సోమవారం 01 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 21:23:05

ఈవారం కథ.. గస్సాల్‌

ఈవారం  కథ.. గస్సాల్‌

‘బేటా! ఐసా మత్‌ కర్‌నా, అందర్‌ జాయియే’ తండ్రి మాటలు పెడచెవిన పెడుతూ, ఇంటి చూరు వాసానికి గూడు కట్టే పనిలో ఉన్న పిచ్చుకలలో చిన్న పిచ్చుకపైకి వేలు పెడుతూ అదిలించే పని చేస్తూనే వుంది సలీమా. పెద్ద పిచ్చుకలు ఎక్కడెక్కడి నుండో గడ్డిపోచలు తెచ్చి చెదిరిన గూడుపై పెడుతుంటే, ఆ చిన్న పిల్ల పిచ్చుక వాసంపైన అప్పటికే చెదిరిపోయి ఉన్న గడ్డిపోచల్ని అటూ ఇటూ జరుపుతూ పేరుస్తోంది. పిచ్చుకల నిర్మాణాన్ని వాటి సేకరణ విధానాన్ని అనుకరిస్తున్న పిల్ల పిచ్చుకను పరిశీలిస్తూ దాన్ని బెదిరించే పని చేస్తున్నది సలీమా. తండ్రి వద్దని వారిస్తున్నాడు. కానీ, పిల్లలు ఏదైనా శ్రద్ధగా గమనిస్తూనే ఉంటారు. సలీమా కూడా.

అది మూడు గదుల ఇంటి వెనకాల వసారాకు ఆనుకొని ఉన్న చూరు. చాంద్‌ చిన్న కూతురు సలీమా. ఎప్పుడో ఎర్రమట్టితో కట్టిన గోడలు. సున్నంతో గిలాబు చేయబడి వుంది. అక్కడక్కడా పెచ్చులూడిపోగా తడిసిపోయిన ఎర్రమట్టితో జాజు రంగులోకి మారాయి గోడలు. ఆ గోడలు కనిపించినప్పుడల్లా పాతకాలపు అనుబంధాలు కండ్లముందు కదలాడతాయి. అందుకనే పేదల ఇండ్లల్లోని తడి మరకలో ప్రేమలింకా మిగిలే ఉన్నాయి. ఆ మూడు గదులనానుకుని ఇంకో మూడు గదుల పోర్షన్‌ కూడా ఉంది. ఇంగ్లీష్‌ పెంకులతో మూడు స్టెప్పుల కప్పు. చాంద్‌ వాళ్ళ దూరపు బంధువులెవరో అందులో ఉంటారు. ఎత్తయిన గోడలతో ఓ కాంపౌండు వాలూ ఉంది. ఇంటి ముందర ఖాళీ స్థలమూ ఉంటుంది. కాంపౌండుకు పెద్దదే దర్వాజ. ఆ దర్వాజలోంచి ఇంట్లోకి వెళ్ళే ముందు లోపల దర్వాజకెదురుగా రెండు గుంజలు పాతి, గోనె బస్తాలను కలిపి కుట్టిన ఒక పెద్ద పరదా కట్టి ఉంటుంది. ఇంటి ద్వారాలకు, కిటికీలకూ పరదాలు కట్టి ఉన్నాయి. అవి మాసిపోవడం వల్ల ఏ రంగో చెప్పలేము. మధ్యగది మాత్రం రాతిరైనట్టుగానే ఉంటుంది. నట్టింట్లో తాండవించే దారిద్య్రంలా. ఇంటి గోడలచుట్టూ గింజలకోసం తిరుగుతూ ఉన్న కోడిపిల్లలు.

ఇల్లందు పెద్దపట్టణంగా అభివృద్ధి చెందినదేమీ కాదు. అయినా చారిత్రక ప్రాముఖ్యం ఉన్న పెద్ద ఊరే. నిజాం పరిపాలన నాటి శకలాలు ఇప్పటికీ కనపడుతుంటాయి. ఊర్లో రెండే బజార్లు. రెండో బజారు తూర్పున ఉన్న రోడ్డు చివర్న కుడివైపు సందులో కొంత లోపలికి పోయినాక మళ్ళీ కుడివైపు తిరిగితే దక్షిణం వైపు ఉన్నదే చాంద్‌ ఉంటున్న ఇల్లు. చాంద్‌కు నలుగురు ఆడపిల్లలు. ఒక్కడే కొడుకు. ఇద్దరు ఆడపిల్లలకు అతికష్టం మీద పెండ్లిళ్లు చేసి పంపాడు. ఉన్న ఊర్లోనే వుంటారు.

