శుక్రవారం 05 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 21:26:07

మనసు పదిలం.. గుండె భద్రం!

మనసు పదిలం.. గుండె భద్రం!

ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారా..? లేక డిప్రెషన్‌ బాధిస్తున్నదా? అయితే, మీ గుండె జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. పొగతాగడం వల్ల గుండెకు ఎంత హాని ఉంటుందో, డిప్రెషన్‌ వల్ల కూడా అంతే నష్టం ఉందంటున్నది ఓ కొత్త పరిశోధన. అందుకే మానసిక కుంగుబాటును తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఆందోళన లేదా డిప్రెషన్‌ ఎక్కువగా ఉన్నవాళ్ల గుండె లయ తప్పే ప్రమాదం 65 శాతం అధికం. వీరిలో పక్షవాతం వచ్చే ఆస్కారం 64 శాతం, అధిక రక్తపోటు రిస్క్‌ 50 శాతం, ఆర్థరైటిస్‌ ముప్పు 87 శాతం అధికమని  ఈ అధ్యయనంలో తేలింది. పొగతాగేవాళ్లు, స్థూలకాయుల్లో కూడా దాదాపుగా ఇంతే రిస్కు ఉంటుంది. అధిక ఒత్తిడి, డిప్రెషన్‌ ఉన్నవాళ్లలో తలనొప్పి, జీర్ణ సమస్యలు, నడుము నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉంటాయని ఈ అధ్యయనంలో తేలింది. అందుకే మనసు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, మదిలో అలజడి రేగితే మానసిక చికిత్స తీసుకోవడానికి వెనుకాడవద్దని సూచిస్తున్నారు పరిశోధకులు.

కుట్లు ఉండవిక!

సర్జరీ చేసిన తరువాత కుట్లు వేయడం, తరువాత కొన్ని రోజులకు కుట్లు తీసేయడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు కరిగిపోయే కుట్లు, స్టేపుల్స్‌ కూడా వాడుతారు. అయితే ఆపరేషన్‌ తరువాత ఇక కుట్లు, స్టేపుల్స్‌ ఉండవంటున్నారు వైద్యరంగ పరిశోధకులు. ఆపరేషన్‌ కోసం కోసిన భాగాన్ని చక్కగా జిగురుతో అతికించొచ్చని చెబుతున్నారు. ఏ కారణంతో అయినా భయటపడ్డప్పుడు గొంగళి పురుగులు ఒక రకమైన పదార్థాన్ని స్రవిస్తాయి. దీని నుంచి గ్లూను తయారుచేయొచ్చని అంటున్నారు మెక్‌గిల్‌ యూనివర్సిటీ పరిశోధకుడు జియాన్యులీ. జీవసంబంధ పదార్థాలతో తయారైన హైడ్రోజెల్‌ కుట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని ఆయన చెబుతున్నారు. ఇది చాలా బలంగా ఉండటమే కాకుండా, ఏ హానీ చేయదు. అంతేకాదు తడిగా ఉండే భాగాలను కూడా అతికిస్తుందంటున్నారు ప్రొఫెసర్‌ లీ. 

ఆలస్యంగా మెనోపాజ్‌!

నెలసరి ఆగిపోయి మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టిన మహిళలకు స్త్రీ సంబంధిత లైంగిక హార్మోన్లు తగ్గిపోయి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అందుకే మెనోపాజ్‌ ఆలస్యంగా వస్తేనే మంచిదంటుంటారు. అయితే మహిళల లైంగిక జీవితం ఎంత ఆరోగ్యంగా ఉంటే మెనోపాజ్‌ అంత ఆలస్యం అవుతుందంటున్నారు పరిశోధకులు. వారానికి ఒకసారైనా లైంగిక చర్యలో పాల్గొనే మహిళలకు ఎర్లీ మెనోపాజ్‌ వచ్చే అవకాశం 28 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. నెలకోసారి లైంగిక చర్యలో పాల్గొనేవాళ్లలో మెనోపాజ్‌ తొందరగా వచ్చే అవకాశం 19 శాతం తక్కువగా ఉంటుంది. అయితే అలాగని లైంగిక జీవితం గురించి ఎక్కువ ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు అధ్యయనకారులు. పూర్తి స్థాయి లైంగిక క్రియ మాత్రమే కాదు, ఆత్మీయ స్పర్శ కూడా మెనోపాజ్‌ ఆలస్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. కానీ శృంగారానికీ, మెనోపాజ్‌కీ మధ్య సంబంధం ఏంటన్నది ఇంకా తెలియలేదు. ఇందుకోసం మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందంటున్నారు రిప్రొడక్టివ్‌ ఎపిడమాలజిస్ట్‌ జెన్నిఫర్‌ మారినో.

ఆస్తమా కూడా.. 

అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలకు అవకాశముందని తెలిసిందే. ఇప్పుడు వీటి సరసన ఆస్తమా కూడా వచ్చి చేరింది. అధిక బరువు, స్థూలకాయం ఉన్నవాళ్లలో కొవ్వు చర్మం కింద అడిపోస్‌ కణజాలంలో మాత్రమే పేరుకుపోతుందని అనుకుంటున్నాం. ఈ కొవ్వు డిపాజిట్లు ఊపిరితిత్తుల శ్వాస మార్గాల గోడల్లో కూడా చేరుతాయని కొత్త పరిశోధనలో తేలింది. ఈ కొవ్వు శ్వాసమార్గాల నిర్మాణంలో కూడా మార్పు తీసుకువస్తుందంటున్నారు పరిశోధకులు. ఇలా కొవ్వు చేరడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై పిల్లికూతలు, ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ అధ్యయనం యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో భాగంగా 52 మంది మృతుల ఊపిరితిత్తులను పరిశీలించారు. వీరిలో 16 మంది ఆస్తమాతో చనిపోగా 21 మందికి ఆస్తమాతోపాటు ఇతర కారణాల వల్ల మరణించారు. వీరి శ్వాస మార్గాల నిర్మాణాలను, ఊపిరితిత్తుల కణజాలాన్ని పరిశీలించి, వాటిలోని కొవ్వు కణజాలాన్ని బాడీ మాస్‌ ఇండెక్స్‌తో పోల్చి చూశారు శాస్త్రవేత్తలు. ఇందులో బిఎంఐతో పాటుగా కొవ్వు కణజాలం కూడా పెరుగుతున్నట్టు గమనించారు. 

VIDEOS

logo