పుస్తక సమీక్ష

ఒకచోట నుంచి కదలకుండా ప్రపంచాన్ని చుట్టేసిన అనుభూతి కలిగించే అద్భుతమైన సాధనాలు పుస్తకాలు. పుస్తకం చేతిలో ఉంటే నాలుగ్గోడల మధ్య ఉంటూనే దశ దిశల్లో జరుగుతున్న మార్పులపై స్పష్టమైన అవగాహన పొందవచ్చు.
కరోనా నేర్పిన పాఠాలు
కోవిడ్-19
(కథల సంకలనం)
సంకలనం:
డా॥డి.ఎన్.వి.రామశర్మ
పేజీలు: 160 వెల: రూ.150
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవచేతన
పబ్లిషింగ్ హౌస్
గతేడాది ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఉపాధి మార్గాలను మూసేసింది. కానీ, ఈ మహమ్మారి మనుషుల్లో మృగ్యమవుతున్న మానవత్వాన్ని తట్టిలేపింది. అనుబంధాలు మర్చిపోయిన వారికి ఆప్యాయతలు పరిచయం చేసింది. నేనే అధికుడనని విర్రవీగేవారికి కనువిప్పు కలిగించింది. తండ్రికి కొడుకును దగ్గర చేసింది. పట్నవాసిని పల్లె గొప్పదనాన్ని చాటింది. తెలియకుండానే కోవిడ్-19 వైరస్ ఎన్నో కార్యాలను చక్కబెట్టింది. ఆ గాథల సమాహారమే ‘కోవిడ్-19 కథల సంకలనం’. కరోనా కాలంలో పలువురు రచయితలు, రచయిత్రులు సాగించిన అక్షర సేద్యం ఈ సంకలనం. ప్రతి కథ భయంతోనే మొదలవుతుంది. భవిష్యత్తు ఏమిటన్న దిగులుతోనే ప్రారంభం అవుతుంది. కథ చివరకు వచ్చేసరికి వెలకట్టలేని నీతిని బోధిస్తుంది. మనలో నిద్దురపోతున్న మానవత్వాన్ని తట్టి లేపుతుంది. ‘ప్రియమైన రచయితలు’ సమూహం నిర్వహించిన కరోనా కథల పోటీలో బహుమతులు గెలుచుకున్న వాటినన్నిటినీ గుదిగుచ్చి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. అనుభవజ్ఞులు, వర్ధమాన కథకులు ఇందులో పాలుపంచుకున్నారు. అందరి కథా వస్తువు కరోనా వైరసే అయినా.. కథనంలో ఎవరి ప్రతిభను వారు కనబరిచారు. సమాజంలో నూతన చైతన్యం తీసుకురావడంలో అందరూ సఫలీకృతులయ్యారు.