అక్కడి ఆమ్‌బజార్‌లోనే సైకిళ్ళు అమ్మే సమద్‌ సైకిల్‌ షాపులోనే ఓ పక్కన రిపేర్లు, పంక్చర్లు వేసి బతుకుబండిని లాక్కొచ్చాడు చాంద్‌. తాను పని చేసే క్రమంలోనే కొడుకుకూ రిపేర్‌ నేర్పించాడు. సైకిళ్ల ఫిట్టింగ్‌ నేర్చుకున్నాడు. చదువుకొమ్మని ఎంత కోరినా వాడికి అబ్బలేదు. అతి కష్టం మీద పది వరకు చదివి, పరీక్ష తప్పి సైకిల్‌ దుకాణానికి రావటం మొదలుపెట్టాడు. ఒక్కడే కొడుకు. ఇద్దరాడపిల్లల తర్వాత కలిగిన సంతానం. కొంత గారాబంగా చూశారు. 

“చాంద్‌ చాంద్‌” అనే కేకలు వినపడగానే “అబ్బా ఆప్‌కో కిసినే బులాయా” అని తండ్రిని పిలిచాడు కొడుకు జావెద్‌. “ఆరై ఆరై, కౌన్‌” అని బయటి దిక్కుకు వెళ్ళాడు. “చాంద్‌ భాయ్‌ వో దో నెంబర్‌ బస్తీమే గఫూర్‌ సాబ్‌కే ఘర్‌మే బుడ్డేమియా గుజర్‌గయేకతే. ఆప్‌కో ఆనేకో కహ” అని చెప్పారు వచ్చినోళ్ళు. “ఆరూ.. ఆరూ..” అంటూ టోపీ పెట్టుకొని, చెప్పులేసుకుని వేగంగా ఉత్సాహంగా వెళ్ళాడు చాంద్‌.

ఊర్లో ముస్లింలు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి స్నానం చేయించి, శుభ్రపరిచే పనిని చేస్తాడు చాంద్‌. ‘జనా జే నమాజ్‌'కు వాళ్ళను సిద్ధం చేసే ‘గుసుల్‌' పని గత పాతికేండ్ల నుండీ చేస్తున్నాడు. లేకుంటే ఒక్క పంక్చర్‌, సైకిల్‌ రిపేర్లతోటి అంతింటిని ఎలా వెళ్ళదీస్తాడు. నెలలో ఒకటి రెండుసార్లు ఈ పని చేయాల్సి వస్తుంది. ఒక్కరిని శుభ్రం చేసి, తయారు చేసి వస్తే ఎంత తక్కువయినా ఇప్పుడు ఐదు వందల రూపాయల నుండి వారి స్థోమతనుబట్టి రెండు, మూడు వేల రూపాయల వరకూ వస్తాయి.

* * *

అలా కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు సైకిళ్ళు అమ్ముడుపోవడం లేదని సమద్‌ షాపు మూసేశాడు. అవును, ఎవరు చూసినా మోటరు సైకిళ్ళే నాయే. ఎంత పేదోడయినా హీరోహోండా కొనాల్సిందే. అవి కొనటానికి బ్యాంకులు పిలిచి మరీ అప్పులిస్తున్నాయాయే. చాంద్‌కున్న ఆదాయ ఆదరువు పోయింది. కొడుకును ఓ సైకిలు షాపులో పనికి కుదిర్చాడు. పంక్చర్లు, రిపేర్లు చేసి వాడు తెచ్చే డబ్బులతోనే కనాకష్టంగా నడుస్తున్నది బతుకు. చాంద్‌ భార్య ఇంట్లో మిషను పని చేస్తుంది. జాకెట్లు, లంగాలు కుడుతుంది. కానీ, అదంతా పాతకాలపు కుట్టుపని. ఇప్పటి డిజైన్లు కుట్టడం రాదు. ఏదో అడపాదడపా ఆ పని చేస్తుంది. ఆడపిల్లల బట్టల ఖర్చు ఎల్లిపోతోంది.

