ఆదివారం 07 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 20:21:35

ప్రేమ‘కథ’లు..

ప్రేమ‘కథ’లు..

సృష్టికి మూలం ప్రేమ. భాషకందని భావం ప్రేమ. ఈ ప్రకృతిలో ప్రతీది ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. ఆ ప్రేమ పంచే అనుభూతులెన్నో, అనుభవాలెన్నో. ప్రేమకు నిర్వచనాలెన్నో, అర్థాలెన్నో! ఆ ప్రేమను తెలిపే కవితలెన్నో, కావ్యాలెన్నో. ఇతిహాసాలు, పురాణాలు, కథలు, కల్పనలు.. ఒక్కటేమిటీ ప్రతీది ప్రేమమయమే. అందుకే సినిమాల్లోనూ ప్రేమకథలదే మొదటి స్థానం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను అలరించనున్న ప్రేమకథలేంటో ఓ లుక్కేద్దాం..

లవ్‌ స్టోరి 

చక్కగా, సౌమ్యంగా సాగిపోయే ప్రేమకథలకు చిరునామా శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా క్యూట్‌ ‘లవ్‌ స్టోరి’ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, ‘ఏయ్‌..పిల్లా..’ పాట, టీజర్‌ అంచనాలను పెంచేస్తున్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య ఓ చక్కని ప్రేమకథను అల్లినట్లు అర్థమవుతున్నది.  

ఉప్పెన

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి మధ్య సాగిన అందమైన ప్రేమకథ ‘ఉప్పెన’. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య సాగే ప్రణయగాథ ఇది. సముద్రపు అలల సవ్వడంత హాయిగా సాగిపోయే లవ్‌స్టోరీ ఇది. అప్పుడప్పుడు సముద్రం సునామీలా విరుచుకుపడుతుంది కదా! అలా ఈ ప్రేమకథలోనూ ఉప్పెనలున్నాయి, ఉద్ధృతాలున్నాయి. అందుకే టీజర్‌లో సింహభాగం అందమైన ప్రేమకథతో ప్రశాంతంగా సాగినా.. చివర్లో అంతులేని విషాదాన్ని చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. 

రాధేశ్యామ్‌

పాన్‌ ఇండియా స్టార్‌ అయినా లవర్‌ బాయ్‌గా ప్రభాస్‌కున్న క్రేజ్‌ తక్కువేం కాదు. యాక్షన్‌, థ్రిల్లర్‌ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ప్రేమకథ ‘రాధేశ్యామ్‌'. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ చూస్తేనే అందమైన ప్రేమకథ అని తెలిసిపోతుంది. రాధేశ్యామ్‌ అంటేనే అమరమైన ప్రేమకు చిరునామా. పేరులోనే ఈ సినిమా ఓ ప్రేమకథ అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు.

మహాసముద్రం

ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో రూపొందుతున్న చిత్రం మహాసముద్రం. ఇద్దరిద్దరంటే రెండు ప్రేమకథలన్నమాట. ‘ఎగిసిపడే అలల్లో మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి మీ ముందుకొస్తున్నాం’ అంటూ చిత్రబృందం చేసిన ట్వీట్‌ను చూస్తే తెలిసిపోతున్నది ఇది ఫక్తు లవ్‌స్టోరీ అని. శర్వానంద్‌, సిద్ధార్థ్‌లతో అదితీరావు హైదరీ, అను ఇమ్మానుయేల్‌ జతకడుతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో రికార్డు విజయాన్నందుకున్న అజయ్‌ భూపతి ఈ సినిమా దర్శకుడు. 

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌


అఖిల్‌ అక్కినేని హీరోగా వస్త్తున్న సినిమా.. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. పూజా హెగ్డే కథానాయిక. ఇక చెప్పేదేముంది? బ్యాచ్‌లర్‌కి, హాట్‌ భామకి మధ్యసాగే క్యూట్‌ లవ్‌స్టోరీ. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా ఉన్న హీరో ఎలా ప్రేమలో పడ్డాడనేదే కథ. చక్కని ప్రేమకథ ‘బొమ్మరిల్లు’ను అందించిన భాస్కర్‌ ఈ సినిమాకు  దర్శకుడు. 

ఇవేకాదు ఈ ఏడాది రాబోతున్న చెక్‌, రంగ్‌దే,  వకీల్‌సాబ్‌, వరుడు కావలెను.. లాంటి అన్ని సినిమాల్లోనూ కథతోపాటు చిన్నదో పెద్దదో ప్రేమకథ  ఉండటమైతే గ్యారెంటీ..!! 

VIDEOS

logo