విరి వసంతానికి దిక్సూచి
పచ్చని లోగిలి
(ఇంటి మొక్కల కదంబం)
రచన: బోడెంపూడి శ్రీదేవి
పేజీలు: 307 వెల: రూ.300
ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్, [email protected]
వాకిట్లో పూసే మందారం, పెరట్లో పలకరించే పారిజాతం, బడికెళ్లే దారిలో ఎదురుపడే రాధామనోహరం, గుడికి వెళ్లినప్పుడు ఆశ్చర్యపరిచే నాగమల్లి.. చెబుతూ పోతే మనిషి జీవితం ప్రకృతితో లతలా అల్లుకుపోయింది. పచ్చదనాన్ని చూసి పరవశించని మనసుండదు. వింత రకం మొక్క తారసపడితే కండ్లింత చేసి కాలాన్ని మర్చిపోని మనిషి ఉండడు. అలాగని ప్రకృతి ఆరాధకులంతా మొక్కలు పెంచలేరు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లలో మనుషులు ఉండటమే కష్టమనుకుంటే ఈ మొక్కలకు ఏ దిక్కున చోటివ్వాలో తెలియదు. ఖాళీ జాగా ఉన్నా.. ఎలా పెంచాలో తెలియదు. ‘పచ్చని లోగిలి’ పుస్తకం చెంతనుంటే ప్రతి ఇంటా విరి వసంతం ఖాయం. తన అనుభవాన్నంతా జోడించి ఈ పుస్తకాన్ని ఇంటి మొక్కల కదంబంగా తీర్చిదిద్దారు రచయిత్రి బోడెంపూడి శ్రీదేవి. రకరకాల పూల మొక్కల విశేషాలు, వాటిని పెంచే తీరు, చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలు ఇలా మొక్కలు పెంచడంలో అనుసరించాల్సిన విధి విధానాలన్నిటినీ ఇందులో పొందుపరిచారు. కనీవినీ ఎరుగని పూల విశేషాలను పుస్తకంలో చూడొచ్చు. ఇంటికి పచ్చదనాన్ని ప్రసాదించడమే కాదు, ఇంటి సభ్యులకు ఆయుర్వేద ఔషధాలుగా ఉపయోగపడే మొక్కల వివరాలూ ఇందులో ఉన్నాయి. సుమారు 150 రకాల పూల మొక్కల విశేషాలను తెలుసుకోవచ్చు. ఆ మొక్కలను మన ముంగిట్లోనో, పెరట్లోనో, బాల్కనీలోనో పెంచుకోవచ్చు.
అమ్మమ్మ యాదిలో..
మా అమ్మమ్మ కథలు
రచన: గంటి ఉషాబాల
పేజీలు: 72 వెల: రూ.100
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, books.acchamgatelugu.com
చిన్నప్పుడు బడినుంచి వచ్చేసరికి అమ్మమ్మ ఇంట్లో కనిపిస్తే.. సరాసరి చంద్రమండలంపై కాలుమోపినట్టు అనిపిస్తుంది. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్తే డిమాండ్ చేసి మరీ అమ్మఒడిలో తలదాచుకున్న అనుభూతి కలుగుతుంది. ఇక అమ్మమ్మను తలుచుకున్నప్పుడల్లా చిక్కటి పాలు కలుపుకొని పులిహోర తిన్నంత తృప్తిగా ఉంటుంది. ప్రతి మనిషికీ అమ్మమ్మ జ్ఞాపకాలు మదిలో పదికాలాలూ పదిలంగా ఉంటాయి. అవి జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా గుండె గూటికి పండుగొస్తుంది. కంటిపాప చంటిపాపవుతుంది. కండ్లనుంచి వర్షించే ఆనందభాష్పాల తెరలపై గతమంతా కదలాడుతుంది. అలాంటి అమ్మమ్మతో తన అనుబంధాన్ని ‘మా అమ్మమ్మ కథలు’ పేరుతో సంకలనం చేశారు రచయిత్రి గంటి ఉషాబాల. నలభై వసంతాల కిందట అమ్మమ్మతో తను అల్లుకున్న అనుబంధాలకు అక్షర రూపమిచ్చి ఆత్మీయార్చన చేశారు. తనతో ఆడుకున్న అమ్మమ్మ, తన కోసం ఇష్టమైనవి వదులుకున్న అమ్మమ్మ, తనను నలుగురిలో గొప్పగా నిలబెట్టిన అమ్మమ్మ! ఇలా ప్రతి సందర్భమూ.. ప్రతి ఒక్కరికీ వాళ్ల అమ్మమ్మను మరోసారి పరిచయం చేస్తుంది. ఆమె కురిపించిన అవ్యాజమైన ప్రేమను తెరలు తెరలుగా మనసుల్లో ఆవిష్కరిస్తుంది. గతంలో ఆంధ్రభూమిలో ప్రచురితమైన ఈ కథలను సంకలనంగా తీసుకొచ్చి అమ్మమ్మ గొప్పదనాన్ని మరింత మందికి చేరువ చేశారు రచయిత్రి.
తాజావార్తలు
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్