చాంద్‌కు వయస్సు అరవై దాటింది. అనారోగ్యమూ చేరింది. ఛాతీలో నొప్పి వస్తుంటే స్థానిక డాక్టర్‌కు చూపించాడు. ‘గుండెకు సంబంధించిన సమస్య’ అని చెప్పి జిల్లా కేంద్రానికి వెళ్ళమన్నాడు. వెంటనే ఖమ్మంలోని మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తీసుకుపోయారు. వాళ్ళు స్టెంట్‌ వేయాలన్నారు. తక్కువ ఖర్చుతోనే  వేశారు. స్నేహితుల సహాయంతో త్వరగానే ఇంటికి వచ్చాడు. రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. చాలా కష్టంగా ఇల్లు గడుస్తున్నది. సైకిలు షాపులన్నీ కనుమరుగయిపోతున్నాయి. కొడుకు జావెద్‌ కూడా ఖాళీగా వున్నాడు. ‘మోటారు సైకిల్‌ రిపేర్‌ నేర్చుకోరా’ అంటే పెడ చెవిన పెట్టాడు. తండ్రికూడా ఒత్తిడి పెట్టలేదు. ప్రస్తుతం పేపరు బాయ్‌గా పనిలో చేరాడు. దానికి సైకిల్‌ కావాలి. దానికోసం వెతుకుతున్నారు.

ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కొద్దిగా తేరుకున్నాడు చాంద్‌. ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా గడుస్తుంది. రోజూ ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకొని స్నేహితులను కలిశాడు. ఆరోగ్యం బాగానే వుందని చెప్పాడు. “ఎవరైనా పోతే నాకు కబురు పెట్టండి. ఇప్పుడు చేయగల స్థితిలోనే ఉన్నా” అని అందరికీ చెప్పుకొచ్చాడు. స్నేహితులందరూ మంచివాళ్ళే. వాళ్ళుకూడా కష్టాల గట్లెక్కుతున్న వాళ్ళే. అప్పుడప్పుడూ కొంత సహాయం చేస్తూనే ఉన్నారు. అలా ఎంతకాలం! పిల్లలు కూడా తల్లిదండ్రికి అనుకూలంగానే పెరిగారు. అదే ఆయనకున్న అదృష్టం. ఇప్పుడు చావుల రేటు కూడా తగ్గిపోయింది. ఎప్పుడో నెలకొకటి జరుగుతున్నది.

* * *

“అజీ! ఆజ్‌ ఘర్‌మే ఛావల్‌ నహీహై” అంది సన్నగొంతుతో పిల్లలెవరికీ వినపడకుండా చాంద్‌ భార్య. “థోడా టైరోనా మై భీ సోంచరహా హూ’ అంటూ గదమ కింద చేయి ఆనించి, ఇంటి ముందు గద్దెపై కూచుని ఆలోచిస్తున్నాడు చాంద్‌. కొద్దిసేపు ముంగిట్లో అటూ ఇటూ తిరిగాడు. “దేఖోనా కుచ్‌ హైతో!” అని ఇంట్లోకి వంగి ఆమెతో చిన్నగా మూలిగాడు. ఆమెకర్థమయింది. పక్కన ఎవరినైనా అడగమని దానర్థం. ‘ఛావల్‌ కైసే పూఛూ..’ అని తనలో తానే ప్రశ్నించుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటయింది. అసలే స్టంట్‌ వేసుకున్నోడని ఇంట్లోవాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేసే మాటలు అనడం లేదు. కానీ, ఆయనలో ఒత్తిడి పెరగకుండా వుంటుందా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. అసలే ఆత్మాభిమానం అధికంగా ఉన్నవాడు చాంద్‌. ఎన్నిసార్లు చేయి చాస్తాడు. మనస్కరించడం లేదు. లేమితనాన్ని మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. ఎవడు సృష్టించాడు ఈ తరగతి! పరువూ మర్యాదలు, మానాభిమానాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ వీళ్ళకు సవాళ్ళుగా మూగుతాయి. లేనిపోని కంచెల్ని మనసు పొరలపై నిర్మిస్తాయి. ఆ ముళ్ళపైబడి రక్తార్పణ చేసుకుంటారు మన కళ్ళ ముందే. ఏమీ చేయలేం.

