ఆదివారం 07 మార్చి 2021
Sunday - Feb 06, 2021 , 22:57:43

మెగాఫోన్‌ పడితే ప్రేమకథే తీస్తా

మెగాఫోన్‌ పడితే ప్రేమకథే తీస్తా

ఆయన.. చిత్రసీమలో నాన్‌స్టాప్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌. ఇరవైఏండ్లుగా అభిమానుల మోముపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న సడెన్‌ స్టార్‌. నటనతో ప్రేక్షకులను నవ్వించడంలోనైనా, ఏడిపించడంలోనైనా ‘తనకు తానే సాటి’ అని నిరూపిస్తున్న ఆ అల్లరోడే.. ‘అల్లరి’ నరేశ్‌. ఓవైపు తనదైన కామెడీని పండిస్తూనే, మరోవైపు సీరియస్‌ పాత్రల్లో ఒదిగిపోయే ఈ ఈవీవీ వారసుడు.. ఇప్పుడు ‘నాంది’తో వెండితెరపై మరోసారి మెరవబోతున్నాడు. 

ఈ సినిమాతో తనలోని సరికొత్త నటుడికి నాంది పలుకుతున్నాడు. ఆర్టిస్టులు ఎన్ని విజయాలు సాధించినా వారిని ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. వైవిధ్యమైన కథలు, గొప్ప పాత్రలకోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. నేను సినీరంగంలోకి ప్రవేశించి దాదాపు ఇరవై ఏండ్లు అవుతున్నది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలతోపాటు అంచనాలు తలకిందులై నిరాశకు గురైన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఐదేండ్లుగా నేను అనుకున్నట్లుగా నా కెరీర్‌ సాగడం లేదనే చిన్న అసంతృప్తి ఉంది. పరాజయాలను దృష్టిలో పెట్టుకొనే కథల ఎంపికలో పంథా మార్చుకున్నా. తిరిగి విజయాల బాట పడతాననే  నమ్మకం ఉంది.

నవ్వించాలనే ప్రయత్నంలో..

‘సుడిగాడు’ సినిమా తర్వాత నాపై తెలియకుండానే ఒత్తిడి ఎక్కువైంది. ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్వించాలి. వినోదాల మోతాదు ఇంకా పెంచితే బాగుంటుందనే మాటలు అంతటా వినిపించాయి. దీంతో సీరియస్‌ సన్నివేశాల్లోనూ కామెడీనీ పండించే ప్రయత్నాలు చేశా. ఈ ధోరణివల్ల వినోదంపైనే దృష్టి పెడుతూ, కథల్ని పట్టించుకోవడం లేదనే విమర్శలొచ్చాయి. ప్రస్తుతం కథల ఎంపికలో పంథా మార్చుకున్నా. కామెడీకోసం కథను ఎంపిక చేసుకోకుండా, కథలో అంతర్భాగంగా సాగే వినోదానికి ప్రాధాన్యమిస్తున్నా. ఒకప్పటితో పోల్చుకుంటే నేటితరం ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. కామెడీ కథల్నికూడా సెన్సిటివ్‌గా డీల్‌ చేయాల్సిన పరిస్థితులొచ్చాయి. గతంలో మాదిరిగా శరీరాకృతిని, రంగును లేదా ఏదో ఒక ప్రొఫెషన్‌ను తీసుకొని సరదాగా కామెడీ చేస్తే ఇప్పుడు ఎవరూ ఊరుకోరు. ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవిస్తూ జాగ్రత్తగా కామెడీ కథల్ని రాసుకోవాల్సి వస్తున్నది. ఇప్పటి ప్రేక్షకులు లాజిక్‌ లేని కామెడీని తిరస్కరిస్తున్నారు. కథతో సాగే వినోదాన్నే బాగా ఇష్టపడుతున్నారు.

నాన్నగారు ఉంటే..

