్‌ బోధనలు ఆధ్యాత్మిక భావనను పెంపొందించాయి. ప్రజలను సన్మార్గంలో నడిపించాయి. ఆయన బోధనల ప్రభావంతో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, భక్తిభావంతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. మహరాజ్‌ పుట్టిన గ్రామ పరిసరాల్లో ఉన్న .. బేల మండలంలోని బెదోడ, దహేగాం, మణియార్‌పూర్‌, కామ్‌దార్‌పూర్‌, గూడ గ్రామాల ప్రజలు మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్నారు. బాజీరావు మహరాజ్‌ను మహా గురువుగా, సాక్షాత్తు 

దేవుడిగా భావిస్తున్నారు. జిల్లాలోని బేల, జైనథ్‌, ఆదిలాబాద్‌,  మండలాల్లోని 107కు పైగా గ్రామాల్లో బాజీరావు మహరాజ్‌ ఆలయాలున్నాయి. నిత్యం ఎంతోమంది భక్తులు  తమ ఇష్ట గురువును దర్శించుకుంటూ ఉంటారు. ‘మా జీవితాలను మార్చిన మహానుభావుడు..’ అంటూ మహరాజ్‌ గురించి వివరిస్తారు ఆ గ్రామీణులు.

వృద్ధాశ్రమం ఏర్పాటు

బేల మండలం బెదోడకు చెందిన యశ్వంత్‌ గోడే అనే భక్తుడు రూ.36లక్షలతో వృద్ధాశ్రమం నిర్మించారు. 2017లో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఎంతోమంది వయోధికులకు నీడనిస్తున్నది. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు ఆశ్రయం కల్పించాలన్న మహరాజ్‌ బోధనలకు అనుగుణంగా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యశ్వంత్‌ తెలిపారు. ‘ఈ ప్రయత్నంలో అన్ని ప్రాంతాల నుంచీ సహకారం లభిస్తున్నది’ అంటారాయన. 

దురలవాట్లకు దూరం

బాజీరావు మహరాజ్‌ బోధనలు మా గ్రామస్తులను ఎంతో ప్రభావితం చేశాయి. 12 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నారు. ఆయన జీవన విలువలు నేర్పించారు. పేదలను పట్టించుకోవాలని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఎంతోమందిని సన్మార్గంలో నడిపిస్తున్నాం. గ్రామంలోని బాబా ఆశ్రమంలో రోజూ ఉదయం, సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తాం.- విజయ్‌, భక్తుడు బెదోడ, బేల మండలం

VIDEOS

logo