మధ్యాహ్నం కావస్తుందనగా ఇంటి బయటినుండి ఇద్దరెవరో నిలబడి “ఛాంద్‌ భాయ్‌ జల్దీ ఆవో” అన్నారు. ఆ పిలుపు వినగానే ‘హమ్మయ్య’ అనుకొన్నాడు. ఒక ఆశావహ పిలుపేదో భగవంతుని దగ్గరినుండి వచ్చినట్లు ఉత్సాహపడ్డాడు. “క్యా హై భాయ్‌” అంటూ బయటికి వచ్చాడు. “తేరా నెంబర్‌ బస్తీమే హమారా సలీమ్‌ సాబ్‌ హైనా, ఉన్కే బావా గుజర్‌ గయే. ఓ ఆప్‌కో బులారై” అని చెప్పారు.

“కబ్‌ హువా!” 

“అబీ తీన్‌ చార్‌ గంటే హువా, బచ్చే సబ్‌ మెహమాన్‌ నజ్దీక్‌ వాలే ఆగయే” అని చెప్పగానే, “ఆ.. ఆ.. అభీ నికులుంగా” అంటూ గబగబా ఇంట్లోకి వెళ్లాడు. టోపీ తీసుకుని, చెప్పులేసుకుని “చార్‌ బజే తక్‌ ఆవుంగా, ఆతే ఆతే హిబీ ఛావల్‌ లేకరావుంగా, థోడా సబర్‌ కరో” అంటూ ఉత్తేజంగా అడుగులేస్తూ బయటికి నడిచాడు చాంద్‌.

చాంద్‌ భార్య తన మిషన్‌ సొరుగులో ఉన్న దస్తీతీసి ముడి విప్పింది. చిల్లర డబ్బులు ఎన్నున్నాయో తీసి లెక్క గట్టింది. మొత్తం లెక్కేస్తే పది రూపాయలు తేలాయి. నీరసంగా కూర్చున్న సలీమాను పిలిచింది. 

“ఏలో బేటీ బాజుకే దుకాణ్‌ సే దో బిస్కట్‌ ప్యాకెట్స్‌ లేకే ఆవో” అంటూ పది రూపాయలిచ్చింది. “బహెన్‌! థోడా పానీలావోనా” అని అక్కను మంచినీళ్ళు అడిగి తాగింది సలీమా. ఉరికి వెళ్ళి బిస్కట్లు తెచ్చి ఒక ప్యాకెట్‌ అన్న జావెద్‌కు ఇచ్చింది. రెండో ప్యాకెట్‌ అక్కాచెల్లెళ్ళిద్దరూ కూర్చుని తిన్నారు. “ఏలో అమ్మీ” అని కొడుకు బిస్కట్లు అందిస్తూ పిలిచినా, తల్లి మనసు ఎక్కడో ఉంది. ‘ఆయన ఎప్పుడొస్తాడో’ అని పిల్లల ఆకలి తలచుకుని కన్నీళ్ళు కడుపులోనే నింపుకుంటున్నది.

నాలుగన్నరకల్లా చేతిలో బియ్యం సంచీతో లోపలికి అడుగుపెట్టాడు చాంద్‌. సలీమా ఎదురెళ్ళి సంచీ తీసుకుని ఇంట్లోకి ఉరికింది. చాంద్‌ పక్కనుండి ఇంటి వెనుకకు పోయి బట్టలిప్పేసి స్నానం చేసి లోపటికి వచ్చాడు. అలసటతో ఉన్న చాంద్‌ మంచంలో అలా కూలబడ్డాడు. “అబ్బా హమ్‌ లోగ్‌ బిస్కట్‌ ఖాలియే, ఏ లేవ్‌ దో బిస్కట్‌ ఖాలో” అంటూ సలీమా తండ్రికి బిస్కెట్లు అందించింది. అన్నం వండేవరకు కొద్దిగా ఆసరా ఉంటుందని తల్లిలాగే బిడ్డకూడా తనకు బిస్కెట్లు ఇవ్వడంతో చాంద్‌ గుండె బరువెక్కింది. అంతేకాదు, మాకిప్పుడు ఏమంత ఆకలిగా లేదు, బిస్కెట్లు తిన్నామన్న నిండుతనమూ పన్నెండేండ్ల సలీమాలో కనపడటంతో “బేటా ఇదరావో” అని దగ్గరకి తీసుకుని, చేతిని ముద్దు పెట్టుకున్నాడు చాంద్‌. ఇంతలో ఇంట్లోంచి “జీ ఖానా తయార్‌ హై ఆజాయియే” అన్న పిలుపు వచ్చింది. సలీమా అక్క జుబేదా అందరికీ ప్లేట్లు పెట్టింది. అందరూ కూర్చుని వేడి వేడి అన్నం పచ్చి పులుసు, కోడిగుడ్ల కూరతో కడుపునిండా భోజనం చేశారు.