నాన్న ఈవీవీ సత్యనారాయణగారి దర్శకత్వంలో తొమ్మిది సినిమాలు చేశా. అందులో అన్నీ హిట్లే. నా కెరీర్‌ వృద్ధిలోకి రావడానికి నాన్నగారు ఎంతగానో తోడ్పాటునందించారు. ఆయనతో కలిసి సినిమాలు చేయడంతోపాటు చిన్నప్పటి నుంచీ ఆయన్ని దగ్గరగా చూశాను కాబట్టి తెలియకుండానే నాకు కామెడీపై పట్టు పెరిగింది. నాన్నగారు బతికి ఉంటే మా ఇద్దరి కాంబినేషన్‌లో మరిన్ని హిట్స్‌ వచ్చేవనుకుంటున్నా. ఇక కెరీర్‌పరంగా పక్కన బెడితే, వ్యక్తిగతంగా నాన్నగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన ఉండి ఉంటే నా తప్పుల్ని సరిదిద్దుతూ మార్గదర్శనం చేసేవారు. కష్టాలొచ్చినప్పుడు నాలో ధైర్యాన్ని నింపేవారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. తన ఇద్దరు కొడుకుల పెండ్లి చూడాలని, వాళ్ల పిల్లలతో ఆడుకోవాలని ఎంతగానో కోరుకున్నారు. ‘త్వరగా పెండ్లి చేసుకొని పిల్లల్ని కనండ్రా’ అని ఎప్పుడూ చెబుతుండేవారు. తాతయ్యగా ఆయన జీవితాన్ని చూడలేకపోయారనే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.

నరేశ్‌ ఏడిపిస్తారన్నారు..

నేను ఇప్పటి వరకు 56 సినిమాలు చేశాను. అందులో ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’లాంటి సినిమాల్లో సీరియస్‌ పాత్రల్ని పోషించాను. మిగతావన్నీ వినోద ప్రధానమైనవే. కెరీర్‌ తొలినాళ్లలో ‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాల్ని ఆశిస్తున్నారు’? నటుడిగా ఎలాంటి ఇమేజ్‌ను కోరుకుంటున్నారు?’ అనే విషయాలమీద స్పష్టత ఉండేది కాదు. కామెడీ, సీరియస్‌ కథల్లో వేటిని ఎంచుకోవాలనే ఊగిసలాట ఉండేది. ‘ప్రాణం’, ‘గమ్యం’ తర్వాత నా ఇమేజ్‌ మారింది. నేను కామెడీతో నవ్వించడమే కాదు.. సీరియస్‌ పాత్రల్లోనూ ఏడిపించగలనని ప్రేక్షకులు నమ్మారు. ‘గమ్యం’ తర్వాత చాలా మల్టీస్టారర్‌ ఆఫర్లొచ్చాయి. అయితే, కథలు నచ్చక తిరస్కరించా. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని ‘శంభో శివ శంభో’ చేశా. అందులోని ‘మల్లి’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ‘మహర్షి’ సినిమాలో సీరియస్‌ క్యారెక్టర్‌ చేశా.

సీరియస్‌ పాత్రలూ చేస్తా

ప్రస్తుతం ‘నాంది’ సినిమాలో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా సీరియస్‌ పాత్ర చేస్తున్నా. దర్శకుడు విజయ్‌ కనకమేడల ‘మహర్షి’లోని నా నటన చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యానని చెప్పాడు. ఎన్నో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కాబట్టే ‘నాంది’కి అంగీకరించా. ‘మీలో అద్భుతమైన ఆర్టిస్టు ఉన్నాడు. అయినా సీరియస్‌ సినిమాల్ని ఎక్కువగా ఎందుకు చేయరు’? అని చాలామంది అడుగుతుంటారు. వాస్తవానికి నాకూ ఆ తరహా పాత్రలు చేయాలని ఉంది. అయితే, సినిమాల్ని ఎంపిక చేసుకునే అంశంలో బిజినెస్‌నూ అర్థం చేసుకోవాలి. నాకు ‘కామెడీ హీరో’ అనే ఇమేజ్‌ స్థిరపడిపోయింది. కాబట్టి, నాతో సీరియస్‌ కథలు కమర్షియల్‌గా వర్కవుట్‌ కావేమోనని చాలామంది నిర్మాతలు భయపడుతుంటారు. ఈ విషయంలో వారినీ తప్పు పట్టలేం. బిజినెస్‌ పరంగా ఎవరి సమీకరణాలు వారికి ఉంటాయి. ‘నాంది’లాంటి చిత్రాలు విజయవంతమైతే నేను మరిన్ని సీరియస్‌ పాత్రల్ని ఎంచుకునేందుకు వీలు కలుగుతుంది.