భుక్తాయాసాన్ని తీర్చుకుంటూ మంచంలో పడుకున్నాడు చాంద్‌. తనుకూడా తిని జాకెట్‌ హుక్స్‌ కుట్టే పనిని ముందేసుకొని మంచం పక్కనే కూర్చుంది భార్య. “ఓ కైసా హువా కతేజీ” అని అడిగింది. “ఓ బూడాపన్‌ ఆయేగానా సుభా సుభా. సబ్‌సే బాత్‌ కరే కతే, గ్యారాబజే సబ్‌ లోగోంకో నజ్దీక్‌ బులాయే కతే.. బస్‌ బచ్చోంకే హాత్‌ మేయి జాన్‌ చెలేగయి కతే, హార్ట్‌ ఎటాక్‌ బోల్‌రై” అని వివరిస్తూ చెప్పాడు. 

హు.. మహానుభావుడు తన ఇన్నేండ్ల జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు. మనకు ఈ రోజు కడుపు నింపాడు. ఎంత వింతయిన దునియా ఇది. 

‘ఆజ్‌ వే గుజర్‌ నా జాతేతో ఆజ్‌ హమారీ భూక్‌ క్యాహోగి! ఖుదా క్యాకర్తా హై!’ తనలో తాను తాత్త్వికతలోకి పోయాడు. చనిపోయిన ఆయనను తలచుకుని ఒక నమస్కారం పెట్టుకున్నాడు. అవును ఎంత విచిత్రం. ఒక మరణ వార్త వీళ్ళకు జీవం పోస్తున్నది. చిత్రం చిత్రం.

చాంద్‌తో చాలా గారాబంగా చనువుగా మాట్లాడేది సలీమా ఒక్కతే. కొడుకూ ఇంకో కూతురూ తల్లితో ఎక్కువగా వుంటారు. 

చాంద్‌కూడా పరిస్థితులు, కష్టాలు మరిచిపోవడానికి సలీమాతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఏవో ఏవో విషయాలు తీసుకొచ్చి చెబుతుంది. అన్నీ శ్రద్ధగా వింటాడు. బదులిస్తాడు. తన మనసులోని విషయాలు, పెద్దల విషయాలు కూడా సలీమాతో పంచుకుంటాడు చాంద్‌. తల్లిలా ఫోజులు పెట్టి అన్నీ తండ్రిని అడుగుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు జవాబులు, పరిష్కారాలూ చెబుతుంది. మధ్యమధ్యలో నవ్విస్తూ ఉంటుంది. అన్ని విషయాలు పెద్దలు మాట్లాడినట్లే అబ్బాతో మాట్లాడుతుంది. 

ఆ రోజు కూడా సలీమాతో మాట్లాడుతున్నాడు చాంద్‌. 

“బేటీ బాతే కర్తెహీరె”

“ఆప్‌ ఊ కహతేరె బోలింగే, అబ్బా! తుమ్‌ సోరై”

“నై మా నై”

“మై ఏక్‌ కహానీ బోలుంగా సునో”

“ఊ.. ఊ.. ” అంటూనే ఏదో ఇబ్బందిగా ఛాతీమీద చేయి వేసి పట్టుకున్నాడు. ఒక్కసారిగా తలెత్తి బిడ్డవైపు చూశాడు. చేతిని గుండెకు హత్తుకున్నాడు. “అబ్బా! అబ్బా!.. క్యా హువా.. క్యా హువా!” తండ్రి తలను చేతుల్లోకి తీసుకుంది. “బేటీ..” అంటూ సలీమా చేతుల్లోనే కళ్ళు మూతలు పడ్డాయి చాంద్‌కు. లోపటి నుండి భార్య, కొడుకు, కూతురు వచ్చి “అబ్బా! అబ్బా!” అంటూనే వున్నారు. సలీమా చేతిలో ‘ఊ’ కొడుతూనే చివరిశ్వాస వొదిలాడు.

తండ్రి గుండెలపై తలపెట్టి “అబ్బా..! అబ్బా..!” అంటూ గట్టిగా పిలుస్తున్నది సలీమా. చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఎవరో చేయి పట్టుకుని చూశారు. “నాడీ నయ్యే” అన్నారు. భార్య కుప్పకూలి పోయింది. కొడుకు కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. చాంద్‌ స్నేహితులకు కబురు పోయింది. భార్య, కొడుకు, కూతురు ఏడుస్తున్నారు. సలీమా మాత్రం బాధతో నిట్టూరుస్తున్నది. కానీ, కన్నీళ్ళు కార్చడం లేదు. ఏడ్వబోయి దుఃఖాన్ని ఆపుకుంది. అబ్బా చెప్పింది గుర్తుకొచ్చింది. ఒక్క కన్నీటి చుక్క కింద పడితే గుట్టంత బరువు మోయాల్సి వస్తుందని ఎప్పుడో చెప్పాడు తనకు. తండ్రికి బరువు పెంచదలచలేదు. అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడ్వద్దని చెప్పింది. అక్కతో, అన్నతో కూడా చెప్పి ఊరకుంచింది.

స్నేహితులొచ్చారు. ఎలా జరిగిందో తెలుసుకుంటున్నారు. ఊర్లోనే ఉన్న బిడ్డలూ, అల్లుండ్లూ, మనవలూ వచ్చారు. కాలం గడుస్తూనే వుంది. ఇంకేముంది నేల గర్భంలోకి ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమవుతూనే వుంది.

ఇంట్లో ఒక్క పైసా లేదు. కనీసంగా ఏడెనిమిది వేలు అవుతాయి. స్నేహితులు కూడా పేదవాళ్ళే. అయినా కొద్దిగా సమకూర్చారు. అల్లుండ్లూ అంతంత మాత్రమే. వాళ్ళూ కొంత సర్దారు. ఇంకా అవసరమే వుంది. ఎవరో ఓ పండు ముసలి ఇంటిముందు గద్దెపై కూర్చుని “అరె క్యా దేఖ్‌రై ఓ గస్సాల్‌కు బులావోనా” అన్నాడు.

“ఎక్కడ గస్సాల్‌. ఆయనే గస్సాల్‌” అని ఆ పెద్దాయనకు వినిపించేలా పెద్దగా చెప్పాడు ఎవరో ఇంకో అతను. “తేరా నంబర్‌ బస్తీలో ముసలాయన ఉన్నాడు. పిలిపించండి” అన్నాడు. “వెయ్యో రెండు వేలో ఇవ్వాలి మరి” ఇంకో వైపున ఎవరో అన్న మాటలు వినపడుతున్నాయి. ఇంతలో “తేరా నంబర్‌ బస్తీ వాలా నయ్యే కతే” అంటూ వార్త మోసుకొచ్చాడు పక్కింటాయన. ‘పుట్టుక ఎంత ఉత్సవమో చావుకూడా అంతేరా బాబు. ఇది కూడా అంతే. పవిత్ర కార్యంగానే చేయాలి. ఎంతో మందిని పవిత్రంగా శుభ్రంగా చేసి చివరి వీడ్కోలుకు సిద్ధం చేశాడు. ఇప్పుడేమిటి ఈ విధి. అతన్ని శుభ్రం చేయటానికి ఎవరూ లేకుండా అయ్యిందే’ అని అంటున్నారు కొందరు పెద్దలు.