పరుగెత్తి చేయను

లాక్‌డౌన్‌ సమయంలో డబ్భుకిపైగా కథల్ని విన్నా. అందులో రెండు మూడు మాత్రమే నచ్చాయి. నా గత చిత్రాల్ని పోలి ఉండే పాత్రల్ని తిరిగి రిపీట్‌ చేయడం ఇష్టం ఉండదు. అందుకే, చాలా కథల్ని వొద్దనుకున్నా. కేవలం కథ మాత్రమే విని కామెడీ సినిమాల్ని జడ్జ్‌ చేయలేం. సన్నివేశాలతోపాటు సంభాషణలు, పంచ్‌లు.. అన్నీ తెలుసుకున్నప్పుడే ఆ చిత్రంపై ఓ అంచనాకు రాగలుగుతాం. నలుగురు కూర్చొని ఓకే చేసే కథ, రేపు సినిమాగా నాలుగుకోట్ల మందికి నచ్చాలన్న నియమమేమీ లేదు. కథల ఎంపికలో ఎన్నో విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ఇక నుంచి పరుగెత్తి సినిమాలు చేయకుండా, కాస్త ఆలస్యమైనా ఉత్తమమైన కథలను, ప్రభావవంతమైన పాత్రల్ని  మాత్రమే ఎంచుకోవాలనుకుంటున్నా.

అవే విలువైన సంపదలు

లాక్‌డౌన్‌ విరామం వల్ల ప్రతిఒక్కరూ స్వీయవిశ్లేషణ చేసుకునే అవకాశం దొరికింది. గత ఎనిమిది నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాలు చూసి ఓ రకమైన వైరాగ్యం పుట్టుకొచ్చింది. ఈ ఉరుకుల పరుగుల జీవితం, ఏదో తెలియని తాపత్రయం ఎందుకోసమనే ఆలోచన మొదలైంది. జీవితంలో కుటుంబం, స్నేహితులకు మించిన విలువైన సంపదలు ఏవీ లేవనే విషయం తెలిసొచ్చింది. మన వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఫలితం ఎలా ఉన్నా సంతోషంగా స్వీకరించాలనే తాత్వికత అవగతమైంది. నేను ఇతర సినీ సెలెబ్రిటీల మాదిరిగా సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను. ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎవరు ఏమనుకుంటారో అనే సందిగ్ధం వల్ల సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటా. మా పాపకు సంబంధించిన ఫొటోల్ని మాత్రం అప్పుడప్పుడూ పోస్ట్‌ చేస్తుంటా. నా సన్నిహితులు, మిత్రులకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తే ఫోన్‌ద్వారానే తెలియజేస్తా.

ఆదరణ తగ్గలేదు

సినిమాల పరంగా కొత్త ట్రెండ్స్‌ వస్తున్నప్పటికీ కామెడీకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. కథలో ఎంత వైవిధ్యమున్నా, వినోదం లేకపోతే అదో లోటుగా భావిస్తున్నారు. ఈ పరిణామాల్ని గమనిస్తూ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. యేడాదికి ఎన్ని సినిమాలు చేస్తున్నామనే విషయం కంటే.. ప్రేక్షకులకు గుర్తుండిపోయేవే చేయాలని నిర్ణయించుకున్నా. గతంలో నేను ఏడాదికి ఐదారు చిత్రాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అలా కాకుండా కంటెంట్‌మీద దృష్టి పెడుతూ సెలెక్టివ్‌గా ఉంటున్నా. ఒకవేళ కథలు నచ్చకపోతే ఖాళీగా ఉండటం మంచిదనే అభిప్రాయానికొచ్చా.

దర్శకత్వం చేయాలనుకుంటున్నా!

నాకు దర్శకత్వంపై ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. కొన్ని పాయింట్స్‌ అనుకుంటున్నా. త్వరలో వాటిని స్క్రిప్ట్‌ రూపంలోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. దర్శకుడిగా ప్రేమకథా చిత్రాల్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతా. భవిష్యత్తులో డైరెక్షన్‌ చేస్తే, తొలుత ప్రేమకథనే తీస్తాను. మల్టీస్టారర్‌ సినిమాలు, ఓటీటీల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా.

కళాధర్‌ రావు

VIDEOS

logo