ఇలా అనుకుంటూ ఉండగానే గబగబా సలీమా వాళ్ళ దగ్గరకు వచ్చింది. “అబ్బా కో మై గుసుల్‌ దూంగీ. ఫికర్‌ మత్‌ కరో” అంటూ నిబ్బరంగా చెప్పింది. పెద్దవాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి తర్వాత “చిన్నపిల్లవి నువ్వు చేయొద్దు” అన్నారు. “అయినా నువ్వెలా చేయగలవు చెప్పు, నీకేం తెలుసు?” అని ప్రశ్నించారు. “నువ్వు ఆడపిల్లవి. నువ్వెలా చేస్తావు” ఇంకెవరో అన్నారు. 

“నేను ఆడపిల్లనే. కానీ, అబ్బా శరీరానికి నేను కూడా వారసురాలిని. ఇన్నేండ్లుగా మాకోసం కొట్టుకున్న గుండె ఆగిపోయింది. చమటలు కార్చిన శరీరం అలిసిపోయింది. అబ్బా రుణం ఎప్పుడు తీర్చుకుంటాం? ఆడపిల్లనైతే ఏం? కొడుకులు లేని వాళ్ళకు ఆడపిల్లలే కొరివి పెట్టడం చూడటం లేదా? ప్రాణానికి ఆడా మగా వుంటుందా? చివరిసారిగా శుభ్రం చేసే వాళ్ళుకూడా దిక్కు లేరనే భారాన్ని మేము ఉండీ మోయాలా? పక్షులు తమ పిల్లలపట్ల మగా ఆడా అని భేదం చూపుతాయా? ఒక తండ్రిమీద ప్రేమకు ఈ రకమైన విభజనలా? నా ప్రేమను ఆడపిల్ల అనే నెపంతో అడ్డుకోవద్దు. అబ్బా నాకు అన్నీ చెప్పాడు. నాకే చెప్పాడు. వారసత్వమంటే ఆయన సంపాదించిన ఆస్తి పంచుకోవటమే కాదు. ఆయన నేర్పింది కొనసాగించడము కూడా. ప్రేమగా, మర్యాదగా, స్వచ్ఛంగా వీడ్కోలు చెప్పటం నా బాధ్యత కాదా! లేదు. నాకంతా తెలుసు. నేను చేయగలను. అబ్బాకు నేను చేయటమే న్యాయం. నాకు చెప్పాడు. ఏమేమీ చేయాలో, ఎలా చేయాలో అన్నీ తెలుసు నాకు” అన్నది సలీమా.

* * *

‘పద్నాలుగు మీటర్ల తెల్లనిబట్ట కావాలి. మూడు మీటర్ల గుడ్డలు రెండు ముక్కలు చేయాలి. ఒకటి పైన వేయాలి. గ్లౌసు తొడగాలి. అరమీటరు దస్తీ చేయాలి. మూడు మీటర్లది మూడు ముక్కలు చేసి, రెండు ముక్కల గుడ్డను చాపమీద వేయాలి. ఒక్క ముక్కతో షర్టు చేయాలి. చుట్టూ పరదా కట్టాలి. బల్లమీద పడుకోబెట్టాలి. అవును అబ్బా లేవలేడు కదా! బట్టలు విప్పి ఇటుక పెల్లకు దూది చుట్టి ముడ్డి తుడవాలి. పది చెంబుల నీళ్ళు కొట్టి శుభ్ర పరచాలి. షాంపూతో కడగాలి. రేగుపళ్ళ ఆకులు వేసిన పదిహేను బిందెల నీళ్ళతో శరీరాన్నంతా కడగాలి. స్నానం చేయించాలి. హారతి కర్పూరం శరీరానికంతా పూయాలి. చెవి గులిమి తీయాలి. గోర్లు తీయాలి. కండ్లలో సుర్మా పెట్టాలి. అత్తరు చల్లాలి. కాళ్ళ కాడ, నడుము, తలాపును గుడ్డతో కట్టి ముడి వేయాలి. తల ముందుభాగంలో ఉండేట్టు జనాజాలో పడుకోబెట్టాలి. సెంటు వేయాలి. అప్పుడు మౌలీసాబ్‌ ‘జనాజేకి నమాజ్‌' చదువుతాడు. అక్కడినుండి ఖబరస్తాన్‌కు చివరియాత్ర జరుగుతుంది’ అబ్బా చెప్పిన ఈ మాటలన్నీ సలీమా మదిలో మార్మోగుతున్నాయి. 

ఒకసారి శుభ్రం చేసి వచ్చిన తండ్రిని ‘ఎలా చేస్తారు అబ్బా’ అని అడగటంతోనే ఇదంతా పూస గుచ్చినట్లు చెప్పాడు చాంద్‌. అవన్నీ ఇప్పుడు సలీమా కండ్లముందు వినపడుతున్నాయి. సలీమా ఆలోచనల్లో ‘నాన్నకు చివరిసారిగా ఈ సేవ చేసే అవకాశాన్ని విడువకూడదు. ఎలాగైనా నేనే చేస్తాను. నేనే చేస్తాను’.

“గత పాతికేండ్లుగా వందలమంది శరీరాలను శుభ్రపరిచిన చేతులవి. చివరియాత్రకు ముస్తాబు చేసిన హస్తాలవి. ఈ లోకంలో అంటిన మలినాలన్నింటినీ కడిగి దేహాన్ని స్వచ్ఛంగా చేసిన చేతులవి. మానవీయ పరిమళాలను అద్దిన చేతులవి. అబ్బా చేతులను శుభ్రం చేయటం నా బాధ్యత. నా కర్తవ్యం. నా అదృష్టం. ఎవరూ ఆపొద్దు.” 

“లేదమ్మా ఆడపిల్లవి. నువ్వు చేయొద్దు” అని ఓ పెద్దాయన బిడ్డను సముదాయించాడు. 

అప్పుడు సలీమా ఒక నిర్ణయానికి వచ్చింది.

“అరె భాయ్‌ జావెద్‌! నువ్వు రా.. నేను చెప్పినట్లు చెయ్‌” అంటూ అన్నను పిలిచింది.

ఆమె కన్నీళ్లను దిగమింగి నీళ్ళను అందించింది. ప్రేమ పరిమళం కాయమంతా పూయబడుతున్నది.  ఓ తల్లి బిడ్డని తీర్చినట్లు తలుపుల జోలపాటతో ఓదార్చినట్టు అపురూపంగా, ఆప్యాయంగా శుభ్రమయ్యాడు చాంద్‌, తెల్లని మంచుకొండలా.

ఒక నిశ్శబ్ద సన్నివేశం. 

ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. అంతా జరిగిపోతున్నది. ముగింపు యాత్ర మొదలయింది. ఒక ప్రశాంతమైన నదిలా పావురాల గుంపు కదిలి పోయింది. ఒక బతుకు యాతన ముగిసిపోయింది. ఒక అత్తరు వాసన దారి మలుపు తిరిగి సాగిపోయింది.

కటుకోజ్వల ఆనందా చారి


ఖమ్మం పట్టణానికి చెందిన కటుకోజ్వల ఆనందాచారి, ఎంఏ (తెలుగు సాహిత్యం), బీఈడీ చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా 30 ఏండ్లపాటు పనిచేసి, 2019 జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. 2018లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు. సాహిత్యంపై అభిరుచితో గత నాలుగు దశాబ్దాలుగా కవిత్వం, విమర్శలు రాస్తున్నారు. ‘మొలక’, ‘స్ఫూర్తి శిఖరం’ కవితా సంపుటాలను వెలువరించారు. ‘ధిక్కార గళం మన కాళోజీ’, ‘మహోన్నతుడు మార్క్స్‌' పేరుతో కాళోజీ నారాయణరావు, కార్ల్‌ మార్క్స్‌ల జీవిత పరిచయాలను రచించారు. అనేక సన్మానాలు, అవార్డులు అందుకున్నారు. 2016లో సినారె చేతుల మీదుగా ‘ఉత్తమ కవి’ బహుమతి పొందారు. 1999 నుంచీ సాహిత్య సభలను నిర్వహిస్తున్నారు. ‘సాహిత్య ప్రస్థానం’ అనే పత్రికకు 12 ఏండ్లపాటు సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ‘తెలంగాణ సాహితి’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఐదు కథలను రాశారు. వీటిలో పోటీకి పంపిన మొదటి కథ ‘గస్సాల్‌'. వాస్తవికమైన జీవితాన్ని సృష్టించడమే రచయిత చేయాల్సిన పని అంటారు ఆనందా చారి.

VIDEOS

logo